జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ


జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జంపన్నలేఖ‌కు

08-07-2021

అభయ్‌ ʹఫత్వాకు నా జవాబు అంటూ జూన్‌ 20, 2021న జంపన్న రాసిన లేఖకు మా సమాధానం...

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన జంపన్నకు విప్లవ రాజకీయాలపై, మా పార్టీపై మాట్లాడటానికి కనీస నైతిక అర్హత కూడా లేదని మా పార్టీ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తోంది. మాజీ మావోయిస్టుగా అవతారమెత్తిన జంపన్న చీటికి మాటికి పోలీసుల కథనాలకు వంత పాడుతూ మీడియా ముందు ప్రత్యక్షం కావడం ఆయనకు మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నాంʹ అనే వ్యాఖ్య ఉంది. ఈ వ్యాఖ్యకు సమాధానంగా జూన్‌ 20, 2021న సీ.పీ.ఐ (మావోయిస్సు) పంథాపైనా, కార్యాచరణపైన జంపన్న దాడి చేస్తూ లేఖ రాసాడు. ఆ లేఖకు మా సమాధానాన్ని కింద ఇస్తున్నాము.

జూన్‌ 18న మా పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌గా నేను ఇచ్చిన పత్రికా ప్రకటనపై జంపన్న సందేహాన్ని వెలిబుచ్చాడు. అది పార్టీ నుంచి వచ్చిందో లేక నకిలీలు చేసిన పనో అన్న సంశయాన్ని వ్యక్తపరిచాడు. జంపన్నకు అటువంటి శంక అవసరం లేదు. సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధి అభయ్‌గా నేను ఇచ్చినదే. నేను చేసిన అ వ్యాఖ్యకు జంపన్న స్పందిస్తూ, జూన్‌ 20న సోషల్‌ మీడియాలో తన సమాధానాన్ని ఉంచాడు.

అ సమాధానంలో తనకు అభయ్‌ ఇచ్చిన ʹఫత్వాʹ హేళనతో, నిరాధార అరోపణలతో, అప్రజాస్వామికంగా, హెచ్చరికలతో కూడిన దాడిగా ఉందనీ, దానిని తాను ఖండిస్తున్నానంటూనే, తిరిగి పార్టీ పంథాపైనా, కార్యాచరణపైన వక్రీకరణలతో, అబద్ధాలతో దాడిని ఎక్కుపెట్టాడు. అంతేకాకుండా నా వ్యాఖ్యకు జవాబుగా రాసిన తన లేఖలో అబద్ధాలను, అభూత కల్పనలనూ, వక్రీకరణలను దట్టించి రాసాడు.

అవేమిటో చూద్దాం. సోషల్‌ మీడియాలో తానిస్తున్న ఇంటర్వ్యూలూ, కామెంట్‌లు విమర్శనాత్మక, స్వేచ్భాయిత, వర్గదృక్చథంతో కూడుకున్నవనీ, ఉద్యమ పాఠాలుగా నేర్చుకున్న సైద్ధాంతిక, రాజకీయ అవగాహనకు చెందినవనీ, తాను కేవలం మావోయిస్టు పార్టీపైనే కాకుండా వివిధ పార్టీల వైఖరులపైనా, వివిధ అంశాలపైన వ్యాఖ్యానాలు చేస్తున్నాననీ, వీటిపై ఎందరో స్పందనలు తెలియజేస్తున్నప్పటికీ, వారెవ్వరికీ రాని ʹజంపన్న పోలీసులకు వంతపాడుతున్నాడన్నʹ అనుమానం మవోయిస్టు పార్టీకి మాత్రమే వచ్చిందని బుకాయించాడు.

ఇంకా ప్రజాస్వామిక పద్ధతి గురించీ, ఆదర్శాల గురించీ, పార్టీకి సంబంధించిన అనేక విషయాలలో తాను స్పష్టీకరణ ఇస్తున్న విషయం గురించీ, భారత సామాజిక వ్యవస్థ గురించీ, భారత విప్లవ పంథా గురించీ, మా పార్టీ నిరంకుశ ధోరణి గురించీ, శతృవులనూ, మిత్రులను వేరు చేసి, మిత్రులను కలుపుకొచ్చుకోవడంలో పార్టీ అనుసరిస్తున్న సెక్టేరియన్‌ ధోరణి గురించి ఇలా ఎన్నో విషయాలలో పార్టీ పైన అహంకార పూరిత, అసత్య అరోపణల దాడి చేస్తూ, తన అక్కసును వెళ్ళబోస్తూ, పాలకవర్గాలకు తాను నమ్మిన బంటునన్న విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు.

జంపన్న రాసిన సమాధాన లేఖలో పొందుపరిచిన వక్రీకరణలకూ, అబద్ధాలకు మా సమాధానం కింద ఇస్తున్నాము.

ముందుగా జంపన్న ఫోకస్‌ చేసిన ʹఫత్వాʹ గురించి చూద్దాం. మా వ్యాఖ్యలో జంపన్న రాజ్యంతో చేతులు కలిపి ముఖ్యంగా పోలీసు వ్యవస్థతో మిలాఖతై పధకం ప్రకారం విప్లవ ప్రతీఘాతుక కార్యకలాపాలకు పాల్పడుతుండటాన్ని వ్యతిరేకిస్తూ, ఆయనపై తీవ్ర విమర్శతో పాటు హెచ్చరికను చేసాము. మా విమర్శనూ, హెచ్చరికను జంపన్న ʹఫత్వాʹ స్థాయికి తీసుకువెళ్ళి మేము ప్రకటించనిదాన్ని ప్రకటించినట్లుగా ఫోకస్‌ చేసి, చౌకబారు ఎత్తుగడలకు పాల్పడ్డాడు. ఇటువంటి కుయుక్తుల ద్వారా జంపన్న సాధించేదేమీ ఉండదని తెలియజేస్తున్నాం.

ఇకపోతే తన ఉత్తరంలో వాస్తవాలను మరుగుపరుస్తూ, పార్టీ తనపై నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నదని నిర్ధారించడానికి అబద్ధాలను వండివార్చాడు. తాను పార్టీని విడిచిపెట్టినంత మాత్రానే, పార్టీ తనను ద్రోహి అంటున్నదనీ, సెక్టేరియన్‌ జడ్జిమెంటులు ఇస్తున్నదనీ, ఇష్టానుసారం సంకుచిత, మొరటు తీర్పులు ఇస్తున్నదనీ, జంపన్నను అర్ధం చేసుకోవడంలో భ్రమలపైన ఆధారపడి, పై పై విశ్లేషణలతో తప్పుడు నిర్ణయానికి వస్తున్నదనీ, పిడివాద, మూస, రొడ్డకొట్టుడు పదజాలంతో, పనికిరాని కొలతలతో జంపన్నలాంటి ʹమిత్రులనుʹ దూరం చేసుకొంటున్నదని ఆరోపిస్తూ సానుభూతి పొందాలని ప్రయత్నించాడు. వాస్తవానికి జంపన్న పదగుంఫనతో తన నిజస్వరూపాన్ని మరుగుపరచాలని చూస్తున్నాడు. వాస్తవాలేమిటో చూద్దాం.

జంపన్న పార్టీలో మూడు దశాబ్దాల కాలం పని చేసాడు. ఆయన రాజకీయంగా దిగజారడానికి ముందు కేంద్రకమిటీ సభ్యుడి హోదాలో పని చేసాడు. ఆయనకు పార్టీ విధానాల గురించీ, అభివృద్ధి గురించి తెలియనిదేమిలేదు. పార్టీ మహత్తర శ్రామికవర్గ సాంసృతిక విష్లవస్ఫూర్తితో ఉద్భవించింది. కేంద్రీకృత ప్రజాస్వామ్యం, విమర్శ, స్వయం విమర్శలు పార్టీకి జీవనాడి లాంటివి. పార్టీ బలం కూడా ఆ నిర్మాణ సూత్రాలపైనే అధారపడి ఉంది. ఈ సూత్రాలు మాటల్లోనే కాదు, పార్టీ ఆచరణలో కూడా అమలవుతుండటం వల్లనే పార్టీ కార్మికవర్గ ఉక్కు క్రమశిక్షణ కలిగిన సంఘటిత శక్తిగా పురోగమిస్తున్నది.

ఇటువంటి విప్లవకర కార్మికవర్గ పార్టీలో జంపన్నకు నిజంగానే భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలపైనా, పార్టీ పంథాపైనా భిన్నాభిప్రాయాలుంటే పార్టీ నింబంధనావళి ప్రకారం, నిర్మాణ సూత్రాల ప్రకారం రెండు పంథాల మధ్య పోరాటం చేసేందుకు బోలెడంత అవకాశం ఉంటుంది, ఉంది కూడా. కానీ ఆయన ఏనాడు ఏ ఒక్కకేంద్రకమిటీ సమవేశంలో సైతం తనకు భిన్నాభిప్రాయాలున్నట్లు వ్యక్తం చేయలేదు.

చివరికి కేంద్రకమిటీ సభ్యుడిగా ఆయన దృఢంగా, త్యాగపూరితంగా ఉండటంలేదనే విమర్శలు వెల్లువెత్తడంతో, కేంద్రకమిటీ సమావేశంలో ఆయన కార్యాచరణపై చర్చించి రెండు సంవత్సరాల సస్పెన్షన్‌ విధించడం జరిగింది. ఈ చర్యను జీర్ణించుకోలేని జంపన్న భారతదేశ ఉత్పత్తి సంబంధాలపైనా, విప్లవపంథాపైన చర్చను లేవనెత్తాడు. ఆయన అవకాశవాదంతో ఈ చర్చను లేవనెత్తుతున్నాడన్న విషయం కేంద్రకమిటీకి అర్ధమైనప్పటికీ, పార్టీ నిర్మాణ సూత్రాలకు లోబడి ఆయనకు చర్చ చేసే అవకాశాన్ని కల్పించింది.

కానీ అప్పటికే విప్లవతత్వం నశించి, త్యాగ సంసిద్ధతను కోల్పోయిన జంపన్న నేరుగా పోలీసు బాసుల ముందు శరణు వేడుకున్నాడు. లక్షల రూపాయల ప్రజల రక్తపు కూడును ప్రభుత్వ లొంగుబాటు పధకంలో భాగంగా స్వీకరించాడు. చివరికి జంపన్న లాంటివాళ్ళ కోసం సామ్రాజ్యవాద, పాలకవర్గాల ప్రాయోజిత ధోరణిగా ముందుకొచ్చిన ʹభారత సమాజం పెట్టుబడిదారీ సమాజంగా మారిందనే వాదనను ఆయన భుజాన వేసుకొని, పాలకవర్గాల సేవలో తరించిపోయేందుకు పార్టీపైనా, పార్టీ పంథాపైన దాడికి సిద్ధపడ్డాడు. ఇక్కడ మేము ʹభారత సమాజం పెట్టుబడిదారీ సమాజంగా మారిందనే ధోరణిని సామ్రాజ్యవాద, పాలకవర్గాల ప్రాయోజిత ధోరణిగా చెప్పడంలో ఒక నిజమైన తర్మం ఉంది.

అదేమిటంటే సీ.పీ.ఐ (మావోయిస్టు)గా మేము దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా భారతదేశ అర్ధభూస్వామ్య సమాజాన్ని మార్చి దేశాభివృద్ధికీ, నూతన ప్రజాస్వామిక వ్యవస్థను అటుపిమ్మట సోషలిజం, కమ్యూనిజంలను స్థాపించాలనే ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చాము. ముందుకు తేవడమే కాదు, మా ʹప్రజాయుద్ధ పంథాను ఆచరణలో పెట్టి చూపుతున్నాము. దీంతో భారతదేశంలో ప్రజాయుద్ధం మరింత బలోపేతం అవుతున్న ధోరణిని గమనించిన సామ్రాజ్యవాదులు, దేశీయంగా, అంతర్జాతీయంగా ఏర్పడబోయే తీవ్ర పరిణామాలను ముందుగానే అంచనా కట్టాయి.

ఈ నేపథ్యంలోనే సామ్రాజ్యవాదుల దిశానిర్దేశంతో భారత దళారీ పాలకవర్గాలు సీ.పీ.ఐ (మావోయిస్టు)ను దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా ప్రకటించాయి. నిజంగా దీర్హకాలిక ప్రజాయుద్ధ పంథాకు ప్రాసంగికత లేకపోతే, ఇదే కాలం చెల్లినదైతే, దోపిడీ పాలకవర్గాలు అంత అందోళన పడాల్సిన అవసరమేమున్నది? ప్రజాస్వామిక విప్లవానికి ప్రాతినిధ్యం వహించే విప్లవ ప్రజాస్వామిక, మేధావి బృంధాలను ఎందుకు వేటాడుతున్నాయి? పలు బూటకపు కేసులు పెట్టి ఎందుకు జైళ్ళలో కుక్కుతున్నాయి? నిజంగా పార్టీ పంథాకు ప్రాసంగికత లేకపోతే, ప్రజలలో విశ్వసనీయత లేకపోతే పాలకవర్గాలు ఇంత పెద్దఎత్తున దాడికి సిద్ధపడవు కదా!

పాలకవర్గాలు ఇంతటితోనే అగలేదు. భారతదేశంలో తక్షణం జరగాల్సిన సామాజిక విప్లవంగా నూతన ప్రజాస్వామిక విప్లవ అవశ్యకత పెరగుతుండటంతో, దోపిడీ పాలకవర్గాలు విప్లవ శ్రేణుల్లో, ప్రజల్లో సిద్ధాంత గందరగోళం సృషించేందుకు తమ ప్రాయోజిత సంస్థలకు కోట్ల రూపాయలు ఇచ్చి భారతదేశంలో పెట్టుబడిదారీ సంబంధాలు వచ్చాయని నిర్దారిస్తున్నాయి. ఈ విషయంపై 2011లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో పెద్దఎత్తున జరిగిన సెమినార్‌తోపాటు, లెక్కకు మించిన పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. ఈ పరిశోధనలతో భారతదేశం ఎంత మాత్రమూ అర్ధభూస్వామ్య దేశంగా లేదు, అది పెట్టుబడిదారీ సమాజంగా మారిందనే వాదనను నిర్ధారిస్తున్నాయి. అందుకే దీన్ని సామ్రాజ్యవాద పాలకవర్గ ప్రాయోజిత వాదనగా చెప్పాలి.

అయితే భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం వచ్చిందని చెబుతున్నవారంతా సామ్రాజ్యవాద, పాలకవర్గ ప్రయోజిత వాదనకు సమర్థకులుగానూ, ప్రతినిధులగాను చెప్పనవసరం లేదు. ముఖ్యంగా శతృ ఏజెంట్లు, విప్లవ వ్యతిరేక శక్తులు, పార్టీ నుంచి తోసివేయబడిన అవకాశవాద రివిజనిస్టు శక్తులు, పార్టీ నుంచి వెళ్ళి శతృవుకు లొంగిపోయిన విద్రోహ శక్తులు ఈ ధోరణికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీరు మొదటికోవకు చెందినవారు. అయితే ఈ ధోరణిని కొందరు స్వతంత్ర మేధావులు కూడా సమర్ధిస్తున్నప్పటికీ, వారు రెండవ కోవకు చెందినవారు. వారు ఎమ్‌.ఎల్‌.ఎమ్‌ అవగాహన కొరవడటం, సామాజిక అచరణకు దూరంగా ఉండటం, అనుభవరాహిత్యం కారణంగా, విశ్వసనీయతలేని సగటు డేటాపై అధారపడి యాంత్రిక విశ్లేషణ చేయడం కారణంగా ఈ ధోరణికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జంపన్న మాత్రం పైన ఇచ్చిన వివరణ ప్రకారం మొదటి కోవకే చెందుతాడు.

జంపన్న విషయంలో పైన మేము పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలు కాదా! అసలు నిజమైన విప్లవకారులెవరైనా, వర్గశతృవులైన దోపిడీ పాలకవర్గాల ముందు, వారి నిరంకుశ పోలీసు అధికారుల ముందు లొంగిపోతారా? జంపన్న పోలీసు అధికారుల ముందు లొంగిపోవడమే కాకుండా, వారి మార్గదర్శకత్వంలో, పెట్టుబడికి కట్టుకథలకు పుట్టిన ʹఐ డ్రీమ్‌ʹ ఇంకా కొన్ని ఇతర ఎలక్ర్షానిక్‌ మీడియాలతో అపవిత్ర కలయిక ఏర్పరుచుకొని పార్టీమీద, పార్టీ పంథామీద ఒక పధకం ప్రకారం దాడి చేయడం లేదా? ఎవరైనా ఈ వాస్తవాలను కాదనగలరా? ఈ పనులన్నీ వర్గసంకర రాజకీయాలలో మునిగితేలుతూ విప్లవోద్యమంపై దాడి చేయడం కాదా? ఇంత చేస్తూ, అంటే ఒకవైపున విప్లవ ప్రతీఘాతుకత్యానికి పాల్పడుతూ, మరోవైపు తనవర్స స్పృహ గురించి తన లేఖలో ప్రస్తావించడం తనకే చెల్లింది.

నిజంగా విప్లవకారులెవరైనా చర్చ, చర్చ కోసం చేయరు. విప్లవ సమస్య పరిష్కరించేందుకు చేస్తారు. కానీ జంపన్న ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన నిజంగా భారతదేశంలో పెట్టుబడిదారీ విధానమే ఉందని నమ్మితే, అందుకు ఆచరణాత్మక పధకాన్ని రూపొందించుకొని, విప్లవ సమస్యను పరిష్కారించేందుకు పూనుకోవాలి. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, మీడియాలో తన చర్చను ప్రధానంగా పార్టీపంథాపై దాడి చేసేందుకే కేంద్రీకరిస్తున్నాడు. ఇది చాలదన్నట్లు తన ʹఇంటర్వ్యూల్లో, సోషల్‌ మీడియా కామెంట్‌లల్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన అనేక విషయాల్లో స్పష్టీకరణతో కూడిన విషయాలు ప్రధానంగా ఉంటున్నాయనిʹ తన లేఖలో పేర్కొన్నాడు.

అసలు మూడు సంవత్సరాల క్రితమే విప్లవోద్యమం నుంచి దిగజారిన జంపన్న పార్టీకి సంబంధించిన విషయాలపై స్పష్టీకరణ ఎలా ఇవ్వ్చగలుగుతాడు? అటువంటి విషయాలు మాట్లాడేందుకు ఆయనకు ఏమి హక్కు ఉంటుంది? ఇదంతా ఒక పధకం ప్రకారం కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారమే. ఈ వ్యవహారంలో ʹఐ డ్రీమ్‌, ఇంకా కొన్ని ఇతర మీడియా సంస్థలు జంపన్న దిగజారుడుకు ʹమసి పూసి మారేడు కాయ చేసిʹ ఇప్పటికీ, ఆయనని మావోయిస్టు ప్రతినిధిగా చిత్రీకరించి, ఆయన మాటలకూ, వ్యాఖ్యలకు ఒక విప్లవ సాధికారతను కల్పించి ప్రజలలో గందరగోళం సృష్టించే కుట్ర చేస్తున్నాయి. ఇటువంటి కుట్రపూరిత నీచమైన ఎత్తుగడలను పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. పార్టీకి సంబంధించిన ఏ విషయంపైనైనా స్పష్టీకరణ ఇచ్చే హక్కు పార్టీలో పని చేస్తున్న వారికీ, పార్టీచేత నియమించబడిన అధికార ప్రతినిధికి మాత్రమే ఉంటుంది.

ఇక జంపన్నపైన మేమిచ్చిన పై వివరణ ప్రకారం మా వ్యాఖ్యలో ఏ మాత్రం హేళనగానీ, నిరాధార ఆరోపణగానీ, అప్రజాస్వామిక వైఖరిగాని లేదని తెలియజేస్తున్నాం. మా వ్యాఖ్య వాస్తవాలనే ప్రతిబింబిస్తున్నదని మరోసారి వక్కాణిస్తున్నాం. వాస్తవంగా జంపన్నే పార్టీలో నెలకొని ఉన్న ప్రజాస్వామిక సూత్రాలకూ, విలువలకూ, ఉమ్మడి కార్యాచరణకు ఏ మాత్రం విలువ నివ్వకుండా వ్యక్తివాదంతో, స్వార్థంతో పార్టీని వదిలి వెళ్ళాడు. ఇటువంటి వ్యక్తి తిరిగి పార్టీకి ప్రజాస్వామిక విలువలనూ, సూత్రాలను బోధించడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆలోచించండి.

జంపన్న ఒకవైపున తన వాస్తవస్థితిని మరుగుపరిచేందుకు ప్రయత్నిస్తూనే, పార్టీపంథా వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు, ʹదేశంలో అనేకమైన ప్రజా సమస్యల పరిష్కారానికి గత 2 దశాబ్దాలకుపైగా మీ కార్యాచరణ ఏమిలేక, విశాల ప్రజా రాశులకు దూరమైన విషయం గత కొన్ని సంవత్సరాలుగా మీకు అర్ధమవుతున్నప్పటికీ, వాటిని దాటవేస్తూ కాలం గడపటం భారత పీడిత ప్రజలను నిరాశ పరుస్తున్నదనిʹ స్వీయాత్మకంగా ప్రకటించాడు.

ఎవరికైనా వాస్తవాలను చూడాలనే చిత్తశుద్ది ఉంటే, వాస్తవాలను గుర్తించగలుగుతారు. కానీ కళ్ళుండి వాస్తవాలను చూసేందుకు నిరాకరించేవారికి వాస్తవాలు ఎట్టిపరిస్థితుల్లోనూ కన్పించవు. నేడు భారతదేశంలో గుర్తింపు పొందిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమంలో మా పార్టీ ఉనికిని గుర్తించడంవల్లనే మోడీ ప్రభుత్వం అ ఉద్యమంలో ʹఅర్బన్‌ మావోయిస్టులుʹ ఉన్నారని అందోళన పడింది. మధ్య భారతదేశంలోని విశాల ఆదివాసీ ప్రాంతాలలో పత్తల్‌ఘడి పేరుతో స్వయం నిర్ణయాధికారం కోసం జరుగుతున్న పోరాటాలకు మెజారిటీగా పార్టీ నేతృత్వం వహిస్తున్నది. గెరిల్లా జోన్‌ ప్రాంతాలలో ముఖ్యంగా దండకారణ్యం, బీహార్, జార్ఖండ్‌, ఏ.ఓ.బీ ఉద్యమ ప్రాంతాలలో పోలీసు క్యాంపుల ఎత్తివేతకు లక్షలాది మంది అదివాసీ రైతాంగం సమరశీలంగా పోరాడుతున్నారు.

ఈ పోరాటానికి పరాకాష్టగా దండకారణ్యంలో సిలింగేర్‌ క్యాంపుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని చూడవచ్చు. అ పోరాటంలో రాజ్యానికి వ్యతిరేకంగా లక్షలాదిమంది మూలవాసీ రైతాంగం చేస్తున్న త్యాగపూరిత, సమరశీల పోరాటం దేశవ్యాపితంగా పోరాడుతున్న ప్రజలను ఉత్తేజపరుస్తున్నది, వారి సంఘీభావాన్ని పొందుతున్నది. విస్థాపనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలలో మెజారిటీ పోరాటాలకు పార్టీ నేతృత్వం వహిస్తున్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదనుకుంటాను. దళిత ఉద్యమాలకు పార్టీ కొన్ని చోట్ల నేతృత్వం వహిస్తుంటే, మరికొన్ని చోట్ల సంఘీభావాన్ని ప్రకటిస్తున్నది.

ఈ క్రమంలో పార్టీ ప్రభావం, నేతృత్వం గెరిల్లా జోన్ల నుంచి విశాల భారతదేశంలోని పట్టణాలకూ, మైదానాలకు విస్తరిస్తున్నదన్న భయంతోనే మోడీ ప్రభుత్వం ʹఅర్బన్‌ నక్సలైట్లʹ పేరుతో అనేక మంది విప్లవ ప్రజాస్వామిక వాదులపై అక్రమ కేసులు బనాయించి జైళ్ళలోకి నెట్టింది. తెలంగాణలో కే.సీ.ఆర్‌ ప్రభుత్వం ఏకంగా 16 సంఘాలపై నిషేధం విధించింది. పార్టీ ఈ విషయంలో చాలా స్పష్టమైన అవగాహనతోనే ఉంది. ప్రజాయుద్ధమంటే గెరిల్లా పోరాటంతోపాటు, అనేక ఇతర పోరాట రూపాలు ఉంటాయనీ, ప్రజాయుద్ధం కేవలం వెనకబడిన గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా, విశాల, మైదాన పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తుందనే సరైన, స్పష్టమైన అవగాహనతో పార్టీ పురోగమిస్తున్నది.

ఈ అవగాహనలో భాగంగానే ప్రధాన శతృవుకు వ్యతిరేకంగా విశాల ఐక్యసంఘటనల ద్వారా ఐక్య ఉద్యమాలను నిర్మించేందుకు కృషి చేస్తున్నది. ఈ క్రమంలోనే దేశవ్యాపితంగా ఏర్పడబోయే ప్రజా ఉద్యమ వెల్లువలో సీ.పీ.ఐ (మావోయిస్టు) కేంద్ర స్థానాన్ని పొందుతుందని పూర్తి విశ్వాసంతో చెప్పదల్చుకొన్నాం. ఈ పరిణామాలను శతృవు చూడగలుతున్నాడు గానీ, జంపన్న మాత్రం చూడ నిరాకరిస్తున్నాడు.

ఇక చివరిగా, ʹదేశంలో సకల సమస్యలకు మూలకారణమైన పెట్టుబడిదారీ వ్యవస్థ అంతానికి మీ శక్తియుక్తులతో నిజమైన ప్రతిదాడిని ఎక్కుపెట్టండి. నిజమైన శతృవులను గుర్తించి వేరు చేయండి. అన్ని రకాల మిత్రులతో కలిసి నడవండిʹ అంటూ జంపన్న హితవు పలికాడు. ఇక్కడే ఉంది, ఆయనకు చెందిన ప్రభుత్వ ప్రాయోజిత, స్పీయాత్మక, రాజకీయ దివాళాకోరుతనం. భారతదేశంలో సకల సమస్యలకు మూలకారణం, జంపన్న చెబుతున్నట్లు పెట్టుబడిదారీ వ్యవస్థకాదు, సామ్రాజ్యవాదుల కనుసన్నలలో నడుస్తున్న బ్రాహ్మణవాద హిందుత్వంతో విడదీయలేనంతగా పెనవేసుకుపోయిన అర్ధవలస-అర్ధభూస్వామ్య వ్యవస్థనే అసలు కారణం.

కనుక సకల సమస్యలను పరిష్కరించుకునేందుకు సామ్రాజ్యవాదులకూ, నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వరాలకు వ్యతిరేకంగా కార్మికవర్గ నాయకత్వంలో నాలుగు విప్లవకర వర్గాలను కలుపుకొని దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలి. అ తర్వాతనే సోషలిస్టు విప్లవాన్నీ, కమ్యూనిజాన్ని స్థాపించాలి. ఈ అసలు వాస్తవాన్ని జంపన్న మరుగున పరిచి విప్లవోద్యమానికి హాని కల్గించే వక్రబుద్ధితో భారతదేశంలో సోషలిస్టు విప్లవం జరగాలని గావుకేకలు పెడుతున్నాడు. జంపన్న అనుసరిస్తున్న ఈ వైఖరిని పార్టీ నిక్క‌చ్చిగా తిప్పికొడ్తుంది.

పార్టీని నడిపించేది గతితార్కిక భౌతికవాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతం వెలుగులోనే గత ఐదు దశాబ్దాలుగా పార్టీ కృషి చేస్తూ పురోగమిస్తున్నది. పార్టీకి సాయుధ పోరాటం నిర్వహించేందుకు సైన్యమంటూ లేని పరిస్థితుల నుంచి దోపిడీ పాలకవర్గాల కిరాయి సాయుధ బలగాలతో ధీటుగా పోరాడే ʹప్రజా విముక్తి గెరిల్లా సైన్యాన్ని నిర్మించుకొన్నది. ప్రజలకు అధికారమే లేని స్థితి నుంచి ప్రాదుర్భావ స్థితిలో రాజ్యాధికార అంగాలుగా ఉన్న గెరిల్లా బేస్‌లను నిర్మించింది. ఈ ప్రయాణమంతా ʹనల్లేరు మీద బండిలాʹ సాగలేదు, అనేక ఓటములతోటి, విజయాలతోటి, రక్తతర్పణతోటి, పెద్ద పెద్ద వెనుకంజలతోటి, ముందంజలతోటి ఉద్యమ ప్రయాణం ముందుకే సాగింది.

భవిష్యత్‌లో కూడా ముందుకే సాగుతుంది. ఇలా చెప్పడానికి పార్టీ చేతిలో మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంత ఆయుధముండటమే కాకుండా, సిద్ధాంత అన్వ‌యింపు ద్వారా ఎప్పటికప్పుడు సామాజిక పరిస్థితులలోనూ, ఉద్యమ స్థితిలోను వస్తున్న మార్పులపై సరైన విశ్లేషణ చేస్తూ, నూతన ఎత్తుగడలను రూపొందించుకుంటూ, వాటిని అమలు చేస్తూ వచ్చిన గొప్ప అనుభవాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలే పార్టీ భవిష్యత్‌ పురోగమనానికి గట్టి హామినిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో దేశంలో నెలకొని ఉన్న (చలనంలో ఉన్న) సామాజిక సంబంధాలపై సీ.సీ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనం ద్వారా దేశ సామాజిక వ్యవస్థ (అర్ధవలస, అర్ధభూస్వామ్య)లో గణనీయమైన మార్పులు జరిగినప్పటికీ, మౌలికమార్చు రాలేదని నిర్ధారించింది. అయితే సామ్రాజ్యవాదుల భారత పాలకవర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఆర్థికవ్యవస్థలో జరిగిన గణనీయమైన మార్పులు, సామాజిక సంబంధాలపై బలమైన ప్రభావాన్ని వేసాయనీ, అవి గణించదగిన పరిమాణామాత్మక మార్పులకు గురి అయ్యాయని సీ.సీ అభిప్రాయపడింది.

ఈ మార్పులు భారతదేశ అర్ధవలస -అర్ధ్థభూస్వామ్య సామాజిక వ్యవస్థ అసమానాభివృద్ధి స్వాభావానికి అనుగుణంగా జరిగాయనీ, ఇందుకనుగుణంగా ఎత్తుగడలలో మార్చు తీసుకురావాలని కూడా సీ.సీ గుర్తించి ఈ క్రోడీకరణలపై ఆధారపడి ʹభారతదేశ ఉత్పత్తి సంబంధాలలో మార్పులు-మన రాజకీయ కార్యక్రమంʹ అనే డాక్యుమెంటును రూపొందించింది. దానిని నెట్‌లో పెడ్తున్నాం. భారతదేశంలో సామాజిక విప్లవాన్ని కోరుకునేవారు దీనిని తప్పక అధ్యయనం చేసి మాకు సూచనలు, సలహాలు పంపాలని కోరుకుంటున్నాం. లోతైన అధ్యయనం, సమిష్టి చర్చ, విప్లవ నిజాయితీ అవసరం లేని జంపన్నకు మా నూతన డాక్యుమెంటు అంత అవసరం కాకపోవచ్చు.

అధికార ప్రతినిధి,
అభయ్‌,

తేది :జులై 6, 2021
సీ.పీ.ఐ (మావోయిస్టు)Keywords : cpi maoist, abhay, jampanna,
(2021-12-03 19:57:09)No. of visitors : 2179

Suggested Posts


అభయ్ పేరిట విడుదలైన ప్రకటనకు జంపన్న జవాబు

రెండు రోజుల క్రితం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో వచ్చిన ఓ ప్రకటనలో జంపన్నపై కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై జంపన్న స్పంధించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పూర్ణేందు శేఖర్ ముఖర్జీ మృతి - అభయ్ ప్రకటన‌

14 ఆగస్టు, 2021 మనం కొద్ది రోజులలో జరుపుకోబోతున్న మన పార్టీ అవిర్భావ వారోత్సవాల ఉత్సాహభరిత రాజకీయ వాతావరణంలో అత్యంత విషాదకర వార్తను వినాల్సి వస్తోంది. ఇటీవలే మా యువ సీసీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ యాప నారాయణ అమరత్వ వార్త నుండి మనమింకా పూర్తిగా తేరుకోక ముందే మేం వెటరన్ కామ్రేడ్ అంబర్ ను కోల్పోయాం.

Celebrate grandly the 17th Anniversary of CPI (Maoist) in revolutionary atmosphere!

CPI (Maoist) is about to celebrate its 17th Anniversary. The CC of our party gave a detailed revolutionary message almost one month back. On the occasion the CC conveys revolutionary

పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17 వ పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోబోతున్నది. మా పార్టీ కేంద్రకమిటీ దాదాపు నెల రోజుల క్రితమే సవివరమైన విప్లవ సందేశాన్ని అందజేసింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ తరపున యావత్ పార్టీ శ్రేణులకు; పీఎల్‌జీఏ కమాండర్లకు, యోధులకు; విప్లవ ప్రజా నిర్మాణాల నాయకులకు, కార్యకర్తలకు; విప్లవ ప్రజా కమిటీల నాయకులకు, కార్యకర్తలకు; దేశం

Search Engine

నాగాలాండ్ లో 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపిన సైన్యం
తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
more..


జంపన్నలేఖ‌కు