ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?


ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?

ఆర్టీసీ


ఆర్టీసీ ప్రజారవాణా సంస్థ. దీన్ని కాపాడాల్సిన బాధ్యత, ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వంతో పాటు ప్రజలది కూడా. పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు అనునిత్యం ఆర్టీసి కార్మికులు ప్రజా సేవలో నిమగ్నమై ఉంటారు. అలాగే ప్రజలు కూడా సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసి బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సంస్థకు స్వయం ప్రతిపత్తి అనేది లేదు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రజాసేవయే మా కర్తవ్యం అంటూ నిజాయితీగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ నేడు నష్టాల ఊబిలో కూరుకుపోతోంది.

నష్టాలకు కారణం కార్మికులే అంటూ ప్రభుత్వాలు కార్మికుల మీద నిందలు వేస్తుంటే, కార్మికులు మాత్రం మావల్ల నష్టం రావటం లేదు. ప్రభుత్వ విధానాలే దీనికి కారణం అంటున్నారు. విద్యార్థులు, వికలాంగులు, స్వాతంత్ర్య సమర యోధులు లాంటి మరెంతో మందికి రాయితీలు ప్రభుత్వ విధానాల మేరకు ఆర్టీసి ఇవ్వడం జరుగుతోంది. బస్ పాస్ ల‌పై ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీ సొమ్ము సాలీనా సుమారు 600 కోట్ల రూపాయలు. దీనిలో ఏ సంవత్సరం కూడా రాయితీలు ఆర్టీసికి పూర్తిగా చెల్లించిన దాఖలాలు లేవు. అలాగే 2014 నుండి 2019 వరకు. ఆర్టీసి సుమారు 2700 కోట్ల రూపాయల రాయితీలు క్లెయిమ్ చేస్తే ప్రభుత్వం ఇచ్చింది మాత్రం కేవలం 710 కోట్ల రూపాయలు మాత్రమే.

అంటే ప్రభుత్వం నుండి ఆర్టీసికి రావలసిన సొమ్ము దాదాపు 2 వేల కోట్ల రూపాయలు, ఈ సొమ్ము ఆర్టీసికి చెల్లిస్తే సగం నష్టాలు తగ్గిపోతాయి. కానీ ప్రభుత్వం ఆ సొమ్ము చెల్లించకపోగా నష్టాలకు కారణం ఆర్టీసి కార్మికులే, ఈ సంస్థకు ఎంత ఇచ్చినా బాగుపడదు అని నిందలు వేయడం సమంజసం కాదు.

ట్యాక్సుల రూపంలో ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టీసిపై విపరీతమైన పన్నుల భారాన్ని పెట్టి ఆర్టీస్ నుండి వసూలు చేసుకుంటోంది. ప్రభుత్వం. డీజిల్ పై వార్షిక పన్ను రూపంలో 600 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసి నుండి పిండుకుంటోంది. అలాగే మోటారు వాహనాల పన్ను రూపంలో సుమారు 230 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్టీసి నుండి ప్రభుత్వం వసూలు చేస్తోంది. జిఎస్టి రూపంలో దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకుంటోంది. అలాగే జాతీయ రహదారులపై నిర్మించబడ్డ టోల్ ప్లాజాల్లో సాలీనా సుమారు 60 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది.

అంటే తెలంగాణ ప్రభుత్వం సాలీనా సుమారు 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీ నుండి వసూలు చేస్తోంది. 2014 నుండి 2019 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో 5 వేల కోట్ల రూపాయలు ఆర్టీసి ప్రభుత్వానికి చెల్లిస్తే, ప్రభుత్వం మాత్రం కేవలం 710 కోట్ల రూపాయలు మాత్రం ఆర్టీసికి ఇచ్చి చేతులు దులుపుకుంది. అసలే నష్టాలతో నట్టి విరిగిపోతున్న ఆర్టీసి నుండి ఈ 5 ఏళ్ళ కాలంలో సుమారు 5 వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ప్రభుత్వం దండుకోవడం ఎంతవరకు సమంజసం?

అందుకే ఆర్టీసి సజావుగా నడవాలంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ మనుగడకు అన్ని రకాల పన్నులమీద మినహాయింపు ఇవ్వాలి, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 1 లీటర్ డీజిల్ ధర 54 రూపాయలు. 5 సంవత్సరాలు గడిచిన తరువాత అంటే 2019లో లీటర్ డీజిల్ ధర 77 రూపాయలు. అంటే 1 లీటర్ డీజిల్ కి 23 రూపాయలు రేటు పెరగడం వల్ల ఆర్టీసిపై సుమారు 6 వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడింది.

కార్మికులు ఎంత కష్టపడి బాధ్యతగా విధి నిర్వహణ చేసినా డీజిల్ పై పడుతున్న భారం ఆర్టీసికి గుదిబండగా తయారవుతోంది. అందుకే డీజిల్ పై పెరుగుతున్న భారాలను ప్రభుత్వమే భరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇతర రాష్ట్రాలలో డీజిల్ మీద పెరుగుతున్న భారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలే భరించటం వల్ల అక్కడున్న ఆర్టీసిలు కొంతమేరకు నష్టాన్ని తగ్గించుకోగలుగుతున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో డీజిల్ మీద సెస్ పెంచటం వల్ల దాదాపు 60 కోట్ల రూపాయలు ఆర్టీసిపై భారం పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న ఈ భారాలు గమనించకుండా కార్మికులే నష్టాలకు కారణం అని నిందించడం ఎంతవరకు సమంజసం?

గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా సౌకర్యం కోసం తిరుగుతున్న పల్లెవెలుగు బస్సులపై వస్తున్న నష్టాలను ప్రభుత్వమే భరించాలి. దాంతో పాటు సిటీ బస్సులపై వస్తున్న నష్టాలను జీహెచ్ఎంసి నుండి వసూలు చేసి ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసింది, కానీ డబ్బులు మాత్రం రాలేదు. ఆర్టీసికి 50 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 3 వేల కోట్ల రూపాయల నష్టం ఆర్టీసికి పెద్ద కష్టమేం కాదు.

ఈ నష్టాలు కూడా ప్రభుత్వం పెట్టిన సరే తప్పు, పుట్టిన నష్టాలు కావు. 2011లో జరిగిన సకల జనుల సమ్మె కాలంలో ఆర్టీసి ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిపోలకు తాళాలు వేసి అంకితభావంతో ఉద్యమాన్ని ముందుండి నడిపిన సంగతి ఈ ప్రభుత్వం అప్పుడే మర్చిపోయినట్లుంది. ఉద్యమ సమయంలో ఆర్టీసిని ఆదుకుంటామని, అక్రమ రవాణాను అరికడతామని బాసలు చేసిన ఉద్యమ నాయకులు నేడు ఆర్టీసిని బలిపీఠంపై ఎక్కించడం అత్యంత శోచనీయం.

ప్రైవేటు వాహనదారులు కాంట్రాక్ట్ క్యారేజెస్గా పర్మిట్ ఉన్న తమ వాహనాలను స్టేజి క్యారేజీలుగా తిప్పుతూ ప్రజాధనాన్ని దోచుకోవడం ప్రభుత్వానికి తెలియదా? ప్రైవేటు వాహనాలు ఈ విధంగా ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేయటం వల్ల ఆర్టీసికి సాలీనా వెయ్యి కోట్ల రూపాయలు నష్టం కలుగుతోంది. అటు ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ కాని, ఇటు పోలీస్ డిపార్ట్ మెంట్ ని వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ రవాణా ఇబ్బ‌డి ముబ్బడిగా పెరిగిపోయి ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసి ఉనికికే ప్రమాదం తెచ్చి పెడుతోంది.

నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అక్రమ రవాణాను ఎందుకు అరికట్టదు? ఆర్టీసికి ఉన్న 3 వేల కోట్ల రూపాయల నష్టాలలో ప్రభుత్వం ఇవ్వవలసిన 2 వేల కోట్ల రూపాయలు, ప్రైవేటు అక్రమ రవాణాను ఆపటం వల్ల వెయ్యికోట్ల రూపాయలు ఆర్టీసికి వస్తే సంస్థ నష్టాల్లో ఎందుకు ఉంటుంది? అలాగే ప్రభుత్వం ఆర్టీసికి అన్ని రకాలు ట్యాక్సులు మినహాయిస్తే సాలీనా వెయ్యి కోట్ల రూపాయల లాభాల్లో ఉంటుంది.

ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ లేకపోతే ప్రతి తల్లితండ్రులు వారి పిల్లలకు నెలకు సుమారు వెయ్యి రూపాయల చొప్పున ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రైవేటు బస్సులు ఏవీ కూడా విద్యార్థులతో పాటు ఇతరులను ఉచిత ప్రయాణానికి అనుమతించకపోగా ఎలాంటి రాయితీలు ఉండవు అని ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఆర్టీసి ఉండడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించటంతో పాటు సామాజిక రిజర్వేషన్లు కూడా అమలు చేయబడతాయని ప్రజలు గుర్తించాలి.

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిగించటానికి కాలం చెల్లిన బస్సులు తీసివేసి కొత్తబస్సులు కొనుగోలు చేయాలనీ, కొత్తబస్సుల కొనుగోలుకు సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వమే సామాజిక బాధ్యతగా భరించాలనీ జెఎసి డిమాండ్ చేస్తోంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ రంగ రవాణా సంస్థలు కూడా ప్రభుత్వ సహకారం లేకుండా లాభాలలో ఉండవు.

విద్య, వైద్యం లాంటి శాఖలు లాభాలు గడిస్తున్నాయా? ఆర్టీసి కూడా లాభాపేక్షతో పనిచేస్తున్న సంస్థ కాదు. కేవలం సేవాభావంతో నడుస్తున్న సంస్థను ప్రభుత్వం లాభనష్టాల బేరీజు వేసి చూడటం సమజసం కాదు. దాదాపు ఈ అయిదు సంవత్సరాల కాలంలో ఆర్టీసిలో ఎటువంటి రిక్రూటిమెంట్ జరగలేదు.

2014 నుండి 2019 వరకు ఈ 5 సంవత్సరాలలో సుమారు 6 వేల మంది రిటైర్ అయినా ప్రజలపై ఎటువంటి భారం మోపకుండా, ఉత్పత్తి ఏమాత్రం తగ్గకుండా ఆర్టీసి కార్మికులు అంకిత భావంతో పనిచేస్తున్నారు. టీఎస్ఆర్టీసి ప్రతి ఏటా ఎన్నో అవార్డులు తీసుకుంటున్న సంగతి మీకు తెలుసు. ప్రజల నుండి కూడా పూర్తి సహకారం అందితే ఈ సంస్థకు బంగారు బాటలు ఏర్పడతాయి.

ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది జెఎసి ప్రధాన డిమాండ్. కాని ప్రభుత్వ వర్గాలు విలీనం సాధ్యం కాదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. కాని పక్క రాష్ట్రంలోని ఎపిఎస్ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటున్నట్లుగా అక్కడి ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. అక్కడ సాధ్యమయింది. ఇక్కడ ఎందుకు కాదు?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. విజయాబ్యాంక్, దేనా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి. ఇలా అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ఒకదానిలో ఒకటి విలీనమయ్యాయి. అన్ని రంగాలలో విలీనం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఆర్టీసిని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికవర్గం కోరుకుంటోంది.

డ్రైవర్, కండక్టర్లు నిత్యం ప్రజల మధ్యలో తిరుగాడుతూ తమ విధి నిర్వహణను చేస్తూ ఉద్యోగ భద్రత లేదని అనేక సందర్భాల్లో వాపోతున్నారు. వారు చేయని తప్పులకు కూడా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే డ్రైవర్, కండక్టర్లకు పూర్తి ఉద్యోగ భద్రత కల్పించటం వల్ల ఆర్టీసిలో పనిచేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులకు న్యాయం జరిగినట్లుగా ఉంటుందని తెలియజేస్తున్నాం. 2017లో జరగాల్సిన ఆర్టీసి కార్మికుల వేతన సవరణ 30 నెలలు గడిచిపోతున్నా ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈ సమస్యను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఎన్నిసార్లు వినతులిచ్చినా, ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినా ఎటువంటి స్పందనా లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని తెలిసినా సంస్థను కాపాడుకోవడం కోసం వేరే మార్గం లేదు. కాబట్టి రోజువారీ ప్రయాణాలలో రాబోతున్న ఇబ్బందులకు ఆర్టీసి కార్మికులను నిందించకుండా ఆర్టీసి పది కాలాల పాటు ఉండేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని వేడుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో ఆర్టీసిని కాపాడుకుంటామనే నమ్మకం మాకు ఉంది.

ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం - ఆర్టీసి పరిరక్షణ - ఉద్యోగ భద్రత - కార్మిక హక్కుల సంరక్షణ - జీతభత్యాల సవరణ జెఎసి ధ్యేయం కార్మికుల ఐక్యత వర్తిల్లాలి - ఐక్య పోరాటాలు జిందాబాద్

తెలంగాణ మజ్జూర్ యూనియన్ - ఎంప్లాయీస్ యూనియన్

స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ - సూపర్వైజర్స్ అసోసియేషన్
హైదరాబాద్

ఆర్టీసీ సమస్యలకు, ఆర్టీసీ నష్టాలకు కారణమెవరో... తమ సమ్మె ఎందుకు న్యాయమైనదో వివరిస్తూ తెలంగాణ మజ్జూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్, సూపర్వైజర్స్ అసోసియేషన్ లతో కూడి జాయింట్ యాక్షన్ కమిటీ విడుదల చేసిన కరపత్రం పూర్తి పాఠం


Keywords : telangana, RTC Strike, unions, trs, kcr
(2019-10-13 16:40:52)No. of visitors : 262

Suggested Posts


ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ

ఆర్టీసి కార్మికులంతా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించకుండా విరోచితంగా పోరాడండి. పోరాడితేనే మన సమస్యలకు అంతిమ పరిష్కారాలుంటాయి. లేదంటే వున్న ఉద్యోగాలు పోయి బజారున పడుతారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధం కండి. కార్మికుల న్యాయమైన డిమాండకు అన్ని సెక్షన్ల ప్రజలంతా తమ సంపూర్ణ మద్దతును అందించండి. వారితో భుజం కలిపి పోరాడండి.

ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ

ఉచితాలు, రాయితీలు, పింఛన్లు కాకుండా న్యాయమైన హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతున్నారు. సంస్థను ప్రైవేటీకరించాలనే కుట్రను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజల పోరాటం. ప్రజా అవసరాలు తీర్చే పోరాటం. ఈ పోరాటానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధి జీవులు పూర్తిగా సంఘీభావం ప్రకటించాలి. ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని బతికించు కోవలసిన అవసరం ప్ర

Search Engine

మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
ఐదు దశాబ్దాల వసంతగానం
మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్
కశ్మీర్ లో దుర్మార్గం పై మహిళల నివేదిక
ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు !
పార్టీ స్వర్ణోత్సవాలను పల్లెపల్లెనా జరుపుకుందాం - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు
more..


ఆర్టీసీ