ముందు బాక్సైట్‌ సంగతి చూడండి - పాణి

ముందు

అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య మీద చాలా మంది అంగలారుస్తున్నారు. ఆదివాసుల నుంచి ఎదిగిన నాయకులను చంపేస్తారా? అంటున్నారు. ఒకవేళ ఆదివాసులు కాకపోయి ఉంటే అప్పుడు ఇంకో రకమైన నిట్లూర్పులు వినిపించేవి. అసలు ఎవర్నీ చంపే దాకా పరిస్థితులు పోకూడదు. దీని మీద ఎవరూ సిద్ధాంతాలు చెప్పనవసరం లేదు. అది చాలా మామూలు మానవతా వైఖరి. వివరాల్లోకి వెళితే ఎంతయినా మాట్లాడుకోవచ్చు.

మావోయిస్టులు వ్యక్తిగత హింసావాదం ఇంకా వదులుకోలేదా? ఇట్లా విప్లవం వస్తుందా? అనే రాజకీయ చర్చ కూడా మరి కొందరు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విప్లవ వ్యూహ చర్చ కూడా చేసుకోవచ్చు. కాదనేది లేదు. అవన్నీ చాలా అవసరమైనవే. విప్లవానికి సంబంధించిన ఏ చర్చకైనా సిద్ధం కావడం బాధ్యత.

కానీ వ్యవహారం నిర్దిష్టంగా ఉండాలి. ఈ హత్యా ఘటన జరిగిన ప్రాంతంలో బాక్సైట్‌ సమస్య ఉంది. ముందు ఆ సంగతి మాట్లాడుకోవాలి. అది లేకుండా ఆ చివర అస్తిత్వాల దగ్గరి నుంచి, ఈ చివర విప్లవ కార్యక్రమాల దాకా మాట్లాడుకుంటే సాగతీత అవుతుంది. నికరంగా తేలేది ఏమీ ఉండదు. నాలుగు రోజులుగా దిన పత్రికలు ఠంచనుగా ఒకటి రెండు పేజీలు ఈ ఘటనకే కేటాయించాయి. ఈ హత్యలు ఎలా జరిగాయి? వ్యూహకర్తలెవరు? ఎలా అమలు చేశారు? అనే భోగట్టా వండుతూనే ఉన్నాయి. రెండు ప్రభుత్వ అనధికార పత్రికలు పూర్తిగా ఈ పనిలో తలమునలయ్యాయి. ప్రతిపక్ష పత్రిక పనిలో పనిగా తన సొంత వ్రయోజనాలకు తగినట్లుగా వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటోంది.

దీనికి భిన్నంగా విషయాన్ని చూడలేమా? అనేదే ప్రశ్న.

బాక్సైట్‌తో సంబంధం లేకుండా ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లోని ఏ హత్యల గురించీ మాట్లాడటం సబబు కాదు. ఇప్పుడు ఈ ఇద్దరి హత్యలనే కాదు, కనీసం గత పదిహేనేళ్లుగా ఏవోబీ అనబడే విప్లవోద్యమ ప్రాంతంలో ఎన్ని డజన్ల మందిని హత్య చేశారు. రాంగుడా మారణకాండ గుర్తుండే ఉంటుంది. 31 మందిని హత్య చేశారు. ఆ తర్వాత కూడా హత్యలు జరిగాయి. వాళ్లలో చాలా మంది ఆదివాసులే. కాకపోతే వాళ్లు గనుల బినామీ ఓనర్లు కాదు. ఆ పార్టీని, ఈ పార్టీని పట్టుకొని ఎమ్మెల్యేలు కాలేదు. అయితే ఆదివాసులే. ఆ హత్యలను ఇప్పటి ఘటనకు పోటీ తేవడం లేదు. ఎందుకంటే హత్యలకు హత్యలను పోటీ పెట్టడం విప్లవ నీతి కాదు. అయితే ఈ అన్ని హత్యలకు బాక్పైట్‌తో సంబంధముంది. దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు. ఆ మాటకొస్తే బాక్సైటే కాదు, ఏవోబీలోని సహజ సంపదతో సంబంధం ముడిపడి ఉంది.

బాక్సైట్‌ తవ్వకాలు వద్దని, మొత్తంగా అడవిలోని సహజ సంపదను కొల్లగొట్టడానికి కంపెనీలు రావద్దని ఆదివాసులు పోరాడుతున్నారు. ఎమ్మెల్యే పదవిని, ప్రభుత్వ ప్రాపకాన్ని అడ్డం పెట్టుకొని బాక్సైట్‌ తొవ్వుకొని వెనకేసుకుంటున్నాడు కిడారి. ఇదీ అసలు సమస్య. ఇదొక్కటే సమస్య. అత్యంత శక్తివంతమైన అస్తిత్వం ఆస్తి దగ్గర, అధికారం దగ్గర దుర్బలమైపోవడమే ఈ హత్యల వెనుక ఉన్న విషాదం. ఎవరైనా దీనికి వగచాలి. ʹనా ఆదివాసీ జనం కదా? వాళ్లదీ నాదీ ఒకే ఉమ్మడి సాంఘిక అస్తిత్వ పునాది కదా? నాకు ఈ ఎమ్మెల్యే పదవైనా ఉన్నది.. వాళ్లకు ఈ తవ్వకాల వల్ల జీవితమే తుడిచిపెట్టుకొని పోతుందే..ʹ అనే ఫీల్‌ కలగాలి. చైతన్యం అనేంత పెద్ద మాట దీనికి ఉపయోగించాల్సిన పని లేదు. ఇలా అనుకోవడం అస్తిత్వ సహజ లక్షణం. అది సామాజికం, చారిత్రకం. ʹమా అదివాసులం.. మేమంతా ఒక్కటి, మీరు వేరే..ʹ అనే అస్తిత్వ కైవారం ఆస్తి దగ్గర ధ్వంసమైపోయినందుకు దు:ఖించాలి.

అతి ప్రాచీన సాంఘిక ఆదివాసీ అస్తిత్వాన్నే ఆస్తి, ఆధికారం ఇంతగా తుత్తినియలు చేసింది. మరి మిగతా అస్తిత్వాల ఉనికి ఏమిటి? వాటి ఆధారంగా మనం తయారు చేసుకుంటున్న సిద్ధాంతాల మాటేమిటి? రాజకీయ వ్యూహాల మాటేమిటి? ఎంత ఆర్దృమైన భావనలు, వర్ణనలు నిర్మించకున్నాం..ఇవన్నీ పరంపరాగత జీవన మూలాల సున్నితత్వంలోంచి ఒడిసిపట్టుకున్నవి కదా? ʹమేమూ.. మీరూʹ అనే అత్యంత మౌలిక అస్తిత్వ దినుసే ఇలా తేలిపోవడాన్ని ఏమనుకుందాం?
కిడారి సర్వేశ్వరరావు, సోమ హత్యలతోగాని మనకు ఈ ఎరుక కలగలేదా?

నేల గర్భంలో ఎప్పటి నుంచో దాక్కొని ఉండి ఇప్పుడిలా బైటపడే క్రమంలో బాక్సైట్‌ ఎంత విషాదాన్ని నింపింది.

ఇంతకూ బాక్పైట్‌ బలీయమైనదా? వేల ఏళ్ల ఆదివాసీ సాంఘిక అస్తిత్వ మూలాలు బలీయమైనవా? గనుల తవ్వకాల నుంచి వెలికి వచ్చింది బాక్సైటేనా? లేక ఆస్తిత్వ తవ్వకాల నుంచి వర్గమనే మహమ్మారి వెలికి వచ్చిందా?

భూమ్మీది మానవ సమాజాలన్నీ వర్గ సమాజాలుగా విడిపోవడం ఇలాగే జరిగి ఉండొచ్చు.

కిడారి సర్వేశ్వరరావు ఓ పదేళ్ల కింద, పాతికేళ్ల కింద ఎలా ఉండి ఉంటాడు? ఆయన అలాగే ఉండిపోవాలని కోరుకోడానికి మనమెవరం? కానీ ఆయనకూ, ఆయనలాంటి అసంఖ్యాక ఆదివాసులకూ మధ్యలోకి బాక్సైట్‌ వచ్చేసింది. ఆస్తి వచ్చేసింది. అంతకంటే ముందే కావచ్చు.. ʹవీళ్లందరూ మా ఆదివాసులు, ఇదంతా మా ఆదివాసీ ఏరియా, అసెంబ్లీలో మా ప్రాతినిధ్యం ఉండొద్దా..ʹ అనే అస్తిత్వ ప్రకటనతో ఆయన రాజకీయ నాయకుడయ్యాడు. కావద్దని మనమెందుకు అంటాం? కావచ్చు. అయితే ఈ పక్క ఆయన ఆదివాసీ అస్తిత్వం చట్టసభలోనో, బాక్సైట్‌ గనుల్లోనూ చిక్కుకపోయింది. ఆ పక్క అసలు ఆదివాసులు తమ అస్తిత్వాన్ని వర్గంగా గుర్తించుకోవాల్సి వచ్చింది. కిడారి సర్వేశ్వరరావు అనే ఎమ్మెల్యే వేరు, ఆదివాసులుగా బాక్సైట్‌ తవ్వకాలతో దోపిడీకి బలైపోతున్న మేం వేరు అనే విభజన జరిగిపోయింది.

మరి ఆదివాసీ అస్తిత్వం ఏమైంది?

దీన్నెందుకు చూడకూడదు? చూసీ వదిలేద్దామా?

కిడారి కూడా గతంలో బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించాడు. మిగతా అన్ని రకాల మైనింగ్‌ వద్దని పల్లెలు తిరిగాడు. ఎప్పుడు? ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు. బహుశా ఆ రాజకీయాల్లోకి వెళ్లక ముందు కూడా ఆదివాసీలందరిలాగా మైనింగ్‌ వద్దనే అని ఉంటాడు. మైనింగ్‌ అంటే ఆస్తిని వెలికి తీయడం, ఆదివాసీ జీవన అస్తిత్వాన్ని మెల్లగా రద్దు చేయడం. కిడారి సర్వేశ్వరరావు మైనింగ్‌ వద్దనే దగ్గరి నుంచి మైనింగ్‌ యజమాని అయ్యాడు. అందుకే ఆయన హత్య వార్త వినగానే విదేశం నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివాసీ నాయకుడ్ని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన చెందాడు. అది మొదలు అందరూ ఆదివాసీ నాయకులను చంపుతారా? అనే పాట అందుకున్నారు. వీళ్లన్నా కాకున్నా ఆయన ఆదివాసీ కాకుండాపోడు. చాలా మందికి కిడారి పార్టీ మారిన సంగతే తెలుసు. ఆయన తన అస్తిత్వం నుంచే ఫిరాయించి అవతలి వర్గంలో చేరాడు. ఈ సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. అస్తిత్వమనే పుట్టక గుర్తింపు పోదు కాబట్టి ఆదివాసీ ఆనాల్సిందే. తప్పదు.

కాకపోతే గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. అవతలి వర్గానికి అస్తిత్వాలను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. అన్ని అస్తిత్వాలతో కూడిన వర్గంగా ఎలా సంఘటితంగా ఉండాలో తెలుసు. వివిధ పీడిత అస్తిత్వాల నుంచి తన వర్గం వైపు మొగ్గు చూపుతున్న వాళ్లను ఎలా పికప్‌ చేసుకోవాలో అంతకంటే బాగా తెలుసు. అయితే అవతలి వర్గంలో తనకు దొరికిన చోటు ఎంతో కిడారికీ తెలిసి ఉండాలి.

వివరాల్లోకి వెళితే కిడారి దళారీ కాకుండా విప్లవోద్యమం కాపాడుకొని ఉండవచ్చు కదా? చాలా సహజంగా జరిగే ఇలాంటి పరిణామాన్ని నిలువరించి ఉండవచ్చు కదా? ఆదివాసీ ప్రాంతంలోనే సాధ్యం కాకపోతే ఇంకెక్కడ సాధ్యమవుతుంది? పోనీ అతనలా తయారయ్యాడనే అనుకుందాం.. ఎన్ని సార్లు హెచ్చరించారు? ఉత్తరాల్లోనా? నేరుగానా? అయినా సరే ఆదివాసీ కదా? ఈ వ్యవస్థ అనే సాగరాన్ని అల్లకల్లోలం చేస్తున్న సొర చేపలు, పెద్ద చేపలు ఎన్నో ఉండగా అవేవీ కాక ఈ చిన్న చేపకు శిక్ష ఏమిటి? అవి దొరకలేదని ఈ చేపకు వల వేశారా? ఇలా ఎంతో చర్చ చేయవచ్చు.

ఇవేవీ అస్తిత్వాల్లో ఆస్తి, అధికారం తెచ్చే వర్గ విభజనను వివరించజాలవు.

అవతలి వర్గంలోకి వెళ్లినవాళ్లనల్లా చంపేసుకుంటూ పోతారా? అట్లా చంపి విప్లవం తేగలరా? అనే ప్రశ్నలూ ఎదురయ్యేవే. చంపడమే ఒక విధానం కానేకాదు. విధానంలో భాగంగా చంపేదాకా పోకపోవడమే అసలు విధానం. అస్తిత్వాలతో నిమిత్తమే లేదు. ఉన్నది అస్తిత్వపు సంకెళ్ల నుంచి విముక్తి ఎలా? అనే. ఆదివాసులు ఒక ప్రత్యేకమైన సాంఘిక అస్తిత్వం ఉన్న జనాలే కాదు. వర్గాలుగా చీలిపోయిన జనం కూడా. రకరకాల గనుల తవ్వకాల వల్లే కాదు, అంతక ముందు కూడా వర్గాలుగానే ఉన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో సాల్వాజుడుం అనే హంతక సైన్యాన్ని ఆదివాసుల నుంచే తయారు చేసి ఆదివాసుల మీదే ఉసికొల్పి మారణకాండ సృష్టించిన మహేంద్రకర్మ కూడా ఆదివాసీనే. ఆయన పూర్వీకులు బ్రిటీష్‌ ఏజెంట్లుగా పని చేసి ఆదివాసీ ఆకాంక్షలపై, పోరాటాలపై దాడులు చేయించారట. ఈ వర్గ మూలాలను విప్లవోద్యమం అక్కడికి వెళ్లాకనే బైటికి తీసింది. మహేంద్రకర్మను హత్య చేయక తప్పలేదు.

అట్లని మహేంద్రకర్మను, కిడారి సర్వేశ్వరరావును ఒకే బ్రాకెట్‌లో ఎందుకు పెట్టాలి? అసలు ఏ ఇద్దరు వ్యక్తులనైనా ఒక బ్రాకెట్లో ఎలా ఇరికించగలం? ఎవరి ప్రత్యేకత వారిదే. కామన్‌ పాయింట్‌ ఏదైనా ఉంటే అది వర్గానికి సంబంధించిందే. కొందరు ఇలాంటి వ్యక్తులను అస్తిత్వం అనే కామన్‌ పాయింట్‌ మీద నిలబెట్టి మావోయిస్టులను బోనెక్కించాలనుకుంటున్నారు. కానీ కిడారి లాంటి వాళ్లు తమంతకు తామే వర్గమనే కామన్‌ పాయింట్‌ మీదికి వచ్చి నిలబడ్డారు. అస్తిత్వాన్ని కాలదన్ని. మళ్లీ చెప్పాలంటే అదీ అసలు విషాదం. ఇది ఆ వ్యక్తుల చేతిలో ఉండేది కూడా కాదు, వాళ్లు కాకుంటే మరొకరు. ఆదివాసులే కాకపోతే ఆదివాసేతరులు గనులు తవ్వుకుంటారు. అంతా తొవ్వుకపోతున్నది అలాంటి మల్టీ నేషనల్‌ కంపెనీలే. మేమూ ఎందుకు గనులు తొవ్వుకోకూడదని కిడారిలాంటి వాళ్లు వాటా కోసం వస్తారు. సరిగ్గా అస్తిత్వం అక్కడ వాళ్లకు సరుకు అయింది. ఆ తర్వాతే బాక్సైట్‌ సరుకైంది.

ఆ పక్కనేమో ప్రాచీన అస్తిత్వ సంకెళ్లతోపాటు సరుకును, మార్కెట్‌ను, బూర్జువా ఆధిపత్య దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివాసులు వర్గంగా సంఘటితమవుతున్నారు. ఆదివాసుల్లోని పీడిత వర్గమే విప్లవం తెస్తుందా? అనే సిద్ధాంత సంబంధమైన ప్రశ్న తప్పక ఎదురయ్యేదే. విప్లవం తెచ్చే వర్గంలో ఆదివాసులు కూడా ఒక భాగం. ఆదివాసీ ప్రాంతాలు విప్లవానికి వ్యూహాత్మక స్థావరాలు. అంత వరకే. అంత కంటే ఎక్కువా కాదు, తక్కువా కాదు. ధ్వంసం చేయాల్సిన అసలు వ్యవస్థ బైటే ఉన్నదని, అది కొమ్ములు తిరిగిన ఆంబోతని కూడా విప్లవోద్యమానికి ఎరుకే. ఆ మాత్రం తెలియకుండా దేశ విప్లవాన్ని ఎజెండా ఎలా చేసుకుంటారు? ఆదివాసీ ప్రాంతాల విముక్తితో సరిపుచ్చుకుందామనుకోవడం లేదు. మామూలు కవితాత్మక వాక్యాల్లోనే ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరేయడం తమ లక్ష్యమని విప్లవకారులు చెప్పుకుంటారు. దండకరణ్యం, ఏవోబీ, ఝార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమ కనుమల్లో దశాబ్దాలుగా సాగుతున్న పెనుగులాట అర్థం ఏమిటి? అత్యంత ప్రాచీనమైన అస్తిత్వాల్లోని ప్రగతి వ్యతిరేక మూలాల నుంచి ఎలా విముక్తి కావాలి? అనే. అంత మాత్రమే కాదు, వర్గ దోపిడీ నుంచి ఎలా బైటికి రావాలి అనే పోరాటం అక్కడ ప్రధానంగా ఉన్నది. ఆ దిశగా మావోయిస్టు ఉద్యమం గతంలో పని చేసింది, చేస్తోంది. ఇప్పటికి ఉన్న వ్యూహాలు చాలకపోతే, సరిపోకపోతే కొత్తవి తయారు చేసుకుంటుంది. మిగతా వాళ్లు కూడా ఆ పనికి ఎందుకు సిద్ధం కాకూడదు?

- పాణి

Keywords : maoists, virasam, kidari sarveshvara rao, soma. police, bauxite
(2024-04-24 19:14:55)



No. of visitors : 1501

Suggested Posts


తుపాకులతో... బాక్సైట్ తవ్వకాలు - భగ్గుమంటున్న మన్యం

పచ్చని అడవి బతుకులను బూడిద చేయడానికి ప్రభుత్వం నడుం భిగించింది. మన్యం ఆదివాసులంతా తమ జీవితాలను బుగ్గి చేయొద్దని వేడుకుంటున్నా, మావోయిస్టు పార్టీతో సహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నా.... చివరకు అధికార తెలుగుదేశం నాయకులు కూడా ఒద్దని చెబుతున్నా.... తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....

ʹఅటవీ సంపద ఆదివాసులదేʹ - మన్యంలో తీవ్రమైన మావోయిస్టుల పోరాటం

అటవీ సంపద పై ఆదివాసులదే అధికారం అంటూ మన్యంలో మావోయిస్టులు పోరాటం ఉదృతం చేశారు. విశాఖపట్నం మన్యంలో ఒక వైపు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మావోయిస్టులు మరో వైపు కాఫీ తోటలను ఆదివాసుల పరం....

టీడీపీ సైట్ నుండి బాబు బాక్సైట్ లేఖను ఎందుకు మాయం చేశారు ?

విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల పై చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారా ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరప వద్దని, అది రాజ్యాంగ విరుద్దమని డిశంబర్ 24, 2011న గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు బాక్సౖట్ తవ్వకాలకు అనుమతులు ఎలా ఇచ్చారు ? నిన్నటిదాకా తెలుగుదేశం వెబ్ సైట్ లో ఉన్న ఆ లేఖ ఇవ్వాళ్ళ ఎందుకు మాయమయ్యింది ?....

బాక్సైట్ నిరసన - మన్యం బంద్

విశాఖమన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం మన్యం బంద్ జరగనుంది.....

బాక్సైట్ తవ్వకాలు ఆపేయండి లేదంటే నక్సల్స్ బతకనివ్వరు - మంత్రి అయ్యన్నవేడుకోలు

ʹప్రతిపక్షాలను ఎదుర్కోవచ్చు నక్సలైట్లను ఎదుర్కోలేంʹ ఇది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి ఆందోళన. విశాఖపట్నం జిల్లా మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి....

బాక్సైట్ పోరు - మన్యం బంద్ సక్సెస్

విశాఖ మన్యం బంద్ విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకోసం అనుమతినివ్వడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం శనివారం బంద్ కు పిలుపునిచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు కూడా ఈ బంద్ లో....

బాక్సైట్ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

విషాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. మావోయిస్టుల నాయకత్వంలో గిరిజనుల పోరాటం, స్వపక్షం విపక్షం నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ముందు