మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న


మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న

మొదటితరం

దశాబ్ద కాలంగా అమరుల బంధుమిత్రుల సంఘంలో క్రియాశీలకంగా, బాధ్యునిగా ఉంటూ ఈతరం వారికి అమరుల బంధుమిత్రుల సంఘం నేతగా సుపరిచితుడైనవాడు నర్సన్న. తుదిశ్వాస వరకూ నమ్మిన విలువల కోసం పోరాడుతూ ఆ విప్లవ కమ్యూనిస్టు సాంస్కృతిక విలువల ప్రతినిధిగా నిలిచినవాడు నర్సన్న. ఎనభైయవ దశకం వారికి ముఖ్యంగా విద్యార్థి ఉద్యమ ప్రభావంలో ఉన్న వారందరికీ రైతుకూలీ సంఘం నర్సన్నగా ఆదర్శప్రాయుడు. ఆ కాలంలో విస్తృతంగా జరిగే ప్రతి సభ, సమావేశంలోనూ ముందువరుసలో నిలిచి హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల రైతుకూలీ సంఘం నేతగా పాల్గొని ప్రసంగించేవాడు. తన సాదాసీదా మాటలతో సమాజంలో జరుగుతున్న వివక్ష, అణిచివేతలను గురించి విప్పి చెప్పే తీరు అందరినీ ఆకట్టుకునేది, ఆలోచింపజేసేది. ఎల్లప్పుడూ తెల్లని బట్టలతో కనిపించే నర్సన్న అంతే స్వచ్ఛమైన మనసున్నవాడు. విద్యార్థులుగా మేం చాలా చిన్న పిల్లలమైనా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని.. అంతా క్షేమమేనా అయ్యా.. అని పలుకరించే అతని మాటలు మా బోటి వారికి ఆయనలో ఓ కుటుంబ పెద్ద, తండ్రి, తాత కనిపించేవాడు. నాటినుంచీ నేటిదాకా ప్రజా సంఘాల కార్యకర్తలకు ఆయన పంచిన ప్రేమానురాగాలు మరుపురానివి.
ఎనభైయవ దశకం విద్యార్థులుగా సభలు, సమావేశాల్లో పాల్గొంటూ ఒకవిధంగా ఆయన వ్యక్తిత్వంతో ఉపన్యాసాలతో ఉత్తేజితులైన తరం మాది. ప్రజల గురించి, ముఖ్యంగా పేదల గురించీ ఆలోచించటం అంటే ఎంత బాధ్యతాయుత కార్యాచరణో, అది ఎంతటి ఉన్నతమైనదో ఆయన తన నిబద్ధ జీవితాచరణతో తెలియజెప్పాడు. ఆ రోజుల్లో విప్లవోద్యమ కార్యకర్తలు, సానుభూతిపరులందరికీ రైతు కూలీసంఘం నర్సన్న, ఆర్‌వైఎల్ ప్రభు, శ్రీనివాస్‌లు అన్నింట్లో ఆదర్శం. ఆ క్రమంలోనే జంటనగరాల్లో పెల్లుబుకిన విప్లవ విద్యార్థి ఉద్యమ విజయాల్లో వారి పాత్ర విడదీయలేనిది.
1986 నాటికి రాష్ట్రంలో ఆటా మాటా బంద్ అయ్యి నిప్పులు చెరిగే నిర్బంధ కాలంలో.. ఊహించనివిధంగా నర్సన్న బీహెచ్‌ఈఎల్ ప్రధాన గేట్ సమీపంలోని బస్తీలో ఎదురయ్యాడు. రాజ్యం అమలుచేసే నిర్బంధం ప్రజా కార్యకర్తలను ఏ రూపాల్లోకి మారుస్తుందో ఊహకందని కాలమది. ఎల్లప్పుడూ ప్రజల మధ్య నాయకుడిగా, మార్గదర్శిగా ఉండే నర్సన్న ఓ చిన్నపాటి గుడిసెలో కార్పెంటర్ వృత్తి చేస్తూ కనిపించాడు. నేను ఏంటన్నా.. అంటే... విప్లవోద్యమం నిర్దేశించిన మార్గంలో మన జీవితాలను మలుచుకోవాలని, తీర్చిదిద్దుకోవాలని చెప్పిన తీరు విప్లవాచరణలోని సృజనాత్మతకు అద్దం పట్టింది. ఆ క్రమంలో.. నా రాకను గురించి ఆయన ఎన్నడూ నన్ను అడుగలేదు, అలాగే ఆయన అక్కడ ఉండటం గురించి కూడా నేను ఆయన్ను అడుగలేదు. అదంతా విప్లవోద్యమ ఆవశ్యకతలు, అవసరాల్లోంచి ఆవిష్కరించుకున్న దృశ్యాలు. ఆ తర్వాత కాలంలో నేను ఎప్పుడు పోయినా అదే ప్రేమతో సాదరంగా ఆహ్వానించి దగ్గర కూర్చోబెట్టుకుని యోగక్షేమాలు అడిగేవాడు. ఎప్పుడు వెళ్లినా అన్నం తినమనేవాడు. తిని వచ్చానని చెప్పితే.. తిన్నోనివి ఎంత తింటవ్ తిను.. అని తిన్నదాకా కాలు కదుపనిచ్చేవాడు కాదు. కార్పెంటర్‌గా కలపతో సౌకోట్లు, దర్వాజా తయారుచేసే పనులు ఆపకుండా చేస్తూనే.. నేనున్నంత సేపూ ఏదో ఒకటి తన అనుభవాలు చెప్పేవాడు. ముఖ్యంగా విప్లవోద్యమ ఆరంభ కాలంలో పెద్దాయన కొండపల్లి సీతారామయ్యతో కలిసిన అనుభవాలు ఎంతో ఉత్తేజంగా చెప్పేవాడు. బహుశా నర్సన్న కొడుకు వేణు అప్పుడు పదేండ్లలోపు పిల్లవాడు. బక్కపలుచగా చంకకు బ్యాగేసుకొని బడికి పోతున్న వేణును అప్పుడే చూశాను. తన కొడుకును చూపిస్తూ.. ఇతను ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడో, ఈ ప్రజల కోసం ఏం పనిచేస్తాడోనని తన ఆశలన్నీ తన కొడుకుపైనే అని చెప్పకనే చెప్పేవాడు. సరిగ్గా ఆశయాల మార్గంలోనే వేణు జంటనగరాల విప్లవోద్యమంలో కీలక భూమిక నిర్వహించాడు. నగరంలో పుట్టి పెరిగిన భూమి పుత్రులుగా వేణు (రావణ), జంటనగరాల విప్తవోద్యమ నేత హయత్‌నగర్ సురేశ్ (ప్రభాకర్) అమరులు కాకుండా ఉంటే నగరంలో ఉద్యమనిర్మాణం మరోవిధంగా ఉండేది. వీరిద్దరూ కొద్దికాలం తేడాతో రాజ్యం చేతిలో బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరులవటం జంటనగరాల విప్లవోద్యమానికి తీరని లోటు.
నర్సన్న జీవితం ఆసాంతం విప్లవాశయంతో ముడివేయబడింది. అతను ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా విప్లవోద్యమంలో భాగంగా తనదైన పాత్ర పోషించాడు. ప్రజా సంఘాల్లో తనదైన పాత్ర పోషిస్తూనే, యువతరానికి ఓ పెద్ద బాల శిక్షగా పనిచేశాడు. తనదైన వ్యక్తిత్వంతో, కార్యాచరణతో నేటి తరానికి స్ఫూర్తి నింపాడు. ప్రజసంఘాల కార్యక్రమాలన్నింటిలో అగ్రభాగాన ఉంటూ ఉద్యమ పతాకగా నిలిచాడు. 90ల చివరి రోజుల నుంచి ప్రభుత్వ నిర్బంధం పెరిగి అమరుల జాడలు కూడా మాయం చేయబడుతున్న గడ్డుకాలమొకటి వచ్చింది. నగరాలు మొదలు అటవీ ప్రాంతంలో అమరులైన వారిని గుర్తుతెలియని వారుగా ప్రకటించి అనామక శవాలుగా పోలీసులే పూడ్చివేస్తున్న దుర్మార్గ పరిస్థితుల్లో అమరుల బంధుమిత్రుల సంఘం పురుడు పోసుకున్నది. ఆ క్రమంలో కన్న కొడుకును విప్లవోద్యమానికి అందించిన త్యాగశీలిగా నర్సన్న అమరుల బంధుమిత్రుల సంఘానికి ముందుండి నడిపించాడు. అమరుల బంధు మిత్రుల సంఘం నాయకునిగా ఆయన రెండు తెలుగు రాష్ర్టాల్లోనే కాదు, సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో అడవులు, పట్టణాలు అనకుండా కాలుకు బలపం కట్టుకొని తిరిగాడు. ఎదురు కాల్పుల పేరిట రాజ్యం బలిగొన్న విప్లవకారుల దేహాలను తల్లిదండ్రులకు అప్పగించటంతో పాటు, పోరాటయోధులు తమ చివరిశ్వాస దాకా వారు కలలుగన్న సిద్ధాంతాలు, విలువలకు అనుగుణంగా వారిని సగౌరవంగా విప్లవ సాంప్రదాయాలకు అనుగుణంగా వారి అంతిమయాత్రలను నిర్వహించటంలో నర్సన్న పాత్ర ఎనలేనిది.
నలభై ఏండ్లుగా విరామమెరుగని విప్లవాచరణలో నర్సన్న ఎన్నడూ అనారోగ్యం, అలసట ఎరుగడు. ఈ సుదీర్ఘకాలంలో జరిగిన అన్ని అందోళనలు, ఉద్యమాచరణలన్నింటిలో ఆయన నిత్యనూతనంగా ప్రతి సందర్భంలోనూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఎన్నడు లేనిది అమరుడు కావటానికి రెండు రోజుల ముందు కనిపించినప్పుడు కొంత డల్‌గా కనిపించాడు. ఏంటన్నా.. ఆరోగ్యం బాగా లేదా అని అడిగితే.. ఏం లేదయ్యా.. కొంత అలసటగా ఉన్నదని ఎప్పటిలాగానే తన సొంతమైన, స్వచ్ఛమైన తెల్లని నవ్వుతో సమాధానమిచ్చాడు. ఆ అలసటనే నిత్య పోరాటయోధున్ని శాశ్వత విరామంలోకి తీసుకుపోవటం ఊహించనిది. చివరి మాటలుగా కూడా తన సహచరితో మాట్లాడుతూ.. అందరి వలె నేను పోయాక నీవు బొట్టు, గాజులు తీయొద్దు. అవి మహిళలుగా మీకు సహజసిద్ధంగా, హక్కుగా వచ్చిన వ్యక్తీకరణలు, ఆబరణాలని తెలియజెప్పుతూ ఎట్టి పరిస్థితిలోనూ బొట్టు, గాజులు తీయొద్దని జీవిత సహచరి అండాలమ్మ దగ్గర హామీ తీసుకొని కన్నుమూశాడు నర్సన్న. చివరిశ్వాస దాకా తాను కలలుగన్న సమ సమాజం కోసం పోరాటయోధుడిగా అలుపెరుగని పోరాటం చేయటమే కాకుండా ఒక నూతన మానవీయ శాస్త్రీయ విలువల కోసం పాటుపడ్డాడు నర్సన్న. బంధువులు, ఇరుగుపొరుగు వారు ఎంతగా వత్తిడి చేసినా.. నర్సన్న జీవిత సహచరిగా నర్సన్న బాటలో నడుస్తున్న విప్లవ మాతృమూర్తి అండాలమ్మకు జేజేలు. నర్సన్న జీవితాచరణ ఈ తరానికి స్ఫూర్తిదాయకం, అనుసరణీయం. సకల దోపిడి పీడనలు, వివక్షలు, అసమానతలు లేని మానవీయ సమాజం కోసం నర్సన్న ఆశయాలను ముందుకుతీసుకుపోవటమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.
- దాము

Keywords : narsanna, ravana, venu, revolutionary,
(2020-08-10 01:46:04)No. of visitors : 399

Suggested Posts


0 results

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


మొదటితరం