అస్తిత్వ ప‌రిధులు దాటి కార్మిక‌వ‌ర్గ ప్ర‌తినిధులై.. -పాణి

అస్తిత్వ

02-07-2021

(ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ వ్యాసం చాలా ఎడిట్ అయ్యింది. అందువల్ల పూర్తి వ్యాసం మీ కోసం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం.)

విషాదం కూడా రోమాంచితంగా ఉంటుందా? మామూలుగానైతే అంగీకరించలేం. కానీ అదీ అనుభవంలోకి వస్తుంది. అప్పుడే తెలుస్తుంది.. విషాద రేఖకు కూడా ఒక మెరుపు అంచు ఉంటుందని. అదే దు:ఖం నుంచి తెప్పరిల్లే ఓదార్పు గీతమవుతుంది. అదే నడచి వచ్చిన దారిని రక్త కాంతులతో దేదీప్యమానం చేస్తుంది. తెరచాప వలె భవిష్యత్తులోకి లాక్కెళుతుంది.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌, ఇంద్రావతి ఏరియా కమిటీ నాయకురాలు సిద్దబోయిన సారక్క అలియాస్‌ భారతి కరోనా లక్షణాలతో మరణించారనే వార్త అనేక రకాల ఒత్తిడిని పేర్చింది. వాళ్లనెన్నడూ చూడలేదు. వాళ్ల నాయకత్వంలో నిర్మాణమైన విప్లవోద్యమం మాత్రమే తెలుసు. ఈ మరణపు సన్నివేశంలో వాళ్లు నిర్మించిన పోరాటంలోంచి వాళ్ల మహాద్భుత వ్యక్తిత్వాలు తేజోవంతంగా పరిచయం అవుతున్నాయి. ఇప్పుడు హరిభూషణ్‌ ʹఅందరికీʹ తెలిసిన మనిషి అయ్యాడు. మామూలుగా మృత్యువుతో ముగిసిపోవడం చూస్తాం. కానీ ఇక్కడ ఆరంభమైంది. ఇప్పుడు ఎవరైనా ఆయన గురించి మాట్లాడుకోవచ్చు. ఆయన నిర్మించిన విప్లవోద్యమాన్ని అంచనా వేయవచ్చు. ఆయనను రూపొందించిన వర్గపోరాటానికి ఉన్న శక్తిని పరీక్షించవచ్చు. కాల్పనికంగా చెప్పాలంటే ఇప్పుడాయన జానపద కథా నాయకుడు. శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే అచ్చమైన విప్లవకారుడు.

సరిగ్గా మన దేశంలో విప్లవం చేయగల సామాజిక, నైసర్గిక, చారిత్రక శక్తి ఉన్న పీడిత వర్గ, పీడిత అస్తిత్వ సమూహాల ప్రతినిధి ఆయన. హరిభూషణ్‌కంటే సారక్కది మరింత మేలిమి ప్రాతినిధ్యం. ఇలాంటివాళ్లు నిర్మిస్తున్న విప్లవోద్యమం సైనిక దాడులను సరే... అనేక శిబిరాల నుంచి తాత్విక, సైద్ధాంతిక, రాజకీయ ప్రశ్నలను, ఆరోపణలను, విమర్శలను, సందేహాలను, సంభాషణలను, ఆదాన ప్రదానాలను అది అనుభవిస్తున్నది. అలాంటి భారత విప్లవోద్యమానికి హరిభూషణ్‌, సారక్కలాంటి వాళ్లు కదా నాయకులు అనే ఊహ చాలు.. ఈ మరణపు విషాదంలో కూడా గొప్ప ఉత్తేజాన్ని ఇస్తుంది.

వాటన్నిటినీ వీళ్లు ఎలా ఒడిసి పట్టుకున్నారు? ఎలా అర్థం చేసుకున్నారు? నిజంగానే మన చుట్టూ సంఘర్షణాభరితమైన మేధో ప్రపంచం ఉంది. అది అనేక విలువైన అన్వేషణలు సాగిస్తున్నది. చాలా సవాళ్లు విసురుతున్నది. దానికి హరిభూషణ్‌, సారక్క ముప్పై ఏళ్లుగా ఆచరణాత్మక పార్శ్వాన్ని జోడిస్తున్నారు. వైరుధ్యాలను విశ్లేషిస్తే పరిష్కారం కావని, ఆచరణలోకి దిగాల్సిందే అనే వాళ్ల ఎరుక మనల్ని తప్పక ఉద్వేగపరుస్తుంది. తమను తాము మార్చుకుంటూ లోకాన్ని మార్చగల శక్తి ఈ ఆదివాసులకు ఎలా వచ్చిందో తెలుసుకోవాల్సిందే. బహుశా ఇప్పటికీ ఒక మేధో ప్రశ్నను మరణానంతరం కూడా హరిభూషణ్‌, సారక్క ఎదుర్కోవాల్సి వస్తుందేమో. ʹమీకు.. మీ ఆదివాసులను మార్చే శక్తి ఉన్నదేమోగాని ఈ వ్యవస్థను మార్చేశక్తి లేదʹనే సవాలు వాళ్లకు ఎదురవుతుంది కావచ్చు.

హరిభూషణ్‌ నిర్మించిన ఉద్యమం తప్పక దీనికి సమాధానం చెప్పగలదు. నిజానికి ఆయన ఆదివాసీ జీవన మూలాల నుంచే చైతన్యవంతమయ్యాడు. సారక్క ఆదివాసీ గూడేల్లోని పితృస్వామ్యానికి వ్యతిరేకంగానే సమానత్వ కాంక్ష పొందింది. కానీ వాళ్లు వాటితో సహా ఈ వ్యవస్థ మౌలిక వైరుధ్యాలను అర్థం చేసుకున్నారు. దోపిడీకి గురవుతున్న వాళ్లందరినీ సమీకరించి పోరాటాల్లోకి నడిపించారు. హరిభూషణ్‌లాంటి వేలాది మందిని తయారు చేస్తున్న విప్లవోద్యమం నుంచి ఆయననే ఒక ఉదాహరణగా పరిశీలించవచ్చు. ఇవాళ భారత విప్లవోద్యమంలో సగానికంటే ఎక్కువ మంది ఉన్న మహిళలకు ఒక నమూనాగా సారక్కను గుర్తించవచ్చు. కులం, ఆదివాసీ, మహిళ వంటి సాంఘిక అస్తిత్వాలు పుట్టుకతో వచ్చేవే కావచ్చు. కానీ వాటికి శాశ్వతత్వాన్ని ఆపాదించాల్సిన పని లేదు. అదే నిజమైతే ఇక వాటిని భరించాల్సిందే తప్ప ప్రశ్నించడానికి లేదు. కాకపోతే ధిక్కార చైతన్యంతో ఆత్మగౌరవంగా ప్రకటించుకోవచ్చు.

కానీ ఆదివాసీ నారాయణ, సారక్క తమ జీవితాచరణ ద్వారా ఒక అద్భుతమైన సిద్ధాంత సూత్రీకరణ చేస్తున్నారు. అదేమంటే.. అస్తిత్వాలు నిర్జీవమైనవీ, శిలాసదృశమైనవీ, మార్పుకు అతీతమైనవీ కాదు. వాటిని మార్చవచ్చు. విమర్శనాత్మక ఆచరణ ద్వారా వాటిలోని ప్రగతి వ్యతిరేకమైన సంకెళ్ల నుంచి బైటికి రావచ్చని వాళ్లు తమ జీవితం ద్వారా నిరూపించారు. అసలు ఈ క్రమమే నచ్చని వాళ్లు ఏ ఆరోపణలైనా చేయవచ్చు. కానీ లోతైన వర్గపోరాట ఆచరణ వల్ల ఈ క్రమం సాధ్యమే అని వారు ఉదాహరణగా నిలిచారు. విప్లవోద్యమం ఈ పని చేయగలుగుతుందని వాళ్లు తమ సుదీర్ఘ జీవితం ద్వారా తేల్చి చెప్పారు. ఇతరులు వాళ్లను ఆదివాసులుగానే గుర్తించవచ్చు. కానీ వాళ్లు కార్మికవర్గ ప్రతినిధులయ్యారు.

ఈ దృక్పథం వల్లనే యాప నారాయణ హరిభూషణ్‌గా, జగన్‌గా ఎన్నెన్నో ప్రజా సమూహాలను కదిలించాడు. వాళ్ల పోరాటాలకు రాజకీయ సిద్ధాంత భూమికను కల్పించాడు. నిర్మాణ రూపాలను ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో ఆయన చేసిన ప్రకటనలు, చేసిన విశ్లేషణలు మావోయిస్టు అవగాహనలో ప్రామాణికమైనవి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాంతీయ ఉద్యమకారులతో, ప్రజాస్వామికవాదులతో, మేధావులతో ఆయన తీవ్ర నిర్బంధం మధ్యనే నిరంతర సంభాషణలో ఉన్నాడు. పాలక వర్గ దుర్మార్గాలపై అప్‌డేట్‌ ప్రకటనలు, విమర్శలు, పోరాటాలు సాగించాడు.

ఇవన్నీ ఆయన తన ఆదివాసీ అస్తిత్వానికి పరిమితమైతే చేయగలిగేవాడు కాదు. కార్మికవర్గంలో భాగంగా చేశాడు. కార్మికవర్గ పార్టీ నాయకుడిగా చేశాడు. తెలంగాణ ప్రభుత్వం 2017 డిసెంబర్‌లో ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించినప్పుడు ఆయన రచయితలకు, భాషావేత్తలకు, సాంస్కృతిక కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు మార్క్సిస్టుగా ఆయన విస్తృతికి నిదర్శనం. విప్లవకారులకు ఆర్థిక రాజకీయ విషయాలు తెలుసేమోగాని భాషా సాంస్కృతిక విషయాలు తెలియవని కొందరు మేధావులు అంటుంటారు. హరిభూషణ్‌ ఆ రచనలో లోతైన సాంస్కృతిక విషయాలను ప్రస్తావించాడు. తన జీవన మూలాల్లోని ఆదివాసీ భాషా సంస్కృతుల ప్రస్తావనలు కూడా ఉండొచ్చు. తెలంగాణ ప్రాంతీయ ముద్ర కూడా ఉండవచ్చు. కానీ మౌలికంగా ఆయన భాషా సాంస్కృతిక వికాసాన్ని ప్రజల వైపు నుంచి విశ్లేషించాడు. వర్గ దృష్టితో చూస్తూ ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరించమని పిలుపు ఇచ్చాడు.

ఇంత విస్తృతి ఎలా సాధ్యమైంది? ఆయనలాంటి వాళ్లంతా ఎలా రూపొందారు? అది వ్యక్తుల ప్రత్యేకతలు, సంసిద్ధతలకు సంబంధించిందే కాదు. ఉదాహరణకు ఒక ఆదివాసీగా హరిభూషణ్‌కు ఆ తరంలోనే కాలేజీ చదువుల వంటి కొన్ని అనుకూలతలు ఉండవచ్చు. కానీ మొత్తంగానే విప్లవోద్యమం అంతర్గతంగా ఒక మహత్తర పరివర్తనా క్రమాన్ని సాధించింది. ఇలాంటిదేదీ లేకుండా ఒక పార్టీ విప్లవం తేగల సత్తాను యథాతధంగా ప్రదర్శించలేదు. బహుశా ఇది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండవచ్చు. మన దేశంలో ఈ ప్రాసెస్‌ను సాధించలేని నిర్మాణాలు కూడా ఉన్నాయి. అది ఉన్న నిర్మాణాలే వేయి కత్తివేట్లకైనా, వందల శిశిరాల్లో అయినా చిగురిస్తునే ఉన్నాయి.

ఇలాంటి ప్రాసెస్‌లో హరిభూషణ్‌, సారక్కలాంటి ఆదివాసులు, దళిత బహుజనులు, మహిళలు వ్యక్తులుగా, సమూహాలుగా భాగం కావడం వల్లే విప్లవోద్యమం ఎంతో నేర్చుకొని ఉంటుంది. బహుశా దాని లర్నింగ్‌ ప్రాసెసే మనకు హరిభూషణ్‌ అవగాహనా విస్తృతిగా కనిపిస్తున్నది. ఇది కేవలం ఆదివాసీ ప్రజలకు మాత్రమే వర్తించేది కాదు. అన్ని పీడిత అస్తిత్వ ప్రజలు విప్లవోద్యమంలో ఎలా భాగమవుతున్నారో పరిశీలించడానికి ఈ రోజు యాప నారాయణ, సిద్దబోయిన సారక్క మరణంలో కూడా సజీవ ఉదాహరణగా నిలిచారు. విప్లవాన్ని విజయవంతం చేయగల వర్గాలను, సమూహాలను తనలో సంలీనం చేసుకోవడం వల్ల ఆ ఉద్యమం విప్లవాత్మకంగా తయారైందా? లేక విప్లవ లక్ష్యం ఉన్న నిర్మాణంలో భాగం కావడం వల్ల ఆ సమూహాలే విప్లవకరంగా ఎదిగి తమ చారిత్రక పాత్ర పోషిస్తున్నాయా? అనేవి అవిభాజ్యమైనవి.

అందుకే ఇదొక సంక్లిష్టమైన పరివర్తనా క్రమం. దీని మీద సరళమైన ప్రశ్నలు సంధించి మేధో సంతృప్తి పొందవచ్చు. చాలా పెద్ద విషయాల దాకా పోనవసరం లేదు. కనీసం హరిభూషణ్‌, భారతిలాంటి వాళ్ల జీవితానుభవాల్ని మనం అర్థం చేసుకోగలమా? దానికి ఏదైనా పద్ధతులు ఉన్నాయా? జీవితాన్నే అత్యంత కఠోరమైన ఆచరణాత్మక ప్రయోగంగా మలుచుకోవడం వెనుక పని చేసిన శక్తి ఏమిటి? ఈ క్రమంలో వ్యక్తులుగా గడిరచిన అనుభవాలేమిటి? వ్యక్తులకు కలిగిన అనుభవాలు ఒక అత్యున్నత సామూహికతలో ఎలా ప్రతిఫలించాయి? వేటిని ఎలా వడగట్టి సాంద్రీకరించి అది సొంతం చేసుకున్నది? జ్ఞానంగా మార్చుకున్నది? ఈ క్రమంలో తిరిగి ఆ వ్యక్తుల మేధో, హృదయ వైశాల్యం ఎలా విస్తరించింది? విప్లవోద్యమంతా సంతరించుకున్న విలువలకు ఒక భౌతిక, సజీవ మూర్తిమత్వంగా వాళ్లు ఎలా తయారయ్యారు? ఇలాంటి వేల, లక్షల మందిని తనలో కలుపుకపోయిన విప్లవోద్యమాన్ని ఉద్వేగ రహితంగా, తార్కికంగా విశ్లేషించడానికి ఇప్పటికైనా మన దగ్గర పరికరాలేమైనా ఉన్నాయా?

హరిభూషణ్‌ ఇవాళ విప్లవంలో అనేక మందిలో ఒకరు. కానీ ఆయనగాని, సారక్కగాని ఇలా ఉదాహరణగా మన ముందు నిలబడ్డారు. ఇలాంటి సందర్భాలు భారత విప్లవోద్యమ చరిత్రలో ఎన్నో వచ్చి ఉండవచ్చు. కానీ విప్లవోద్యమం చుట్టూ అయినవాళ్లూ, కానివాళ్లూ, శతృవులూ అనేక ప్రశ్నలు సంధిస్తున్న సమయం ఇది. అలాగే నలభై ఏళ్ల పరివర్తనా క్రమం హరిభూషణ్‌, భారతిగా మన కళ్ల ముందు వచ్చి నిలబడిరది.

ఒక ఆదివాసీ విప్లవోద్యమానికి కేంద్ర నాయకుడు కావడమనే విషయాన్ని విశ్లేషకులు ఎలా చూస్తారు? ఇదొక అద్భుతమంటే సరిపోదు. అలాగే ఇది సామాన్యమైనదీ కాదు. ఇది వ్యక్తులుగా వాళ్ల ప్రయాణమే కాదు. వేలాది, లక్షలాది మంది సమస్త పీడిత అస్తిత్వ సమూహాలు ఇందులో భాగం. ఇంకోపక్కన విప్లవోద్యమం దళితులను నాయకులుగా చేయలేదని అనే వాళ్లు ఉన్నారు. స్త్రీలను అస్సలు ఎదగనీయదని అంటారు. ఆదివాసులను కాల్బలంగానే వాడుకుంటోందని అంటారు. బహుజనులకు అక్కడ చోటేదని నిట్టూర్పులు విడుస్తారు. అబ్బే మరీ అంత అన్యాయం కాదు కాని ఈ సమూహాలను పట్టించుకోవలసినట్లు పట్టించుకోలేదని జంటిల్‌గా అనే వాళ్లుంటారు.

ఇవన్నీ నిజాలా, అబద్ధాలా అనే చర్చలోకి వెళ్లనవసరం లేదు. ఇప్పటికే ఎందరో ఉన్నప్పటికీ, ఈ రోజు యాప నారాయణ అనే ఆదివాసీ విప్లవోద్యమంలో కేంద్ర నాయకుడనే సత్యం తెలుస్తున్నది కదా. పైన చెప్పిన దృష్టి కోణాలను మార్చుకోమనడం లేదు. కనీసం పున:సమీక్షించుకుంటారా? మరణంలోనూ హరిభూషణ్‌, సారక్క వేస్తున్న ప్రశ్న ఇదే

-పాణి

Keywords : haribhushan, sarakka, martyrs, adivasi, cpi maoist
(2024-05-21 22:44:02)No. of visitors : 2909

Suggested Posts


అమరుడు కామ్రేడ్ హరిభూషణ్ పై పాట రిలీజ్ చేసిన జననాట్యమండలి

అమరుడు కామ్రేడ్ హరిభూషణ్ పై పాట రిలీజ్ చేసిన జననాట్యమండలి

వాళ్ళ అమరత్వంలోంచి అడవి చిగురిస్తున్నట్లుగానే ఉంటుంది

మావోయిస్టు పార్టీ నాయకులు హరిభూషన్, భారతక్క మరణం అనేక మందిని కలిచివేసింది. వాళ్ళతో పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేకున్నా వాళ్ళ గురించి విన్నవాళ్ళు అనేక విధాలుగా సపంధించారు. సోషల్ మీడియాలో అనేక మంది తమ భావాలను పంచుకున్నారు. కొందరు ఆ అమరులపై కవితలు రాశారు.

ఆదివాసీ, పీడిత ప్రజల గుండె ధైర్యం కామ్రేడ్.హరిభూషణ్ -అలెండి

ఆదివాసీ, పీడిత, తాడిత ప్రజానీకానికి జూన్ 21, 2021 తీవ్రమైన దుఃఖాన్ని కలిగించిన రోజు. ఆదివాసీ, పీడిత ప్రజల ప్రియమైన నాయకుడు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ

హరిభూషణ్ భార్య శారదక్క చనిపోలేదు... అసత్య‌ ప్రచారాలను ఖండించిన మావోయిస్టు పార్టీ

పోలీసులు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని నమ్మకండి. కా ,శారద, కా. హిడ్మా ఆరోగ్యంగానే వున్నారు. పాలకులు, ప్రభుత్వాలు కావాలనే ఉద్ద్యేశ పూర్వకంగా దుష్ప్ర‌చారం చేస్తున్నారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అస్తిత్వ