ʹʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹʹ

ʹʹఅంబేద్కర్,

మరో అబద్దపు కేసు బనాయించి పూణే జైలు నుండి కర్ణాటక పావగడ కోర్టుకు తీసుకొచ్చిన విప్లవకవి వరవరరావును కలిసేందుకు వెళ్ళిన వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ తన ఫేస్‌బుక్ టైమ్ లైన్‌పై పోస్ట్ చేసిన రిపోర్ట్

బుధవారం సాయంత్రం కూర్మనాథ్ నుంచి ఫోన్. ʹవివి మీద ఇంకొక కేసు పెట్టి కర్ణాటక తీసుకుపోతున్నారట గదాʹ అని ఎవరో పత్రికా విలేఖరి అడిగారని, నాకేమన్నా వివరాలు తెలుసా అని. అప్పటికి నాకు తెలియదు. పుణె న్యాయవాదులను కనుక్కుంటే కూడ ఏమీ చెప్పలేకపోయారు.

క్రమంగా ఒక గంట రెండు గంటల్లో వివరాలన్నీ తెలిశాయి. అప్పటికే రాత్రి అయింది. అప్పటికప్పుడు బయల్దేరి పావగడ వెళ్లడం సాధ్యం కాదని, వెళ్లినా కోర్టు ముగిసేలోపు సాధ్యం కాదని అనుకున్నాం. గురువారం పావగడ కోర్టులో ఏం జరుగుతున్నదో గంట గంటకూ తెలుస్తూనే ఉంది. దాదాపు రెండు వందల మంది పోలీసులు కోర్టును చుట్టుముట్టారని, చాల మంది జనం వివిని చూడడానికి వచ్చారని, వివిని తీసుకొచ్చి వాన్ లో కూచోబెట్టారని, కోర్టు హాలు లోకి రెండుసార్లు తీసుకుపోయారని అట అటలుగా వార్తలు తెలుస్తున్నాయి. పోలీసు కస్టడీకి ఇమ్మని అడిగారని, వివి తన వాదన తానే చేసుకున్నారని, చివరికి మేజస్ట్రీట్ రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇచ్చాడని సాయంత్రానికి తెలిసింది. శుక్రవారం సాయంత్రం కూడ కోర్టుకు తీసుకువస్తారని పొరపాటు సమాచారం కూడ వచ్చింది. గతంలో పుణె లో, అహెరిలో పోలీసు కస్టడీలో కూడ కొద్ది సేపు కలవడానికి అవకాశం ఇవ్వడంతో ఇక్కడ కూడ ఇస్తారేమోనని, శుక్రవారం కోర్టులో కూడ చూడవచ్చుననీ, శనివారం ఎలాగూ కస్టడీ ముగిసి కోర్టుకు తీసుకువస్తారు గనుక అప్పుడూ కలవవచ్చునని మేం (అక్కయ్య, అనల, నయన, అల, నేను) పావగడ బయల్దేరాం. మధ్యలో పాణి మాతో కలిశాడు. అనంతపురం నుంచి శేషయ్య కూడ బయల్దేరాడు.

మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా పావగడ కోర్టు చేరాం. ఆరోజు కోర్టుకు తీసుకొస్తారనేది సరైన సమాచారం కాదని తెలిసింది. పోలీసు కస్టడీలో ఎక్కడ ఉంచారో తెలియదు. పోలీసు కస్టడీకి ఇన్ చార్జ్ గా ఉన్న అదనపు ఎస్ పి కి ఫోన్ చేశాం. ʹకోర్టు ఆర్డర్ తెచ్చుకొండి, కలవనివ్వమని కోర్టు అనుమతిస్తే మాకేం అభ్యంతరంʹ అని ఆమె అన్నారు. పోలీసు కస్టడీకి ఇచ్చిన జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజస్ట్రీట్ ముందర ఇలా హైదరాబాద్ నుంచి తొమ్మిది గంటలు ప్రయాణించి వచ్చామని, కస్టడీలో కాసేపైనా చూడడానికి అనుమతించమని పోలీసులను ఆదేశించమని పిటిషన్ వేశాం. ఆ మెజస్ట్రీట్ చాల టెక్నికల్ గా ʹపోలీసు కస్టడీలో ఉన్నప్పుడు అలా అదేశించడం నా పరిధిలోకి రాదు. రేపటికి కస్టడీ అయిపోయి తీసుకొస్తారు. అప్పుడు నా పరిధిలో ఉంటుంది గనుక మీరు మాట్లాడడానికి అనుమతిస్తానుʹ అన్నాడు. అలా ఆ రోజు గడిచిపోయింది.

మర్నాడు ఉదయం పదిన్నరకల్లా కోర్టు చేరితే కోర్టు ఆవరణంతా పోలీసుల మయం. సాధారణ పోలీసులు, కర్ణాటక రిజర్వ్ పోలీసులు, మిలిటరీ దుస్తులు వేసుకున్న పారామిలిటరీ కమాండో బలగాలు. అప్పటికే నాలుగైదు పోలీసు వాహనాలు వచ్చి ఉన్నాయి. మా కారును కోర్టు ఆవరణలోకి కూడ ప్రవేశించనివ్వలేదు. మా కారును మాత్రమే కాదు, అక్కడి న్యాయవాదుల కార్లను కూడ బైటే పార్క్ చేయించారు. క్రమక్రమంగా పోలీసు వాహనాలు దాదాపు ఇరవై అయ్యాయి.

అప్పటికే వివిని చూడడానికి పావగడ నుంచి, ఇరుగుపొరుగు పల్లెల నుంచి జనం వస్తూ ఉన్నారు. వారిని ఎందుకొచ్చారని ప్రశ్నస్తూ, బెదిరిస్తూ, వీలైనంతవరకు చెదరగొట్టడానికి ప్రయత్నిస్తూ, కోర్టు ఆవరణ గేట్లు మూసిపెట్టిన పోలీసులు మమ్మల్ని మాత్రం ఆపలేదు. మేం ఆవరణలోపలికి వెళ్లి ఆ మెజస్ట్రీట్ కోర్టు హాలు ముందు కూచున్నాం. ఈ లోగా ఏదో ఒకటి చెప్పి గుంపులు గుంపులుగా జనం లోపలికి ప్రవేశిస్తూనే ఉన్నారు.

దాదాపు ఇరవై మంది విలేఖరులు వచ్చారు.

ఈలోగా ఇదిగో తీసుకొస్తున్నారు, అదిగో తీసుకొస్తున్నారు, తుమకూరులో బయల్దేరారు, మధుగిరిలో బయల్దేరారు, మడకశిర దాటారు అని వదంతులు. వీటిలో ఏది నిజమో ఏది కాదో తెలియదు. చివరికి పన్నెండున్నర, ఒంటి గంట మధ్య ʹకోర్టు సిబ్బందిని, న్యాయమూర్తులను లంచ్ బ్రేక్ తీసుకోవద్దన్నారట, అయితే లంచ్ బ్రేక్ లో తీసుకొస్తారేమోʹ అని మరొక వదంతి. పోలీసులు కాసేపు హడావుడిగా ఇక తీసుకురాబోతున్నారన్నట్టు కనబడతారు, మరి కాసేపు తీరుబడిగా చెట్ల కింద కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఇప్పట్లో తీసుకురారన్నట్టు కనబడతారు.

చిట్టచివరికి ఒకటిన్నరకు పోలీసుల హడావుడి పెరిగింది. అప్పటికి కూడిన దాదాపు రెండు వందల మంది దాకా జనాన్ని పోలీసులు దూరం కొట్టారు. కోర్టు హాలు ముందు వరండా అంతా ఖాళీ చేయించి పోలీసులతో నింపారు. ఆ వరండా పొడవునా దాదాపు ఇరవై గజాల దూరం వరండా పక్కన కూడ ఎవరూ లేకుండా ఖాళీ చేయించారు. ఆ వరండా చివర మెట్లదగ్గరికి వాన్ తీసుకువచ్చి సరిగ్గా మెట్లమీద వివిని దింపారు. ఆ వరండాలోనుంచి కోర్టు హాల్లోకి నడిపించుకుపోతుండగా తను మావైపు చూడడానికి ప్రయత్నిస్తున్నారు గాని గోడలా దడి గట్టిన పోలీసుల మధ్యనుంచి ఒకటీ అరా తప్ప చూపులు చిక్కడం లేదు.

కోర్టు అనేది బహిరంగ ప్రజాస్థలం. అక్కడ కదలికల మీద ఆంక్షలు విధించడం తప్పు. ఆ ప్రాంగణంలోపల న్యాయవ్యవస్థకే తప్ప పోలీసులతో సహా మరే ఇతర అధికార వ్యవస్థ అధికారమూ చెల్లదు. కాని ఆ సంగతి తెలిసిన, దాన్ని అమలులో పెట్టే వెన్నెముక ఉన్న న్యాయాధికారులు ఎక్కడున్నారు? అలా ఒక బహిరంగ స్థలంగా ఉండవలసిన కోర్టు హాలును పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తలుపుకు అడ్డంగా నిలబడి ఎవరినీ లోపలికి పోనివ్వడం లేదు.

వివి లోపలికి వెళ్లగానే మేజస్ట్రీటు, ప్రాసిక్యూటర్, పోలీసులు కోర్టు పనులు మొదలుపెట్టారు. నిందితుడిని పోలీసు కస్టడీలో సరిగ్గా చూసుకున్నారా వంటి ప్రశ్నలు వేసి, కేసును సెషన్స్ కు కమిట్ చేసే, నిందితుదిని మళ్లీ జుడిషియల్ కస్టడీకి పంపే యథావిధి పనులు మొదలుపెట్టారు. ʹఇవన్నీ చేసేస్తే నన్ను వెంటనే తీసుకువెళ్తారు, ముందు నా కుటుంబ సభ్యులను కలవనివ్వండి, ఆ తర్వాత రొటీన్ పనులుʹ అని వివి అడ్డుకున్నారు. అప్పుడిక, ʹరిమాండ్ ఆర్డర్ మీద లంచ్ తర్వాత సంతకం పెడతాను. లంచ్ బ్రేక్ లో ఇరవై నిమిషాలు 2.00 నుంచి 2.20 వరకు భార్య, కూతురు, ఇద్దరు మనవరాళ్లు కలవనివ్వండిʹ అని మెజస్ట్రీట్ ఉత్తర్వు ఇచ్చాడు. ʹహైదరాబాద్ నుంచి నా మేనల్లుడు కూడ వచ్చాడు, మిత్రులు వచ్చారు. వాళ్లను కూడ కలవనివ్వండిʹ అని వివి వాదించారు. కుటుంబం అంటే, రక్తబంధువులంటే అర్థమేమిటో వివరించడానికి ప్రయత్నించారు. కోర్టులో నిందితుల హక్కుల గురించి సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టులు ఏం చెప్పాయో చెప్పారు. కాని మేజస్ట్రీట్ అవేవీ వినదలచుకోలేదు. ఈ నలుగురు తప్ప మరెవరినీ కలవడానికి వీలు లేదు అని బెంచి దిగి, భోజనానికి ఇంటికి వెళ్లిపోయాడు.

అప్పుడు కోర్టు హాలు లోంచి మిగిలిన న్యాయవాదులందరినీ బైటికి పంపించి, ఎ ఎస్ పి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇద్దరు మహిళా పోలీసులు, నలుగురైదుగురు పోలీసులు లోపల ఉండగా వివితో అక్కయ్యను, అనలను, మనవరాళ్లిద్దరిని ఇరవై నిమిషాలు ఉంచారు. అదీ ఆత్మీయ, కుటుంబ, వ్యక్తిగత సంభాషణకు కోర్టూ పోలీసులూ ఇచ్చిన నిర్వచనం!!

ఆ ఇరవై నిమిషాలు గడవగానే హాలు నుంచి బైటికి తీసుకువస్తున్నప్పుడు వివినే పోలీసులను పక్కకు జరుపుకుంటూ వచ్చి శేషయ్యనూ నన్నూ కావలించుకున్నారు. మానుంచి పక్కకు లాగి మళ్లీ పోలీసుల దడి మధ్యనుంచి ఆ వరండా పొడుగునా నడిపించుకుపోయి అక్కడ నిలబెట్టిన జీపులోకి ఎక్కించి ఒక భోజన ప్లేటు వివి చేతికి ఇచ్చారు. ఈ భోజన సమయంలో మనవరాళ్లిద్దరూ పక్కన ఉండొచ్చునని మెజస్ట్రీటు చాల ఔదార్యంతో ఉత్తర్వులిచ్చాడు గనుక వివికి అటూ ఇటూ వాళ్లను కూచోనిచ్చారు.

భోజనం అయిపోయి, మెజస్ట్రీటు తిరిగి బెంచి ఎక్కాక వివిని మళ్లీ హాల్లోకి తీసుకు వచ్చారు. కేసు సెషన్స్ కు కమిట్ చేస్తున్నామని, జుడిషియల్ కస్టడీ కొనసాగుతుందని, ఈ కేసు విచారణకు వస్తున్నదని సమన్స్ వచ్చేవరకూ పుణెలో మొదటి కేసు విచారణలో ఉండవచ్చునని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు అయిపోయే సమయానికి బైట వాన్ సిద్ధం చేసి చుట్టూ పది గజాల పరిధిలో జనాన్ని, విలేఖరులను దూరంగా తరిమి వివిని బైటికి తీసుకువచ్చారు.
ఆయనను వాన్ ఎక్కిస్తుండగానే అప్పుడే వ్యాన్ కు ఎదురుగా వస్తున్నారు ప్రొ. హరగోపాల్, నగరి బాబయ్య గారు. బెంగళూరు నుంచి ఉరుకులు పరుగుల మీద వచ్చిన వాళ్లిద్దరూ చివరి నిమిషానికైనా అందుకోగలిగారు. హరగోపాల్ గారు ఒక్క ఉదుటున వివి వెనకే వ్యాన్ ఎక్కేసి అక్కడే రెండు నిమిషాలు మాట్లాడారు. బాబయ్యగారు వ్యాన్ బైట నిలబడి కిటికీలోంచి మాట్లాడారు.

లోపలి నుంచి కాగితాలు రావడానికి ఆలస్యమై, మరొక పావు గంట వ్యాన్ అక్కడే నిలబడింది. ఆ వ్యాన్ లోపల కూచొని లోపలి నుంచి మెష్ దాటి, వేసేసిన గాజు కిటికీ దాటి వివి ఎత్తిపట్టిన పిడికిలి, చేస్తున్న అభివాదం, వాతావరణాన్ని విద్యుచ్చకితం చేస్తున్న చిరునవ్వు.

ఒక పైలట్ జీపు ముందు కదులుతుండగా, వెనుక వ్యాన్ పుణె బయల్దేరింది. మధ్యలో విశ్రాంతి కోసం బెల్గాంలో కాసేపు ఆగుతామన్నారు గాని అది గోడ కుర్చీ లాంటి వ్యాన్ లో పదిహేను పదహారు గంటల పాటు సాగే ప్రయాణం. మళ్లీ ఎంత అలసిపోయి, డస్సిపోయి, నిస్త్రాణగా యరవాడ జైలులోని ఆ ఒంటరి సెల్ చేరుతారో...

ఆ నిరాశనూ దుఃఖాన్నీ పోగొట్టినవి పావగడ ప్రజల ఆదరణ, పత్రికా మిత్రుల స్నేహం. ఆ ప్రాంతంలో 1990ల మొదటి నుంచీ 2005-06 దాకా విప్లవోద్యమం బలంగా ఉండిందట. దాదాపు ప్రతి పల్లెలోనూ బలమైన సంఘాలు ఉండేవట. ఇప్పటికీ ఆ ప్రభావం కనబడుతుంది. వివిని చూడడానికే కనీసం రెండు వందల మంది చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చారు. ʹమంచోళ్లకు కాలం కాదుʹ, ʹఎవరికొస్తది ఇంత పేరు? ఎంత మంది జారిపోయినారు! ఈ యప్ప ఎట్లున్నాడు!ʹ, ʹశాన జనం చూసేదానికే ఉండారు, ఏమి జేసినా పోరుʹ ʹఆ సామి చేసింది సర్కారుకు కెట్ట, జనరిగె ఒళ్లెʹ అని ఆ పల్లె జనాలు అంటున్న మాటలు వింటూ అక్కడ తిరుగుతుంటే ఒళ్లు పులకించింది, చెంపలమీద కన్నీరు కాల్వలు కట్టింది. ʹఆయన దళితులకోసమూ, కూలీల కోసమూ పోరాడాడు, అందుకే ఆయనను చూడడానికి వచ్చానుʹ అని ఒక దళిత నాయకుడు అన్నాడని ముందురోజు హిందూ విలేఖరి రాశాడు. వివి పట్ల అక్కడి దళిత, అంబేద్కర్ యువజన సంఘాల కార్యకర్తల్లో ఎంత అభిమానం ఉన్నదో నాకు కనబడింది. మాకు భోజనాలు పెట్టిన ఒక కార్యకర్త ʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹ అన్నాడు.

వివిని తీసుకుపోయిన తర్వాత, అప్పటికే నాలుగైందని, తొందరగా ఎక్కడికన్నా వెళ్లి తినడానికి ఏమన్నా దొరుకుతుందా చూద్దామని మేం బయల్దేరుతుంటే పత్రికా విలేఖరులు, దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు, అంబేడ్కర్ యువజన సంఘాల కార్యకర్తలు, పాత విప్లవోద్యమ అభిమానులు మా ఊరి నుంచి అట్ల పోనిస్తమా అని వాళ్లే భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రెస్ తో మాట్లాడి, భోజనం చేసి బయల్దేరాం.

- ఎన్. వేణుగోపాల్

Keywords : VaraVara Rao, Bima Koregaon, Pavagada, Elgar Parishad
(2024-04-24 18:11:26)



No. of visitors : 1324

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹʹఅంబేద్కర్,