యుద్ధం - శాంతి.


యుద్ధం - శాంతి.

యుద్ధం

ఇవాళ గౌరీలంకేష్ మతోన్మాదుల చేతుల్లో హత్య చేయబడిన రోజు. మోహన సుందరం తన ఫేస్‌బుక్‌ వాల్‌పై గౌరీ లంకేష్‌ను మరోసారి గుర్తు చేశారు. దానితో పాటే రాజ్యం చేస్తున్న అప్రకటిత యుద్దం గురించి కూడా చర్చించారు. ఆ పోస్టు యధాతథంగా...

----------------------

* రాజ్యం యుద్ధం చేస్తుంది.
* ప్రజలు శాంతి కోసం యుద్ధాల్ని ప్రతిఘటిస్తారు.

జంగల్ మహాల్లో " యుద్ధం - శాంతి" ని నేరంగా చూపి టాల్ స్టాయ్ ఆత్మకి కోర్టు, మీడియా సమన్లు జారీ చేసిన నేపథ్యంలో.... సెప్టెంబర్ 5 వ తేదీ గౌరీ లంకేశ్ ద్వితీయ వర్ధంతి ని పురస్కరించుకుని ఈ పాత వ్యాసం మరోసారి.....

పదిహేనేళ్ల క్రితం అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో, కర్నాటక లో, ఆ తర్వాత కేంద్రంలోనూ మావోయిస్టులతో జరిగిన చర్చల ప్రక్రియ ʹ యుద్ధం - శాంతి ʹ ల డొల్లతనాన్ని బద్దలు కొట్టేసింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చర్చల పేరిట మావోయిస్టులను బయటకు రప్పించి చర్చల తతంగం నడిపిన అనంతరం చర్చల ప్రతినిధి కామ్రేడ్ రియాజ్, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్ లతో సహా 1200 మంది మావోయిస్టులను ఐదేళ్లపాటు దారుణంగా ఊచకోత కోయించింది. అదే సమయంలో కర్నాటక లో కూడా చర్చల కోసం ఏర్పడిన పౌరస్పందన వేదికతో ఓ పక్కన చర్చలు జరుపుతూనే అప్పటి ధరమ్ సింగ్ ప్రభుత్వం మావోయిస్టు పార్టీ కర్నాటక రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ సాకేత్ రాజన్ ని కాల్చిచంపింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం శాంతిని ఓ పథకం ప్రకారం దెబ్బతీసి , ప్రజలమీద గ్రీన్ హంట్ పేరిట ప్రత్యక్ష యుద్ధానికి పూనుకున్న నేపథ్యంలో ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ మధ్యవర్తిగా కేంద్రప్రభుత్వం కీ ,మావోయిస్టులకీ మధ్య శాంతి చర్చల కోసం ఓ ప్రయత్నం జరిగింది. అయితే ఆ పరిస్థితి ని ఉపయోగించుకొని అప్పటి హోం మంత్రి చిదంబరం మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ ఆజాద్ ని బూటకపు ఎన్ కౌంటర్ లో హత్యచేయించాడు. అప్పుడు స్వామి అగ్నివేష్ ఆ నాయకుడి హత్యకు తానే పరోక్ష కారణమంటూ భోరున విలపించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా చర్చల మధ్యవర్తులుగా వ్యవహరించిన మేధావులు కూడా ప్రభుత్వ క్రూర దమనకాండని చూసి తీవ్రంగా పశ్చాత్తాప పడ్డారు.కర్నాటక లో కూడా గౌరీ లాంటి మేధావులు ప్రభుత్వతీరుపై ధ్వజమెత్తారు. ఈ ఘటనలతో శాంతి చర్చల డొల్లతనం, రాజ్యం యుద్ధకాంక్ష అందరికీ స్పష్టంగా అర్ధమయ్యాయి.అప్పటిదాకా ప్రభుత్వానికి - మావోయిస్టుల కి మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని వాపోయిన గొంతులు మూగ పోయాయి. చాలామంది మేధావుల కళ్ళు తెరుచుకున్నాయి.రాజ్యం హక్కుల కోసం, అస్తిత్వం కోసం పోరాడే ప్రజల మీద పాశవికంగా యుద్ధం చేస్తుందని, ప్రజలు శాంతి కోసం దాన్ని ప్రతిఘటిస్తారని మరోసారి అర్ధమైంది.

పశ్చిమ కనుమల్లో యుద్ధం - శాంతి...!
--------------------------------------------------

" మరణంలో కూడా కామ్రేడ్ సాకేత్ కర్నాటక ఆకాశంలో నక్షత్రం లాగా మెరవడం మొదలైంది " అంటారు గౌరీ లంకేశ్. తెహల్కా పత్రిక, మార్చి 5 , 2005 లో రాసిన ఈ కింది వ్యాసంలో ఆమె కామ్రేడ్ సాకేత్ రాజన్ ( సాకీ ) గురించి రాస్తూ " కర్నాటకలోని ప్రజా చరిత్ర కారుడు, పశ్చిమ కనుమల్లో మొలకెత్తుతున్న ప్రజా ఉద్యమాల చారిత్రక అన్వేషకుడు మల్నాడు అటవీప్రాంతంలో ప్రభుత్వ బలగాల చేతిలో చంపబడ్డాడు. ఒకే వ్యక్తిలో అపార మేధోతనం, కార్యాచరణ కలగలసివుండటం ఆశని రేకెత్తించింది. ప్రజల ఆకాంక్షల ప్రతిబింబంగా అది ప్రతిఫలించింది. కొన్ని ఆదర్శాలకు ఇది పనికిమాలిన పనిగా కనిపించింది. తనని తుదముట్టిస్తే నక్సల్ ఉద్యమం కనుమరుగై పోతుందని రాజ్యం భావించింది కానీ దాని ఆశ అడియాస అయింది. సాకేత్ కాల్చివేత తో పశ్చిమ కనుమల్లో నక్సల్స్ కార్యాచరణ అనుకూల పవనం వీచింది. బెంగుళూరు యూనివర్సిటీ లో, న్యూఢిల్లీ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ లో ఓ సీనియర్ గా సాకేత్ నాకు తెలుసు. ఆ తర్వాత ఎప్పుడో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు." అని తలుచుకున్నారు. కామ్రేడ్ సాకేత్ హత్య తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామిక వాతావరణంపై రాజ్యాంగ యంత్రం దాడిచేస్తున్నప్పుడు.... తాను ఏవిధంగా ఆనాడు ఆ పరిసరాలలో నిలబడి ఎలా పోరాటం చేయాల్సి వచ్చిందో, ఆనాడు ʹ సంఘ్ శక్తులు, పోలీసులు ʹ కలిసి తన పత్రిక నుంచి తన సోదరుడి చేతనే ఎలా గెంటివేయించారో గౌరీ ఈ వ్యాసంలో గుర్తుచేసుకున్నారు.

మరణంలో మెరిసిన ఓ ఉజ్వల నక్షత్రం...!
-----------------------------------

గౌరీ లంకేశ్.

గడిచిన గత రెండువారాలు నా జీవితంలో అత్యంత బాధాకరమైన కాలం. ఒక్కసారిగా ఈ రెండు వారాల సమయం హింసలోని అమలవుతున్న వివిధ పార్శ్వాలను నాకు చూపించింది. కుదించుకుపోతున్న ప్రజాస్వామిక వాతావరణం, మన కాలంలో మేధావులని మనం అనుకున్న వారు చేసిన మోసం, పోలీసుల మీద అదుపులేని ప్రభుత్వం... అన్నింటికీ మించి మనల్ని తీవ్రంగా గాయపర్చగల గృహ హింస. వ్యక్తిగతం అంతా రాజకీయమే అని స్త్రీ వాదం ప్రకటిస్తుంది. నా విషయంలో అది అక్షరాలా ( శారీరకంగా.. సాహిత్య పరంగా ) నిజమైంది.

ఇదంతా ఫిబ్రవరి 6 న పశ్చిమ కనుమల్లో జరిగిన ఇద్దరు నక్సలైట్ల హత్యతో మొదలైంది. వార్తల్లో వివరాలు తెలుస్తున్న కొద్దీ ఆ చంపివేయబడిన ఇద్దరిలో ఒకరు కర్నాటక రాష్ట్ర మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమ్ అని తెలిసింది. కానీ వాస్తవానికి ప్రేమ్ అంటే కామ్రేడ్ సాకేత్ రాజన్ అని తెలిశాక ప్రపంచమంతా దిగ్భ్రాంతికి గురయింది. మైసూర్ నుంచి ఢిల్లీ దాకా అన్ని కళాశాలల్లో రెండు దశాబ్దాల క్రితం తామందరికీ తెలిసిన, ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన సాకేత్ ని ప్రభుత్వం అత్యంత క్రూరంగా చంపేసిందని, సాకేత్ అపార మేధో సంపత్తి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. పోలీసులు అతని నెత్తురు అంటిన బహుమతి డబ్బుని తీసుకున్నా గానీ, అన్ని రంగాల ప్రజలు అతని మరణానికి నివాళులర్పించారు. అన్నింటికీ మించి అతను "సాకీ" పేరుతో రాసిన రెండు చరిత్ర గ్రంథాల్ని ప్రశంసిస్తూ అందరూ మాట్లాడారు. ఆ రెండు గ్రంథాలు " మేకింగ్ హిస్టరీ" కర్నాటక చరిత్రని మట్టిమీద నిలబడి రాసిన గ్రంథాలుగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు గుర్తించి తమ గుండెలకు హత్తుకున్నారు. ఆ గ్రంథాల నుంచి కొన్ని భాగాలను రాష్ట్రంలోని రెండు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యఅంశాలుగా చేర్చారు కూడా. ఆఖరికి కర్నాటక ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ కూడా " సాకేత్ లాంటి అద్భుత మేధావి మరణం తనను కలచివేసింది " అని ప్రకటించాడు.

కామ్రేడ్ సాకేత్ రాజన్ దాదాపు రెండు దశాబ్దాలపాటు అజ్ఞాతంలో వున్నారు. తన మరణం తర్వాత అతను మరింతగా కర్నాటక ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం లాగా ప్రకాశించడం మొదలుపెట్టాడు. ఒక మేధావిని, ఒక మంచి కార్యకర్తని జమిలీగా ఒక వ్యక్తి లోనే చూడగలగడం చాలా అరుదు. ప్రజల ఆశని కలగలిపి వేసింది. (వాళ్ళు అటువంటి ఒక ఉదాహరణ కోసం ఎక్కడో వెదికారు.) అంతటి అమూల్యమైన వ్యక్తిని పోలీసులు క్రూరంగా కాల్చి చంపేయడం వల్ల ఒక సానుభూతి కెరటం ఎగసిపడి సమాజంలో నక్సలైట్ల గురించి మళ్ళీ ఒక చర్చ మొదలైంది. సరిగ్గా అప్పుడు పోలీసులు వణకడం ప్రారంభించారు. ముందుముందు ఈ వ్యాసంలో ఒక నా వ్యక్తిగత అనుభవైక సంఘటన కూడా ఉంది. నాకు సాకేత్ బెంగుళూరు విశ్వవిద్యాలయంలో ఒక సీనియర్ గా తెలుసు. ఇంకా న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ లో కూడా తెలుసు. ఆ తర్వాత ఎప్పుడో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

తిరిగి రెండు దశాబ్దాల తర్వాత గత యేడాది జూన్ నెలలో తాను మళ్ళీ బయట ప్రపంచానికి తెలిశాడు. నక్సలైట్లు కర్నాటక రాష్ట్రంలో పెట్టిన తొలి పత్రికా సమావేశంలో అతడు ప్రత్యక్షమయ్యాడు. దట్టమైన అటవీప్రాంతంలో నిర్వహించిన ఆ పత్రికా సమావేశానికి వెళ్ళడానికి ఎంపికైన వెళ్ళమీద లెక్కింపదగిన విలేకరులలో నేనూ ఒకదాన్ని. అప్పుడే సుదీర్ఘ కాలం తర్వాత నేను తిరిగి సాకేత్ ని చూశాను. ఈసారి అతడి పేరు ప్రేమ్. ఆ పత్రికాసమావేశం అప్పటిదాకా పోలీసులు వ్యాప్తి చేసిన మిధ్యావాదాల్ని చెదరగొట్టేసింది. అందులో ఒకటి వారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడే కర్నాటకలోనే పుట్టి పెరిగిన వాళ్ళు. రెండవది వాళ్ళు గాలికి తిరుగుతున్న, దారితప్పిన ముఠాలు కాదు.పైపెచ్చు ఖుద్రేముఖ్ అభయారణ్యంలో నిర్వాసితులైపోతున్న ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న ఓ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు. చర్చలకు తాము సిద్ధమేనని అయితే ముందుగా అది ప్రభుత్వం నుంచి ముందుకు రావాలని, ఆదివాసులకు సంబంధించిన డిమాండ్లను ఆమోదించి అమలు పర్చాలని వారు కోరారు. ఈ పత్రికాసమావేశం తర్వాత ముఖ్యమంత్రి కూడా చాలా సానుకూల దృక్పథంతో స్పందించాడు. నక్సలైట్ల అంశం కేవలం శాంతిభద్రతల అంశం కాదని, అది సాంఘిక, ఆర్ధిక అంశమని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పౌరస్పందన వేదిక ( శాంతి గాగి నాగరిక వెదికే ) ఏర్పడింది. దీని లక్ష్యం శాంతి స్థాపన. మా ఉద్దేశం ప్రభుత్వానికి నక్సలైట్లకీ మధ్య ఒక శాంతియుత వాతావరణం ఏర్పరిస్తే ప్రజల యొక్క దీర్ఘకాల అవసరాలు తీర్చగలిగే విధంగా సమాజంలో పెద్దఎత్తున ఒక చర్చ జరిగేందుకు ఒక వేదిక ఏర్పడగలదని ఆశించాం. అప్పటికే ఆదివాసులు అభయారణ్యం స్థాపన పేరిట తమను నిరాశ్రయుల్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వారు తమ సహజ సాంప్రదాయ సాంస్కృతిక హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ మారుతూ వస్తోన్న ఏ ప్రభుత్వం కూడా వాళ్లగొడుని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చర్చలకు తొలి అడుగుగా నక్సలైట్లు తమ ఆయుధాలు దించాలన్న విజ్ఞప్తి తో పాటు, ప్రభుత్వం కాల్పుల్ని ఆపేయాలని, కూంబింగ్ ని నిలిపివేయాలని మేం డిమాండ్ చేశాం. 2003 నవంబర్ లో పోలీసులు ఇద్దరు మహిళా నక్సల్స్ ని చంపేశారని, ఈ చంపుడు ఇంకా కొనసాగుతుందని, మరింత మంది ప్రజల్ని, పోరాటకారుల్ని చంపివేస్తారని, అదే గనుక కొనసాగితే నక్సల్స్ వైపు నుండీ ప్రతిఘటన ఉంటుందని, దాంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని మేం ఆందోళన పడ్డాం. ఏ పరిణామాలు గురించి మేము భయపడుతూ వచ్చామో ఆ పరిణామాలు సాకేత్ హత్య తర్వాత నిజంగానే మొదలయ్యాయి.

సాకేత్, అతని సహచరుడు చంపివేయబడిన వెంటనే పౌరస్పందన వేదిక ముఖ్యమంత్రి ని కలిసి అదనపు డిమాండ్లని పెట్టింది. బూటకపు ఎదురుకాల్పులపై విచారణ జరిపించాలని, కూంబింగ్ లు ఆపేయించాలని, జాతీయ మానవ హక్కుల వేదిక మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెండోసారి శవ పంచనామా జరిపించాలని డిమాండ్ చేసాం.అలాగే సాకేత్, అతని సహచరుడి మృతదేహాల్ని ఎవరూ స్వాధీనం చేసుకోకపోతే గనుక వారి మృతదేహాల్ని మాకు అప్పగించాలని, మేం వారికి ఒక గౌరవప్రదమైన, హుందా అయిన వీడ్కోలుని ఇస్తామని చెప్పాం. ముఖ్యమంత్రి వారి దేహాల్ని మాకు అప్పగించడానికి ఒప్పుకున్నప్పటికీ పోలీసులు, ప్రభుత్వ అధికారులు న్యాయపరమైన అడ్డంకులను చూపించారు. మృతుల పిల్లలకు, సొంత కుటుంబ సభ్యులకు మాత్రమే దేహాల్ని అప్పగిస్తామని చెప్పారు. ఇక్కడ మరో చిక్కు వచ్చింది. సాకేత్ తో పాడు చనిపోయిన యువకుడు ఎవరైందీ సరైన వివరాలు తెలియలేదు. బళ్ళారికి చెందిన శివలింగు గా కొందరు అభిప్రాయపడ్డారు. వచ్చిచూసి తమ కుమారుడిని గుర్తించాల్సిందిగా అతని తల్లిదండ్రులకి కబురు వెళ్ళింది. ఈలోగా సాకేత్ తల్లిగారు కూడా తెరపైకి వచ్చారు.సాకేత్ యొక్క అవశేషాల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వారంటున్న మైసూర్ కి తీసుకురామని నేను ఆమెకి గట్టిగా హామీ ఇచ్చాక సాకేత్ దేహాన్ని మాకు అప్పగించమని ఆమె ప్రభుత్వానికి చెప్పారు. ఈలోగా సాకేత్ దేహాన్ని మాకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని అందుకు సంబంధించి అనుమతికి అవసరం అని చెప్పి పోలీసు అధికారులు ఆమె చేత మోసపూరితంగా ఓ కాగితం మీద చేవ్రాలు తీసుకున్నారు. కానీ ఆ కాగితం లో ప్రభుత్వమే సాకేత్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలి అని ఉంది. ఆ కాగితం పట్టుకొని కర్నాటక డీజీపీ ఎన్. ఎస్. బోర్కర్ మృతి చెందిన నక్సల్స్ కి పోలీసులే అంత్యక్రియలు చేస్తారని ప్రకటించాడు.

పోలీసులు తనని మోసం చేశారని సాకేత్ తల్లిగారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జరిగిన మోసాన్ని మీడియా కి చెప్పారు. తన కుమారుడి మృతదేహాన్ని పౌరస్పందన వేదిక వారికే అప్పగించాలని ముఖ్యమంత్రికి ఉత్తరాన్ని ఫాక్స్ లో పంపారు. అప్పటికి రెండోసారి పంచనామా కూడా పూర్తవడంతో మేం మృతదేహాలని తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఇంతలో పోలీసులు మృతదేహాల్ని గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లిపోయారనే వర్తమానం వచ్చింది. మార్చురీ దగ్గర పోలీసుల్ని ఆపడానికి ప్రయత్నించిన కార్యకర్తల్ని అమానవీయంగా కొట్టారు. పోలీసులు మృతదేహాల్ని విల్సన్ గార్డెన్ లోనో దహన వాటికకు తీసుకెళ్లినట్లు ఆ కార్యకర్తలు మాకు చెప్పారు. మేం మళ్లీ ముఖ్యమంత్రి కి విషయాన్ని చెబితే ఆయన డీజీపీ తో మాట్లాడాడు. మేం హుటాహుటిన దహన వాటికకి చేరుకున్నాం. కానీ అక్కడ మృతదేహాలు లేవు. నగరానికి రెండో చివరనున్న మరో శ్మశాన వాటిక కి పట్టుకెళ్లారనే సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్నాం. అప్పటికే పోలీసులు అంత్యక్రియలు చేసేసి వెళ్లిపోయారని తెలిసింది. ఈ నాటకీయత, హైడ్రామా చూస్తే.... ముఖ్యమంత్రికి తన పోలీసుల మీద అదుపులేదని అర్ధమవుతుంది. తిరిగి అతడు తనకు, పోలీస్ ఉన్నతాధికారికీ మధ్య సరైన సమాచార వ్యవస్థ లేదని చెప్పడం ఓ కుంటి సాకే నని మాకు అర్ధమైంది. ఈ దేశంలోనే సాంకేతిక నైపుణ్యానికి పెట్టింది పేరైన, సాంకేతికతకి రాజధానిగా చెప్పబడుతున్న బెంగుళూరు లోనే ఓ ముఖ్యమంత్రికి పోలీస్ అధికారికీ మధ్య సమాచార లోపం ఉందంటే ఏమనుకోవాలి ?

ఈ మధ్యలో సాకేత్ తో పాటు చంపివేయ బడినట్టు భావిస్తున్న శివలింగు తల్లిదండ్రుల్ని మాతో కలిసే వీలులేకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. చదువురాని, నిరుపేదలైన వాళ్ళని రాయచూరు లోని ఓ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఉంచారు. వాళ్ళెక్కడ అని మేం గట్టిగా నిలదీశాక వాళ్ళని బెంగుళూరు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా పోలీస్ కమీషనర్ ఆఫీస్ లోనే వాళ్ళని దాచివుంచి, మమ్మల్ని కలవనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళని మేం కలవొచ్చని ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నప్పటికీ వాళ్ళని మేం కలవడానికి వీలులేకుండా రహస్య ప్రదేశంలో దాచివుంచేశారు. ఈనాటికీ కూడా వాళ్ళెక్కడున్నారో ఎవరికీ తెలియదు. అలాగే సాకేత్ తో పాటు బూటకపు ఎన్ కౌంటర్ లో చనిపోయిందేవరో ఎవరికీ ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు కనుక.

నక్సల్స్ కీ ప్రభుత్వానికీ మధ్యన చర్చలకు ఒక శాంతియుత వాతావరణం ఏర్పర్చడానికీ, పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వారికి ఒక హుందాతనంతో కూడిన అంత్యక్రియలు నిర్వహించడానికి పౌరస్పందన వేదిక ప్రయత్నిచినందుకు గానూ... మేం నక్సల్స్ మద్దతుదారులమని, మా నెత్తురు కళ్ళజూడాలని సంఘ్ పరివార్ పెడబొబ్బలు పెట్టడం మొదలు పెట్టింది. హోంశాఖ కూడా మా మీద కేసులు పెట్టి త్వరలో అరెస్ట్ చేయనున్నట్టు మీడియాలో వార్తలు రావడం మొదలైంది. అది చాలదన్నట్టు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని పావగడ దగ్గరలో నక్సలైట్లు ఏడుగురు కర్నాటక రాష్ట్ర రిజర్వుడు పోలీసుల్ని చంపి జరిగిన దాష్టికాన్ని, జరుగుతున్న దాడి వాతావరణాన్ని ఆపారు. ఈ ప్రతిఘటన ఎలాంటి భయానక వాతావరణాన్ని సృష్టించిందంటే ప్రతీ ఒక్కళ్ళూ మమ్మల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసేవాళ్లే. మేం పూర్తిగా హతాశులమైపోయాం. వాస్తవానికి మేం నక్సలైట్ల సాయుధ పోరాటాన్ని ఏనాడూ ఆమోదించనూ లేదు - సమర్ధించనూ లేదు. అంతకన్నా ముఖ్యంగా మేం ఏదైతే ఈ సందర్భంలో చేశామో అదంతా చట్టబద్ద పరిధిలోనే, రాజ్యాంగానికి పూర్తిగా లోబడే చేశాం. అయినప్పటికీ పావగడ వద్ద జరిగిన పోలీసుల హత్యలపై మేమే ప్రధాన బాధ్యులమంటూ నిందలు మోపబడ్డాం.

పోలీసులు పన్నిన ఉచ్చులకి మా తమ్ముడు ప్రభావితం అయ్యాడు. ఆ ప్రచారాన్ని అతడు నమ్మాడు. సంఘ్ పరివార్ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. నన్ను " లంకేష్ పత్రికే" సంపాదకురాలి స్థానంలోంచి బయటకు పంపేలా చేసింది. ఈ పత్రికని మా తండ్రి గారు కీ. శే. పి. లంకేష్ " మాట్లాడలేనివాళ్లకోసం, అణగారిపోతున్న వర్గాలకోసం ... ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళకీ కొంత జాగా ఉండాలని" ప్రారంభించారు. 1980 లో పత్రిక ప్రారంభం అయినప్పటినుండీ స్వలాభాపేక్షకు దూరంగా , పాసిస్ట్ ధోరణులకు వ్యతిరేకంగా దీన్ని నడిపారు. ఐదేళ్ళక్రితం ఆయన మరణించినప్పటినుంచీ అణగారిన వర్గాలకు, నిర్వాసితులకు ఉండవాల్సిన ఆ మాత్రం అవకాశాలనైనా నిలిపివుంచాలని, నేటి ప్రజాస్వామ్య పరిధుల్లో ఆ యొక్క ఆవరణ మరింతగా కృశించి పోకూడదనే ఒకేఒక్క ఉద్దేశంతోనే ఆ పత్రికని మేం నడుపుతున్నాం. తద్వారా మా తండ్రి గారి ఆశయం, స్ఫూర్తి ని సజీవంగా నిలిపి ఉంచాలనుకున్నాం. ఈ కారణం చేతనే నేను ఈ పత్రిక సంపాదకత్వ బాధ్యతలు తీసుకుంటే, నా సోదరుడ్ని పత్రిక హక్కుదారునిగా, ప్రచురణ కర్తగా మా కుటుంబం నియమించింది.

కానీ ఈ రెండువారాలుగా పోలీసులు, సంఘ్ పరివార్ లు మామీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారంటే .. నేను సంపాదకురాలిగా రాసిన వ్యాసాలు నక్సల్స్ ని సమర్ధిస్తున్నాయనే మిషతో, వాటిని పత్రికలో ప్రచురించకూడదని నా సోదరుడు నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి నేనింకా నా వ్యాసం రాయనేలేదు. ఏదేమైనా గానీ ఈ ఆందోళన కలిగిస్తోన్న పరిస్థితిని వాడుకొని నా సోదరుడు నన్ను బయటకు గెంటేసి మొత్తంగా పత్రికని తన అదుపులోకి తీసుకోవాలనుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే నన్ను బలవంతంగా నిశ్శబ్దంలోకి నెట్టే ప్రయత్నం చేయడమే యిది.

దీన్ని నాకూ, నా కుటుంబానికీ మధ్య జరిగిన కుటుంబ వ్యవహారంగా పక్కన పడేయొచ్చు కానీ దానికన్నా " పావగడ ప్రతిఘటన హత్యల " ప్రభావమే ఈ విషయంలో ఎక్కువగా వుంది. వాటి పరిణామాలు మరింత తీవ్రంగానే ఉంటాయి. పదిరోజులుగా జరుగుతున్న దుమారం లాంటి ఈ వరుస సంఘటనల్ని చూస్తుంటే రాజ్యం తల్చుకుంటే ఓ ప్రజాస్వామ్య ఆవరణలోకి చొచ్చుకొచ్చి దాన్ని ఎలా కూలగొట్టేయగలదో రుజువు చేశాయి. ఈ భయం, చుట్టూ ఆవరించిన అనుమానాలు ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి. ఈ మాత్రం స్పందించినందుకే, గొంతెత్తినందుకే విశ్వవిద్యాలయ అధ్యాపకులు వారి అభిప్రాయాలు, కార్యాచరణ పేరిట వేధింపులకు గురయ్యారు. పదేపదే గుచ్చిగుచ్చి ప్రశ్నించబడ్డారు. వారి ఫోన్ లు నిఘాలోకి వెళ్లిపోయాయి. వారికోసం వచ్చిపోయే వారిని వెంటాడుతూ మఫ్టీ పోలీసులు నిరంతరం కాపలా కాస్తూనే వున్నారు.

ఇంతవరకూ భారత రాజ్యానికి సహనం - ప్రజాస్వామ్యం లాంటి విశాల దృక్పథం ఉందని అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ ప్రజాస్వామ్య ఆవరణ పరిధులు ఎంతగా కుదించుకుపోయాయో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే మనకు అది ఆచరణలో అర్ధమవుతుంది. అయితే ఇలాంటి సమయాల్లోనే - మన గొంతుల్ని మరింతగా విప్పాల్సివుంది. దృఢంగా నిలబడాల్సి ఉంది. ఎందుకంటే " ప్రజాస్వామ్యం " అనేది ఓట్లకన్నా, ఎన్నికల కన్నా కూడా చాలా ఎక్కువ విలువైనది. వేరేగా ధ్వనించే గొంతుల్ని తప్పకుండా అది తనతో ఇముడ్చుకోవాలి. ఎందుకంటే రాజ్యాన్ని ప్రశ్నించడం - ఆ వేరే గొంతుక యొక్క అతి ముఖ్య కర్తవ్యం కనుక. కాబట్టి మరింత బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం కోసం ఈ గొంతుక మరింతగా విచ్చుకుంటుందని మన ఆశ.

- మోహన సుందరం

ఫేస్‌బుక్ లింక్ : https://www.facebook.com/mohana.sundaram.3975012/posts/363882331184135

Keywords : Gouri Lankesh, War and Peace, State, Arrest, Death Anniversary, Tolstoy
(2020-09-17 21:44:04)No. of visitors : 743

Suggested Posts


0 results

Search Engine

పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
Delhi Police Violated Human Rights Standards, Domestic Laws During Delhi Riots: Amnesty International
ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌
కంగనా అమ్మగారికి ఒక లేఖ
more..


యుద్ధం