పలాస 1978 – కరుణకు అభినందన బిగికౌగిలి

ఇప్పుడు చర్చంతా పలాస 1978 సినిమా గురించే. ఇంత వరకు తెలుగు తెరపై రాని అరుదైన సబ్జెట్‌తో ఈ సినిమా వచ్చింది. కాగా ఈ సినిమాపై వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆ ఫేస్‌బుక్ పోస్ట్ యధాతథం..
---------------------------------------------------------------------------------------------

ఇది నన్ను లోలోపలినుంచి కదిలించిన, కంట తడి పెట్టించిన, సామాజిక దుర్మార్గం గురించి అవగాహనను అద్భుతమైన కళా రూపంలో చెప్పిన, చూపిన ఒక సినిమా గురించి.

ముందే చెపుతున్నాను. సినిమా కళ గురించి నాకేమీ తెలియదు. ఒక కళారూపంగా సినిమా అత్యంత ప్రభావశీలమైనదని, అది అత్యద్భుతమైన సృజన అని, అది సకల కళారూపాల సమాహారమని చాల గౌరవం. కానీ ఎందువల్లనో సినిమా నా జీవితంలో పెద్దగా లేదు. వరంగల్, బెజవాడ, హైదరాబాద్ ఫిలిమ్ సొసైటీల్లోనూ, థియేటర్లలోనూ, టీవీలోనూ, లాప్ టాప్ మీదా సినిమాలు చూసి తబ్బిబ్బయిన సందర్భాలు, వాటిమీద రాసిన సందర్భాలు ఉన్నాయి గాని అయినా సినిమా గురించి నాకు తెలియదనే చెప్పాలి. అతి తక్కువ తెలుసనే చెప్పాలి.

అటువంటి సినిమా పామరుడినైన నన్ను కరుణ, బీభత్స, ఆశ్చర్య, అద్భుత, వీర రసాలలో ముంచెత్తి, హృదయాన్నీ మేధనూ కన్నీటి పదనులోనూ, కత్తి వాదర మీది నెత్తుటి పదనులోనూ కరగదీసి, సినిమా ముగిసి బైట అడుగు పెట్టేటప్పటికి మాట రాని స్థితి కలిపించిన ఆ సినిమా పలాస 1978.

ఆ సినిమా దర్శకుడు కరుణ కుమార్ తన కథల ద్వారా నా అభిమాన రచయిత. కూడలి కథా ఉత్సవంలో స్నేహితుడయ్యాడు. ఆ తర్వాతి ఆర్మూరు కథా ఉత్సవానికి వెళ్తున్నప్పుడు కలిసి చేసిన ప్రయాణంలో తన జీవిత కథ విని, తన స్నేహశీలత, సంభాషణా చతురత చూసి ముగ్ధుడినై కరుణను తమ్ముడిగా స్వీకరించాను. తమ్ముడు కరుణ మొన్న జనవరి 31న ఆ సినిమా ప్రివ్యూకు రమ్మని పిలిస్తే తన మీద ప్రేమతో వెళ్లాను.

పలాస 1978 అనేక కారణాల వల్ల ఇవాళ తెలుగు సమాజానికి చాల అవసరమైన సినిమా. స్థూలంగా దాని ఇతివృత్తం కుల వివక్ష కావచ్చు, ఒక కళాకారుడు కాళ్లగజ్జెలు వదిలి కత్తులు పట్టుకుని, వందలాది మందిని ఆకట్టుకునే శ్రావ్యమైన కంఠాన్ని వదిలి డజన్ల కొద్దీ కంఠాల్ని అవలీలగా నరకగల కత్తివీరుడిగా మారిన పరిణామక్రమం కావచ్చు. 1960లలో, 70లలో తెలుగు సమాజంలో చిన్న పట్టణాలలోనూ నగరాల శివార్లలోనూ తలెత్తిన రౌడీయిజం, దాన్ని పెంచి పోషించిన, దానివల్ల ప్రయోజనం పొందిన వర్గాల కథ అనే సామాజిక చరిత్ర శకలం కావచ్చు. లేక ఈ మూడు ప్రధాన ఇతివృత్తాలూ ఒకదానిలో ఒకటి అవిభాజ్యంగా కలిసిపోయి ఒకే ఇతివృత్తంగా మారి ఉండవచ్చు.

ఈ ప్రధాన ఇతివృత్తం లోపల ఎన్నో ఉప ఇతివృత్తాలున్నాయి. అన్నదమ్ముల మధ్య వైరమూ ప్రేమా, కులాల మధ్య అంతరం, చిన్న నాటి నుంచి చివరి వరకూ ప్రత్యక్షం గానూ పరోక్షం గానూ సాగే కుల వివక్ష, కులపరమైన అవమానాలు, ఆధిపత్య వర్గాల కుట్రలు, ప్రతీకార వాంఛ, డబ్బు పాత్ర, రాజకీయ పరిణామాలు, ఆధిపత్య వర్గానికీ అధికార యంత్రాంగానికీ మధ్య సంబంధాలు, సంస్కరణవాదపు పరిమితులు, వైఫల్యం, జీడిపిక్కల పరిశ్రమ, ఉత్తరాంధ్రకే ప్రత్యేకమైన సాంస్కృతిక జీవనం, ఉద్యమం పట్ల అవగాహన లేకుండా ఏదో పగతో అన్నల్లో కలిసిపోయిన వ్యక్తులు తిరిగి వెనక్కి వచ్చి ఎటువంటి సంఘ వ్యతిరేక శక్తులుగా మారుతారో వంటి అనేక సబ్ టెక్స్టులు ప్రధాన టెక్స్టులో ఇమిడి పోయాయి. టెక్స్ట్ మీద దృష్టి పెట్టే సృజనకారులు చాలామంది ఈ సబ్ టెక్స్టులను సాధారణంగా అవసరమైనంత శ్రద్ధతో పట్టించుకోరు. అందువల్ల సమన్వయం కొరవడి అవకతవకలు మిగులుతాయి. పలాస సినిమా గొప్పదనం ఏమంటే అందులో టెక్స్ట్ విషయంలో ఎంత జాగ్రత్త కనబడుతుందో ప్రతి ఒక్క సబ్ టెక్స్ట్ లోనూ అంతే శ్రద్ధ కనబడుతుంది. కనుక సినిమా మొత్తంగా ఒక సమగ్రతనూ, విశ్వసనీయతనూ, ప్రభావశీలతనూ సంతరించుకుంది.

ఉత్తరాంధ్ర, అందులోనూ ప్రత్యేకంగా ఉద్దానం ప్రాంతపు, పలాస ప్రాంతపు భాషా సౌందర్యం ఈ సినిమా విశ్వసనీయతను మరింత పెంచి సినిమాను ఆకట్టుకునేలా చేసిన అదనపు సొగసు.

పియ్యి ఎత్తే మనుషులు, డప్పు కొట్టే మనుషులు, ఊరికి అవతల ఉంచబడే మనుషులు, తోటి మనుషులకు దూరంగా ఉంచబడే మనుషులు, కుక్కలతో పోల్చబడే మనుషులు, అద్భుతమైన కళాకారులై కూడ ఆ కళకు కూడ దూరం చేయబడే మనుషులు, జాతితక్కువ మనుషులుగా గుర్తించబడే మనుషులు లేచి నిలిస్తే నిజంగా ఏమి సాధించగలరో పలాస చూపుతుంది.

ప్రధాన పాత్ర మోహనరావు సాహిత్య విమర్శలో ఒక సూత్రమైన పాత్రోన్మీలనానికి అద్భుతమైన ఉదాహరణ. అవమానపడిన బాల కళాకారుడిగా మొదలై, ప్రేమ కోసం ఎంతకైనా తెగించగల యువకుడిగా, స్త్రీ మీద అవమానాన్ని సహించక తిరగబడి, కత్తివీరుడిగా అరివీర భయంకరుడిగా మారి, అనేక మందిని అవలీలగా తెగనరికి చిట్టచివరికి ఆధిపత్యాన్నీ కులాన్నీ అధిగమించి మనుషులం కాలేమా అని, ఏకలవ్యులనూ శంభూకులనూ కారంచేడులనూ చుండూరులనూ రోహిత్ వేములలనూ ప్రణయ్ లనూ ఆపలేమా అని ప్రశ్నించే దాకా ఆ నాయక పాత్ర పాత్రోన్మీలనం ప్రేక్షకుల అవగాహనలను ఆ విధంగానే ఉన్మీలనం చేయగలిగితే కరుణ ప్రయత్నం ఫలించినట్టే. ఆ అవగాహనలను మార్చడానికి జరుగుతున్న అనేక ప్రయత్నాలలో కరుణది అద్భుతమైన, ఎన్నదగిన ప్రయత్నం.

ఒక గొప్ప కరుణ-వీర-అద్భుత రసాత్మక దృశ్య కావ్యం అందించిన తమ్ముడు కరుణకు గాఢమైన అభినందన పూర్వక బిగి కౌగిలి.

- ఎన్. వేణుగోపాల్, ఎడిటర్, వీక్షణం.

ఫేస్‌బుక్ పోస్ట్ : https://www.facebook.com/story.php?story_fbid=10156711678631700&id=539051699

Keywords : Palasa 1978, Tollywood, Movie, North Andhra, Review, Karuna Kumar
(2024-10-10 05:43:47)



No. of visitors : 3046

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పలాస