భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్వాతంత్ర సమరయోధులు, పేరు ప్రఖ్యాతులు పొందిన వారి చరిత్రను తీసి ప్రస్తుత తరానికి చూపించాలని తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్ల సినిమాలు కూడా తీస్తున్నారు. చాలా మంచిదే.. కాని చరిత్రను వక్రీకరించి.. సినిమాటిక్ లిబర్టీ పేరుతో, కమర్షియల్ హంగుల కోసం ఏవేవో అబద్దాలు కూడా చొప్పిస్తే ఇప్పటి తరం అవే నిజాలనుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ʹజార్జిరెడ్డిʹ అనే సినిమాను మైక్ మువీస్ వాళ్లు తీస్తున్నారు. దీంట్లో ఎన్నో అసంబద్ద సన్నివేశాలు, అబద్దాలు చొప్పించారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ʹఎస్ఏ డేవిడ్ʹ ఒక ఫేస్‌బుక్ పోస్టు పెట్టారు. అది యధాతథంగా....
ఓయూ విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి జీవిత కథ ఆధారంగా వస్తున్న సినిమా ʹజార్జిరెడ్డిʹ మీద నేను సుతిమెత్తని విమర్శలతో కూడిన వరుస పోస్టులు పెడుతున్నప్పుడు కొంతమంది మిత్రుల నుండి అభ్యంతరం వస్తోంది...☺
సినిమాలో హీరోయిన్ అతని కోసం పాట పాడి,డ్యాన్స్ చేస్తే తప్పేముంది, స్కూటర్ కు బదులు రాయల్ ఎన్ ఫీల్డ్ నడిపినట్లు చూపిస్తే పెద్దగా నష్టమేముంది ఇదేమీ పెద్ద తప్పు కాదుగా, పైగా ఇలా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా సినిమాలు తీయడం సాధ్యమవుతుందా, ఒక వేళ అలా తీస్తే సినిమా హిట్ అవుతుందా అంటూ ప్రశ్నలు, కామెంట్స్ సందిస్తున్నారు.
కథలో విషయం ఉంటే ప్రేక్షకులు ఎలా అయినా చూస్తారు అనేది నా సమాధానం అయితే, అసలు ప్రేక్షకులు పాటలు ఉంటేనే సినిమా చూస్తారా అనేది నా ప్రశ్న.
ఎన్నో హాలీవుడ్ సినిమాలు ఎలాంటి పాటలు లేకుండా ఈ దేశంలో విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందుతుంటే ఇంకా ఆరు పాటలు, నాలుగు ఫైట్స్ అనే మూసలోనే సినిమాలు తీస్తూ ఇలా తీస్తేనే చూస్తారు అనే అపవాదు ప్రేక్షకులపై వేస్తే ఎలా..? అయినా మన పక్కనే ఉన్న తమిళ, మలయాళ సినిమాలు ఎలాంటి పాటలు లేకుండా, కొన్ని సినిమాల్లో అయితే అసలు హీరోయిన్ కూడా లేకుండా సినిమాలు తీస్తుంటే మన తెలుగు దర్శకులు మాత్రం వాస్తవ కథలకు కూడా కల్పిత పాత్రలు జోడించి ఏటో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే కాల్పనిక పాత్రలకు ఆ సినిమా దర్శకులు ఎన్ని కల్పిత పాత్రలు జోడించి ఎలా తీసిన అభ్యంతరం ఉండదు కానీ కొంతమంది యువకులకు, కొన్ని సమూహాలు లేదా కొన్ని ఉద్యమ సంస్థలకు రోల్ మాడల్ గా ఉన్న వ్యక్తి కి సంబందం లేనివాటిని అపాదిస్తేనే అభ్యంతరం వస్తుంది.
ఇక రెండో విషయం మార్కెట్ కోసం, లేదా అందరికీ చేరువయ్యేందుకు ఏదైనా తీసేయొచ్చా అనేది కూడా ఆలోచించాలి.. ఇది ఓ సందర్భం కాబట్టి ఈ మధ్య నా దృష్టికి వచ్చిన ఓ విషయాన్ని గుర్తుచేస్తాను.
భగత్ సింగ్, బ్రిటన్ అధికారి అయినా సాండర్స్ను చంపడానికి ఉపయోగించిన తుపాకీ ఏమైంది, ఎక్కడుంది అని డిస్కవరీ చేసి కనుక్కున్న పాత్రికేయుడు, పరిశోధకుడు అయిన ʹజుపిందర్ జిత్ సింగ్ʹ తాను సాగించిన అన్వేషణ క్రమాన్ని ʹDiscovery of Bhagat Singhʹs Pistol and his Ahimsaʹ అనే అనే శీర్షికతో పుస్తకంగా తీసుకువచ్చాడు. పియూష్ పబ్లిషర్స్ అండ్ డిస్రిబ్బ్యూటర్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
అయితే ఆరెస్సెస్, హిందూమహాసభలతో భగత్ సింగ్ కు ఏదో ఒక విధంగా ఒక అనుబంధాన్ని ʹసృష్టిస్తేʹ పుస్తకం లక్ష కాపీలు అమ్ముడు అవుతాయని పబ్లిషర్ సూచించాడట. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు అంటాడు ʹజుపిందర్ జిత్ సింగ్ʹ
భగత్ సింగ్ కు, ఆరెస్సెస్ కార్యకలాపాలతో లేదా సావర్కర్ తదితరులు ఎవ్వరితో అస్సలు సంబంధం లేనప్పుడు ʹ ఎలా కల్పించి రాస్తాను అంటాడు ఆయన. అలా అని జుపిందర్ జిత్ సింగ్ కమ్యూనిస్టు కార్యకర్తనో కనీసం నాస్తికుడో కూడా కాదు. ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్ట్ మాత్రమే..ఇది ఒక రచయితగా, పాత్రికేయునిగా ఆయనకు ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం అది.
తన పుస్తకం అమ్ముడుపోవాలనో, ఎక్కువమందికి చేరాలనో అనే దుర్బుద్ధి అతనికి ఉంటే పబ్లిషర్ కోరినట్లు కల్పించి రాసేవాడెనేమో కానీ ఇక్కడే అతని చిత్తశుద్ది, భగత్ సింగ్ నమ్మిన విలువల పట్ల కమిట్ మేంట్తో ఉన్నది ఉన్నట్లుగా రాసే ప్రయత్నం చేశాడు ఆయన. అందుకే ఆ పుస్తకం అందరి ప్రశంసలు.. మన్ననలు పొందింది.
ఇలాంటి చిత్తశుద్ది అందరికీ, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు ఉండాలి లేదంటే అబాసుపాలు కాక తప్పదు.
ఇక ఇంకో విషయం జార్జిరెడ్డి, చే గువేరా ను ఎక్కువగా అభిమానించేవాడని, అతనిలా ఆలోచనలో, వ్యూహాత్మక విధానంలో, ఆహార్యం లో ఉండేందుకు ప్రయత్నించేవాడని విన్నాం, చదువుకున్నాం. అయితే చే గువేరాను మరణాంతరం సామ్రాజ్యవాద దేశాలు అతని ప్రతిమలని, చిహ్నాలని మార్కెట్ సరుకుగా మార్చేందుకు కూడా ప్రయత్నించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటర్వ్యూలో చే గువేరా కూతురు ʹఅలైదా గువేరాʹను ఓ విలేకరి ʹచే ఇప్పుడు టి-షర్ట్‌ల మీద కనిపించే ప్రతిమ అయిపోయారు. ఈ పరిస్థితి ఇట్లా అయిందని మీరు విచారిస్తున్నారాʹ అని ప్రశ్నిస్తే ఆమె ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా..?
"క్యాపిటలిస్టు సమాజంలో మార్కెట్ పెంచుకోవడానికి అమలు పరిచే వ్యూహం ఇది. అయితే ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంటే మేం తప్పకుండా దానిని ఎదుర్కొంటాం. ఉదాహరణకు బీర్ బాటిల్లపైనో, సిగరెట్ పెట్టలపైనో ఆయన బొమ్మ వేస్తే మేం సరేమిరా అంగీకరించం. ఆయన బొమ్మను విచ్చల విడిగా, ఆనాలోచితంగా ఉపయోగించుకుంటే మేం అంగీకరించం. అయితే ఆయన ప్రతిమను పెట్టుబడిదారి మార్కెటింగ్ వ్యూహాలతో వ్యాపారపరం చేయాలనుకుంటే, అది బెడిసికొట్టింది. అది తిరుగుబాటు తత్వంతో ఉన్న యువతను ఒకే జెండా కింద ఐక్యం చేయడానికి తోడ్పడింది" అని
జార్జిరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా రేపు సినిమాలో కానీ ఇంకెక్కడైనా జరిగినా తీవ్ర వ్యతిరేకను మూతకట్టుకోవాల్సి వస్తుంది.
ఆ పరిస్థితి రాదు/ రాకూడదు అని ఆశిస్తు All the Best to entire team...💐💐
- SA David, Research Scholar, Osmania University
Keywords : Cinema, George Reddy, Bhagat Singh, Pistol
(2023-09-28 02:35:05)
No. of visitors : 3300
Suggested Posts
0 results