ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం
[నిర్వాసిత్వ వ్యతిరేక ఉద్యమం - జార్ఖండ్ రాష్ట్రం- రాజ్యం పాత్రపై ఫాదర్ స్టాన్ స్వామి అనేక వ్యాసాలు రాశారు. ఈ వ్యాసం 2014 లో ప్రాక్సిస్ రివ్యూలో ప్రచురితమైంది.]
" ...రాష్ట్రంలో మావోయిస్టులతో పోరాడటానికి ఆదివాసీలకు గెరిల్లా యుద్ధంలో శిక్షణ యివ్వాలి" [హిందుస్తాన్ టైమ్స్, రాంచి ఎడిషన్, 30-6-2014]
ఈ వార్తాపత్రిక సమాచారం ప్రభుత్వ ప్రణాళికను వివరిస్తుంది. రాష్ట్రంలోని ఆదిమ ఆదివాసీ సమూహాల యువతతో రెండు ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేసి అడవుల్లోని మావోయిస్టులతో పోరాడటానికి అధునాతన గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇవ్వనున్నారు. తిరుగుబాటు నిరోధక చర్యలలో వారు భద్రతా దళాలకు సహాయం చేస్తారు.
వారు అటవీ ప్రాంతాలలో పుట్టి పెరిగారు, పరిసరాల గురించి వారికి బాగా తెలుసు, అననుకూల పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనేది ఈ ఆదిమ ఆదివాసీ యువకులను ఎన్నుకోవటానికి గల కారణం.
దీంతో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతాయి: (1) జార్ఖండ్ లోని ʹమావోయిస్టులుʹ ఎవరు? (2) ఆదివాసీలు ఎవరు? (3) జార్ఖండ్‌లోని ఆదిమ ఆదివాసీ సమూహాలు ఎవరు? వారి ప్రస్తుత సామాజిక-ఆర్థిక పరిస్థితి ఏమిటి? (4) సుప్రీంకోర్టు ఏమి చెబుతుంది?
జార్ఖండ్‌లోని ʹమావోయిస్టులుʹ ఎవరు?
జార్ఖండ్‌లో ఎక్కువగా ʹమావోయిస్టులుʹ అని పిలవబడేవారు స్థానిక ఆదివాసీలు అనేది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అగ్ర నాయకత్వంలో కొంతమంది రాష్ట్రం బయట నుండి వచ్చివుండవచ్చు, కాని కార్యకర్తలు ఎక్కువగా ఆదివాసీలు, స్థానికులు.
2014 జనవరి 1 నుండి జూన్ 30 వరకు, ఆరు నెలల వ్యవధిలో జార్ఖండ్ లో మావోయిస్టులు అనే అభియోగంతో అరెస్టు చేసిన 243 మందిలో 186 (77%) మంది స్థానిక ఆదివాసీలు అనే వాస్తవం దీన్ని రుజువు చేస్తుంది. వాటిలో ʹఎన్కౌంటర్లుʹ అని పిలవబడే వాటిలో 10 మంది మరణించారు, వారిలో 7గురు (70%) ఆదివాసీలు. ఆదివాసీ అంటే మావోయిస్టు అని ప్రభుత్వం అనేసుకుంటుంది అనడానికి ఇది తగినంత రుజువు. కాబట్టి ఆదివాసీ సమాజంపై అణచివేత ʹమావోయిస్ట్ పై చర్యʹ పేరిట జరుగుతుంది.
ఆదివాసీలు ఎవరు?
ఒక అపూర్వమైన తీర్పులో భారత సుప్రీంకోర్టులాంటి అత్యున్నత సంస్థ దీనికి సమాధానమిచ్చింది. [క్రిమినల్ అప్పీల్ నం: 11/2011] కోర్టు ʹభారతదేశంలో మూల నివాసులు ద్రవిడులు కాదు, ద్రవిడ పూర్వ ముండా ఆదిమవాసులు, వారి వారసులు ప్రస్తుతం చోటనాగ్‌పూర్ (జార్ఖండ్), ఛత్తీస్‌ఘడ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ మొదలైన ప్రాంతాల్లోనూ, తమిళ నాడులోని నీల్‌గిరి కొండల్లో వుండే తోడాలు, అండమాన్ దీవులలోని ఆదివాసీలు, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో (ముఖ్యంగా అడవులు, కొండప్రాంతాలలో)వుండేవారు. ఉదాహరణకు గోండ్లు, సంథాల్, భిల్లులు మొదలైనవారు.
భారతదేశంలో ఆదివాసీ ప్రజలకు జరిగిన అన్యాయం దేశ చరిత్రలో ఒక సిగ్గుపడే అధ్యాయం. ఆదివాసీలను ʹరాక్షస్ʹ (రాక్షసులు), ʹఅసురులుʹ అని పిలిచారు. వారిని పెద్ద సంఖ్యలో వధించారు, మిగిలినవారిని, వారి వారసులను నీచంగా చూశారు, అవమానించారు, శతాబ్దాలుగా వారిపై అన్ని రకాల దారుణాలు జరుగుతున్నాయి. వారు తమ భూములను కోల్పోయి, పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులతో, అడవులు, కొండల్లోకి దయనీయమైన అస్థిత్వానికి నెట్టబడ్డారు. వారు నివసిస్తున్న అడవులు, కొండల భూమిని, వారి జీవనాధారమైన అటవీ ఉత్పత్తులను కూడా లాక్కోడానికి ఇప్పుడు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు.ʹ [ఇవి సుప్రీంకోర్టు చెప్పిన యదాతధ వాక్యాలు]
అపారమైన లాభాలను గడించడానికి, ఖనిజ-అటవీ సంపన్న భూమిని కాజేయటానికి పాలకవర్గాలు ప్రభుత్వాన్ని అనుకూలమైన సాధనంగా ఉపయోగించుకొని సాగిస్తున్న దోపిడీ, అణచివేతలను భరించడానికి యిక ఆదివాసీలు ఏ మాత్రం సిద్ధంగా లేరనడంలో ఆశ్చర్యమేమీ లేదు. కార్పొరేట్, వ్యాపార వర్గం, పట్టణ మధ్యతరగతి, పై నుండి క్రింది స్థాయి వరకు వున్న ప్రభుత్వాధికారులు, పోలీసులు, పారా మిలటరీ దళాలు - అందరూ వారికి శత్రువులుగా తయారయినప్పుడు, పేద ఆదివాసీలు తాము పూర్తిగా అంతమైపోకుండా కనీస రక్షణను కలిగించే ʹకామ్రేడ్స్ʹ (అడవి అన్నలు) దగ్గరికి తప్ప ఇంకెవరిదగ్గరకు వెళ్తాడు?
ʹఆదిమ ఆదివాసీలుʹ ఎవరు?
ఆదిమ ఆదివాసీ సమూహాలు స్వతంత్ర భారతదేశంలో, జనాభాలో చాలా నిర్లక్ష్యం చేయబడిన విభాగం. జార్ఖండ్‌లో వారు అసుర్, బిర్హోర్, కొర్వా, హిల్ పహరియా, పహరియా, సవర్, సౌరియా పహరియాలు.
జార్ఖండ్‌లోని ఆదిమ తెగల మొత్తం జనాభా 19,48, 351. ఈ ఆదివాసీ సమూహాలు సంచార జీవులు, ఇప్పటికీ ఆహార సేకరణ దశలో ఉన్నాయి. తమ జీవనోపాధి కోసం అడవులలో తిరుగుతారు. వారి సంచార స్వభావం కారణంగా, అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, స్థిరపడిన వ్యవసాయం వారికి అందడం ఆలస్యమైంది. ఈ సమూహాలను జాగ్రత్తగా చూసుకోకపోతే, పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు.
ఆచరణలో అన్ని ఆదిమ ఆదివాసీ సమూహాలు ప్రతికూల జనాభా పెరుగుదలను చూపించాయి. తక్కువ జనన రేటు, అధిక మరణాలు, అధిక శిశు మరణాలు, వ్యాధుల బారిన పడటం, ఎక్కువ అనారోగ్య స్థితి, అంటువ్యాధులు, రక్తహీనత, వంధ్యత్వం వంటి కొన్ని వ్యాధుల నుండి వుండే ముప్పు దీనికి కారణం.
అక్షరాస్యత రేటు 10% కన్నా తక్కువ, మహిళల్లో ఇది 2% లేదా 3% కంటే తక్కువగా ఉంటుంది. [అలెక్స్ ఎక్కా: ఆదివాసిస్ / స్వదేశీ పీపుల్స్ ల్యాండ్ సిరీస్ - 4 జార్ఖండ్, ఆకార్ బుక్స్ & ది అదర్ మీడియా, 2011, pp. 21-23]
అన్నింటిలో మొదటిది, ముద్ర వేయడం చాలా తప్పు. వారు సాధారణ ఆదివాసీ లేదా ప్రిమిటివ్ ఆదివాసి పరిధిలోకి వచ్చినా, వారంతా ఆదివాసీలు. ఎస్టీ & ఎస్సీ ఆర్డర్ (సవరణ) చట్టం, 1976 లో 9 ఆదిమ ఆదివాసీ సమూహాలతో సహా 30 ఆదివాసీ తెగలను జార్ఖండ్ రాష్ట్రానికి షెడ్యూల్ చేయాలని ప్రకటించింది.
కొన్ని సాధారణ, ఆదిమ తెగలు మాట్లాడే భాషలు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. వారు ఒకరికొకరు దగ్గరగా భౌగోళిక సామీప్యతతో జీవిస్తారు, వారపు సంతల్లో ఒకరితో ఒకరు కలిసిపోతారు. కాబట్టి వారంతా ఒకటి. పాలకవర్గ రాజకీయ సౌలభ్యం కోసం వారిని వేరు చేయడమే కాకుండా, వ్యతిరేకంగా నిలబెట్టడం క్రూరమైన అన్యాయం.
ఆదిమ తెగల ప్రస్తుత దుస్థితిని చూసిన ప్రభుత్వం వారి భయంకరమైన ఆర్థిక, పేదరికం, సామాజిక బలహీనత నుండి బయటకు తీసుకురావడానికి అర్ధవంతమైన, సమర్థవంతమైన ప్రయత్నాలు చేయాలి. అటవీ హక్కుల చట్టం, 2006 ను వేగంగా అమలు చేయడం ద్వారా ప్రతి కుటుంబానికి కనీసం 2 హెక్టార్ల (5 ఎకరాలు) పట్టా -భూమి ఇస్తే స్వయంప్రతిపత్తి ఆర్థిక వ్యవస్థకి దగ్గరైనట్లవుతుంది.
సుప్రీంకోర్టు ఏమి చెప్పింది?
ప్రత్యేక పోలీసు అధికారులపై (SPOలు) తీర్పు ఇచ్చిన సందర్భంలో చత్తీస్‌ఘడ్ లో, "మావోయిస్ట్ / నక్సలైట్ హింసకు వ్యతిరేకంగా పోరాటం కేవలం శాంతిభద్రతల సమస్యగా పరిగణించకూడదు" అని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే స్థానికంగా, భీకరంగా ఉన్న స్థూల అసమానతలతో బాధపడుతున్న సమాజంపై రాజ్యం అనుసరిస్తున్న సామాజిక ఆర్థిక విధానాలలోనే ప్రాధమిక సమస్య లోతుగా ఉంది. ఇటువంటి ఉగ్రవాద హింసకు దారితీసే సామాజిక అసంతృప్తిని తగ్గించడానికి అవసరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిష్కార విధానాలను చేపట్టడం తప్పనిసరి అని ఇది సూచిస్తుంది,ʹ [ఎస్సీ - రిట్ పిటిషన్ (CIVIL) NO(s) 250 2007]
ఈ ప్రాతిపదికన, చత్తీస్‌ఘడ్‌లోని ఎస్‌పిఓలను, రద్దు చేయాలని, కేంద్రప్రభుత్వం గౌరవవేతనంగా యిస్తున్న అన్ని నిధులను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
చివరగా, సాధారణ మానవ జ్ఞాన నిర్దేశనకి, సుప్రీం కోర్టు యిచ్చిన ఆదేశానికి కట్టుబడి ఉండటానికి బదులుగా మావోయిస్టులతో పోరాడే పేరుతో, ఆదిమ ఆదివాసీల నుండి కొంతమంది యువకులను ఎన్నుకొని, వారికి గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదన, ఆదివాసీలను, ఆదివాసీలతో పోరాటం చేయించడం, చంపించడం అత్యంత క్రూరమైన చర్య అవుతుంది. అందుబాటులో వున్న ప్రతి పద్ధతిలో దీన్ని వ్యతిరేకించాలి.
(groundxero.in సౌజన్యంతో)
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి
Keywords : stan swamy, adivasi, maoists, jarkhamd,
(2025-03-15 15:39:40)
No. of visitors : 1644
Suggested Posts
| ఆదివాసీల సహవాసి వెళ్ళిపోయాడు!గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించారు. ఆయన వయసు 84. మే నెలలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి స్వామి తొమ్మిది నెలలు జైలులో ఉన్నారు . పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఆదివారం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చారు . |
| ఫాదర్ స్టాన్ స్వామి జైలు కవితభయపెట్టే చెరసాల సింహద్వారం దాటగానే అతి కనీస అవసరాలు మినహా నీ సొంత వస్తువులన్నీ లాగేసుకుంటారు |
| Stan Swamy death an institutional murder by Modi government - Maoist Party
rrest, the governments would announce that they did all the needed and were helpless. As he guessed, the Indian Foreign Minister immediately responded and issued a report that his arrest was legal.
|
| ఫాదర్ స్టాన్ స్వామిది హత్యే... భీమా కోరేగావ్ కేసును వెనక్కి తీసుకోవాలి - మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రకటనదేశ దళిత అదివాసీ పీడిత ప్రజా సముదాయాల ప్రజలు తమ శ్రేయోభిలాషిని, ఒక నిజమైన ప్రజాస్వామికవాదినీ కోల్పోయారు. భారత దేశంలోని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తుల రాజ్య నిరంకుశత్వానికి 84 ఏళ్ల జిస్యూట్ ప్రీస్ట్ ఫాదర్ స్టానిస్లాస్ లూర్గుసామి బలైపోయారు. |
| స్టాన్ స్వామికి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీలు - నిరాకరించిన కోర్టుభీమాకోరేగావ్ కేసులో జైల్లో ఉండి మరణించిన ఆదివాసీ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీల విఙప్తిని కోర్టు తిరస్కరించింది. |
| స్టాన్ స్వామి మృతి కలచి వేసింది, రాజకీయ ఖైదీలను విడుదల చేయండి -ఐక్యరాజ్యసమితి ఫాదర్ స్టాన్ స్వామి జైల్లోనే రిమాండు ఖైదీగా మృతి చెందడం పట్ల ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హైకమిషనర్ మైఖేల్ బ్యాచ్‌లెట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. |
| bhima koregaon: స్టాన్ స్వామి చనిపోలేదు - చంపబడ్డాడుఫాదర్ స్టాన్ స్వామి మరణం అనేకమందిని ధుంఖంలో ముంచింది. పీడితుల పక్షాన ఉన్నందుకే అతనిపై అబద్దపు కేసులు బనాయించి, జైల్లో వేధించి, తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా అతని మరణానికి |
| అతని మరణం ఒక సత్య ప్రకటన -విరసంఅతను వెళ్లి పోయాడు. మనందరిని వదిలి సాగిపోయాడు. అతను భూగోళం ఖాళీ చేసాక దుఃఖ పడటం మన వంతయింది. అతను గౌరవ వీడ్కోలు తీసుకోలేదు. శిలువతో సెలవంటూ వెళ్లి పోయాడు. |
| వాళ్ళు ఈ నేలకు శాపం పెట్టారు ---- అరుంధతీ రాయ్భారతదేశ ప్రజాస్వామ్యం క్రమేపీ పయనిస్తున్న ʹహత్యాపథంలోʹ స్టాన్ స్వామి హత్య ఒక పెద్ద పరిణామం. చూడటానికి చిన్నదిగా కనిపించినా, నిజానికి ఇది చాలా పెద్ద సంఘటన. విస్తృతంగా ప్రభావం వేసిన ఒక అత్యంత పెద్ద సంఘటన. |
| మమ్మల్ని మన్నించు సామీ! బ్రతుక్కి అర్థం తెలీనోళ్లంబాగా చదువుకుని, రెండు చెవులూ సరిగా పనిచేయక, అవయవాలు సరిగా పనిచేయని పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ, వెన్నెముక కిందిబాగం పాడైపోయి సరిగా కూర్చోలేని స్తితిలో జనంలో బ్రతికే అదివాసీల తరపున మాట్లాడే ఒక 84 ఏళ్ల ముసలితనపు హక్కుల కార్యకర్త, ఎవరి హత్యకోసం? ఏ రకంగా కుట్ర పన్నాడో? ఆధారాలు లేకుండా, ఇలా జైలులో నిర్బంధించి, చావుకి ఎరవేయడాన్ని ఏమందాం? |