క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్


క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

క్రీడా

చత్తీస్ గడ్ లో భూంకాల్ ఉత్సవాల సందర్భంగా కబడ్డీ, ఖోఖో వంటి ఆటల పోటీల్లో పాల్గొంటున్న పిల్లలను పోలీసులు కాల్చి చంపి ʹఎన్ కౌంటర్ʹ గా ప్రకటించిన ఘటనపై క్షేత్ర పర్యటనకు వెళ్ళిన‌ సీనియర్ జర్నలిస్టు సీ వనజ రాసిన రిపోర్ట్ . ఇది వీక్షణం జూన్, 2019 సంచికలో ప్రచురించబడినది

ʹʹఅడవిలో 100 నుంచి 150 మంది నక్సలైట్లు సమావేశమయ్యారని తెలిసి ఒక సెర్చ్‌ పార్టీ ఏర్పాటు చేసి గాలించటం కోసం వెళ్లాం. అక్కడ మాకు పెద్ద సంఖ్యలో సాయుధ నక్సలైట్లు ఎదురయ్యారు. ఆయుధాలు వదిలేసి లొంగిపొమ్మని హెచ్చరించాం. వాళ్లు వినకుండా కాల్పులు జరిపారు. తప్పనిసరై మేమూ కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పులు ఆగిపోయిన తర్వాత చూస్తే సంఘటనాస్థలంలో 10 మృతదేహాలు కనిపించాయి.ʹʹ

దాదాపు ప్రతి ఎన్‌కౌంటర్‌ తర్వాత పోలీస్‌ కథనం ఇదే. అంకెలు అటూ ఇటూ కావచ్చు కాని కథలో పెద్ద తేడా ఉండదు. మావోయిస్టులకు పట్టు ఉన్న చత్తీస్‌ గడ్‌ బస్తర్‌ ప్రాంతం నుంచి ఈ కథ చాలా తరచుగా వింటుంటాం. అంతమంది సాయుధ నక్సలైట్లు కాల్పులు జరిపితే ఒక్క పోలీసు కూడా ఎందుకు గాయపడలేదని ఎవరైనా అడగటం కూడా మానేశారు. ఎందుకంటే ఇప్పుడా కథను ఎవరూ నమ్మరు కాబట్టి. అధికారిక రికార్డుల్లో ఆ కథనమే ఒక వాస్తవంగా ఉండిపోతుంది.

ఫిబ్రవరిలో బస్తర్‌ ప్రాంతంలో జరిగిన బొడ్గా ఎన్‌కౌంటర్‌ లో కూడా పోలీసులు ఇదే కథనాన్ని విడుదల చేసారు. కాని ఆ సంధర్భంగా పోలీసులు విడుదల చేసిన ఫొటోలు చూస్తే మాత్రం తీవ్రమైన అశాంతి కలుగుతుంది. హడావుడిగా వేసి, సరిగా గుండీలు పెట్టని కొత్త మావోయిస్ట్‌ ఆలివ్‌ గ్రీన్‌ యూనిఫాం కింది నుంచి రంగురంగుల సివిల్‌ దుస్తులు కనపడటం ఇలాంటి ఎన్‌కౌంటర్‌ వార్తలు తరచుగా చూసేవారికి కొత్త కాదు. కాని బోడ్గా ఎన్‌కౌంటర్లో మరణించినట్లుగా పోలీసులు విడుదల చేసిన ఫొటోలో ఉన్న 10 మంది ముఖాలు చాలా లేతగా చిన్న పిల్లల్లాగా ఉండటమే ఇందులో అశాంతి రేకెత్తించే అంశం.

అది రెండు కారణాలవల్ల ఆందోళన కలిగిస్తుంది. ఒకటి, వాస్తవంగా అది నిజమైన ఎన్‌కౌంటర్‌ కాదా? రెండు, పోలీసులు చెప్పినట్లుగా అంత మంది మావోయిస్టుల భారీ సాయుధ బృందంలో చనిపోయిన వాళ్లంతా అంత చిన్నవాళ్లే ఎందుకున్నారు? 100కి పైగా మావోయిస్టులు ఉన్నప్పుడు వారు మైనర్లను ఎందుకు రక్షించలేదు? అంతమంది సంఘటనాస్థలం నుంచి పారిపోతే కేవలం పిల్లలే ఎలా మిగిలిపోయారు? బయట ప్రచారం జరుగుతున్నట్లుగా నిజంగానే భారీగా మైనర్ల రిక్రూట్‌ మెంట్‌ జరుగుతోందా?

వీటికి సమాధానాలు వెతకాలని ఒక చిన్న మహిళా జర్నలిస్టుల బృందం నిర్ణయించుకుంది. ఇది రైలో, బస్సో ఎక్కి వెళ్లిపోయి వెంటనే రిపోర్టింగ్‌ చేసే ప్రాంతమూ కాదు, అక్కడ ప్రజలతో సంబంధం ఏర్పడటం అంత సులువూ కాదు. కనుక మాకు అక్కడికి చేరటానికి అక్కడ బాధిత ప్రాంతాలతో కాంటాక్ట్‌ ఏర్పడటానికి సమయం తీసుకుంది.

బోడ్గా ఎన్‌కౌంటర్లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలం అడవిలో భైరాంగడ్‌ పోలీసు స్టేషన్‌ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. భైరాంగడ్‌లో ఎన్‌కౌంటర్‌ గురించి మేము తెలుసుకున్న మొట్టమొదటి విషయం ఏమిటంటే, పోలీసులు ఇచ్చిన సంఘటనాస్థలం వివరాలు తప్పు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న గ్రామం బోడ్గా కి గానీ లేదా అందులో చెప్పిన బోడ్గా నాలా కు గాని ఈ ఎన్‌కౌంటర్‌ తో సంబంధం ఏమీ లేదు.

సంఘటనా స్థలానికి చేరటానికి భైరాంగడ్‌కు సుమారు 50 మైళ్ల దూరంలో మైదాన ప్రాంతాన్నీ అడవినీ ఇంద్రావతి నది వేరుచేసే చోటకు చేరటానికి రవాణా సౌకర్యం లేదు. దానికి ప్రైవేటు వాహనాలే శరణ్యం. నదిలో కొన్నిచోట్ల వేసవిలో నీరు చాలా తక్కువగా ఉండి కాలినడకన
దాటటానికి అవకాశం ఉంటుంది. మేము అలాటి ఒక పాయింట్‌ ఎంచుకున్నాం. ఎన్‌కౌంటర్‌ స్థలం నది నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకసారి నది దాటాక మాత్రం ఇక నడక తప్ప దారి లేదు. మేము నడవడానికి సిద్ధపడే వెళ్లాం. కాని అలా నడుస్తూ సంఘటనా స్థలానికి చేరటానికి దాదాపు రెండు రోజులు పట్టింది.

గిరిజన గ్రామాలు మైదాన గ్రామాలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అక్కడ వీథులు ఉండవు. దాదాపు 3-4 కిమీ ప్రాంతంలో అటుఇటు వేసినట్టుగా 10 నుంచి 30 ఇళ్ల దాకా ఉంటాయి. ఒక ఇంటి నుండి మరో ఇంటికి వంద మీటర్ల దూరం. ఇళ్ల మధ్య సరిహద్దులు లేదా కంచెలు ఉండవు.
ఇటువంటి నివాస సముదాయాలను పారా (హామ్లెట్‌) అని పిలుస్తారు. ఇలాంటి నాలుగైదు పారాలు కలిపితే ఒక గ్రామం. మేము నది దాటి అడుగుపెట్టిన మొదటి పారాలోనే ఎన్‌కౌంటర్‌ కథ మొదలైంది.

ఖోఖో... కబడ్డి కబడ్డి...

ఇంద్రావతి ఒడ్డున మొదటి గ్రామంలోనే మేము అప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న 10 మందికి పైగా అమ్మాయిలు, అబ్బాయిలను కలిశాం. ఎన్‌కౌంటర్‌ గురించి ప్రస్తావించగానే వాళ్లందరికీ తెలుసని, అది జరిగినప్పుడు తమలో చాలా మంది అక్కడే ఉన్నారని కూడా చెప్పారు. అది విని మేము చాలా అశ్చర్యపోయాం. గతంలో ఎన్‌కౌంటర్‌ వార్తలను కవర్‌ చేసిన వారికి కూడా అది కొత్తే. ʹʹఎన్‌కౌంటర్‌ జరిగిన చోట మీరంతా ఎందుకు ఉన్నారు?ʹʹ

ʹʹమేము ఆడుకుంటున్నాం. కొంతమంది కబడ్డీ కొంతమది ఖోఖో ఆడుతున్నాం...ʹʹ దాదాపు ఇదే మాట ప్రతి ఒక్కరూ చెప్పారు. ʹʹనేను కాల్పులు జరిగినప్పుడు కబడ్డీ ఆడుతున్నానుʹʹ, ʹʹఅప్పుడు నేను ఖోఖోలో పరుగెత్తుతున్నానుʹʹ, ʹʹనా వంతు ముగిసింది కాని మిగిలినవాళ్ల ఆట చూస్తున్నానుʹʹ. ఆ పారా నుండి 10 మంది యువకుల బృందం ఎన్‌కౌంటర్‌ జరిగిన తాడబల్ల గ్రామానికి, అక్కడ ఏర్పాటు చేసిన క్రీడల కార్యక్రమంలో పాల్గొనేందుకు సంఘటన జరిగిన ముందు రోజు రాత్రి వెళ్లారు. వారు మంగళవారం ఫిబ్రవరి 6 రాత్రి దారిలో ఆగి తెల్లవారి తాడబల్ల గ్రామానికి చేరారు. అప్పటికి అక్కడ ఆటల పోటీల్లో రెండో రోజు. మొదట మేము మాట్లాడిన పారా నుంచి వెళ్లిన 10 మందిలో ఐదుగురు ఎన్‌కౌంటర్‌ అయ్యారు.

అలా ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి, ఒక పారా నుంచి ఇంకో పారాకి వెళ్తూ మేము మర్నాటికి ఎన్ని మైళ్లు నడిచామన్న లెక్క కూడా కోల్పోయాం. ఈ దారంతా ఖోఖో కబడ్డి కబడ్డి అన్న మాటలే పదే పదే వినిపించాయి. దారంతా కలిసిన 15, 16 ఏళ్ల యువతీ యువకులు కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది. కాని దార్లో మట్టిగడ్డ తగిలి బోర్లా పడింది. పక్కన పరిగెడుతున్న స్నేహితురాలు పరిగెత్తుతూ ముందుకు వెళ్లి చూస్తే పడిపొయిన సుక్కి జుత్తు పట్టుకుని పైకి లేపుతున్న బలగాలు కనిపించాయి. వెంటనే సుక్కి మీద కాల్పులు జరిపారా లేదా అన్నది ఆమె చూడలేదు. కాని రెండు రోజుల తరువాత సుక్కి మృతదేహం నగ్నంగా గ్రామానికి చేరింది. ఆమె శరీరంపై బుల్లెట్‌ గాయాలు మాత్రమే కాక, తొడల మీద రైఫిల్‌ గాయాలు కూడా కనిపించాయి.

మేము ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఒక పారా నుంచి ఇంకో పారాకి నడుస్తుంటే దాదాపు ఇదే కథ మళ్లీ మళ్లీ వినిపించింది. అయితే మాతో మాట్లాడిన వాళ్లంతా 13 నుంచి 18 ఏళ్ల వయసున్న యువతీ యువకులే. అందులో గాయపడి తప్పించున్నవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లంతా
పోలీసులు విడుదల చేసిన ఫోటోల్లో వారి స్నేహితులను గుర్తించారు. మరణించినవారి ఫొటోలతో ఉన్న ఫోన్‌ వారికి ఇచ్చినప్పుడు ప్రతి పారాలోనూ ఉన్న పిల్లలంతా ఫోన్‌ చుట్టూ మూగి ఫొటోలు చూస్తూ ఉండిపోయారు. ఆధార్‌ లేదా రేషన్‌ కార్డుల మీద ఉన్న అలుక్కుపోయిన ఫొటోలు తప్ప తమ స్నేహితుల జ్ఞాపకాలేవీ వాళ్ల దగ్గర లేవు. వారి స్నేహితుల మృతదేహాల చిత్రాలు చూస్తూ విషణ్ణవదనాలతో ఉన్న ఆ పిల్లల్ని చూస్తే హృదయం ద్రవించిపోయింది.

అవును మీరు చదివింది నిజమే. చనిపోయిన వాళ్లందరికీ ఆధార్‌, రేషన్‌ కార్డులు ఉన్నాయి. మేము మరణించిన వాళ్ల కుటుంబాలను కలిసినప్పుడు దాదాపు అన్ని కుటుంబాలు వారి ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు తెచ్చి చూపించారు. అక్కడ మరణించిన వారి పేర్లు ఉన్నాయి. అవి పోలీసులు విడుదల చేసిన వివరాలతో సరిపోయాయి కూడా. ఒక్కటి తప్ప. ఆ కార్డుల ప్రకారం ఇద్దరు మినహా మిగిలిన మృతులంతా మైనర్లే. అంటే దానర్థం వాళ్లంతా పౌరులే అని.

అలా నడుస్తూ ఒక అర్ధరాత్రికి ఒక గ్రామం చేరి మళ్లీ ఉదయాన్నే గ్రామాల్లో ఆగుతూ ఆగుతూ తెల్లవారి మధ్యాహ్నానికి తాడబల్ల గ్రామం దగ్గర ఎన్‌కౌంటర్‌ స్థలానికి చేరుకున్నాం. అప్పటికి దారిలో మేము కలిసిన గ్రామాల నుండి చాలామంది గ్రామస్తులు అక్కడకు చేరారు. ఎత్తైన చెట్ల కింద పొదలు తీసేసి చదును చేసిన స్థలం అది. అక్కడ కబడ్డీ, ఖోఖో కోర్టులు ఎక్కడ గీశారో గ్రామస్తులు మాకు చూపించారు. సంఘటన జరిగి అప్పటికే రెండు నెలలు అవుతూ ఉండటం వలన ఆ కోర్టులన్నీ ఆకులతో కప్పబడి ఉన్నాయి.

అసలీ కబడ్డీ ఖోఖో ఏంటి?

మేము దారంతా ఈ ఆటలకు ఎన్‌కౌంటర్‌కు ఉన్న సంబంధాన్ని, మైదాన ప్రాంతాలకు చెందిన ఆటలతో అక్కడొక కార్యక్రమం ఎందుకు జరిగిందన్న దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ వచ్చాం. మేము తెలుసుకున్నది ఇది.

చాలా పాత గిరిజన ప్రాంతాల్లో ఉన్నట్టే బస్తర్‌ గిరిజన ప్రాంతంలో కూడా వసంతోత్సవ సంప్రదాయమం ఉంది. యుక్తవయస్సుకు చేరిన బాలురు, బాలికలు వసంతకాలం ఆరంభంలో ఒక చోట చేరి ఆడి పాడి అందులో భాగంగా తమ సహచరులను ఎంచుకోవడానికి ఇది వేదిక. వయసుతో సంబంధం లేకుండా యుక్తవయసుకు చేరిన ఆడ మగ పిల్లలందరికీ ఈ స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ యుక్తవయసు అంటే 14,15 ఏళ్లు. ఈ ఎంపికకు సహజంగానే కులం, కట్నం, జాతకం వంటి ప్రాతిపదికలు ఉండవు. అయితే గత 100 సంవత్సరాల్లో దీనిలో కొంచెం మార్పు వచ్చింది. 1910లో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా బస్తర్‌ గిరిజనుల వీరోచిత గిరిజన తిరుగుబాటు తరువాత, ఫిబ్రవరి మొదటి వారంలో బస్తర్‌ గిరిజనులు భూంకాల్‌ దివస్‌ జరుపుకుంటారు. దాంతో ఈ రెండిటినీ కలిపి ఒకే కార్యక్రమంగా జరుపుకుంటున్నారు. మావోయిస్టులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత, వారు మైదానాల్లో ఆడే ఆట పాటలను కూడా ఇందులో చేర్చారు. దాంతో ఇందులో కబడ్డీ, ఖోఖో వంటి ఆటలు కూడా చేరాయి. ఇప్పుడిది నాలుగు నుంచి ఐదు గ్రామాలకు చెందిన బాలురు, బాలికలు కలిసి మూడు రోజులపాటు ఆడుకుని, ఆ తర్వాత భూంకాల్‌ దివస్‌ సమావేశం, చివరికి పాటలు, నృత్యాలు, పానీయాలతో ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రతి ఏడాదీ వసంత కాలం ఆరంభంలో నాలుగైదేసి గ్రామాల వాళ్లు కలిసి ఆ ప్రాంతమంతా జరుపుకుంటారు. కాబట్టి గ్రామాల నుండి వాలంటీర్లు ఒకటి రెండు రోజుల ముందే నిర్ణయించిన స్థలానికి ఏర్పాట్లు చెయ్యటం కోసం వెళ్తారు. ఆటల్లో పాల్గొనేవారు ఒకరోజు తరువాత వస్తారు. స్థలాన్ని చదును చేసి, కోర్టులు వెయ్యటంతో పాటు, వచ్చినవాళ్లు రెండు మూడు రోజులు ఉండటానికి వీలుగా స్థలాలను మార్క్‌ చెయ్యటం, అన్ని రోజులు వంటల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చెయ్యటం... ఇవన్నీ నిర్వాహకుల పని. అన్నిటికన్న ముఖ్యం దగ్గరలో ఏదైనా నీటి వసతి ఉండటం. వంట కోసం పాల్గొనే గ్రామాల నుంచి ఆహార ధాన్యాలు, ఇతర సరుకులు వస్తాయి.

మేము తాడబల్ల గ్రామం పక్క అబుజ్‌మాడ్‌కి దగ్గరగా ఉన్న సంఘటనాస్థలానికి చేరుకుంటూ ఉండగా మాతో నడుస్తున్న మహిళలు మధ్యలో ఆగిపోయారు. పోలీసులు కాల్పులు జరిపినప్పుడు గ్రామానికి రెండు మూడు వందల మీటర్ల దూరంలోనే ఉన్న స్థలానికి తాము పరుగెత్తుకుని
వచ్చామని, కాని వందమీటర్ల ముందుగానే అప్పుడు ఆగిన దగ్గరే తమను పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి ఆపారనీ చెప్పారు. ఆ మహిళలు చెప్పిన ప్రకారం బుధవారం ఫిబ్రవరి 7 ఉదయం 8 గంటలకు ఆటలు మొదలయ్యాయి. సమయం అనేది ఆకాశంలో సూర్యుని స్థానాన్ని చూపించి చెప్పటమే. ఆరోజు ఉదయం దాదాపు 70-80 మంది వివిధ జట్లలో ఆటల్లోనో, తమ వంతు కోసం ఎదురు చూస్తూనో, తమ ఆట ముగిసి ఇతరుల ఆట చూస్తూనో ఉన్నారు. దాదాపు అంతే సంఖ్యలో సహాయం కోసం గాని చూడటం కోసం గాని గ్రామాల నుంచి వచ్చినవాళ్లు ఉన్నారు. వారిలో ఎవ్వరూ పెద్దవయసు వాళ్లు కాదు. అందరూ 20 లలో ఉన్నవారే. గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపంవల్లా, మలేరియా వల్లా జీవితకాలం తక్కువగా ఉంటుంది. చాలామంది వ్యక్తులు 40, 50లు దాటరు కూడా. కాబట్టి మిగిలిన వాళ్లంతా కూడా 20ల్లో 30ల్లో ఉన్నవాళ్లే. కాల్పులు జరిగింది ఉదయం 10.30 కు. అప్పటికి వంట ముగిసి అందరూ ఆట దగ్గర చేరారు.

మాతో సంఘటన స్థలానికి నడిచిన తాడబల్ల గ్రామ మహిళల్లో కొందరు అప్పుడే ఆట చూసి తినటం కోసం ఇంటికి వచ్చారు. కాల్పుల చప్పుడు వినగానే వాళ్లంతా వెనక్కి పరుగెత్తారు. కాని వాళ్లను 100 మీటర్ల ముందే బలగాలు ఆపేసాయి. అప్పటినుంచీ దాదాపు మధ్యహ్నం రెండు దాక వాళ్లు అరుపులు, ఏడుపులు వింటూనే ఉన్నారు. ఏడుస్తున్నది తమ పిల్లలో ఇతరుల పిల్లలో తెలియని నిస్సహాయ స్థితిలో వాళ్లు అక్కడే ఉండిపోవలసి వచ్చింది.

బలగాలు వెళ్లిపోయాక సంఘటన జరిగిన చోటకి వెళ్లి చూస్తే అక్కడంతా పగలగొట్టిన గిన్నెలు, కాల్చిపడేసిన బట్టలు, బట్టలు తెచ్చుకున్న సంచులు కనిపించాయి. దాదాపు రెండు నెలల తర్వాత కూడా చెల్లాచెదురుగా అక్కడక్కడ మాకు కాల్చిన బట్టల ముక్కలు కనిపించాయి. అప్పటికి పరిసర గ్రామాల ప్రజలంతా అక్కడికి చేరారు. వాళ్లంతా బలగాలు వెళ్లిన దారిలో పరుగెత్తి ప్లాస్టిక్‌ పట్టాల్లో చుట్టి 10 మృతదేహాలను నది అవతలకి చేరుస్తున్న బలగాలను కలిశారు.

నాకు ఏడుపు వినిపించింది...

ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డుల ప్రకారం, చనిపోయిన 10 మందిలో ఎనిమిది మంది మైనర్లు ఉన్నారు. వారిలో ఒకరికి కేవలం 12 ఏళ్లే. మేజర్లలో ఒకరు పరమేష్‌, 24 ఏళ్లు, ఇద్దరు పిల్లల తండ్రి. ఇంకొక వ్యక్తికి 20 ఏళ్లు. కాని అప్పటికి బలగాల వెంట పరిగెత్తుకుని వచ్చినవాళ్లకు ప్లాస్టిక్‌
షీట్లలో ఉన్నవాళ్లు ఎవరో తెలియదు. తమ పిల్లలు కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి తమ పిల్లలు కావచ్చు. వాళ్లు పోలీసులకు అడ్డుపడి మృతదేహాలను చూపించమని డిమాండ్‌ చేశారు. కాని పోలీసులు చూపించలేదు. నదికి అవతలి ఒడ్డున మరొకవైపు వేచి ఉన్న వాహనాల్లోకి మృతదేహాలను తీసుకుని పోయారు. ఆ సమయంలో ఆ ప్లాస్టిక్‌ షీట్లలో ఉన్న శరీరాల్లో ఒకటి నొప్పితో మూలుగుతుండటం పరమేశ్‌ భార్య విన్నది. అది తన భర్త గొంతులా అనిపించింది. దాంతో ఆమె అడ్డంపడి షీట్‌ విప్పమని అరిచింది. ప్రతిఘటించింది. అందుకు జవాబుగా నదిని దాటుతున్నప్పుడు పోలీసులు ఆ మూటను నీళ్లలో ముంచేసారు.

ఆమె ఇంటిలో పరమేష్‌ బర్సా భార్యను కలుసుకున్నప్పుడు ఆమె పరమేష్‌ రేషన్‌ కార్డును, ఆధార్‌ కార్డును తెచ్చి మా ముందు పడేసింది. ఆ తర్వాత ఒక్క ముక్క కూడా మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆమె భాధతో ఒక రాయిలా మారిపోయినట్లుగా ఉంది. కాని అక్కడ ఉన్న మిగిలినవాళ్లు ఏమి జరిగిందో చెప్పారు. పరమేష్‌ కు ఆరోజు జ్వరం వచ్చిందట. అందుకని వంట ఏర్పాట్ల దగ్గర పడుకుని ఉన్నాడు. అటువైపు నుంచే ప్రవేశించిన బలగాలు పడుకుని ఉన్న అతణ్ని కాల్చేశాకే ఆట జరిగే వైపు వచ్చారు. బలగాలకు చూస్తున్నవాళ్లకు మధ్య ఆడుతున్నవాళ్లు ఉండటం, ఆట ధ్యాసలో ఏం జరుగుతుందో అర్థం కావటానికి కొన్ని క్షణాలు పట్టటంతో ఆడుతున్న పిల్లలు ఎక్కువ మందికి బుల్లెట్లు తగిలాయి.

అయితే పరమేష్‌ భార్య మాత్రమే కాదు చాల మంది పెద్దలు కూడా ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న పిల్లలు, వాలంటీర్లుగా వెళ్లి స్వయంగా చూసిన కొందరు పెద్దలు మాత్రమే ఈ వివరాలు చెప్పారు. దాదాపు తల్లిదండ్రులంతా పిల్లల రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు మాకిచ్చి నిశ్శబ్దంగా ఉండిపోయారు. చుట్టూ ఉన్నవాళ్లతోపాటు వెళ్లి తప్పించుకోగలిగిన పిల్లలే వాళ్ల వివరాలన్నీ చెప్పారు. సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత కూడ ఆ సంఘటన కలిగించిన భీతి నుంచి కుటుంబ సభ్యులు బయటపడలేదు.

పోలీసులు మృతదేహాలను భైరాంగడ్‌ కు వాహనాల్లో తరలించాక ఆ వెనకే నడుస్తూ ఐదు గ్రామాల ప్రజలు పోలీసు స్టేషన్‌ కు చేరారు. మృతదేహాలను చూపించాలని డిమాండ్‌ చేసి పోలీసు స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. కానీ అప్పటికే మృతదేహాలను బీజాపూర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తిరిగి వాళ్లు తెల్లవారేసరికల్లా బీజాపూర్‌ కు తమ పిల్లలను, కుటుంబసభ్యులను గుర్తించారు. దానికి ముందు ఇది నకిలీ ఎన్‌కౌంటర్‌ అని నినాదాలు చేస్తూ పట్టణంలో నిరసన రాలీ కూడా చేశారు.

తల్లిదండ్రులు గుర్తించినప్పటికీ ఒక మృతదేహం వివరాలు తప్పుగా నమోదయ్యాయి. అది కేవలం 12 సంవత్సరాల వయసు ఉన్న తాడబల్ల గ్రామ నివాసి పాలొ. ఆమె ఇంటి నుండి కొన్ని మీటర్ల దూరంలోనే సంఘటనాస్థలం ఉంది. ఆమె ఖోఖో ఆడుతున్నప్పుడు కాల్పులు జరిగాయి. ఆమె తల్లిదండ్రులు అక్కడినుంచి కొద్ది నిమిషాల ముందే ఇంటికి వచ్చారు. కాల్పుల చప్పుడు వినగానే వారు అందరికంటె ముందే పరుగెత్తారు. కానీ వాళ్లను సాయుధ బలగాలు ముందుకు పోనివ్వలేదు. వాళ్లు అంతసేపూ అరుపులు వింటూనే ఉన్నారు. తెల్లవారి బీజాపూర్‌ ఆస్పత్రిలో
శవాన్ని చూడటానికి ముందే వాళ్లకు తమ బిడ్డ కూడా చనిపోయిందని అర్థమయింది. పోలీసులు శవాన్నయితే తల్లిదండ్రులకే ఇచ్చారు గాని ఆమె ఇంకో గ్రామానికి చెందిన రామి అని ప్రకటించారు.

మరి సాయుధ నక్సలైట్లు ఎక్కడ?

ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ. మేము వెళ్లిన దారంతా వాళ్ల ఆధ్వర్యంలో నిర్మించిన చెరువులు కనిపించాయి. కొన్నిచోట్ల వాళ్లు నడుపుతున్న పాఠశాలలు కూడా ఉన్నాయట. కాని అప్పుడు తెరిచి లేవు. 2005కి ముందు ఆ ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉండేవట. కాని ఆపరేషన్‌ సల్వాజుడుం తర్వాత, ప్రభుత్వం ఆ పాఠశాలలను మూసివేసింది. దాదాపుగా ప్రభుత్వానికి ఆదివాసులకు మధ్య రోజువారీ సంబంధాలు తెగిపోయాయి. గుర్తింపు కార్డుల కోసమో, రేషన్‌ కోసమో ఆదివాసులే నడిచి నది దాటి వెళ్తారు. అప్పుడప్పుడు కూంబింగ్‌ కి వచ్చే పోలీసులు తప్ప అధికారులెవరూ అక్కడికి రారు. దాంతో పాఠశాలలు, ఇతర అభివృద్ధి కార్యకలాపాలు ఇప్పుడు మావోయిస్టులు రూపొందించిన ʹజనతన సర్కార్‌ʹ కింద స్థానిక సంస్థలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే చెరువులు, స్కూళ్లు. ʹసబ్‌
కా వికాస్‌, సబ్‌ కా సురక్షʹ అనేది జనతన సర్కార్‌ నినాదం.

సల్వాజుడుం మొదలయ్యాక ఆ ప్రాంతంలో ఒకటి మాత్రం పూర్తిగా మారిపోయింది. 2005 వరకూ తాడబల్ల ఎన్‌కౌంటర్‌ స్థలం లేదా మాడ్‌ వంటి ప్రదేశాలకు పోలీసు బలగాలు చేరడం దాదాపు అసాధ్యంగా ఉండేది. అడవి దారుల్లో తిరగటం, అదీ బస్తర్‌, మాడ్‌ వంటి ప్రాంతాల్లో తిరగటం అంత తేలిక కాదు. ప్రత్యేక పోలీసు అధికారులు (ఎస్‌ పి ఒలు) గా గిరిజన బాలలను నియమించడం ద్వారా గిరిజన ప్రాంతాల్లోకి ప్రవేశించిన తర్వాతనే సల్వాజుడుం ఆపరేషన్‌ రచన జరిగింది. మావోయిస్టులను అడవినుంచి తొలగించే ఆపరేషన్‌ అది. దానికి ప్రభుత్వం ఎన్నుకున్న మార్గం ఆదివాసుల ఇళ్లు, తిండి గింజలు తగలబెట్టటం. దాంతో వాళ్లు అడవిలో ఉండలేక బయటికి వస్తే మావోయిస్టులకు మద్దతు పోయి ఉద్యమం చచ్చిపోతుందని. 2005లో ప్రారంభమైన నాటి నుండి సల్వాజుడుంలో అనేక అత్యాచారాలు, హత్యలు జరిగాయని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అంత చేసినా కూడా జుడుం అనుకున్న ఫలితాలు రాలేదు. జుడుం బలగాలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు కొందరు దొరికిపొయి బలగాలతోపాటు రహదారికి ఆనుకుని ఏర్పాటుచేసిన జుడుం శిబిరాలకు పోతే మరికొందరు అడవిలోకి పారిపోయారు. ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సల్వాజుడుం తరువాత కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌గా మారింది.

సల్వాజుడుం తర్వాత అడవిలో ఉండిపోయిన, శిబిరాలకు వెళ్లిన ప్రజల మధ్య ఒక విభజన ఏర్పడింది. ఒక శత్రుపూరిత వాతావరణం వచ్చింది. దాంతో శిబిరాల్లో ఉన్న ఆదివాసుల నుంచి మరింత మందిని ఎస్‌పిఒ లుగా రిక్రూట్‌ చెయ్యటం తేలికయ్యింది. అడవుల్లో దారులు తెలిసిన
ఎస్‌పిఒ లను ఉపయోగించి విపరీతంగా కూంబింగ్‌లు, దాడులు పెరిగాయి. ఈ ప్రాంతంలో పనిచేసిన సామాజిక శాస్త్రవేత్త నందిని సుందర్‌ వివాదాస్పద ప్రాంతాలలో ఆదివాసులకు వ్యతిరేకంగా ఆదివాసులను వాడటాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసి సుప్రీంకోర్ట్‌ నుంచి అందుకు
వ్యతిరేకంగా ఒక ఉత్తర్వును పొందారు. ఇది స్పష్టమైన మానవ హక్కుల ఉల్లంఘనగా భావిస్తూ సుప్రీంకోర్టు ఎస్‌ పి ఓల కార్యకలాపాల ఉనికిని నిషేధించింది. చత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వం తక్షణమే ఎస్‌పిఒ లను జిల్లా రిజర్వ్‌ గ్రూప్‌ (డిఆర్‌జి) గా పేరు మార్చింది. దాంతోపాటు అగ్ని, సామాజిక్‌
ఏకతా మంచ్‌ వంటి అనేక కొత్త కొత్త సంస్థలను రంగంపైకి తెచ్చింది. ఈ బోడ్గా లేదా తాడబల్ల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నవి అదే డిఆర్‌జి దళాలు. ఎన్‌కౌంటర్‌ సమయంలో ఆదివాసులతో కూడిన ఈ వివిధ దళాలు ʹచంపండి చంపండిʹ అని గోండి భాషలో అరవటం గ్రామస్తులు స్పష్టంగా
విన్నారు. విషాదం ఏమిటంటే మరణించినవారికి చెందిన గ్రామాల నుండి కొంతమంది డి ఆర్‌ జి సిబ్బంది ఆ అపరేషన్‌లో ఉన్నారు.

ఈ ప్రాంతంలో జుడుం కార్యకలాపాలు ప్రారంభం అయిన తర్వాత మావోయిస్టుల్లో చేరటానికి అడవుల్లో ఉండిపోయిన ఆదివాసులలొ సంసిద్ధత పెరిగింది. ఇప్పుడు అనేక మావోయిస్టు దళాలు మాత్రమే కాదు, పార్టీ ప్రాంతీయ కమిటీలు కూడా గిరిజనుల నాయకత్వంలోకి వచ్చాయి. పెరిగిన నిర్భంధం, దాడులు, మరొకవైపు పూర్తిగా ప్రభుత్వ చేయూత కనుమరుగు అయిన నేపథ్యంలో ʹసబ్‌ కీ వికాస్‌, సబ్‌ కీ సురక్షాʹ కోసం బలమైన అవసరం ఏర్పడింది. అభివృద్ధి కోసం గ్రామ కమిటీలు, రక్షణ కోసం మిలీషియా సాధారణంగా మారాయి. తాడబల్ల సంఘటన జరిగినప్పుడు కూడా పర్యవేక్షణ కోసం పార్టీ నుండి ముగ్గురు వచ్చారని కొందరు యువకులు చెప్పారు. హఠాత్తుగా కాల్పులు జరగగానే వాళ్లు వీలయినంతమందిని తప్పించటానికి ప్రయత్నించారని, వాళ్లు కూడా తప్పించుకుని పోయారని కొందరు చెప్తే, అసలు పార్టీ వాళ్లెవరూ లేరని నిర్వహణలో ఉన్న మరికొందరు చెప్పారు. వాళ్లు ఉండి వుంటే,ఆయుధాలు కూడా ఉండి ఉంటే ఎదురు కాల్పులు జరపకుండా ఎందుకు రిట్రీట్‌ అయి ఉంటారన్నది తెలియలేదు.

గెరిల్లా యుద్ధం గురించి ముఖ్యంగా బస్తర్‌ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల గురించి తెలిసిన ఎవరికైనా 100 మంది మావోయిస్టులు యూనిఫారంలో ఒక చోట ఉంటే భద్రత చాలా ఎక్కువగా ఉంటుందనీ చుట్టూ అనేక సెంట్రీ పాయింట్లు ఉంటాయనీ తెలుస్తుంది. 100 మంది మావోయిస్టులు ఒకేచోట సమావేశం అయ్యే సందర్భాలు అరుదుగా ఉంటాయి. అలాంటి సందర్భాలలో పోలీసు బలగాలు మాత్రమే కాదు పారామిలటరీ దళాలు కూడా తమ ఉనికి తెలియకుండా ఈ ప్రాంతాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యం. అంతమంది ఆటోమేటిక్‌ ఆయుధాలు కలిగిన మావోయిస్టులు మొదట కాల్పులు జరిపినట్లయితే పోలీసుదళాలలో భారీ సంఖ్యలో ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఎఫ్‌ఐఆర్‌ లో పోలీస్‌ కథనం ప్రకారం సాయుధ మావోయిస్టులు పోలీసు బలగాలపై మొదట కాల్పులు జరిపినప్పటికీ పోలీసులు ఎవరూ గాయపడలేదు.

పోతే పోలీసులు విడుదల చేసిన అన్ని ఫొటోల్లో మృతదేహాలు మావోయిస్టు యూనిఫాం ధరించి ఉన్నాయి. పోలీసులు 11 బర్మార్లు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా చూపించారు. దీన్ని గురించి ప్రస్తావించినప్పుడు గ్రామస్తులు, నిర్వహకులు తాము కార్యక్రమం దగ్గరకి 6 బర్మార్లు తెచ్చామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఒకటి లేదా రెండు బర్మార్లు ఉంటాయని వాటిని తామే తయారు చేసుకుంటామని చెప్పారు. ఎలుగుబంట్లు, చిరుతపులుల దాడుల నుంచి రక్షించుకునేందుకు వాటిని వాడతామని చెప్పారు. వాటినే అక్కడికి కూడా అలాంటి అవసరాల కోసమే తెచ్చామని చెప్పారు.

ʹʹదాడి చేసినప్పుడు రక్షణగా జంతువులను గాయపరిచేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. మనుషులను చంపడానికి కాదు. బలగాలు ఆటోమేటిక్‌ ఆయుధాలతో వస్తే ఈ బర్మార్లతో ఏమీ చేయలేరు. అక్కడ జరిగింది కూడా అదే. కనీసం మేము వాటిని వాడటానికి కూడా ప్రయత్నం చెయ్యలేదుʹʹ అని గ్రామస్తులు చెప్పారు. అయితే అక్కడ 11 బర్మార్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు నివేదిక లో రాశారు. మిగిలిన బర్మార్లను వాళ్లే తెచ్చి ఇక్కడ దొరికినట్లుగా రాసి ఉంటారని, మృతదేహాలకు తొడిగిన కొత్త యూనిఫారాలు కూడా వాళ్లే తెచ్చారని గ్రామస్తులు చెప్పారు. 20, 25 కిలొమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రామాలన్నిటిలో దాదాపు అందరూ ఇదే చెప్పారు.

గత 15ఏళ్లలో బస్తర్‌ ప్రాంతంలో కానీ ఇంకా అనేక ఉద్యమ ప్రాంతాల్లో కానీ ఇలాంటి సంఘటనలు కొత్త కాదు. అయితే చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రంలో తాజాగా బిజెపి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి ప్రభుత్వం మారి, మానవ హక్కుల ఉల్లంఘనలు తగ్గుతాయని మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం భిన్నమైన విధానం తీసుకుంటుందన్న భావన వచ్చింది. కాని ఈ సంఘటన గురించి మేము ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో ఉన్నవారితో మాట్లాడిన తర్వాత ఆ అభిప్రాయం కలగలేదు. అంతే కాదు, ఎన్‌కౌంటర్లకు, సరెండర్లకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు ప్రతిగా లభించినంత కాలం ఇది మారే అవకాశం లేదు. కేవలం కూంబింగ్‌ ఆపరేషన్లు చెయ్యటానికి, దాడులు నిర్వహించటానికే ప్రత్యేకంగా బలగాలను ఏర్పాటు చేసినప్పుడు ఇటువంటి దాడులకు పాల్పడక తప్పని ఒత్తిడి కూడా ఆ బలగాల మీద ఉండి తీరుతుంది. ఇవి కొనసాగుతాయి కూడా.

అది బూటకపు ఎన్‌కౌంటరే: ఎంఎల్‌ఎ విక్రమ్‌ మండవి

బాధితుల తెగకే చెందిన బిజాపూర్‌ శాసనసభ్యుడు విక్రమ్‌ మండవి ఈ ఎన్‌కౌంటర్‌ కచ్చితంగా బూటకమేనని అన్నారు. ఎన్‌కౌంటర్‌ జరగగానే దాని విషయం ముఖ్యమంత్రికి లేఖ రాశానని, అది వివరించడానికి మృతుల తల్లిదండ్రులను రాజధానికి తీసుకువెళ్లానని ఆయన అన్నారు.
ʹʹరాయపూర్‌ లోనూ, ఢిల్లీలోనూ ఉన్నవాళ్లు, ఐఎఎస్‌, ఐపిస్‌ అధికారులు ఈ ప్రాంతానికి చెందినవాళ్లు కాదు గనుక నక్సలైట్లనూ పోలీసులనూ మాత్రమే చూస్తారు. మధ్యలో ప్రజలు ఉన్నారని చూడరుʹʹ అని ఆయన అన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ మీద వివాదం వల్లనే జిల్లా పోలీసు
సూపరింటెండెంట్‌ ను బదిలీ చేశారని ఆయన అన్నారు. పోలీసు కథనాన్ని ఏ ఒక్కరూ నమ్మడం లేదని, తాను స్వయంగా వెళ్లి వాస్తవాలు పరిశీలించానని ఆయన అన్నారు.

కాని బిజాపూర్‌ కొత్త ఎస్‌ పి గోవర్ధన్‌ ఠాకూర్‌ మాత్రం గత ఎస్‌ పి బదిలీ మామూలుగా జరిగిందేనని, దానికీ ఎన్‌కౌంటర్‌ కూ ఏమీ సంబంధం లేదని అన్నారు. ఎన్‌కౌంటర్‌ గురించి మాట్లాడడానికి ఆయన ఎంతమాత్రం సిద్ధపడలేదు. అది జరిగినప్పుడు తాను ఎస్‌ పి ని కాదు గనుక దాని గురించి తానేమీ చెప్పలేనని అన్నారు.

రోడ్లు - మేజస్ట్రీట్‌ విచారణ

మేజస్ట్రీట్‌ విచారణ జరుగుతున్నందువల్ల ఎన్‌కౌంటర్‌ మీద తానేమీ వ్యాఖ్యానించనని జిల్లా కలెక్టర్‌ కె డి కుంజన్‌ అన్నారు. కాని ఆ ఎన్‌కౌంటర్‌ బూటకం కాదని తాను అనుకుంటున్నానన్నారు. తన పాలనాకాలంలో జిల్లాలో నిర్మించిన రోడ్ల జాబితా ఇస్తూ, ఈ రోడ్లు ఆదివాసులను అభివృద్ధి పథంలోకి తీసుకొస్తాయని తాను బలంగా నమ్ముతున్నానన్నారు. పాఠశాలల సంగతి, ప్రాథమిక ఆరోగ్యం సంగతి ఏమిటని అడిగినప్పుడు అవి కూడ చేస్తామన్నారు. కాని అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోవడానికి రోడ్లే మొదటి ప్రాధాన్యత అన్నారు. కాని ఆదివాసులు మాత్రం రోడ్లు తమ ప్రాంతంలోకి మరింత ఎక్కువగా బలగాలను తీసుకువస్తాయని రోడ్ల పట్ల అనుమానాలతో ఉన్నారు. పాఠశాలలను తిరిగి తెరవాలనీ, ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాలనీ వాళ్లు అన్నారు.

ఇటువంటి ఘటనలు జరిగినప్పుడల్లా మెజస్టీరియల్‌ విచారణలు జరగడం సర్వసాధారణం. బిజాపూర్‌ జిల్లాలోనే ప్రస్తుతం అటువంటి పది విచారణలు జరుగుతున్నాయి. మెజిస్టీరియల్‌ విచారణాధికారి ఎ ఆర్‌ రాణా కూడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేసే ఒక ప్రభుత్వాధికారి. బొడగ/తాడ్బల్ల ʹʹఎన్‌కౌంటర్‌ʹʹ గురించి మాట్లాడుతూ ఆయన పోలీసుల నుంచి సాక్ష్యాలు సేకరించడం పూర్తయిందని, గ్రామస్తుల సాక్ష్యాల కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఈ సాక్ష్యాల సేకరణ ప్రక్రియ గురించి ప్రశ్నించగా, బైరాంగడ్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందితో గ్రామస్తులకు సమన్లు పంపడం జరిగిందని అన్నారు. ʹʹఎన్‌కౌంటర్‌ʹʹ లో పాల్గొన్నది కూడ అదే పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది గనుక వారు ఆ సమన్లు ఇవ్వడానికి గ్రామానికి వెళ్లనేలేదు. నది ఒడ్డున ఉన్న వారం సంత నుంచి తమను పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకుపోయి కొన్ని తెల్ల కాగితాల మీద తమతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని కొందరు మృతుల కుటుంబ సభ్యులు చెప్పారు. మిగిలిన కుటుంబాల సభ్యులను కూడ తీసుకురమ్మని వారికే చెప్పారని అన్నారు.

కొత్త ప్రభుత్వంలో విధానం మారిందా?

ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించి, ఆయనతో ముఖాముఖీ కుదరక, మేం ప్రభుత్వ రాజకీయ సలహాదారు వినోద్‌ వర్మ ను కలిశాం. ఆయన గతంలో జర్నలిస్టుగా ఈ సంఘర్షణా ప్రాంతంలోనే పనిచేశారు. 2017ఒక్క సంవత్సరం లోనే అప్పటి చత్తీస్‌ గడ్‌ ప్రభుత్వం 14 మంది జర్నలిస్టులను అరెస్టు చేయగా, అలా అరెస్టయినవారిలో ఆయన కూడ ఉన్నారు. 2018 చివరలో ప్రభుత్వం మారినప్పుడు ఆయన కాంగ్రెస్‌ ప్రత్వానికి రాజకీయ సలహాదారు అయ్యారు.

ʹʹమేం నక్సలైట్ల పట్ల మెతక వైఖరి అవలంబించడం లేదు. వాళ్లను రాజ్యానికి శత్రువులుగానే
పరిగణిస్తూ ఉంటాంʹʹ అని ఆయన స్పష్టంగా చెప్పారు. ʹʹఅంతేకాదు, వాళ్లతో శాంతి చర్చలనేవేమీ ఉండవుʹʹ అన్నారు. ʹʹఇంతకాలమూ ఆ ప్రాంతంలో తుపాకులే మాట్లాడుతూ ఉండేవి. ఇప్పుడు మేం అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాంʹʹ అన్నారు. మరి ఈ కొత్త అభివృద్ధి కార్యక్రమ ప్రణాళికలో ఇలా చిన్నపిల్లలను చంపిన ఎన్‌కౌంటర్‌ ఎట్లా ఇముడుతుంది? ఆ విషయం మాట్లాడడానికి తాను సమర్థుడిని కానంటూ ఆయన ʹʹదశాబ్దాలుగా ఒక పని పద్ధతికి అలవాటుపడిన అధికారుల మానసికస్థితిని మార్చడం అంత సులభం కాదుʹʹ అన్నారు.

పోలీసుల్లో నేరస్తులను సహించబోమన్న డిజిపి డిఎం అవస్తి

ప్రస్తుత చత్తీస్‌గడ్‌ డిజిపి డిఎం అవస్తి అంతకుముందు నక్సల్‌ వ్యతిరేక కార్యకలాపాల బాధ్యుడిగా ఉండేవారు. దోపిడీ ఎక్కువగా సాగుతున్నప్పుడు, రాజ్యం ఆ ప్రాంతాలకు చేరుకునే అవకాశం లేనప్పుడు నక్సల్స్‌ ఆదివాసుల దగ్గరికి చేరగలిగారని ఆయనన్నారు. అప్పుడు ఆదివాసులను అటవీ అధికారులు, పోలీసు బలగాలు వేధించేవారని కూడ ఆయన ఒప్పుకున్నారు. ʹʹభద్రతా బలగాలతో నక్సల్స్‌ ను నిర్మూలించలేంʹʹ అని ఆయన అన్నారు. పోలీసుల వైపు నుంచి కూడ కొన్ని పొరపాట్లు జరిగాయని ఒప్పుకుంటూ, అటువంటి సిబ్బందిని శిక్షించడం కూడ జరిగిందని ఆయనన్నారు. ʹʹయూనిఫామ్‌ లో ఉన్న నేరస్తులను సహించబోం పోలీసుల్లో ఉన్న నేరస్తులను ఏరి పారవేయడానికి మేం కృతనిశ్చయంతో ఉన్నాంʹʹ అని ఆయనన్నారు.

- సీ.వనజ,ఇండిపెండెంట్‌ జర్నలిస్టు

Keywords : chattis garh, police, fake encounter, adivasi, children, jaournalist
(2021-12-05 02:55:38)No. of visitors : 1742

Suggested Posts


మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు

అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

Search Engine

తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
SKM:ఉద్యమం కొనసాగుతుంది,నవంబర్ 29 నుండి పార్లమెంట్ మార్చ్ జరుగుతుంది -కిసాన్ మోర్చా ప్రకటన‌
more..


క్రీడా