మరొకసారి విద్వేష ప్రభుత్వం...కర్తవ్యం ఏమిటి ?


మరొకసారి విద్వేష ప్రభుత్వం...కర్తవ్యం ఏమిటి ?

మరొకసారి

(వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ రాసిన వీక్షణం జూన్, 2019 సంచిక సంపాదకీయం )

ఎన్నికలు ముగిసి, ఫలితాలు కూడ వెలువడ్డాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ - ఎన్‌డిఎ ప్రభుత్వం ఓడిపోతుందని, మరొక ప్రభుత్వం వస్తుందనీ, దేశంలో కొనసాగుతున్న కుల, మత విద్వేష, అసహన రాజకీయాల నుంచి కొంతయినా ఉపశమనం దొరుకుతుందనీ అనుకున్న చాలమంది ప్రగతిశీల బుద్ధిజీవుల, ప్రజల ఆశలు భగ్నమయ్యాయి.

గత ఐదు సంవత్సరాలలో అమలు చేసిన ప్రజా వ్యతిరేక, విష విద్వేష రాజకీయాలను యథాతథంగానో, మరింత ఎక్కువగానో కొనసాగించడానికి సంఘ్‌ పరివార్‌కు ʹʹప్రజామోదంʹʹఅనబడే బారాఖూన్‌ మాఫ్‌ అనుమతి దొరికింది. ఈ పరిణామం ఎట్లా సంభవించింది, మన సమాజం ఇంతగా మతోన్మాదపూరితమై పోయిందని మనం గుర్తించలేదా లేక మరేదైనా ఆకస్మిక, ఐంద్రజాలిక, సాంకేతిక కనుకట్టు విద్యలతో సంఘ్‌ పరివార్‌ మళ్లీ గద్దెనాక్రమించిందా, ఇది సంఘ్‌ పరివార్‌ బలమా, ప్రతిపక్షాల వైఫల్యమా, ప్రగతిశీల శక్తుల ఆచరణలోపమా అని ఎన్నెన్నో ప్రశ్నలు సమాధానాలు కోరుతున్నాయి.

పార్లమెంటరీ రాజకీయ పక్షాలలో ఎవరు గెలిచి ఎవరు ఓడినా అంతిమ ఓటమి ప్రజలదే అవుతుంది. పాలకవర్గ ప్రయోజనాలను ఓడిన ముఠా కన్న తానే ఎక్కువగా కాపాడతానని గెలిచిన ముఠా తమ యజమానులను ఒప్పించిందనడానికి సూచికే ఎన్నికల ఫలితాలు. అందువల్ల ఓడిన ముఠా ఓటమికి కారణాలను అన్వేషించే బదులు ప్రజల ఓటమికి కారణాలను అన్వేషించడం అవసరమైన పని.

అయితే మన సమాజ సంక్లిష్టత వల్ల ఏ ఒక్క అంశమూ సరళంగా, సూటిగా, సమీకరణం లాగ చెప్పలేము. పాలకవర్గ ముఠాలన్నీ ఒక్క తానులోని ముక్కలేనని తెలిసిన వారు కూడ ఒక ముక్క గెలుపును కాకపోయినా, కనీసం మరో ముక్క ఓటమిని కోరుకునే సందర్భం వస్తున్నది. ప్రజల కనీస అవసరాలు తీర్చే ప్రజానుకూల పాలన అందించకపోవడం, దేశాన్ని బడా భూస్వాముల, దళారీల, సామ్రాజ్యవాదుల చేతుల్లో పెట్టడం, అవసరం అనుకున్నప్పుడు మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, జనహననానికి పాల్పడడం, ప్రాథమిక హక్కులను ఉక్కుపాదంతో కాలరాయడం వంటి పనుల జాబితా తయారు చేస్తే భాజపా ఎంతటి నేరస్తురాలో కాంగ్రెస్‌ అంతటి నేరస్తురాలని స్పష్టమవుతుంది.

రెండు పక్షాల చరిత్రా ఒక్కటేనని తేటతెల్లమవుతుంది. అయినా ఈ ఎన్నికల్లో చాల మంది ఉద్యమకారులు, ప్రగతిశీలవాదులు, అంచులలోకి నెట్టబడిన వర్గాలు భాజపా - ఎన్‌డిఎ ఓడిపోవాలని, ప్రభుత్వం నుంచి దిగిపోవాలని కోరుకున్నారు. అదేమీ కాంగ్రెస్‌ - యుపిఎ పట్ల ప్రేమ కాదు, వారు ప్రజా ప్రయోజనాలను నెరవేరుస్తారనే భ్రమ కాదు.

విషవాయు ప్రయోగంతో ఐదు సంవత్సరాలు ఉక్కిరి బిక్కిరైన వర్గాలు ఈ జైలు కన్న పక్కన అగడ్తలోకి దూకడమైనా సరే అనుకున్నాయి. ఈ మంటల్లో కాలిపోవడం కన్న ఎగిరి పెనం మీద దూకితే వేగినా సరే అనుకున్నాయి. ఎంతకాదన్నా కాంగ్రెస్‌ బహుళత్వాన్ని నమ్మే, ఆచరించే రాజకీయ పక్షం. అనేక చారిత్రక కారణాల వల్ల దానికి ఆ వెసులుబాటు వచ్చింది గనుక ప్రజలకు కూడ కనీసం గాలి పీల్చుకునే అవకాశం, బేరసారాలకు దిగే వీలు వస్తాయని కొందరైనా అనుకున్నారు.

ఆ స్థానంలో ఏకాత్మతను నమ్మే, ఆచరించే, హింసా దౌర్జన్యాల పార్టీగా భాజపా ఐదు సంవత్సరాల అధికారాన్ని ఎంత ప్రజా కంటకంగా నిర్వహించగలదో నిరూపించింది. కారణాల గురించి వివరంగా విశ్లేషించుకోవచ్చుగాని, అంతకన్న ముఖ్యంగా అలా తెలుసుకున్న కారణాలను తొలగించడానికి, తగ్గించడానికి, అంతిమంగా ఈ దుర్మార్గ పాలనను బలహీనపరచడానికి, రద్దు చేయడానికి ప్రతిపాదిస్తున్న ఆచరణ ఏమిటి అనేది ఇవాళ కీలకమైన ప్రశ్న.

ఈ స్థితిలో, ఈ దుస్థితిలో మీరు వ్యక్తిగతంగానో, సామూహికంగానో మీ కర్తవ్యం ఏమిటని నిర్వచించుకుంటున్నారు? ఈ దుర్మార్గ పాలనలో బాధితులుగా, పీడితులుగా మిగలబోయే ప్రజాసమూహాలేవో స్పష్టమే. మనువాదాన్ని ఖండించే సమూహాలు, ఈ దేశం బహుళత్వ దేశమనీ దీన్ని ఏ ఒక్క మతంతోనో, ఏ ఒక్క జీవనవిధానంతోనో ఏకాత్మతా సంస్కృతిగా మార్చడానికి వీలులేదని ఎలుగెత్తే సమూహాలు, హింసకూ అసమానతకూ ఆలవాలమైన ఈ బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు సామాజిక స్వభావాన్ని కూలదోయాలనీ, సమభావం పునాదిగా, ఆర్థిక,
రాజకీయ, సామాజిక న్యాయాన్ని నిర్మించాలనీ కలలు గనే సమూహాలు అన్నిటినీ ఈ పాలన ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నిస్తుంది.

వాక్సభాస్వాతంత్య్రాలను, వ్యక్తిస్వేచ్ఛను, పత్రికాస్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని ప్రతిపాదించే ప్రజాస్వామ్యమన్నా, రాజ్యాంగమన్నా ఈ
పాలకులకు కంటగింపు. ఆ విలువలను ఎత్తిపట్టదలచినవారందరినీ నిర్బంధాల పాలు చేయడం ఈ పాలన లక్ష్యం. ʹఏకీభవించనోడి పీకనొక్కు సిద్ధాంతంʹ ఈ పాలనకు శిరోధార్యం.

ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగంలో ఇటలీలో బెనిటో ముస్సోలినీ, జర్మనీలో అడాల్ఫ్‌ హిట్లర్‌ ఏ మానవతా హనన ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలనే మరెన్నో రెట్లు ఎక్కువగా, మరింత విచ్చలవిడిగా, ఎన్నోరెట్లు విశాలమైన ఈ దేశంలో అమలు చేయాలనేది ఈ పాలకుల కల.బుద్ధిజీవులుగా, చరిత్ర విద్యార్థులుగా, సున్నితమైన హృదయ స్పందనలు గలవాళ్లుగా, సామాజిక జీవులుగా తమను తాము గుర్తించుకునే వాళ్లందరిముందరా ఇవాళ చరిత్ర ఒక సవాల్‌ విసురుతున్నది.

ఎప్పుడో భూస్థాపితమైన నరహంతకుల మీద మీ వైఖరి సరే, వారి మీద పోరాడిన యోధుల గురించి మీ ప్రశంసలు సరే, ఇవాళ ఆ నరహంతకుల వారసులే అధికారపీఠాలు అధిరోహిస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు, ఏం చేయదలచారు అని. తమ గురించి తాము ఏమి ఆలోచించుకుంటున్నా, సమాజం గురించి, సమాజ భవిష్యత్తు గురించి ఏమి ఆలోచిస్తున్నా, ఎన్నెన్నెన్ని అభిప్రాయభేదాలున్నా, ఒకరిది తూర్పుదారి, మరొకరిది పడమటిదారి అయినా సరే, మహమ్మారి ముంచుకొస్తున్నది, సునామీ అందరినీ ముంచబోతున్నది.

మిగిలిన విభేదాలూ వివాదాలూ అన్నీ పక్కన పెట్టి ఒకటవుతామా లేదా, సకల రంగాల్లో సకల స్థాయిల్లో సకల తలాల్లో సకల స్థలాల్లో ఈ మహమ్మారిని ప్రతిఘటించేందుకు మన శక్తి సామర్థ్యాలన్నిటినీ కలగలిపి సమగ్ర, విశాల, సమన్వయ, దీర్ఘకాలిక, అర్థవంత, ప్రజా ప్రయోజనాత్మక పోరాటానికి సిద్ధపడతామా లేదా అనేదే మనలో ప్రతి ఒక్కరినీ ఇవాళ సమాజం, చరిత్ర నిలదీస్తున్న ప్రశ్న.
- ఎన్.వేణుగోపాల్

Keywords : narendra modi, bjp, rss, congress, hindutva
(2019-08-23 09:35:46)



No. of visitors : 312

Suggested Posts


మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

అరాచక రాజ్యంలో భక్తి ముసుగులో అరాచక మూక‌

మత విశ్వాసాల కోసం వందల మందిని, వేలమందిని ఊచకోత సాగించవచ్చునని చూపినవారు దేశాధినేతలుగా ఉండగలిగినప్పుడు ఆ మత విశ్వాసాల కోసమే చట్టాన్ని ధిక్కరించవచ్చునని, సమాజంలో బీభత్సం సృష్టించవచ్చునని భక్తులు అనుకోవడం సహజమే.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

మోడీ కుట్ర విప్పిచెప్పిన సాహసికి లేఖ

ఈ ఉత్తరం నీకందుతుందా, అందినా ఎప్పుడు అందుతుంది, నువ్విది చదవగలవా నాకు తెలియదు. ఈసారి నిన్ను జైలులో కలవడానికి వచ్చినప్పుడు కృతనిశ్చయురాలైన నీ సహచరి శ్వేతా భట్ ఈ ఉత్తరం ప్రతిని నీకు తెచ్చి ఇవ్వవచ్చు. కాని ఇప్పుడైతే ఆమె ఎంతో పోరాడవలసి ఉంది, ఎంతో సంబాళించుకోవలసి ఉంది. నా ఉత్తరం అనే చిన్న విషయం ఆమె మరిచిపోవచ్చు కూడ.

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


మరొకసారి