పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్


పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్

పదునెక్కుతున్న

వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ఆగస్ట్ సంచికలో రాసిన సంపాదకీయం మీ కోసం...

అడాల్ఫ్‌ హిట్లర్‌ నాయకత్వంలో జర్మనీలో ఎనబై సంవత్సరాల కింద సాగిన నాజీ పాలన ఒక దుర్మార్గం నుంచి మరొక దుర్మార్గానికి ఎలా పయనించిందో గతంగా, గడిచిపోయిన పీడకలగా, చరిత్రగా మాత్రమే చదువుకున్న వారికి, ఇవాళ నరేంద్ర మోడీ - అమిత్‌ షా పాలన దాన్ని వర్తమానంగా దృశ్యమానం చేస్తున్నది.
ఈ విషవిద్వేష పాలన అధికారపు పగ్గాలు చేపట్టి ఇంకా రెండు నెలలు పూర్తిగా నిండలేదు. కాని ఈ నరహంతక, భిన్నాభిప్రాయ హనన జగన్నాథ రథం పరుగులు వడివడిగా సాగుతున్నాయి. ఆ చక్రాల కింద పడి నలిగిపోతున్న అసహాయుల ఆర్తారావాలు వినబడుతున్నాయి.
ఆ చక్రాల కింద అణచివేతకు గురవుతున్నది ముస్లింలు, దళితులు, భిన్నాభిప్రాయాలు ఉన్నవారు మాత్రమే కాదు, బహుళత్వానికీ, వైవిధ్యానికీ చిహ్నమైన మన సమాజం మొత్తాన్నీఆ రథం తొక్కివేస్తున్నది, తొక్కివేయడానికి చూస్తున్నది. సమాజం మొత్తాన్నీ ఒక దేశం - ఒకే జాతి, ఒకే మతం, ఒకే ఎన్నికలు, ఒకే ఆహారపుటలవాట్లు, ఒకే ఆహార్యం, ఒకే ఆలోచన అనే ఏకశిలా సదృశ, శ్మశాన సామ్రాజ్యంగా చదును చేయాలని ఆ రథం కోరుకుంటు న్నది.
గడిచిన నాలుగు వారాలలో జరిగిన ఘటనలూ పరిణామాలూ చూస్తే ఈ విద్వేష రాజకీయ రథం చట్టాలను మార్చి, పాలనావిధానాలను మార్చి తన భావజాలాన్ని సమాజం మీద రుద్ది, ఆ భావజాలానికి భిన్నమైన ఆలోచనలు గలవాళ్లందరినీ వేధించడానికి మార్గాలు సిద్ధం చేసుకుంటున్నట్టు స్పష్టంగా కనబడుతున్నది.
సరిగ్గా హిట్లర్‌ చేసిన పని ఇదే. 1920లలో పార్టీ పెట్టిన నాటి నుంచి, 1933లో అధికారానికి వచ్చిననాటి నుంచి యూదులను, కార్మిక నాయకులను, కమ్యూనిస్టులను, సోషలిస్టులను ఒక్కొక్కరినీ వేధించడానికి, హింసించడానికి, ఊచకోత కోయడానికి మార్గం సుగమం చేసుకుంటూ వచ్చాడు. అప్పటికి దేశంలో ఉన్న దాదాపు ఇరవై రాజకీయ పార్టీలనూ ఊడ్చేస్తానని ఎన్నికలలో గెలవకముందే హెచ్చరించాడు. ʹఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతాన్నిʹ అక్షరాలా అమలు చేశాడు.

సరిగ్గా అట్లాగే మోడీ - షా ప్రభుత్వం వేరువేరు రంగాల్లో తన పావులు కదుపుతున్నది. సమాచార హక్కు చట్టానికి సవరణలు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సవరణలు, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ చట్టానికి సవరణలు, అన్‌లాఫుల్‌ ఆక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ చట్టానికి సవరణలు, ట్రిపుల్‌ తలాక్‌ చట్టం వంటివి నేరుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన చర్యలు కాగా, అవన్నీ రాజ్యాంగ ఆదర్శాలకు, ప్రాథమిక హక్కులకు, చట్టబద్ధ పాలనకు, సామాజిక న్యాయభావనకు తూట్లు పొడిచేవే.
ప్రజల పన్నులతో, దేశ సంపదతో నడిచే ప్రభుత్వ కార్యకలాపాల గురించి పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలని దశాబ్దాల పాటు సాగిన ప్రజా ఉద్యమం వల్ల చిట్టచివరికి అవసరమైన సమాచారాన్ని అనేక ఆంక్షలకు లోబడి అయినా పొందగలిగే చట్టం పదిహేను సంవత్సరాల కింద ఉనికిలోకి వచ్చింది.
ఆ చట్టాన్ని సవరించాలనీ, ప్రశ్నించడానికి వీలులేని తమ నిరంకుశ అధికారాన్ని నిలబెట్టుకోవాలనీ ప్రభుత్వాలు చాలసార్లు ప్రయత్నించాయి. సమాచార హక్కు ఉద్యమ కార్యకర్తలు, ప్రజలు ఆ ప్రయత్నాలను అడ్డుకోగా, ఇప్పుడు భాజపా ప్రభుత్వం అధికారానికి రాగానే సమాచార హక్కు చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ లోకసభలో మందబలంతో నెగ్గించుకుంది. రాజ్యసభలో బలం లేకపోయినా తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్‌సిపి, బిజూ జనతా దళ్‌ వంటి అవకాశ వాద పార్టీల మద్దతుతో గెలిపించుకుంది.
ఈ సవరణలతో సమాచార హక్కు చట్టం బలహీనపడి, ప్రజలకు అవసరమైన సమాచారం ఇవ్వకుండా ఉండే హక్కు ప్రభుత్వానికి అందుతుంది. అసలు సమాచారం కావాలని ప్రశ్నలు అడగడానికి ప్రజలకు ఉన్న హక్కులు కుంచుకుపోతాయి. అలాగే ఇంతకాలం ఎంతో కొంత, ఎప్పుడో ఒకప్పుడు స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉన్న జాతీయ మానవ హక్కుల సంఘం, రాష్ట్ర మానవ హక్కుల సంఘాల విధివిధానాలను మారుస్తూ, అంటే వాటిని బలహీన పరుస్తూ కేంద్ర ప్రభుత్వం మరొక చట్టం తీసుకువచ్చింది. నేషనల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ కోరలు పదును పెడుతూ, దాన్ని బలోపేతం చేస్తూ ప్రజల మీద, భిన్నాభిప్రాయాలు ఉన్నవారి మీద విరుచుకుపడడానికి, తప్పుడు కేసుల్లో ఇరికించడానికి, శిక్షలు విధింపజేయడానికి ప్రభుత్వం మరొక చట్ట సవరణను ప్రవేశపెట్టింది.
అంతకన్న ఘోరంగా, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధ) చట్టంలో అన్యాయమైన సవరణలు ప్రవేశపెట్టి నెగ్గించుకుంది. ఈ నాలుగు చట్ట సవరణలు అంతిమంగా రాజకీయ ప్రత్యర్థుల మీద, భిన్నాభిప్రాయాలు ప్రకటించేవారి మీద, సంఘ్‌ పరివార్‌ వ్యతిరేకుల మీద కక్ష సాధింపుకూ, వేధింపుకూ మాత్రమే ఉపయోగిస్తా రనడంలో సందేహం లేదు.

ఇటువంటి ʹʹచట్టబద్ధమనిʹʹ అనిపించే చట్టాలను మార్చే, ఏమార్చే చర్యలు ఒకవైపు జరుగుతుండగానే, చట్టవ్యతిరేక, దుర్మార్గ, దౌర్జన్య చర్యలు పెచ్చుమీరుతున్నాయి. ఆదివాసుల భూమి ఆక్రమించి, వారిని వెళ్లగొట్టడానికి కాల్పులు జరిపేదాకా భూస్వాములు తెగబడుతున్నారు.
వచ్చినది తమ ప్రభుత్వమే గనుక తమ హంతక చర్యలకు అనుమతి దొరికినట్టేనని భావిస్తున్న సంఘ పరివార్‌ శక్తులు, వారి ఆశ్రితులు దేశ వ్యాప్తంగా జైశ్రీరాం అని నినదించమని ఇతరులను హింసిస్తున్న ఘటనలు పెరిగిపోయాయి. ఇటువంటి మూక హత్యలు సమాజానికీ, భవిష్యత్తుకూ మంచివి కావని, వీటిని ఆపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమాజ భవిష్యత్తు మీద ప్రేమ ఉన్న మేధావులు, ప్రజాస్వామిక వాదులు ప్రభుత్వానికి లేఖ రాస్తే, వారి మీద వేధింపులు, దుర్భాషలు, వారిని చంపుతామని బెదిరింపులు సాగుతున్నాయి.

లెక్కపెడితే గడిచిన నాలుగు వారాలలో ప్రభుత్వం, అధికారపక్షం, అధికార పక్షపు మాతృసంస్థ తరఫున రోజుకొకటైనా ఇటువంటి మానవత పట్ల నేరాలు జరిగాయి, చట్టబద్ధ పాలనకూ, సక్రమమైన న్యాయ విచారణకూ సంబంధం లేని పనులు, చట్టాలనే తారుమారు చేసి, కనీస ప్రజాస్వామిక సంప్రదాయాలను తలకిందులు చేసే పనులు జరిగాయి.
అధికారం నెరపడానికి అవకాశం వచ్చిన అరవై నెలల్లో రెండు నెలల్లోనే ఈ దిశ, దశ ఇలా ఉంటే, ఈ అధికార వ్యవధి పూర్తయ్యేలోగా ఈ దేశం ఈ దేశం లాగనే ఉంటుందా అని అనుమానించే స్థితి తలెత్తు తున్నది. ఇది కేవలం సంఘ్‌ పరివర్‌ శక్తులకూ, వారిని వ్యతిరేకించే శక్తులకూ మధ్య ఘర్షణ కాదు, వారికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు.

ఈ స్థితి కొనసాగితే, కొనసాగనిస్తే దేశంలో అసహాయుల మీద, ప్రత్యర్థుల మీద మితిమీరిన హింసతో దేశం విస్ఫోటనం వైపు పయనిస్తుంది. ఇతరేతర విభేదాలన్నీ తాత్కాలికంగానైనా పక్కనపెట్టి, బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, ప్రగతివాదులు విశాల ప్రజారాశుల మధ్యకు వెళ్లి జనసమీకరణ జరిపి ప్రతిఘటించవలసిన, పరిష్కరించవలసిన విస్తృత సామాజిక సమస్య ఇది.
- ఎన్.వేణుగోపాల్

Keywords : adolf hitler, narendra modi, amit shah, rti, uapa
(2019-09-19 08:37:37)No. of visitors : 397

Suggested Posts


0 results

Search Engine

తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
more..


పదునెక్కుతున్న