ప్ర‌మాదంలో ప్రైవ‌సీ


ప్ర‌మాదంలో ప్రైవ‌సీ

ప్ర‌మాదంలో

నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం రాస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం తింటున్నావు? ఎవరెవరిని కలుస్తున్నావు? పౌరుల ప్రతి కదలికపైనా ప్రభుత్వం ఇప్పడు నిఘా పెట్టబోతోంది. అందుకు పది నిఘా సంస్థలకు కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. అత్యంత దుర్మార్గమైన ఈ ఆలోచన ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించివేయనుంది.

ప్రజల కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారంపై నిఘా పెట్టేందుకు, వాటిని స్వాధీనం చేసుకునేందుకు నిఘా సంస్థలకు అనుమతి ఇస్తూ డిసెంబర్‌ 20 కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఆదేశాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. తాజా ఆదేశాల ప్రకారం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్‌ 69(1) కింద ఇంటెలిజెన్స్‌బ్యూరో, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, కేబినెట్‌ సెక్రటేరియట్‌(రా), జమ్మూకశ్మీర్‌, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల డైరెక్టరేట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌, ఢిల్లీ పోలీసులు ప్రజల కంప్యూటర్లపై నిఘా పెట్టవచ్చు. ఆ పేరుతో... ప్రజల వ్యక్తిగత జీవితాల్లో చొరబడవచ్చు. కంప్యూటర్లలోని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే హక్కును ప్రభుత్వం కల్పించింది.

నిఘా సంస్థలకు సహకరించని యెడల ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు కూడా. ఇక్కడ ప్రజల హక్కలకు ఎలాంటి విలువ లేదు. నా వ్యక్తిగత జీవితంలోకి మీరెలా తొంగిచూస్తారని అడిగే హక్కు లేదు. అనుమానం పేరుతో... ఎవరి ఇంటిమీదైనా పడి కంప్యూటర్లు, మొబైళ్లు స్వాధీనం చేసుకోవచ్చు. అనుమానం అనే సాకుతో... ప్రజల కదలికలపై నిఘా పెట్టొచ్చు. మీరు రాసే ఉత్తరాలను చదవొచ్చు. మీరు మాట్లాడుకునే సంభాషణను వినవచ్చు. ఇంత నిర్లజ్జగా రాజ్యం ప్రజల జీవితాల్లోకి చొరబడేందుకు సిద్ధమైంది.

కేంద్రం నిర్ణయంపై పార్లమెంట్‌లో దుమారమే చెలరేగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. కానీ, వ్యక్తిగత స్వేచ్ఛ దేశ భద్రతకు సవాలుగా నిలిస్తే ఐటీ యాక్ట్‌ ప్రకారం ప్రభుత్వ ఏజెన్సీలు దర్యాప్తు చేయవచ్చంటూ కేంద్రం తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు యత్నించింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దర్యాప్తు ఆదేశాలు ఇస్తారని చెప్పుకొచ్చింది. సామాన్యుల కంప్యూటర్లపై నిఘా ఉండ బోదంటూ గొంతు సవరించుకుంది. నిజానికి ప్రభుత్వం... ఇలాంటి ఆదేశాలు ఏవీ లేకుండానే తాను చేయదలుచుకున్నవన్నీ చేస్తోంది.

పదేళ్ల క్రితమే రూపొందించిన ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ కింద ఇప్పటికే... భద్రతా ఏజెన్సీలు టెలిఫోన్‌ సంభాషణలు ట్యాప్‌ చేస్తోంది.

తాజా ఆదేశాలు ప్రజల జీవితాల్లో కల్లోలం రేపనున్నాయనేది వాస్తవం. రాజ్యం తన బరితెగింపుకు.. మరింత స్వేచ్ఛ కావాలంటూ... ఇప్పుడు మన ఆలోచనల్ని స్కాన్‌ చేసేందుకు దూకుడుగా ముందుకు వస్తోంది. ప్రియురాలికి పంపిన ప్రేమలేఖను ప్రభుత్వం చదువుతానంటుంది. కుటుంబంతో గడిపిన సంతోషకర సమయాన్ని స్కాన్‌ చేస్తానంటుంది. మెయిల్స్‌, సోషల్‌ మీడియాలో సంభాషణలను జల్లెడపడుతుంది. కాలం మిగిల్చిన జ్ఞాపకాలనో, గాయాలనో పట్టి పట్టి పరిశీలిస్తుంది.

జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వం... తాము చేసే పనులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం వెల్లడించదు. ప్రజా ధనాన్ని ఎక్కడ ఎలా వినియోగించిందీ తెలియజేయదు. రాఫెల్‌ ఒప్పందం ఎంతకు జరిగిందో ప్రజలకు చెప్పడానికి వెనకాడుతుంది. కానీ ప్రజల వ్యక్తిగత జీవితాలను మాత్రం జల్లడపడతానంటుంది.

నిజానికి ప్రభుత్వం చెబుతున్నట్లు.. ఈ నిఘా కేవలం దేశ భద్రతకు భంగం కల్గించేవారిపైనే ఉంటుందా? అంటే... అది ముమ్మాటికీ నిజం కాదు. యూపీ ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆలుగడ్డలు పడేశారనే కారణంగా ఏకంగా 10 వేల మంది ఫోన్లను ట్యాప్‌ చేశారు పోలీసులు. ఇదీ.. ప్రభుత్వం చెబుతున్న అనుమానం. ఈ పేరుతో వేలు, లక్షల మంది కంప్యూటర్లపై నిఘా పెట్టడానికి సిద్ధమైన ప్రభుత్వం... అందుకోసం తనకు తానే అధికారిక ముద్ర వేసుకుంది.

ఇది కంప్యూటర్ల మీద నిఘా మాత్రమే కాదు.. ప్రజల ఆలోచనల మీద నిఘా. మెదళ్ల మీద నిఘా. ఓ యూనివర్సిటీ విద్యార్థి ఏం ఆలోచిస్తున్నాడు. ఓ రచయిత ఏం రాయబోతున్నాడు. ఓ మీడియా సంస్థ ఏం ప్రచురించబోతోంది. ఓ పసిపిల్లాడు ఏం తినబోతున్నాడు మొదలు... ఎవరు ఏ మతాన్ని విశ్వసిస్తున్నారు. ఎవరిని పూజిస్తున్నారు వరకు ప్రతి కదలికపైనా నిఘా పెట్టేందుకు జరుగుతున్న కుట్ర. ప్రజల స్వేచ్ఛను హరించే అధికార దుర్వినియోగ చర్యలు.

రాజకీయ ప్రత్యర్థులను, ప్రత్యామ్నాయ ఆలోచనలను అణచివేసేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలతో ముందుకు వస్తోందనేది స్పష్టం. ప్రజల ఆలోచలన్ని నియంత్రించాలనుకునే కుట్ర ఇది. ప్రజల ప్రాథమిక హక్కుల్ని అధికారికంగా కాలరాసే ప్రయత్నం ఇది. అధికారికంగా ఈ ఆదేశాలు రాకమునుపు నుంచి కూడా ఫోన్‌ ట్యాపింగ్‌, మెయిల్స్‌, కంప్యూటర్లపై నిఘా కొనసాగుతూనే ఉంది. అందుకు.. తాజా ఉదాహరణే భీమా కోరేగావ్‌ కేసు. సామాజిక కార్యకర్తల మెయిల్స్‌లో మావోయిస్టుల లేఖలు లభ్యమయ్యాయనే పేరుతో... పలువురిని అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించింది రాజ్యం. అది మాత్రమే కాదు... ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ... మావోయిస్టు రాజకీయాలను ప్రచారం చేస్తున్న వెబ్‌ పోర్టల్‌ బ్యాండెడ్‌ థాట్‌ను ప్రభుత్వం నిషేదించింది. ఇది.. ఒక సంకేతం మాత్రమే.

రేపొద్దున... మోదీకి నచ్చని డ్రెస్‌ వేసుకుంటే దాడి చేశారు. సంఘ్‌పరివార్‌కి నచ్చని ఆహారం తింటే.. ఇంట్లో చొరబడి హత్య చేస్తారు. వేరే మతం అమ్మాయితో ఫోన్‌లో సంభాషించినందుకు నిలువునా కాల్చేస్తారు. ఇలాంటి పాశవిక చర్యలకు సైతం ప్రభుత్వం కల్పించిన అధికారాన్ని వినియోగించుకుంటారు. కంప్యూటర్‌లలో నిక్షిప్తమైన సమాచారం తెలుసుకోవడమంటే... ప్రజల జీవితాల్ని పాలకులు తమ చేతుల్లోకి తీసుకోవడమే.

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల్లో భాగమని పుట్టుస్వామి కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆధార్‌ను ప్రభుత్వ పథకాలకు తప్పనిసరి చేయడాన్ని, ఆధార్‌ సమాచారాన్ని బహుళజాతి సంస్థలకు ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ʹʹ21వ అధికరణ ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమʹʹని పేర్కొన్నది.

2017 ఆగస్టులో జస్టిస్‌ ఖేహర్‌తోపాటు జస్టిస్‌ జె.చలమేశ్వర్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఆర్కే అగర్వాల్‌, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, జస్టిస్‌ ఏఎం సప్రే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్కే కౌల్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన బెంచ్‌ ʹవ్యక్తిగత గోప్యత.. వ్యక్తి స్వయంప్రత్తిని కాపాడుతుందని, జీవితంలోని కీలక అంశాలపై స్వీయ నియంత్రణ కల్పిస్తుందని పేర్కొన్నది.

ʹʹ ఆర్టికల్‌ 21 ప్రకారం లభించిన వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కులోనే వ్యక్తిగత గోప్యత హక్కు కూడా అంతర్భాగంʹʹ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. ʹʹవ్యక్తిగత గోప్యత హక్కు మనిషికి పుట్టుకతోనే వస్తుంది. చనిపోయేదాకా ఉంటుంది. ఇది మనిషి జీవితంలో విడదీయలేని అంతర్భాగంʹʹ అని జస్టిస్‌ సప్రే అన్నారు. ʹవ్యక్తిగత గోప్యత లేకున్నా హుందాగా జీవించవచ్చుʹ అని భావించ లేమన్నారు.

అదే తీర్పులో.. ʹʹనయంకాని రోగంతో బాధపడుతూ, కేవలం మందులతో బతికే జీవితం తనకువద్దని రోగి అనుకోవచ్చు. ప్లిలలను కనాలా, వద్దా అన్నది ఓ మహిళ నిర్ణయించుకోవచ్చు. ఇవన్నీ వ్యక్తిగతస్వేచ్ఛ పరిధిలోకే వస్తాయి. తామే ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నామన్నది ప్రభుత్వానికి చెప్పాలని ఎవ్వరూ భావించరుʹʹ అని జస్టిస్‌ చలమేశ్వర్‌ పేర్కొన్నారు.

ఆధార్‌ పేరిట ప్రభుత్వం సేకరించిన సమాచారం బహుళజాతి సంస్థల చేతికి చిక్కడాన్ని బట్టి ప్రజల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భద్రతా లేదని స్పష్టమవుతోంది. అలాంటిది ప్రభుత్వమే నేరుగా... ప్రజల జీవితాలపై నిఘా పెట్టడం, ప్రైవసీకి భంగం కల్పించడం గర్హనీయం. ఈ అప్రజాస్వామిక, నియంతృత్వ ధోరణిని నిరసించాల్సిన అవసరముంది.

- క్రాంతి
(న‌డుస్తున్న తెలంగాణ జ‌న‌వ‌రి 2019 సంచిక‌లో ప్ర‌చురితం)

Keywords : privacy, surveillance, government, నిఘా, వ్యక్తిగత సమాచారం, గోప్యత, ప్రభుత్వం
(2019-06-16 00:36:02)No. of visitors : 231

Suggested Posts


0 results

Search Engine

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
Condemn the criminal intimidation and threats made on activist Dr. Ram Puniyani
iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba
ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా
రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !
నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...
పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం
తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం
క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్
more..


ప్ర‌మాదంలో