ఈ నెల 30న కామ్రేడ్ బండ్రు నర్సింహులు సంస్మరణ సభ‌

ఈ

25-01-2022

తెలంగాణ సాయుధ పోరాటం నుండి నేటి దాకా విప్లవం కోసం పరితపించిన అందుకోసం ప్రతి క్షణం పాటుపడ్డ కామ్రేడ్ బండ్రు నర్సింహులు తన 104వ ఏట జనవరి 22న అమరుడయ్యారు. ఈ నెల 30న ఆ కామ్రేడ్ సంస్మరణ సభ ఆలేరులో జరగనున్న నేపథ్యంలో కామ్రేడ్ బండ్రు నర్సింహులు స్మారక కమిటి, తెలంగాణ కరపత్రం పర్చురించింది.

ఆ కరపత్రం యదాతథంగా.....

ప్రజలారా,

మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో దళ కమాండర్ గా పనిచేసిన స్ఫూర్తిని నేటి దాకా కొనసాగిస్తూ, సి.పి.ఐ (ఎం-ఎల్) జనశక్తి నాయకుడిగా, ప్రజా విమోచన సంపాదకునిగా వ్యవహరిస్తున్న కామ్రేడ్ బండ్రు నర్సింహులు (104), జనవరి 22, 2022న మ|| 3గం||లకు కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచారు. తన జీవిత కాలంలో మూడు తరాలను నిత్య చైతన్యంతో నడిపించే ప్రయత్నం చేస్తూ, కడదాకా కమ్యూనిస్టుగా | బతకాలనీ తన వద్దకు వచ్చే వారికి బోధిస్తూనే నిష్క్రమించారు. తన - పార్టీవ శరీరాన్ని గాంధీ మెడికల్ కాలేజీ కి ముందే డొనేట్ చేయడంతో వాళ్ళు రాత్రి 9గంటల వరకు సందర్శకులు నివాళులర్పించుటకు అనుమతించారు. కా॥ బండ్రుకు సి.పి.ఐ (ఎం-ఎల్) జనశక్తి కేంద్రకమిటీ నివాళులర్పించింది. తన పార్థివదేహం మెడికల్ కాలేజీకి సమర్పించడంతో చాలామంది బండ్రును అంతిమంగా చూడలేకపోయారు. కొద్దిగంటల్లోనే అయినా దాదాపు 500 మంది వచ్చి నివాళులర్పించారు. అందుకే ఆయన పుట్టి పెరిగి ఎనిమిది దశాబ్దాల విప్లవ జీవితం సాగించిన ఆలేరులోనే బండ్రు సంస్మరణ సభ నిర్వహిస్తున్నాం. అందరూ హాజరు కావాలని కోరుతున్నాం.

కామ్రేడ్ బండ్రు 1944మార్చిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన 11వ ఆంధ్ర మహాసభల్లో వాలంటీర్‌గా వెళ్ళి, ఆ సభల్లో వచ్చిన చీలికలో కమ్యూనిస్టుల వైపు నిలిచి సాయుధ పోరాట యోధుడిగా ఎదిగారు. 1946లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాట పిలుపునందుకుని యాదగిరిగుట్ట అయ్యగార్ల వేషంలో వెళ్ళి రాయగిరి పోలీసు స్టేషన్లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 1948లో కొలనుపాకలో జరిగిన ఎదురుకాల్పుల్లో అరెస్టయి 3నెలలు జనగాం క్యాంపులో చిత్రహింసలను అనుభవించారు. ఆ సందర్భంగా దాచిన 30 ఆయుధాలను కాపాడి 1952 సాధారణ ఎన్నికల తర్వాత విడుదలైన తరవాత పార్టీకప్పగించారు. సి.పి.ఐ చీలికలో సి.పి.ఎం వైపు నిలబడి 1967లో ఆలేరు నియోజకవర్గ MLAగా పోటీ చేశారు. కమ్యూనిస్టుల ఓట్లు చీలి మొదటిసారి ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 1984లో మిర్యాలగూడ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకుడిగా పలు ఉద్యమాలు నడిపాడు. తీవ్ర నిర్బంధ పరిస్థితుల్లో 1986లో తన ఇంటి పరిధుల్లోనే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించడంతో ఇంటిల్లిపాది దాడులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆలేరు ప్రాంతంలోని మల్లాపురం, కొలనుపాక, రఘునాథపురం, కాసారం, మంతపురి, జలాల పురం, బావుపేట, బహద్దూర్‌పేట తదితర వందలాది
గ్రామాల్లో జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో, రైతు కూలీ రేట్ల పెంపుదల ఉద్యమాల్లో కా॥ బండ్రు అందించిన స్ఫూర్తి కడదాకా కొనసాగుతుంది.

తిరిగి నక్సల్బరీ వసంత మేఘ గర్జనతో సాయుధ విప్లవ పంథానందుకుని 1969లో అట్లా ప్రగడ ప్లీనంకు హాజరై ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ (ఎపిఆర్ సిపి) లో భాగమైనారు. పార్టీ ప్లీనంకు హాజరైన మినిట్స్ ఆధారంగా 68 మందిపై నమోదైన హైద్రాబాద్ కుట్ర కేసులో కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, కాకి లాక్ష్మారెడ్డిలతో పాటు జైలు శిక్ష అనుభవించారు. ఈ కుట్ర కేసులో బెయిల్ పై రాగానే ఎమర్జెన్సీ రోజుల్లో అరెస్టయి 2 సం||రాలు డిటెన్యుగా, ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు అదనంగా కుట్ర కేసులో జైల్లోనే ఉండి పోయినారు. ఎమర్జెన్సీ శిక్షా కాలాన్ని కాంకరెంట్ గా పరిగణించాలని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ తీర్పుతో విడుదలై వచ్చాడు. 1964లో డి.ఐ. ఆర్. క్రింద, 1974 రైల్వే సమ్మెలో, విప్లవోద్యమ క్రమంలో ఎన్నో తప్పుడు కేసుల్లో అలవిగాని చిత్రహింసలు ఎదుర్కొని జైలులో మగ్గాడు. ఆ విధంగా ఎన్నో కేసులతో తన జీవిత కాలంలో 12 సం||రాలు జైలు జీవితం గడిపాడు. భూస్వాముల పాలిట సింహ స్వప్నంగా పేరుగాంచాడు. 1980 సి.పి.ఐ (ఎం-ఎల్) ప్రత్యేక మహాసభల ప్రతినిధిగా పాల్గొన్నాడు. 1992 జనశక్తి ఏర్పాటులో పాలుపంచుకొని అన్నిరకాల అన్యవర్గ ధోరణులకు వ్యతిరేకంగా పోరాడాడు. గోదావరిలోయ, కరీంనగర్ ప్రతిఘటనా పోరాటాల వెంట పయనించాడు.

బండ్రు కొమురమ్మ-బుచ్చి రాములుల రెండో బిడ్డగా నాటి నల్లగొండ జిల్లా ఆలేరులో 1918లో కామ్రేడ్ బండ్రు నర్సింహులు జన్మించారు. అయితే తల్లి చెప్పిన గుర్తుల ఆధారంగా బండ్రు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే జన్మించినట్లు ధృవీకరించుకుని తన జీవిత చరిత్రలో తన జన్మదినం 1915, అక్టోబర్ 2గా ప్రకటించారు. దీని ఆధారంగానే 2015, అక్టోబర్ 1న ఆయన నూరేళ్ళ పండుగను పలు సంఘాలన్నీ కలిసి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐక్యంగా నిర్వహించారు. తన భూమిని తనఖా పేర ఆక్రమించిన షాహుకారు నారాయణకు వ్యతిరేకంగా పోరాడుతూ తల్లి బండ్రు కొమురమ్మ భువనగిరి కోర్టులో కేసు గెలిచింది. తల్లి పోరాట పటిమను, మొండితనాన్ని అలవర్చుకుని హమాలి పని, వ్యవసాయంలో రాటు దేలిన బండ్రు నర్సింహులు తన సోదరులిద్దరు అనారోగ్యంతో మరణించినా వెరవకుండా సాయుధ పోరాటంలో దుంకాడు. తన ముసలి తల్లికి తోడుగా తన భార్య దివంగత బండ్రు నర్సమ్మను ఉంచి పోరాటంలో ముందుకు సాగాడు. 1952 తర్వాతనే కలిగిన ఐదుగురు సంతానంలో వరుసగా ప్రభాకర్, అరుణ, జయ, భాస్కర్, విమలలున్నారు. కుటుంబ సంబంధాలకంటే వర్గ సంబంధాలకే ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. పెద్ద కొడుకు ప్రభాకర్ 1974 రైల్వే సమ్మెకు మద్దతుగా కరపత్రాలు పంచుతూ అరెస్టయినాడు. శ్రీమతి బండ్రు నర్సమ్మ, కోడలు శ్రీమతి అండాలు ఇద్దరు సంఘం కార్యాలయంలా ఉన్న తమ ఇంటిని ఎంతో సహనంతో నడుపుతూ నిత్య నిర్బంధాలకు ఎదురీదారు.

2011, జూన్ 10న బండ్రు నర్సమ్మ కన్నుమూసిన తర్వాత నుండి బండ్రు నర్సింహులును ఆయన కుటుంబం కంటికి రెప్పలా కాపాడుకున్నది. ఆ విధంగా బండ్రు కుటుంబంలోని మూడు తరాలు ఆయన ఆశయాలను గౌరవించే విధంగా మలుచుకోవడం, విప్లవ సానుభూతిపరులుగా కొనసాగడం అరుదైన పరిణామమే.

కామ్రేడ్ బండ్రు సంపాదకత్వంలో 2015 నుండి ప్రజా విమోచన పీడిత ప్రజల రాజకీయ పక్ష పత్రికగా వెలువడుతుంది. గత సంవత్సరం క్యాన్సర్ వ్యాధి సోకే వరకు తన పనులు తాను చేసుకోవడమే గాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వాడు. అనేక సభలు, సమావేశాల్లో ప్రసంగించి యువకులకు సందేశం ఇచ్చేవాడు. అలనాటి పోరాట పటిమను జీవిత చరమాంకం వరకు కొనసాగించిన బండ్రు నర్సింహులు ఆశయాలను కొనసాగించడమే అతనికి అంతిమ నివాళి కాగలదు. 1920లో పుట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ కంటే ముందుగా జన్మించి ప్రతి మూలమలుపులో నిఖార్సయిన కమ్యూనిస్టుగా దృఢంగా నిలబడడం ఆయన ప్రత్యేకత.

స్టాలిన్ సలహాలను వక్రీకరించి 1951లో ఉమ్మడి పార్టీ నాయకత్వం తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించడాన్ని జైల్లో ఉండి కూడా వ్యతిరేకించాడు. తిరిగి నక్సల్బరీ ప్రజాయుద్ధ రాజకీయాలను ఎత్తిపడూ తన ప్రాణ స్నేహితుడైన దుంపల మల్లారెడ్డి తోనూ రాజకీయంగా విడిపోయాడు. అమరులు యానాల మల్లారెడ్డి, కాకి లక్ష్మారెడ్డి, పలస భిక్షం, బూర్గు అంజయ్య, ఏనుగు పోచయ్య, రఘునాథపురం కటకం అంజన్న, పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి, దేగల సోమన్న, యానాల చంద్రారెడ్డి లాంటి ఎంతోమంది సీనియర్లతో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా విప్లవోద్యమానికి ప్రాణం పోశారు. అది ఏ పార్టీ సభ అయినా తన కంచు కంఠంతో సాయుధ పోరాటమే భారతదేశ విముక్తికి మార్గమని చాటి చెప్పారు. బండ్రు నమ్మి ఆచరించిన ప్రజాయుద్ధ రాజకీయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన విప్లవ వారసత్వం కాగలుగుతుంది.

చివరి దశలో నిజమైన విప్లవకారులంతా ఏకం కావాలని పరితపిస్తూ తనను చూడటానికి వచ్చిన కామ్రేడ్స్ చంద్రన్న, విశ్వంలతో పాటు తమ పార్టీ నాయకుడు కామ్రేడ్ కూర రాజన్నకు సైతం బండ్రు నర్సింహులు విన్నవించాడు. ప్రతి సభలో గర్జించే అతని గొంతు మూగబోదని ప్రకటిస్తూ అతని పరిపూర్ణ విప్లవ జీవితాన్ని ఆదర్శంగా స్వీకరిద్దాం. నూరేళ్ళు దాటిన భారత కమ్యూనిస్టు విప్లవోద్యమంతో పెనవేసుకుని సాగిన ఆయన జీవితంలోని నిబద్ధతను, పట్టుదలను, క్రమశిక్షణను త్యాగనిరతిని కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళియని ప్రకటిద్దాం. విప్లవోద్యమంలో అమరులైన వాళ్లందరినీ ఈ సందర్భంగా తలుచుకుందాం. విప్లవకారుల ఐక్యతకై ప్రతినబూనుదాం.

శ్రీమతి కూర మల్లమ్మ కూడా జనవరి 30, 2019న దాదాపు నూరేళ్ళ వయసులో వేములవాడలో కన్నుమూసింది. 40 సం||రాల ఒంటరి జీవితంలో రాజ్యం నుండే గాకుండా జీవన పోరాటంలో ఎన్నో సవాళ్ళనెదుర్కొని విప్లవోద్యమ సానుభూతిపరురాలిగా నిలిచింది. యాదృచ్చికమే అయినా జనవరి 30, 2022న ఆమె మూడవ వర్ధంతి జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీమతి కూరమల్లమ్మ, బండ్రు నర్సమ్మ లతో పాటు భారత విప్లవోద్యమంలో అమరులైన వాళ్లందరినీ స్మరించుకుందాం.

‍ - కామ్రేడ్ బండ్రు నర్సింహులు స్మారక కమిటి, తెలంగాణ‌

Keywords : comrade bandru narsimhulu, janashakti, telangana armed struggle, vimala,
(2024-04-28 05:32:46)



No. of visitors : 668

Suggested Posts


హరిభూషణ్, భారతక్కలు కరోనాతో మృతి -మావోయిస్టు పార్టీ ప్రకటన

తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు కా|| హరిభూషణ్ (యాప నారాయణ), దండకారణ్యంలోని మాడ్ డివిజన్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు కా|| సిద్ధబోయిన సారక్క ( భారతక్క) ఇరువురు కరోనా లక్షణాలతో భాదపడుతూ తుదిశ్వాస విడిచారు.

Etala Rajendar :ఈటల రాజేందర్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం

ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యూ వరకు కలిసి పోరాడాతారని మాజీ మంత్రి, తాజా బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన ప్రకటన పై సీపీఐ మావోయిస్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్‌కు, ఈటలకు మధ్య కలహం ఏమాత్రం ప్రజలకు

మావోయిస్టు లింకులంటూ ప్రచారాలు...ప్రజా సంఘాలపై దాడులు...ఖండించిన పౌరహక్కుల సంఘం

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వం తన అప్రజాస్వామిక రూపాన్ని ,రాజ్యహింస ను తీవ్రంగా అమలు చేయడంలో భాగంగా మేధావులకు,ప్రతిపక్ష పార్టీలకు మావోయిస్టులకు సంబందం ఉందనే అసత్య ప్రచారం చేస్తూ ...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఈ