ʹసాయుధ శాంతి స్వప్నంʹ : హైకోర్టు తీర్పు

ʹసాయుధ

23-03-2022

వీక్షణం ఏప్రిల్ 2022 సంచిక కోసం ఆ పత్రిక సంపాదకులు తెలుగులోకి అనువదించిన హైకోర్టు తీర్పు పూర్తి పాఠం.....

రామకృష్ణ రచనల, ఆయన మీద సంస్మరణ రచనల సంకలనాన్ని ఆవిష్కరణకు ముందే జప్తు చేసి, కేసు పెట్టిన పోలీసుల చర్యను తప్పుపడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు

2021 అక్టోబర్ లో మరణించిన మావోయిస్టు నాయకుడు రామకృష్ణ సంస్మరణలో వెలువడిన కవితలు, వ్యాసాలు, జ్ఞాపకాలు, గతంలో ప్రభుత్వంతో చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రకటనలు కలిపి ఆయన సహచరి శిరీష ʹసాయుధ శాంతి స్వప్నంʹ అనే పుస్తకం సంకలనం చేశారు. ఆ పుస్తకావిష్కరణ సభ నవంబర్ 14న హైదరాబాద్ లో జరగవలసి ఉండింది.

ఆ ఆవిష్కరణ సభకు రెండు రోజుల ముందు నవ్య ప్రింటింగ్ ప్రెస్ మీద దాడిచేసిన పోలీసులు అచ్చయిన పుస్తకాలనూ, ప్రింటింగ్ ప్రెస్ సామగ్రినీ కూడ జప్తు చేశారు. ఆవిష్కరణ సభ జరగకుండా హాలు యజమానుల మీద ఒత్తిడి తెచ్చారు. ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డి మీద, ఆయన సహచరి సంధ్య మీద కేసు పెట్టారు. ఆ పుస్తకాల జప్తును, ఆవిష్కరణ సభ మీద ఆంక్షలను సవాల్ చేస్తూ శిరీష దాఖలు చేసిన కేసు (రిట్ పిటిషన్ నం. 6479/2022) లో తాను ప్రచురించిన పుస్తకం నేరం కాదని ప్రకటించాలని, ఆ పుస్తకాలను జప్తు నుంచి విడిపించి తనకు తిరిగి ఇప్పించాలని, పుస్తకావిష్కరణ సభను అడ్డుకోకుండా చూడాలని హైకోర్టును కోరారు.

తమ ప్రెస్ మీద దాడిని, తమ మీద కేసును సవాల్ చేస్తూ ప్రెస్ యజమానులు దాఖలు చేసిన మరొక కేసు (క్రిమినల్ పిటిషన్ 659/2022) లో తమ మీద తెలంగాణ ప్రజా భద్రతా చట్టం కింద అంబర్ పేట పోలీసులు పెట్టిన కేసును రద్దు చేయాలని కోరారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ ఈ రెండు వ్యాజ్యాలను కలిపి విచారించి, మార్చ్ 11న తీర్పు వెలువరించారు.

ఈ కేసులలో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు నందిగం కృష్ణారావు, డి. సురేష్ కుమార్ వాదించగా, ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖాజా విజారత్ అలీ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎస్ రామమోహన రావు వాదించారు. మొత్తం 32 పేజీల తీర్పులోని ప్రధాన భాగాలు:

కేసు వివరాలు:

అక్కిరాజు హరగోపాల్ @ రామకృష్ణ @ ఆర్ కె ఫొటోలతో కూడిన ʹసాయుధ శాంతి స్వప్నంʹ అనే పుస్తకాన్ని అచ్చువెయ్యబోతున్నారని, ఆ పుస్తకం నిషిద్ధ మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేస్తుందని, ఆ పుస్తకం అచ్చుపనిని అక్కిరాజు హరగోపాల్ @ రామకృష్ణ @ ఆర్ కె భార్య కోరిక మేరకు చేపట్టారని, నిషిద్ధ మావోయిస్టు పార్టీ పట్ల సానుభూతితో ఉచితంగా చేపట్టారని పిటిషనర్ల మీద ఆరోపణలు.

పోలీసులు ప్రెస్ నుంచి జప్తు చేసుకున్న వస్తువులు: 1. బైండింగ్ కు ముందు దశలో ఉన్న 513 పుస్తకాలు (50 కాపీల చొప్పున ఉన్న 10 కట్టలు, విడిగా 13 కాపీలు). 2. 1000 కాపీలు పుస్తకం ముఖచిత్రం . 3. దాదాపు 487 కాపీలు ఇంకా పుస్తకాలుగా ఎత్తిపెట్టని విడి ఫారాలు. 4. 25 అల్యూమినియం ప్రింటింగ్ షీట్లు. 5. (ఏమీ రాయలేదు). 6. (ఏమీ రాయలేదు). 7. రెండు డెల్ డెస్క్ టాప్ కంప్యూటర్లు, రెండు సిపియు లు. 8. ఒక డివిఆర్. 9. ఎం ఎస్ ఎం ఇ సర్టిఫికెట్. 10. ఒక పెన్ డ్రైవ్. 11. రెండు బిల్ బుక్స్.
తెలంగాణ ప్రజా భద్రతా చట్టం సెక్షన్ 8 (2) కింద నేరం చేశారని పిటిషనర్ల మీద ఆరోపణ.

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు 1:

1. 12.11.2021న నమోదైన ఫిర్యాదులో ఉన్న విషయాలు తెలంగాణ ప్రజా భద్రతా చట్టం సెక్షన్ 8 (2) కిందికి రావు.
2. ఆ చట్టంలోని సెక్షన్ 9 (2) ప్రకారం జారీ చేయవలసిన నోటిఫికేషన్ జారీ చేయలేదు.
3. సోదా జరుపుతున్నప్పుడు ఏయే విధివిధానాలను పాటించాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిర్దేశించిందో ఆ విధానాలను పోలీసులు పాటించలేదు.
4. తాము 12.11.2021ననే హైదరాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ తరఫున నోటిఫికేషన్ జారీ చేశామని ప్రాసిక్యూషన్ ఇప్పుడు చెపుతున్నది గాని, అటువంటి నోటిఫికేషన్ ప్రస్తావన 12.11.2021 నాటి ఫిర్యాదులో లేదు. జప్తు చేసిన సామగ్రిని తమకు తిరిగి ఇవ్వాలని కోరుతూ పిటిషనర్లు కింది కోర్టులో వేసిన పిటిషన్ కు పోలీసులు ఇచ్చిన జవాబులో కూడ ఆ నోటిఫికేషన్ ప్రస్తావన లేదు.
5. అలాగే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 165 కింద హైదరాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన సర్చ్ వారంట్ లో కూడ ఆ నోటిఫికేషన్ ప్రస్తావన లేదు.
6. ఈ మొత్తం సోదా, జప్తు వ్యవహారంలో, నేరాన్ని నమోదు చేయడంలో పోలీసులు చట్టబద్ధంగా నిర్దేశితమైన పద్ధతిని పూర్తిగా ఉల్లంఘించారు.
7. తన భర్త స్మృతిలో ఆ పుస్తకాన్ని వెలువరిస్తున్నానని శిరీష కోరగా, పిటిషనర్లు అచ్చువేశారు.
8. ఆ పుస్తకంలో ఇప్పటికే అచ్చయిన, ప్రసార సాధనాల్లో వెలువడిన వ్యాసాలు, నివేదికలు, సంపాదకీయాలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూలు ఉన్నాయి.
9. ఆ పుస్తకంలో అభ్యంతరకరమైన అంశాలేమీ లేవు.
10. ఆ పుస్తకంలో ఏముందో చూడకుండానే, ఆ పుస్తకంలోని విషయాలు అభ్యంతరకరమైనవి అవుతాయనే నిర్ధారణకు రాకుండానే పోలీసులు పుస్తకాలను జప్తు చేశారు.
11. పోలీసులు మొత్తం ప్రింటింగ్ ప్రెస్ నే జప్తు చేశారు. 44 మంది సిబ్బంది పనిచేసే ప్రింటింగ్ ప్రెస్ పూర్తిగా నిలిచిపోయింది.
12. పిటిషనర్ల మీద జరగనున్న నేర విచారణను ఈ వాదనల ఆధారంగా కొట్టివేయాలని న్యాయవాది కోరారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు 2:

1. పోలీసులు చేసిన సోదాలో, సామగ్రి జప్తులో చట్టం నిర్దేశించిన నిర్దిష్ట పద్ధతులను పాటించలేదు. నిందితుల మీద చేసిన ఆరోపణలను సమర్థించే వివరాలేవీ ఫిర్యాదులో లేవు.
2. సదరు పుస్తకంలో అభ్యంతరకరమైన విషయాలేమీ లేవు.
3. ప్రింటింగ్ ప్రెస్ ను, పుస్తకాలను, సామగ్రిని జప్తు చేయడం భారత రాజ్యాంగం అధికరణం 14, 19 లను ఉల్లంఘించడమే.
4. పి వెంకటేశ్వర్లు వర్సస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు (వాసిరెడ్డి సీతాదేవి నవల మరీచిక నిషేధం కేసు) లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో నిర్ధారించిన సూత్రం మీద ఆధారపడాలి.
5. ఈ వాదనల ఆధారంగా, సదరు నేరారోపణపై విచారణను కొట్టివేయాలనీ, జప్తు చేసిన సామగ్రిని, వెయ్యి పుస్తకాలనూ పిటిషనర్ కు తిరిగి ఇవ్వాలనీ, పుస్తకావిష్కరణ సభ నిర్వహణకు ఆటంకాలు కల్పించగూడదని పోలీసులను ఆదేశించాలనీ కోరారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు:

1. సోదాలో, ఆస్తి జప్తులో పోలీసులు చట్టం నిర్దేశించిన పద్ధతిని, ప్రత్యేకంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిర్దేశించిన పద్ధతిని పాటించారు.
2. మావోయిస్టు పార్టీ అనే నిషిద్ధ సంస్థ పొలిట్ బ్యూరో, కేంద్రకమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ @ రామకృష్ణ @ ఆర్ కె ఫొటోతో, అభ్యంతరకరమైన విషయాలతో పిటిషనర్లు/ నిందితులు పుస్తకం అచ్చువేస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సదరు పుస్తక ప్రచురణ సమాజం మీద, ప్రత్యేకించి యువత మీద దుష్ప్రభావం కలగజేస్తుంది.
3. దర్యాప్తు అధికారి పద్నాలుగు మంది సాక్షులను విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. దర్యాప్తు ఇంకా సాగుతున్నది.
4. అందువల్ల ఈ నేరాన్ని నమోదు చేయడంలో, సోదా జరిపి, సామగ్రి జప్తు చేయడంలో ఎటువంటి చట్టవ్యతిరేకత లేదు.
5. నీహారికా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించిన సూత్రం మీద ఆధారపడుతూ, ఈ దశలో ఎఫ్ ఐ ఆర్ ను కొట్టివేయడం అవసరం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.

గవర్నమెంట్ ప్లీడర్ వాదనలు

1. నవ్య ప్రింటర్స్ మీద 12.11.2021న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారని, అంబర్ పేట పోలీస్ ఇనస్పెక్టర్ ఇచ్చిన సమాచారం కోర్టుకు తెలియజేశారు.
2. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 165 కింద సోదా నిర్వహించడానికి అదే రోజు మలక్ పేట డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నుంచి అనుమతి పొందారనీ, ఆ మేరకే సోదా, జప్తు జరిపి, పంచనామా తయారు చేశారనీ చెప్పారు.
3. ఈ ప్రక్రియలో అపసవ్యత గాని, చట్టవ్యతిరేకతగాని ఏమీ లేదు. కనుక ఈ రిట్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు.

న్యాయస్థానపు నిర్ధారణలు

1. ఎంతో సమయం ఇచ్చినప్పటికీ, ముఖ్యంగా ఏడు సార్లు వాయిదాలు వేసినప్పటికీ, పోలీసులు తమ ప్రతివాదన పత్రాలు దాఖలు చేయలేదు. చివరికి 2022 ఫిబ్రవరి 14న అంబర్ పేట్ పోలీసు ఇనస్పెక్టర్ నుంచి తనకు అందిన పత్రాలను అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ కోర్టుకు సమర్పించారు. అందులో 12.11.2021 న అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్, సోదాకు అనుమతులు, పంచనామా, సిఆర్ పి సి సెక్షన్ 41-ఎ కింద ఇచ్చిన నోటీసు, సెక్షన్ 161 కింద నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాల ప్రకటనలు ఉన్నాయి.

2. ఫిర్యాదు, పంచనామా, సోదా అనుమతులు, సాక్షుల వాంగ్మూలాలు మొదలైన ఈ పత్రాలన్నిటినీ పరిశీలిస్తే ఈ కింది వరుస క్రమం కనబడుతుంది:

ఎ. అంబర్ పేట పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇనస్పెక్టర్ కు 12.11.2021న సాయంత్రం 5 గంటలకు ఒక విశ్వసనీయ సమాచారం అందింది.
బి. అదే రోజు సాయంత్రం 5.15కు ఆ డిటెక్టివ్ ఇనస్పెక్టర్ అంబర్ పేట లోని నవ్య ప్రింటర్స్ లో నిషిద్ధ మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే, యువతను మావోయిజం వైపు ఆకర్షించే పుస్తకాలు అచ్చవుతున్నాయని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ కు సమాచారం అందించారు.
సి. 12.11.2021 రాత్రి 9 గంటలకు అంబర్ పేట పోలీసు స్టేషన్ కు అడిషనల్ పోలీస్ ఇనస్పెక్టర్ నుంచి ఫిర్యాదు అందిందని ఎఫ్ ఐ ఆర్ లో రాశారు.
డి. సిఆర్ పి సి సెక్షన్ 161 కింద డిటెక్టివ్ పోలీస్ ఇనస్పెక్టర్ ఇచ్చిన వాంగ్మూలంలో, తాను సోదా జరపడానికి ఇద్దరు మధ్యవర్తులను పంపించమని తహసీల్దార్ కు ఉత్తరం రాశానని, తహసీల్దారు ఇద్దరు ప్రభుత్వోద్యోగులను పంపారని చెప్పారు.
ఇ. ఒప్పుదల ప్రకటన, పంచనామా రెండూ సోదా 12.11.2021న సాయంత్రం 6.30కు జరిగిందని నమోదు చేశాయి. పైన చెప్పిన ఇద్దరు మధ్యవర్తులు అంబర్ పేట పోలీసు స్టేషన్ కు వెళ్లి డిటెక్టివ్ ఇనస్పెక్టర్ నుంచి ఆ సమాచారం తెలుసుకున్నారని నమోదయింది.

3. అలా, మొత్తం వివాదం సాయుధ శాంతి స్వప్నం అనే శీర్షిక గల పుస్తకం ముద్రణ చుట్టూ తిరుగుతుంది.

4. ఈ నేరం తెలంగాణ ప్రజా భద్రతా చట్టం సెక్షన్ 8 (2) కింద నమోదయింది. (తీర్పు ఆ చట్టంలోని సంబంధిత సెక్షన్లను పూర్తిగా ఉటంకించింది).

5. ఏదైనా ఒక ప్రాంతంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం వస్తే, ఆ ప్రాంతాన్ని నోటిఫై చేసి, తమ అదుపులోకి తీసుకుని, సోదాలు జరిపే అధికారాన్ని ఆ చట్టం లోని సెక్షన్ 9 రాష్ట్ర ప్రభుత్వానికి/ పోలీసు కమిషనర్ కు/ జిల్లా మెజస్ట్రేట్ కు కట్టబెట్టింది. ఆ సమాచారం మీద ఒక అభిప్రాయానికి రావడం, నోటిఫికేషన్ విడుదల చేయడం అనేవి సెక్షన్ 9 ప్రకారం కీలకమైన చర్యలు.

6. సెక్షన్ 9లో చెప్పిన ʹనోటిఫై చేయడంʹ, ʹనోటిఫై చేసినʹ అనే మాటలు అదే చట్టంలో సెక్షన్ 2 (డి) కింద నోటిఫికేషన్ అనే నిర్వచనానికి లోబడినవి. అంటే అవి గెజిట్ లో ప్రచురితమైన నోటిఫికేషన్ కు సంబంధించినవి.

7. అంబర్ పేట పోలీసు ఇనస్పెక్టర్ దాఖలు చేసిన లిఖిత సూచనలలో 12.11.2021ననే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని అంటూ, ఆ నోటిఫికేషన్ ప్రతిని జత చేశారు.

8. అసలు పోలీసు కమిషనర్ ఆ నోటిఫికేషన్ ఇవ్వనే లేదని, సోదా, జప్తు అనే తమ చట్టవ్యతిరేక చర్యలను కప్పిపుచ్చుకునేందుకు, ఆ తర్వాత పాత తేదీతో ఒక కాగితం సృష్టించారని పిటిషనర్ల న్యాయవాదులు నందిగం కృష్ణారావు, డి సురేష్ కుమార్ వాదించారు. వారి వాదనను పరిశీలించడానికి ఆ నోటిఫికేషన్ పత్రాన్ని పరిశీలించవలసి ఉంది. (కోర్టు ఆ పత్రం పూర్తి పాఠాన్ని తీర్పులో చేర్చింది).

9. 12.11.2021న జారీ అయిందని చెపుతున్న ఈ నోటిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం జారీ కాలేదని పిటిషనర్ల న్యాయవాదులు చేసిన వాదనలో బలం ఉంది. అది చట్టబద్ధమైన నోటిఫికేషన్ అయి ఉంటే తెలంగాణ గెజిట్ లో ప్రచురితమై ఉండవలసింది. కాని అది తెలంగాణ గెజిట్ లో ప్రచురితం కాలేదని పైపైన చూసినా తేలిపోతుంది.

10. అంతేకాదు, ఒక ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకోవడం అనే చర్య, నోటిఫికేషన్ ఇచ్చే అధికారి నిర్ధారిత అభిప్రాయం మీద ఆధారపడి ఉండాలని చట్టం లోని సెక్షన్ 9 నిర్దేశిస్తున్నది. అభిప్రాయాన్ని నిర్ధారించుకోవడం అంటే ఆ అభిప్రాయానికి రావడానికి తగిన కారణాలు ఉండాలి. తాను ఆ అభిప్రాయానికి ఏ కారణాలవల్ల వచ్చానో స్పష్టంగా తెలియజేయాలి. అభిప్రాయానికి రావడానికి దారి తీసిన కారణాలు వివరించడమే చట్టం నిర్దేశించిన పద్దతిలో భాగం. అలాగే అది రాజ్యం చేసే నిరంకుశ చర్యల నుంచి రక్షణగా కూడ పనిచేస్తుంది.

11. ప్రస్తుత సందర్భంలో, 12.11.2021 తేదీ ఉన్న నోటిఫికేషన్ కేవలం మావోయిస్టు భావజాలాన్ని సమర్థించే, శాంతి భద్రతలకు, ప్రజా శాంతికీ భంగకరమైన పుస్తకాలను నవ్య ప్రింటర్స్ లో అచ్చువేస్తున్నారనే మాట తప్ప మరేమీ లేదు. ఆ అభిప్రాయానికి రావడానికి కారణాలేమిటో ఆ నోటిఫికేషన్ లో లేదు. ఆ పుస్తకాలు ప్రచురించడం శాంతి భద్రతలను ఎట్లా భంగపరుస్తుందో చూపడానికి నోటిఫికేషన్ లో ఏమీ లేదు.

12. సిఆర్ పిసి సెక్షన్ 95 కింద జారీ చేసిన ఇటువంటి నోటిఫికేషన్ సందర్భంలోనే మనీషి జాని వర్సస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో గుజరాత్ హైకోర్టు ఫుల్ బెంచి ఇచ్చిన తీర్పును, అందులో ఉటంకించిన వేరువేరు సుప్రీం కోర్టు తీర్పులను కోర్టు ప్రస్తావించింది.

13. అలాగే, ఒక సమాచారాన్ని పరిశీలించకుండా, పరీక్షించకుండా, తెలుసుకోకుండా దాని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం సాధ్యం కాదని, తత్సంబంధిత అధికారులు ఆ సమాచారాన్ని పరీక్షించిన తర్వాత మాత్రమే అభిప్రాయం ఏర్పరచుకోవచ్చునని హర్నామ్ దాస్ వర్సస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. (కోర్టు ఆ తీర్పును వివరంగా ఉటంకించింది).

14. పైన చెప్పిన ప్రకారం, మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారు అనే నిర్ధారణకు రావడానికి కారణాలు చెప్పడంలో ఆ నోటిఫికేషన్ విఫలమైంది. ఆ నోటిఫికేషన్, ఆ పుస్తకాలలో తమ నిర్ధారణకు తగిన భాగాలను ఉటంకించడం అలా ఉంచి, కనీసం ఆ పుస్తకాల పేర్లు కూడ ప్రస్తావించలేదు. తన ముందుకు వచ్చిన సమాచారాన్ని పరీక్షించకుండా కమిషనర్ ఆ పుస్తకాలు మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నాయనే నిర్ధారణకు రాజాలరు. ఆ మేరకు తనకు సమాచారం రావడమే చట్టం లోని సెక్షన్ 9 కింద తాను చర్య తీసుకోవడానికి కారణం కాజాలదు. ఆ పుస్తకాలలో ఉన్న సమాచారాన్ని పరిశీలించి, పరీక్షించి, అప్పుడు మాత్రమే ఏ నిర్ధారణకైనా రావలసి ఉంటుంది. ఆ నిర్ధారణకు రావడానికి కారణాలను నమోదు చేయవలసి ఉంటుంది. అందువల్ల, 12.11.2021న జారీ అయిన నోటిఫికేషన్ చట్టం నిర్దేశించిన సెక్షన్ 9 ప్రకారం వెలువడలేదు.

15. ఈ సందర్భంలో పోలీసులు సోదా నిర్వహించడానికి అధికారం ఇచ్చిన సిఆర్ పిసి సెక్షన్ 165 గురించి కూడ చర్చించడం అవసరం. (సిఆర్ పిసి నుంచి ఆ సెక్షన్ ను పూర్తిగా ఉటంకించారు).

16. పైన వివరించిన ప్రకారం, నేర నమోదు 12.11.2021 రాత్రి 9 గంటలకు జరిగింది. మలక్ పేట అసిస్టెంట్ కమిషనర్ ను అంబర్ పేట అడిషనల్ పోలీస్ ఇనస్పెక్టర్ సాయంత్రం 5.15కు కలిశారని సోదా అనుమతి పత్రంలో ఉంది. అంటే సిఆర్ పిసి సెక్షన్ 165 కింద సోదా అనుమతి ఇచ్చే సమయానికి నేరం నమోదు కాలేదు. అంటే స్పష్టంగా, పోలీసులు చేసిన సోదా గాని, జప్తు గాని సిఆర్ పిసి సెక్షన్ 165 నిర్దేశించిన పద్ధతికి ఉల్లంఘనలుగానే జరిగాయి.

17. పోలీసులు చేపట్టిన అన్ని చర్యలలోను ఆ రోజునే వెలువడిందని అంటున్న నోటిఫికేషన్ గురించి ప్రస్తావన కూడ లేదని గుర్తించడం అవసరం.

18. 12.11.2021న జారీ అయిందని చెపుతున్న నోటిఫికేషన్ ను అదే రోజు నమోదైన ఫిర్యాదులో గాని, అదే రోజు ఇచ్చిన సోదా అనుమతి పత్రంలో గాని ప్రస్తావించలేదు. తన దగ్గర జప్తు చేసిన వస్తువులు తిరిగి తనకు ఇవ్వాలని పిటిషనర్ కింది కోర్టులో వేసిన వ్యాజ్యంలో పోలీసులు 29.11.2021న దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో కూడ ఆ నోటిఫికేషన్ గురించి ప్రస్తావించలేదు. మొట్టమొదటిసారి ఈ కోర్టులోనే ఆ నోటిఫికేషన్ ప్రతిని సమర్పించారు.

19. అసలు ఆ నోటిఫికేషన్ 12.11.2021 న జారీ అయి ఉండడం అసంభవమని ఈ కోర్టు భావిస్తున్నది. ఆ నోటిఫికేషన్ గనుక ఆ రోజే జారీ అయి ఉంటే, ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియలో ఎప్పుడైనా పోలీసులు దాన్ని ప్రస్తావించి ఉండవలసింది. ఎందుకంటే, అసలు ఆ నోటిఫికేషన్ పునాది గానే సోదా, జప్తు వంటి తర్వాత చర్యలన్నీ జరిగాయి. ఆ నోటిఫికేషన్ గురించి అంతకు ముందు ప్రస్తావనలు ఎందుకు రాలేదో వివరించడంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ విఫలమయ్యారు. అందువల్ల, ఈ కోర్టు అభిప్రాయంలో, ఆ నోటిఫికేషన్ ను 12.11.2021 న జారీ చేయలేదు. కేవలం ఆ తర్వాత సవరింపు చర్యగా మాత్రమే తయారు చేశారు.

20. అలాగే, ఈ సోదా, జప్తులకు సంబంధించిన మొత్తం ఘటనల పరంపరను చర్చించవలసిన అవసరం కూడ ఉంది. పోలీసులు చెపుతున్న ప్రకారం, పోలీసు ఇనస్పెక్టర్ కు మొట్టమొదటి సమాచారం సాయంత్రం 5 గంటలకు అందింది. ఆ ఇనస్పెక్టర్ ఆ సమాచారాన్ని బషీర్ బాగ్ లో ఉన్న పోలీసు కమిషనర్ కు వెంటనే తెలియజేసి, అప్పుడే వివాదాస్పద నోటిఫికేషన్ తీసుకున్నారు. అదే సమయంలో ఆయన తనకు అందిన సమాచారాన్ని మలక్ పేట డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కు తెలియజేసి సోదా అనుమతి తీసుకున్నారు. సోదా అనుమతి సంపాదించగానే అంబర్ పేట తహసీల్దార్ కు ఇద్దరు మధ్యవర్తులను పంపించమని ఉత్తరం రాశారు. మధ్యవర్తులు పోలీసు స్టేషన్ కు చేరగానే వారికి సమాచార వివరాలు చెప్పి, ఆ తర్వాత సోదాలు నిర్వహించారు. సాయంత్రం 6.30కు పంచనామా పత్రం నమోదు చేశారు.

21. అంటే, ఈ మొత్తం వ్యవహారం ఒక గంటా ముప్పై నిమిషాల వ్యవధిలో, 12.11.2021 సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు జరిగిపోయింది. ఈ వ్యవహారంలో పోలీసులు చెపుతున్న ఘటనల పరంపర వారు చెప్పినట్టుగా జరగడం ఎంతమాత్రమూ సంభవం కాదని ఈ కోర్టు అభిప్రాయపడుతున్నది.

22. ఇక్కడ క్రైం నం. 439/2021 విషయంలో, నిందితుల మీద ప్రజా భద్రతా చట్టం సెక్షన్ 8 (2) కింద నేరం నమోదైందని గుర్తించడం అవసరం. శిరీష విజ్ఞప్తి మేరకు నిందితుడు ఆ పుస్తకం ప్రచురించాడని ఆరోపణ. కాని చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ చట్టవ్యతిరేక సంస్థనైనా, దాని సభ్యులనైనా నిర్వహించినా, దానికి సహకరించినా, ప్రోత్సహించినా, ఏదైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి ఆ సంస్థకు, దాని సభ్యులకు సహకరించినా నేరం అవుతుంది. కాని పైన వివరించిన ప్రకారం, ఒక పుస్తక ప్రచురణ దానికదిగా ఒక చట్టవ్యతిరేక సంస్థకో, లేదా చట్టవ్యతిరేక కార్యకలాపానికో సహకరించడం, ప్రోత్సహించడం ఎలా అవుతుందో చూపడంలో పోలీసులు విఫలమయ్యారు. సెక్షన్ 8 (2) కింద నేరం జరిగిందని ప్రాథమికంగా రుజువు కావడం లేదు.

23. ఈ నేరానికి నిర్దేశించిన శిక్ష ఏడు సంవత్సరాల లోపేనని గుర్తించడం అవసరం. అందువల్ల, దర్యాప్తు అధికారి ఇప్పటికే సిఆర్ పిసి సెక్షన్ 41-ఎ కింద నోటీసులు ఇచ్చారు. 14 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు సాగవలసి ఉంది. అయినా సరే, హడావుడిగా సోదాలు జరిపి, జప్తు చేయడం చట్టం ప్రకారం గాని, సిఆర్ పిసి ప్రకారం గాని నిర్దేశించిన ప్రక్రియకు తీవ్రమైన ఉల్లంఘనే అవుతుంది.

24. పైన చెప్పిన ఘటనాక్రమాన్ని బట్టి చూస్తే, పోలీసుల మొత్తం పనితీరు నిరంకుశమైన పద్ధతిలో సాగింది. వ్యక్తి స్వేచ్ఛనూ, భావప్రకటనా స్వేచ్ఛనూ అరికట్టే ఇటువంటి నిరంకుశ చర్య దర్యాప్తు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. స్టేట్ ఆఫ్ హర్యానా వర్సస్ భజన్ లాల్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రాతిపదికల ఉల్లంఘనే. (ఆ కేసు వివరాలను వివరంగా ఉటంకించారు)

25. అందువల్ల, ఏ కోణం నుంచి చూసినా, ఈ నేరారోపణ కేసును కొట్టివేయకతప్పదు. అదే విధంగా కొట్టివేస్తున్నాం. జప్తు చేసిన తమ సామగ్రిని తమకు తిరిగి ఇప్పించాలని కోరుతూ నాంపల్లి నాలుగవ అడిషనల్ చీఫ్ మెట్రొపాలిటన్ మెజస్ట్రీట్ కోర్టులో ఈ పిటిషనర్లు ఒక కేసు దాఖలు చేశారని, ఆ అభ్యర్థనను ఆ కోర్టు కొట్టి వేసిందని, అయినా పిటిషనర్లు ఆ తీర్పును సవాలు చేయలేదని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఈ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలా సవాలు చేయలేదు గనుక ఆ సామగ్రి తమకు ఇప్పించాలని కోరే అర్హత వారికి లేదని వాదించారు. అయితే కింది కోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తే, ఆ కోర్టు అసలు పోలీసులు ఆ సామగ్రిని తమకు సమర్పించలేదని, అందువల్ల తాము ఏ నిర్ణయం తీసుకోలేమని అంటూ ఆ కేసు కొట్టివేసిందని తెలుస్తున్నది. కనుక అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ వాదనకు అవకాశం లేదు.

26. ఈ మొత్తం వ్యవహారం పుస్తక ప్రచురణకు సంబంధించినది గనుక భారత రాజ్యాంగంలోని అధికరణం 19 వెలుగులో పరీక్షించవలసిన అవసరం ఉంది. భావప్రకటనా, వ్యక్తీకరణ స్వేచ్ఛ మౌలిక మానవహక్కులలో ఒకటి. ఒకరి అభిప్రాయాలనూ, భావాలనూ రాజ్యపు నిరంకుశ జోక్యం లేకుండా స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఉన్న హక్కును అధికరణం 19 గుర్తించింది. భావప్రకటన మీద ఆంక్షలను చాల పరిమితంగా వ్యాఖ్యానించవలసి ఉంటుంది. అవి అధికరణం 19 (2) లో చూపిన కారణాలకు మాత్రమే పరిమితమైనవి. అధికరణం 19 కింద రచయితలకూ, ప్రచురణకర్తలకూ సంక్రమించిన హక్కుల మీద కేవలం శాంతి భద్రతల సమస్యలు తలెత్తవచ్చుననే ఊహతో ఆంక్షలు విధించడం సరికాదు. శాంతి భద్రతల నిర్వహణ రాజ్యపు బాధ్యత. అసాధారణమైన సందర్భాలలో మాత్రమే భావప్రకటనా స్వేచ్ఛ మీద ఆంక్షలు విధించవచ్చు.

27. కళాత్మక స్వేచ్ఛా హక్కు అధికరణం 19 నుంచే ఆవిర్భవిస్తుంది. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశానికి అది చాల ముఖ్యమైనది. పుస్తకాల నిషేధాల విషయంలో ఎన్ రాధాకృష్ణన్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఈవిధంగా నిర్దేశించింది: (సుప్రీం కోర్టు తీర్పును వివరంగా ఉటంకించారు).

28. ప్రస్తుత సందర్భంలో, రెండవ కేసులో పిటిషనర్ అక్కిరాజు హరగోపాల్ @ రామకృష్ణ @ ఆర్ కె భార్య. ఆమె చెపుతున్న ప్రకారం, ఆమె భర్త అనారోగ్య కారణాలతో 14.10.2021న మరణించారు. ఆమెకు ఆ వార్త పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రచార సాధనాల ద్వారా తెలిసింది. ఆయన పీపుల్స్ వార్ పార్టీ రాష్ట్ర నాయకుడుగా ఉండేవారు. 2004లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లకూ ప్రభుత్వానికీ మధ్య జరిగిన శాంతి చర్చలలో పాల్గొన్న పీపుల్స్ వార్ పార్టీ బృందానికి ఆయన నాయకత్వం వహించారు. ఆ చర్చల సందర్భంలో పత్రికలలో, ఎలక్ట్రానిక్ ప్రచార సాధనాలలో ఆ చర్చల వార్తలు విస్తృతంగా వచ్చాయి గనుక ఆమె భర్త ప్రతి ఇంట్లో పరిచితుడిగా మారారు. జీవితమంతా ప్రజల సేవలో గడిపిన తన భర్తను ఆమె గౌరవించదలిచారు. ఆయన జ్ఞాపకాల ద్వారా ప్రజలకు ప్రేరణ ఇవ్వదలిచారు. ఆమె అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యురాలిగా ఉన్నారు. ఆ సంస్థలో ఉన్న మిత్రులు, బంధువుల సహాయంతో ఆమె ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా, ఆలకూరపాడు అనే తన స్వగ్రామంలో 24.10.2021న ఆర్ కె సంస్మరణ సభ జరిపారు. పోలీసులు నిఘా పెట్టినప్పటికీ దాదాపు వెయ్యి మంది ఆ సభకు హాజరయ్యారు. ఆర్ కె గురించి జ్ఞాపకాలతో, ఆయన రచనలతో ఒక పుస్తకం ప్రచురిస్తే బాగుంటుందని అక్కడ ఒక ప్రతిపాదన వచ్చింది. ఆర్ కె గురించి పాటలు, కవితలు, జ్ఞాపకాలు పంపించమని ఆ సభలోనే పిలుపు ఇచ్చారు. అలాగే ఆయన రాసిన వ్యాసాలు, పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రకటనలు కూడ సేకరించి అవన్నీ కలిపి పుస్తకం తయారు చేశారు. తన భర్త ప్రభుత్వానికీ నక్సలైట్లకూ మధ్య జరిగిన శాంతి చర్చలకు నాయకత్వం వహించారు గనుక, ఆ పుస్తకానికి ʹసాయుధ శాంతి స్వప్నంʹ అని పేరు పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ పుస్తకాన్ని హైదరాబాద్ లో ప్రచురించి, 14.11.2021న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుస్తకావిష్కరణ సభ నిర్వహించాలనుకున్నారు.

29. ఆ పుస్తకంలో అభ్యంతరకరమైన విషయమేదీ లేదని ఆమె అంటున్నారు. ఆ పుస్తకంలో ఉన్నవి తన భర్త వార్తాపత్రికల్లో రాసిన వ్యాసాలు, ఇంటర్వ్యూలు, ప్రకటనలు మాత్రమేనంటున్నారు. పోలీసులు ఎటువంటి విచారణ జరపకుండా, పుస్తకంలో ఉన్న విషయాలను ధ్రువీకరించుకోకుండా, అది అభ్యంతరకరమైనదనే నిర్ధారణకు వచ్చి, నవ్య ప్రింటర్స్ లో నిరంకుశంగా, చట్టవ్యతిరేకంగా సోదాలు చేసి, జప్తు చేశారని ఆమె అంటున్నారు.

30. పైన చెప్పినట్టుగా పోలీసులు పుస్తకంలో ఏమి ఉన్నదో చూడకుండానే, పుస్తకం ప్రతులు జప్తు చేశారు. పిటిషనర్లు చెపుతున్న ప్రకారం పుస్తకంలో ఇదివరకే పత్రికల్లో అచ్చయిన అక్కిరాజు హరగోపాల్ @ రామకృష్ణ రాసిన వ్యాసాలు, ఇంటర్వ్యూలు, సంపాదకీయాలు, ప్రకటనలు, వగైరా ఉన్నాయి. చర్య తీసుకునే ముందు అధికారులకు సమంజసమైన కారణాలు ఉండి ఉండవలసింది. ఈ కేసులో పోలీసులు, చట్టం నిర్దేశించిన ప్రక్రియను పాటించకుండా, అచ్చువేసిన నవ్య ప్రింటర్స్ 1991 నుంచీ వ్యాపారంలో ఉన్నదనే వాస్తవాన్ని పట్టించుకోకుండా, వారి యంత్రాలనూ, ఇతర సామగ్రినీ గంటన్నర లోపల జప్తు చేశారు. పోలీసుల ప్రవర్తన నిరంకుశంగా, చట్టవ్యతిరేకంగా ఉన్నది. తెలంగాణ ప్రజా భద్రతా చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లు నిర్దేశించిన ప్రక్రియకు ఉల్లంఘనగా ఉన్నది.

31. పునరుక్తి అయినప్పటికీ, ఈ కోర్టు మరొకసారి నొక్కి చెప్పదలచినదేమంటే, ఈ చట్టం కింద నేరాలు తీవ్రమైన స్వభావం కలిగినవి. అవి ఎంత తీవ్రమైనవో సెక్షన్ 12 ద్వారా స్పష్టమవుతుంది. ఈ చట్టం కింద కేసులో ప్రతి సవరణ పిటిషన్ ను హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మాత్రమే వినవలసి ఉంటుంది. అంటే, ఈ నేరపు తీవ్రత గురించి చట్టసభ ఎంత తీవ్రంగా ఆలోచించిందో చాల స్పష్టంగా ఉంది.

32. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వంటి సీనియర్ పోలీసు అధికారి, వేధింపు, శిక్ష వంటి పర్యవసానాలకు దారి తీసే 12.11.2021 నోటిఫికేషన్ జారీ చేసే ముందు ఈ చట్ట నిబంధనలను ఒకసారి చదివి ఉంటారని ఆశిస్తాము. చట్టం నిర్దేశించిన విధంగా గెజిట్ లో ప్రచురించకుండా, తన కింది అధికారులు సోదాలతో, జప్తులతో ముందుకు పోవడానికి ఆయన అనుమతించడం తెలంగాణ ప్రజా భద్రతా చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిర్దేశించిన విధివిధానాలకు తీవ్రమైన ఉల్లంఘన.

33. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 12.11.2021 న నోటిఫికేషన్ జారీ చేయకుండానే జారీ చేసినట్టు చెపుతున్నారు గనుక అది ప్రమాణం చేసి చెప్పిన అబద్ధం అనే నేరం కిందికి వస్తుందని వాదనల క్రమంలో పిటిషనర్ల న్యాయవాది నందిగం కృష్ణారావు వాదించారు. ప్రమాణం చేసి అసత్యం పలకడం అనే నేరం చేసినట్టు రుజువు కావాలంటే:

ఎ. ఆ ప్రకటన చేసిన వారు సత్యప్రమాణకంగా నిజమే చెపుతామని ప్రమాణం చేసి ఉండాలి.
బి. ఆ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తూ ఉద్దేశపూర్వకంగా అబద్ధ ప్రకటన చేసి ఉండాలి.
సి. తాను చేస్తున్న ప్రకటన సత్యం కాదని ప్రకటనకర్తకు తెలిసి ఉండాలి.
డి. ఆ ప్రకటన ఒక భౌతిక వాస్తవానికి సంబంధించినది అయి ఉండాలి.
ప్రస్తుత సందర్భంలో ఈ నాలుగు అంశాలూ వర్తించవు గనుక, పోలీస్ కమిషనర్ ఆ నేర పరిధిలోకి రారని భావిస్తున్నాం.

ముగింపు

పైన జరిగిన చర్చను దృష్టిలో ఉంచుకుని, ఈ రెండు పిటిషన్లను ఈ కింది విధంగా ఆమోదిస్తున్నాం:
1. నవ్య ప్రింటర్స్ మీద పోలీసులు జరిపిన సోదా, జప్తు మొత్తంగా చర్య చట్టవ్యతిరేకం, తెలంగాణ ప్రజాభద్రతా చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లు నిర్దేశించిన విధివిధానాలకు వ్యతిరేకం.
2. పిటిషనర్లకు వ్యతిరేకంగా అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును (క్రైం నం. 439/2021) కొట్టి వేస్తున్నాం.
3. నవ్య ప్రింటర్స్ కు వేసిన తాళాలు తొలగించాలనీ, పిటిషనర్లు ఆ ప్రాంగణంలో పని చేసుకోవడానికి ఎటువంటి సమస్యలు సృష్టించగూడదని పోలీసులను ఆదేశిస్తున్నాం.
4. ఈ కేసులో పోలీసులు జప్తు చేసుకున్న సామగ్రినంతా పిటిషనర్లకు తిరిగి అప్పగించి, వారి నుంచి తగిన రశీదు పొందాలని పోలీసులను ఆదేశిస్తున్నాం.

(తెలుగు అనువాదం: ఎన్ వేణుగోపాల్)

వీక్షణం ఏప్రిల్ 2022 సంచిక

Keywords : ramakrishna, akkiraju haragopal, cpi maoist, shirisha, high court, Huderabad police
(2024-07-16 02:48:28)No. of visitors : 841

Suggested Posts


పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం

చైతన్యవంతమైన కార్యకలాపాలంటే పొరపాట్లను తగ్గించుకుని ఎక్కువ విజయాలను సాధించడమనే. ఇందుకనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆధారపడి నూతన ఎత్తుగడలను రూపొందించుకోవాలి. ఇందులో ఏ మాత్రం విసుగు చెందకూడదు.

అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ (63) అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021 ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. కామ్రేడ్ హరగోపాల్ కు అకస్మాతుగా కిడ్నీల సమస్య మొదలైంది. వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడు.

చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం

ఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి మౌలిక నమస్యకు పరిష్కారం చూపడంలో నక్సలైట్ల పాత్రను, 30 సంవత్సరాల పైబడిన వారి ఆచరణను వస్తుగతంగా

మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ

విప్లవోద్యమాన్నీ విప్లవ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని దుష్ష్రచార దాడి చేసేందుకు వాళ్లకు సామ్రాజ్యవాదుల నుండి ఆదేశాలు వున్నాయి. వాళ్ళకు త్యాగాలు లేకుండా చరిత్ర పురోగమనం వుండదనే విషయం అర్ధం కాదు, అర్ధం చేసుకోరు కూడా. నిజమే వాళ్ళన్నట్లు మేము కొండను ఢీకొంటాం, పర్వతాలను తవ్వుతాం, ఏటికి ఎదురీదుతాం.

విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి

రెండు రోజులుగా ఆయన కోసం సమాజం దు:ఖిస్తున్నది. ఆయన్ను తలపోసుకుంటున్నది. ఆయనలాంటి వీరోచిత విప్లవకారులెందరినో ఆయనలో పోల్చుకుంటున్నది. ఉద్విగ్న విషాదాలతో తల్లడిల్లుతున్నది.

RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్

14 అక్టోబర్,2021 సాయంత్రం నుండి తెలుగు,చత్తీస్గఢ్ మీడియాలో, మావోయిస్టు పార్టీ నాయకుడు రామకృష్ణ అనారోగ్యంతో చనిపోయినాడని ,చత్తీస్గఢ్ పోలీసులు ధ్రువీకరించారని స్పెషల్ స్టోరీస్ తో పాటు బ్రేకింగ్ న్యూస్ లతో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌

అనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ @ RK సంస్మరణ సభ ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో ఆదివారంనాడు జరిగింది.

ఆర్కే పుస్తకావిష్క‌రణ సభను అడ్డుకున్న పోలీసులు...రేపు మీడియాసమావేశం ఏర్పాటు చేసిన ఆర్కే సహచరి శిరీష‌

అనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు రామకృష్ణపై పుస్తకాన్ని ముద్రిస్తున్న హైదరాబాద్ లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు దాడి చేసి ముద్రణలో ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹసాయుధ