ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
దొరసాని అని నిన్న ఒక సిన్మా రిలీజైంది కదా.. అది చూసిన వాళ్లు చాలా రకాల రివ్యూలు రాసిన్రు. ఆనాటి గడిల రోజులు యాది చేసుకున్నరు. అలా ఆనాటి బతుకులను వెండితెరపై చూయించిన దొరసానిపై అరుణాంక్ కూడా తన అభిప్రాయాలను వెలువరిస్తూ ఫేస్‌బుక్‌లో రాసిండు. అది యధాతథంగా
|| దొరసాని The Princess ||
దొర్సాని
నా బతుకు సీకట్లకు
మొగులు దాటి అచ్చిన ఎన్నెలవు నువ్వు
నల్లతుమ్మ అసొంటి నా మీద వాలిన
గడీ గావురాల పావురమా
నువ్వు యాదికత్తె
ఆన ఎల్సినంక పొడిసిన
సింగిడిని జూసినంత ఖుష్ ఐతది
నిన్ను సూడని దినం
పానమంతా తల్లడమల్లడమైతది
పండెన్నెల అసొంటి మొఖం నీది
సెంద్రవంక నవ్వు నీది
ఎన్నెల లెక్క నువ్వు
నీకోసం సూసుకుంటా నేను
మన మద్దెల మొగులోలే గడీ
రా దొర్సాని రా
మొగులు దాటుకొని
ఎన్నెల లెక్క రా
నల్లతుమ్మ మీద ఆలేందుకు
గడీ గావురాల పావురమై రా
సినిమా నాకెప్పుడు ʹmanufacturing the consentʹ అనే అనిపిస్తుంది. అది స్క్రీన్స్ మీద జార్జ్ ఆర్వెల్ రాసిన అభిప్రాయం వలన కావొచ్చు, గ్రాంసి సినిమాల మీద చేసిన సూత్రీకరణ వలనా అయ్యుండొచ్చు. అరుదుగా కొన్ని సినిమాలు మాత్రమే అందులో జీవితాల్ని మోసుకుని వచ్చి గుండె తలుపు తడతాయి. దొరసాని అట్లా అనిపించింది.
ఇది నా మటుకు semi nostalgic సినిమా. నా బాల్యం, టీనేజ్, తోలి యవ్వన ప్రాయాల యాదుల్నీ తట్టి లేపిన సినిమా. ఆ పీపుల్స్ వార్ కరపత్రాలు, పోరగాళ్ళ ముచ్చట్లు, తొలిప్రేమ అంతా ఓ semi nostalgia. "A true revolutionary is guided by great feelings of love" అన్నాడు చేగెవేరా. ప్రేమా ఓ ఉద్యమమే అంటున్నాడు Kvr Mahendra .
ప్రేమించగలిగిన వారే చలించగలరు. చలించినవారే తిరగబడగలరు. తిరగబడిన వారే వారి పోరాటాన్ని కొనసాగించగలరు. శంకరన్న ఓ ప్రేమికుడు. రాజు ఓ ప్రేమికుడు. దేవిక ఓ ప్రేమికురాలు. ముగ్గురి ప్రేమకథే ఈ దొరసాని.
ఎవ్వరీ దొరసాని? ఇందులో దొరసాని సార్వజనీనం. సెమి/అర్బన్ బతుకుల్లో ముద్దుగా ప్రిన్సెస్ అని పిలుచుకోవచ్చు. బుగ్గ మీద ముద్దు సద్దుల బతుకమ్మకే కాదు, తన పుట్టినరోజుకూ పెట్టొచ్చు. కవితలు ఇప్పుడు పేపర్ మీద రాసివ్వాల్సిన అవసరం లేదు. టైప్ చేసి వాట్సప్ లోనో, మెయిల్ లోనో బట్వాడా చేయొచ్చు. ఇందులో అర్బన్ బతుకులు తమ ప్రేమను రూరల్ గా వెతుక్కోవచ్చు.
ʹʹగడీల దాసీ దానికైనా, దొరసానికైనా ఖాయిష్ ఉండొద్దు దొరసానిʹʹ అని సెంద్రి చెప్పినా. ʹʹదొర పోతాడు గానీ, దొరతనం పోతదా" అని అయ్యగారు పలికినా, ʹʹదొరసానిలో ఉన్నది దొరరక్తమే కదా!ʹʹ అని శంకరన్న అనుమానం వ్యక్తం చేసినా అవన్నీ నడుస్తున్న చరిత్రే. ప్రేమా ఇప్పటికీ ఉద్యమమే. రాజులు దొరసానులను ప్రేమించిన అనేకసార్లు మంటల్లో మాడి మసవుతున్నారు.
క్లైమాక్స్ ʹసైరాట్ʹలా అనిపించిందన్నారు కొందరు. సైరాట్ కి దీనికి ఎక్కడా పోలిక లేదు. ఒక్క టీనేజ్ ప్రేమకథ అనే అంశం తప్ప. క్లైమాక్స్ సీన్ లో మీద పడిపోయిన అమ్మాయిని పక్కకి జరిపి, చేయి పడితే దాన్ని తీసి పక్కన వేసే కుల ఉన్మాదం అందులో లేదు. it have more intense than Sairat.
చివరగా తెలుగు సినిమా దర్శకులకు ఒక మాట:
ఒక సినిమా తీసే ముందు, అందులో ఎంచుకున్న పాత్రల బతుకుల్ని అధ్యయనం చేయండి. నక్సలైట్ల మీద వచ్చిన అన్నీ సినిమాల్లాగే ఇందులోనూ నక్సలైట్ అనేవాడు గంభీరంగా, నవ్వకుండా ఉంటాడు అనే మూసలోనే చూపెట్టాడు. నక్సలైట్ ఆర్. నారాయణ మూర్తిలా అస్సలు ఉండడు. నక్సలైట్లు గొప్ప ప్రేమికులు. వాళ్ళకు ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు మనలాగే, మన సమాజంలోని మనుషులే.
అట్లా సీరియస్‌గా ʹకామ్రేడ్స్ʹ అంటూ మాట్లాడిన నక్సలైట్‌ని ఇప్పటివరకు నేను చూడలేదు. మూడు దశాబ్దాలకు పైగా ఉద్యమంలో ఉండి వచ్చిన వారిని చూశాను. ఐదు దశాబ్దలుకు పైగా విప్లవోద్యమంతో నడుస్తున్న వారినీ చూశాను. వాళ్ళలో ఈ సినిమాటిక్ సీరియస్‌నెస్ ఎక్కడా కనిపించలేదు. తెలంగాణ పల్లెల్లో అడిగితే వాళ్ళ యాదులు, నవ్వులు, కన్నీళ్లు చెప్తారు. శంకరన్న మాట్లాడే బాష కృత్రిమంగా ఉంది. తెలంగాణది జీవభాష.
మహేంద్ర తన వరంగల్ జిల్లాకే చెందిన ʹకౌముదిʹని చదివినా నక్సలైట్లలో ఉండే భావుకత అర్థమై ఉండేది.
..........
ʹʹనెత్తురుని చూసి చలించకండి. నెత్తురు మాత్రమే చరిత్రని కొత్త రంగుల్లో రాయగలదు.ʹ - మాక్సిం గోర్కి. రాజు, దేవకిల నెత్తురుతో మాత్రమే కాదు. మొన్నటి ప్రణయ్ నెత్తురుదాక చరిత్ర గ్రంధస్తం చేస్తూనే ఉన్నది. తెలుగు సినీతెరా ఇప్పుడు దృశ్యమానం చేసింది. Kudos to you Mahendra, your cast and crew.
- అరుణాంక్ లత
URL : https://www.facebook.com/photo.php?fbid=2523694441023851
Keywords : Dorasani, Movie, Shivatmika, Anand Deverakonda, Review
(2023-09-27 04:09:57)
No. of visitors : 2504
Suggested Posts
0 results