అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత

అమ్మల

08-05-2022

యేటా మేలో రెండవ ఆదివారం ప్రపంచ అమ్మల దినం జరుపుకుంటున్నాం. ఈసారి ప్రపంచ అమ్మల దినం యుద్ధం మధ్యలో జరుపుకోవలసి వస్తున్నది. ఈ అన్యాయపూరితమైన, దుర్మార్గమైన సామ్రాజ్యవాదుల యుద్ధ క్రీడలో బిడ్డలను కోల్పోయి గర్భశోకంతో తల్లడిల్లుతున్న తల్లులకు, తల్లులను కోల్పోయిన బిడ్డలకు సాంత్వన చేకూరాలనీ కోరుకుంటూ సామ్రాజ్యవాదుల మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన తల్లులకు, బిడ్డలకు అమ్మలదినపు విషాద ఘడియలలో శిరస్సు వంచి ముందుగా శ్రద్ధాంజలి ఘటిద్దాం. మన పిల్లల కోసం, భవిష్యత్‌ తరాల కోసం దోపిడీ యుద్ధాలు ఎరుగని శాంతిమయ ప్రపంచ సాధనకై పోరాడుదామనీ గట్టిగా అమ్మలమంతా శపథం చేద్దాం.

అమెరికా నాటో కూటమి రగిలించిన వివాదం కారణంగా జరుగుతున్నదే ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య అనేది ప్రపంచ పరిణామాలను నిశితంగా పరిశీలించే సగటు బుద్ధిజీవుల పరిశీలనగా మారింది. గత 70 రోజులుగా ఉక్రెయిన్‌ లో యుద్ధం జరుగుతోంది. ఏ యుద్ధంలోనైనా ముందుగా బాధితులుగా మారేది మహిళలు, పిల్లలేనన్నది కాదనలేని వాస్తవం. ఇపుడు ఉక్రెయిన్‌ లోనూ జరుగుతుందదే! యుద్ధం ముందు వరక సామ్రాజ్యవాద అమెరికా లేదా యుద్ధాల మీదనే పడగలెత్తే యుద్ధ పరిశ్రమల కేంద్రం ఉక్రెయిన్‌ను అన్ని విధాలా రష్యాకు వ్యతిరేకంగా ఎగదోస్తూ డాలర్లు, ఆయుధాలు ఎగజిమ్ముతూ నేనున్నానని విర్రవీగుతూ తన నాటోను ముందుపెట్టి చేయకూడనిదంతా చేసింది. తన జేబు సంస్థ ఐక్యరాజ్యసమితి ఈ వినోదాన్నంతా వీక్షిస్తూ వచ్చింది. చివరకు సామ్రాజ్యవాద రష్యా డాన్బాస్ ప్రాంత ప్రజల స్వయం నిర్ణయాధికార రక్షణ పేరుతో తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి రంగంలోకి దిగింది. తాను జరుపుతున్న యుద్దానికి ʹప్రత్యేక సైనిక చర్యʹ గా నామకరణం చేసింది. దాని పరిమిత లక్ష్యాలను కూడ ప్రారంభంలోనే ప్రకటించింది. అయితే వాటికి కట్టుబడిలేదనేది దాని దురాక్రమణ ఆచరణే చాటుతుంది.

సామ్రాజ్యవాద రష్యా చర్యతో అమెరికా ఇక ఉక్రెయిన్‌ రక్షణ బాధ్యత తనది, తన నాటోదే నంటూ వకాల్తా పుచ్చుకొని తెర వెనుక నుండి యుద్ధ క్రీడను ప్రోత్సహిస్తున్నది . అది స్వఘోషిత ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షకురాలు కాబట్టి అది ఎక్కడైనా అది ఇరాక్‌ కావచ్చు, అఫ్గానిస్తాన్‌ కావచ్చు మరే దేశమైనా కావచ్చు, అది దిగాలనుకున్నపుడు రంగంలోకి దిగుతుంది, లేద నాటోను దింపుతుంది. రేపు మన దేశంలో కూడ మావోయిస్టు ʹభూతంʹ అదుపు తప్పుతుందనీ లేదా తీవ్రమైందని దబాయించి ప్రపంచపోలీసు ఇక్కడికి రాదనే హామీ ఎవరూ ఇవ్వరు. ఇప్పటికే దానితో భారత పాలకులు అనేక ఒప్పందాలు చేసుకొని ఉన్నారు.

ఇపుడు యాంకీలు ఉక్రెయిన్‌ సార్వభౌమత్వ పరిరక్షణను తక్షణ ఎజండాగా ముందుకు తెచ్చుకున్నారు. అక్కడ ఎన్ని మరణాలు సంభవిస్తున్న, ఎంతటి విధ్వంసం తాండవిస్తున్నా అమెరికా, నాటోల నమ్మకబంటు జెలెన్‌ స్కీ మాత్రం తడవ తడవకు మనసు మార్చుకుంటూ యుద్ధాన్ని పొడగించడానికి అమెరికా చేస్తున్నవినాశకర చర్యలకు వత్తాసు పలుకుతూ చేతిలో తుపాకీతో ఆ సినీ విదూషకుడు, పుతిన్‌ ʹవిక్టరీడేʹ (ఫాసిస్టు జర్మనీ సేనలు రష్యా ఎర్ర సైన్యానికి లొంగిపోయిన 1945 మే 9ని విజయదినంగా జరుపుకుంటామని అందుకు కనీసం నైతిక అర్హతైనా లేని నియో జారు ప్రకటించడం గమనార్హం) జరిపినా తన బలగాలను వెనక్కి తీసుకోకపోవచ్చు, యుద్ధం ఇంకా ముందుకు సాగవచ్చని భవిష్యవాణి చేస్తున్నాడు.

ఉక్రెయిన్‌ లో ఇప్పటికే 50 లక్షలకు పైగా యుద్ధ బాధితులు శరణార్జులయ్యారు. దాదాపు రెట్టింపు సంఖ్యలో దేశంలోనే జనం చెల్లాచెదురయ్యారు. దాదాపు అంతే సంఖ్యలో లేదా కొంత ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఎటూ వెళ్లలేని స్థితిలో చిక్కుకొని ఉన్నారన్న వార్తలు కలవరపరుస్తున్నాయి. వీరిలో నిస్సందేహంగా మహిళలు, పిల్లల శాతమే అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. మన దేశానికి చెందిన వారు అందులో పై చదువులకు వెళ్లిన యువత సహ అక్కడ చిక్కుపడిపోయిన వివిధ దేశాల వాళ్లు అక్కడ దయనీయమైన పరిస్థితులలో బాంబుల దాడులలో చావు బతుకుల మధ్య చిక్కుకున్న ప్రజలను, ప్రతిఘటిస్తున్న వారిని వారి మానాన వారిని వదలి స్వదేశాలకు బతుకు జీవుడా అంటూ తరలి వెళ్లడం తమ అమ్మల మనసులను నిండుచేసిందనడంలో సందేహం లేదు కానీ ఇది ఎంతవరకు న్యాయమని మనసు అపుడుపుడు కలచివేస్తోంది.

కాగా, ఇప్పటికే 40కి పైగా దేశాలకు కాందిశీకులుగా వెళ్లిన ఉక్రెయిన్‌ మహిళల ఆర్తనాధాలు, అగచాట్లు, ఆక్రందనలు అంతర్జాలంలో వెలువడుతుంటే చూడ, చదువ లేకపోతున్నాం. శరణు కోరిన మహిళలతో స్వచ్చంద సేవకులుగా చలామణి అవుతున్నవారు, పోర్నోగ్రాఫర్స్‌ (బూతు వ్యాపారులు), శరణు ఇస్తున్న పిశాచాలు వ్యవహరిస్తున్న తీరు పరమ అమానవీయంగా తయరైంది. బ్రిటన్‌ లో కాందీశీక మహిళలు ఎదుర్కుంటున్న దైన్య స్తితిని సాక్షత్తు ఐక్య రాజ్య సమితి కాందిశీకుల కమిషనర్‌ తప్పుపట్టారంటే పరిస్థితి తీవ్రతకు నా లాంటి తల్లులు తట్టుకోలేకపోతున్నారు. బ్రిటన్‌ కే ఈ వైనం పరిమితం కాలేదని, ఏ దేశం వెళ్లిన మహిళల మానంతోనైనా నీచత్వాలు జరుగుతున్నాయనీ అవమానకర పరిస్థితులే మహిళలకు ఎదురవుతున్నాయని ఆధారాలతో సహ వారి కథనాలు రాస్తున్న పత్రికల వార్తలు హృదయాలను కలచివేస్తున్నాయి. ఆడదాని అమ్మతనం సామ్రాజ్యవాదానికి చెల్లిస్తున్న మూల్యం ఇది! ఉక్రెయిన్‌ యుద్దంలో శృంగారం అంటూ నిస్సిగ్గుగా రాస్తున్నారు, చూపిస్తున్నారు. యూరోపియన్‌ దేశాల దేహ వ్యాపారులు ఉక్రెయిన్‌ నుండి పారిపోయి వచ్చిన పసిపిల్లలను ఖండాంతరాలకు విక్రయిస్తున్నారనీ అధికారిక వర్గాలే ఉటంకిస్తున్నాయంటే ఏ తల్లి గుండె తట్టుకుంటుంది? అమెరికా కూడ నేనూ కాందిశీకులకు ఆశ్రమం కల్పిస్తాననీ హామీలిస్తున్నది. అక్కడ వందేళ్ల క్రితమే దేహ వ్యాపారంతో షేర్‌ మార్కెట్‌ ఎలాంటి ధరలు పలికాయో చరిత్ర రికార్డు చేసి పెట్టింది. ఇప్పటికే రేసిజంతో చెప్పనలవికాని దాడులు జరుగుతున్న అమెరికాలో కాందిశీలైన మహిళలకు గౌరవం దక్కుతుందా! నో, అనే నా మనసు ఘోష వినిపిస్తున్నది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల చరిత్రలు వెలికితీస్తే యేండ్ల తరబడి యుద్ధ భూమిలో తమ లాభాల కోసం తుపాకులతో నిలిచిన తమ సైనికులను నిలుపుకోవడానికి వారి *శారీరక సౌఖ్యంʹ కోసం ఎన్ని దేశాలలో ఎంత మంది వేశ్యలను సృష్టించారో, ఎంతటి మూల్యాలు చెల్లించుకున్నారో చరిత్రలో నమోదైంది. మన దేశంలో ఆంగ్లో ఇండియన్లంటూ ఉనికిలోకి వచ్చిన వారి వెనుకగల కన్నీటి గాధలు ఎలా మరిచిపోగలం!

ఇక శ్రీలంకకు వస్తే అక్కడా మహిళలు అనుభవిస్తున్న ఇక్కట్లు అనేకం. పాల కోసం తల్లడిల్లుతున్న పసికూనల దీనావస్ట్థలు వర్ణణాతీతం. అక్కడ వర్తమాన అధ్యక్షుడు, ప్రధాన మంత్రి ఒకే తల్లి బిడ్డలు. 2008-09లలో మహీంద్ర రాజపక్సే తమిళ ఈలం మహిళలపై జరిపిన దారుణాలు జగమెరిగినవే. పారడైజ్‌ పత్రాల గురించి తెలిసినవారికి ఆ దేశంలో నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తూ ఆ కుబేరులు కూడబెట్టుకున్న అపార ఆస్తుల గురించి విదితమే. శ్రీలంక పర్యాటక పరిశ్రమ చాలా పెద్దది అంటారు. అక్కడ 2019లో జరిగిన బాంబు పేలుళ్లు, ఆ తరువాత విరుచుకపడిన కొరోనా మహమ్మారీతో అది కుదేలైపోయింది. దేశం అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అప్పులలో చైనా సమకూర్చినవే 14 శాతం అంటారు. దేశం ఆర్థికంగా దివాళా తీసి తీవ్ర సంక్షోభంలో కూరుకపోయి ఏ సరుకూ కొనలేని స్థితికి ప్రజలు చేరారు. దానితో మార్చ్‌ 16నాడు ఆ దేశ ప్రజా వెల్లువెత్తిన విషయం తెలిసిందే. వారు కడుపాకలికి బియ్యం కొనాలంటే కిలోకు రూ.500 వెచ్చించాలి. కూరగాయలు కోనాలంటే కిలో వందలలోనే చెల్లించాలి. కప్పు ఛాయ్‌ తాగాలంటే వంద రూపాయలు ఇవ్వాలి. రోగికి ఆపిల్‌ పండ్లు ఓ కిలో తినిపించాలంటే రూ. 1,000 వెచ్చించాలి. ఇంతేసి ధరలు పెట్టి ఏ తల్లి ఇల్లు నడుపుతుంది! దీనితో వారంతా తక్షణం రాజపక్స కుటింబీకుల పాలనే అంతం కావాలని నినదించారు. వారిలో అనేకులు దోపిడీ వ్యవస్థ నాశనం కావాలనీ కోరారు. దానితో అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయినా అక్కడి ప్రజల జీవన్మరణ సమస్యల ముందు అత్యవసర పరిస్థితి ప్రకటిస్తేనేమి! వారి పోరాటానికి అదో లెక్కా అన్నట్టే ప్రజలు వెల్లువెత్తుతుండటంతో తుదకు తన సోదరుడిని ప్రధాని పదవి నుంచి తొలగించి అధ్యక్షుడు మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించక తప్పలేదు. కానీ, ఈ క్రమంలో ఎంత మంది తల్లులు ఎన్ని నరకయాతనలు అనుభవించారో మరి రాజపక్స సోదరులు చెప్పగలరా! అని నా లాంటి తల్లులు ఎంతో మంది అడుగుతున్నారు.

ఇక మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలలో యుద్ధ జ్వాలలు చల్లారడమే లేదు. యెమన్‌ లో గడచిన పుష్కర కాలంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిమంది తమ కొంప గూడు వదలుకొని కానరాని దేశాలలో కాందిశీకులయ్యారు. వారు అక్కడ అనేక యాతనలు భరిస్తున్నారు. చౌకగా వారి శ్రమశక్తిని పెట్టుబడిదారులు కొల్లగొడుతున్నారు. వారిని వేశ్యా గృహాలలో సరుకుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. అనేకదేశాలలో అధికారంలో ఉన్నవారి పక్షాన ఒకరు, వైరి పకాన మరొకరు ఉంటూ తమ ఆయుధాల వ్యాపారానికి డోఖా లేకుండా చేసుకుంటున్నారు. అందుకు సిరియా అతి పెద్ద ఉదాహరణగా మన ముందుంది. ఆ దేశాలలోని తల్లుల తన్లాట ఎవరికి కావాలి? ఆ తల్లులకు అమ్మల దినం ఏం ఓదార్పునిస్తుంది. యుద్ధాలు లేని సమాజం కోసం కొట్టాడుదామనే మంచి మాట విన్పిస్తే తప్ప ఆ తల్లుల మనసులు శాంతించవు.

మన దేశంలోని హర్యానా, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీ, అసోం, కర్ణాటక, మధ్య ప్రదేశ్‌ లలో ఇటీవల పెచ్చరిల్లిన మారణకాండ దుష్ట హిందుత్వ పాలకుల ఆగడాలకు మరో మెట్టు పైకి ఎక్కించింది. అది అనేక రాప్రాలలో ముస్లింలను లక్షంగా చేసుకొని రామనవమి నాడు దాడులకు దిగింది చూశాం. తుదకు పిల్లలు చదువుకునే జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వ విద్యాలయంలో కూడ తిండి దగ్గర ఆ రామభక్తులు దాడులకు దిగారు. రామనవమి పాడు కాను, రాకున్నా బాగుండునని నా లాంటి తల్లుల హృదయాలు విలవిలలాడాయి. జహంగీర్‌ పురిలో జరిగిన హిందుత్వ దుర్మార్గం తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. దుర్గా నవరాత్రి సమయంలో కూడ 9 రోజులు మాంసం తినకూడదనీ మాంసం విక్రయాలు నిలిపివేయాలనీ దక్షిణ దిల్లీ మునిసిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ ముఖేశ్‌ సూర్యన్‌ ఆదేశాలే జారీ చేశాడు. ఈ అధికారికి భారత రాజ్యాంగం ఎంతర్థమైందనుకుందాం! లేకపోతే, ఈయన రామభక్తుడా లేక మోదీ భక్తుడా తెలువదు. దానిపై దిల్లీ అమ్మడు, పార్లమెంటు సభ్యురాలు మహువా మోయి త్రా గట్టిగానే మాట్లాడింది.

ముస్లిం సోదరుల పట్ల గత 75 ఏండ్లలో ఇంతటి ద్వేషం ఈ దేశం ఎన్నడూ చూడలేదు. ఏం పాడుకాలమో కానీ, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ అని పైగా మురిసిపోతున్నారు. ఏ వైభవాలను చూసి మహోత్సవాలను జరుపుకుంటున్నారు. శాహీన్‌ బాగ్‌ లో నా లాంటి ʹబడీమాʹ లు ఎందరో వీధుల్లోకి వచ్చిన్యాయం కోరుకుంటే అక్కడా 53 మందిని ఊచకోత కోశారు. మోదీకి ఓ అంతరాత్మ ఉందని భావించిన పలువురు పెద్దలు 108 మంది వారి సంఖ్య ఒక విన్నపం చేశారు. ʹమీ పార్టీ అదుపులో ఉన్న ప్రభుత్వాలు అకుంఠింతంగా అమలు చేస్తున్న ద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలనీ పిలుపు ఇవ్వాలని ఆశిస్తున్నాం. మన జాతి నిర్మాతలు ఊహించిన పోరాటం సలిపిన భారతదేశం అనే భావన విలసిల్లాలంటే సౌభ్రాతృత్వం, మత సామరస్య వాతావరణం కావాలి. ద్వేషం ద్వేషానికే దారి తీస్తుంది అని ఆ హిందూ హృదయ సామ్రాట్‌ ను వేడుకున్నారు. పాపం వారంతా పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగులమని విన్నవించుకున్నారు. వారి మొర మోదీ ఆలకిస్తాడనుకుందామా! ఏమో, నా మనసు మళ్లీ ఎందుకో కానీ నో అనే అంటున్నది. గీతను నరనరాన జీర్ణించుకున్న మోదీ చేసేది, చేయించేది అన్నీ నేనే, నీవు నిమిత్తమాతృడవేననీ చెప్పిన గీతా రహస్యాన్ని ఆయన త్రికరణశుద్ధిగా పాటిస్తాడంటారు మరి. ఈ 108 మందికి అదీ తెలిసే విన్నపంతో ముందుకు వచ్చి నాలాంటిదానికి వివరాలు అందించారేమో మరి, నాకైతే తెలువదాయె. మోదీ కంపెనీ చాలా పెద్దదే ఉంది. అందులో సాక్షి మహారాజ్‌ లు అనేకమంది ఉంటారు. వీరికి గతించిన ఓ పెద్దమనిషి ప్రవీణ్‌ తొగాడియా మంచి మితృడే. ఆయనైతే ఏ జంకూ గొంకూ లేకుండా హిందూ పురుషులను ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి, పిల్లలను ఎక్కువ కనండి అని కోరాడు. ఇపుడు వీరంతా నూతన భారతాన్ని నిర్మించాలనీ దీక్ష పూని ఉన్నారు. వారి నూతన భారతం అదే న్యూ ఇండియాలో ఆదివాసులు ఉండకూడదు, దళితులు ఉండకూడదు, ముస్లింలైతే అసలే ఉండకూడదు. ఎవరున్నా అంతా మేం హిందువులమేనని 56 ఇంచుల ఛాతీ విరుచుకొని చెప్పుకోవాలి. వారి నయా భారత్‌ లో మావోయిస్టు భూతం అసలే ఉండద్దని అమిత్‌ షా 2019 అగస్టులోనే క్లియర్‌ చేసిండు. ఇక ఈ సమూహాలకు చెందిన తల్లులు ఏం చేయాలి? తల్లుల దినం నాడు వారంతా ఏం మాట్లాడుకోవాలి? ఇటీవలి ఒక తెలుగు దినపత్రికలో వచ్చిన హైదరాబాద్‌ లో హైటెక్‌ వ్యాపారం అంటూ రాసిన దేహ వ్యాపార వార్తలు భయం గొలిపేవిగా ఉన్నవి. ముంబాయి కామాటిపురాను మించిన గల్లీలు, బస్తీలు అంటూ రాశారు. ఇవన్నీ పాలకుల కనుసన్నలలో నడిచే దుర్మార్గాలే అనడంలో సందేహం లేదు. మనిషే సరుకైనా ఈ దుర్వ్యవస్థలో మహిళను ఒక శృంగార వస్తువుగా మలిచి కాసులు చేసుకుంటున్నారు. మనం ఆ పత్రికలో వచ్చే సినీ మహిళల బొమ్మలు ఎంత జుగుప్సాకరంగా ఉంటున్నాయో చూడవచ్చు. నీతులు వల్లించే వ్యాపారాలు ఇవి.

గతేడాది నుండి ఇప్పటివరకు నాకు తెలిసిన వీరమాతలు అనసూయమ్మ 99 ఏళ్ల వయసులో కన్ను మూసే. లలితమ్మ 80 దాటాకనే కన్ను మూసింది. కిష్టాబాయి 90లలోనే చెల్లిపోయింది. అంతకుముందే సూర్యకాంతం కూడ కొరోనాతో చనిపోయింది. వీళ్లు పుట్టెడు దుఃఖంల ఉన్నా, వాళ్ల బిడ్డలు జనం కోసం రణం చేసి వాళ్ల కళ్ల ముందే పోయినోళ్లు పోయినా ఉన్నోళ్ళు కొట్లాడుతున్నరని గంపెండంతా ఆశ, విశ్వాసంతోనే అన్నేళ్లు బతికింరు. మధురమ్మ చెట్టెత్తు కొడుకు పోయిన దుఃఖంల ఉన్న కొడుకు కోసం వాళ్ల రాజ్యం రావాలని కోరుకుంటూ బతుకపట్టే. అనసూయ తేల్తుంబ్లే కూడ చేయని నేరాలకు పెద్ద కొడుకు జైలుపాలయిండనీ, తనంటే పడి చచ్చే చిన్న కొడుకు పోలీసులతో కొట్లాడి అమరుడైండనీ 93 ఏండ్ల వయసులో బిడ్డలు చేసే మంచి పనులతో జీవించవట్టే. ఇక అటువంటివాళ్లతో నాలాంటిది ఏం మాట్లాడాలే. మంచి రాజ్యం రావాలనీ, మహిళలకు న్యాయం జరుగాలనీ, మగాళ్లయినా, ఆడాళ్లయినా సమానమే కదా అని చెప్పే బిడ్డలెందరో తమ జీవితాలను ఆ సంగ్రామంలో సమర్పించిరి. ఈ యేడాదిలో అలాంటి బిడ్డలనేక మంది చనిపోయి ఉంటారు. వాళ్లందరిని యాది చేసుకుంటా ఈయేడు అమ్మల దినం జరుపుకుంటే కొంత మనసుకు ఊరట ఉంటదనిపిస్తున్నది.

ఇటీవలే పశ్చిం ముంబాయిలోని బంద్రాలో గల శాంతి ఆవేదన హాస్పైస్‌ సెంటర్లో ప్రపంచమంతా తనదేనని సంబురపడిన నర్మద దిక్కు లేని చందంగా మనందరికీ దూరమాయె! ఆ బిడ్డకు ఇంట్లో కృష్ణకుమారీ అని పేరు పెట్టుకున్నా తండ్రి సుబ్బారావు తన బిడ్డకు బళ్లో నిర్మల కుమారీ అనే పేరు రాయించినా తుదకు నర్మదగా దేశమే కాదు విదేశాలలోనూ మహిళా పోరాటాలకు వన్నె తెచ్చే విధంగా పని చేసి కన్ను మూసే. ఆమెకు కడుపున పుట్టిన బిడ్డలు లేరు కానీ, అంతకన్నా ఎక్కువగా చూసుకున్న పోరాటంల పుట్టిన బిడ్డలు ఎందరో ఉండిరి. వాళ్లంతా వాళ్ల అమ్మలను తలచుకుంటరో లేదో కానీ ఈ అమ్మను మాత్రం తలచుకోకుండా ఉండరు. ఆ బిడ్డలంతా అమ్మల దినం నాడు నర్మదక్కనే తలచుకొని ఆమె నడిచిన దారిలో నడుస్తరనీ వృద్దాప్యానికి చేరువవుతున్న నాలాంటిది ఆశించడమే న్యాయమే అనుకుంటాను. ఈ వయసులో అంతకన్నా నేను కోరుకునేది ఇంకేముంటది!

పేదల కోసం, మహిళల కోసం పని చేసే చదువుకున్నవాళ్లను మోదీ ప్రభుత్వం పట్టణ నక్సలైట్లంటూ పగబట్టి జైళ్ల పెట్టబట్టే. సుధా భరద్వాజ్‌ బయట ఉందన్నమాటే కానీ చిన్న జైల్ల నుండి పెద్ద జైళ్ల పెట్టినట్టే ఆమె ముంబాయి దాటద్దని కండీషన్‌ పెట్టిరి. శోమాసేన్‌ అయితే, ఇంకా జైళ్లనే ఉండే. వీళ్ల బిడ్డలు జైలుపాలైన తమ తల్లుల కోసం ఎంత తన్లాడుతున్నరో చూస్తున్నం కదా! ఇక వీళ్లు బయటకు వస్తరనుకుందామా! మోదీ సర్కార్‌ ఉన్నన్ని రోజులు వాళ్లను రానిస్తరా! మరో సర్కార్‌ వస్తే మాత్రం వారిని వెళ్లనిస్తరా! సర్కార్‌ ఎవరిదైనా అంతా అమెరికోదో, మరోడో చెపితే వినేదే అయినపుడు, వాళ్ల విధానాలనే అమలుచేసేదైనపుడు జనం కోసం నిలిచేటోల్లను జనంలోకి రానిస్తారా? వాళ్లను విడిచిపెట్టాలనీ, దేశ విదేశాలలోని కార్మికులు, మేధావులు మార్చ్‌ 23 నుండి సెప్టెంబర్‌ 13 వరకు ప్రపంచ వ్యాపిత రాజకీయ కేంపెయిన్‌ చేపట్టి నడుపవట్రి. వాళ్లు విడుదలవుతారనే కోరుకుందాం. అయినా, వాళ్లు ఎక్కడ ఉంటేంది, మంచిగుండాలనీి, ఉన్నకాడ వాళ్లు ఎప్పటిలాగే మంచి కోసం నిలువాలనీ, వాళ్లు జైళ్లనే ఉంటే, అటువంటోళ్లను బయట ఉన్నోళ్లు వందలు, వేల సంఖ్యలో తయారు చేయాలనీ అమ్మల దినం నాడు మనం శపథం చేద్దాం.

సామ్రాజ్యవాదం సమస్య సమసిపోవాలనీ, యుద్ధాలు లేని రాజ్యాలు కావాలనీ, మానవాళి శాంతిగా బతుకాలనీ ప్రపంచ కార్మిక వర్గం కోరుకుంటున్నది. నడుములు బిగిస్తున్నది. మనం వారి తల్లులుగా, రష్యా ʹఅమ్మ గా ప్రపంచ అమ్మల దినం నాడు వారికి నిత్యం అండగా ఉంటామనీ ప్రతిన బూనుదాం. తల్లులుగా మనం ఈ మాత్రం చేయలేమా! చేస్తాం, చేసి తీరుతాం.

మమత, ఆదివాసీ పడియోరా కమిటీ

(బంధు మితృల కమిటీ)

(vasanthamegham.com సౌజన్యంతో)

Keywords : mothers day, ukrain, russia, america, USA
(2024-11-05 13:52:20)



No. of visitors : 864

Suggested Posts


ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు

ఈ జూలై 18కి అమరుల బంధుమిత్రుల సంఘం ఏర్పడి 20 ఏళ్లు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాన్ని ఇరవై వసంతాల వేడుకగా జరుపుకుంటారు. మేం ఆ మాట అనలేకపోతున్నాం. ఇది వసంతమూ కాదు, వేడుకా కాదు.

అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?

పేర్లు, వారి స్వగ్రామాలు తదితర వివరాలు ఉద్దేశపూర్వకంగానే తెలియజేయలేదు. సోమవారం ములుగు మార్చురీ దగ్గరికి వెళ్లిన అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులకు మృతదేహాలను చూసే అవకాశం ఇవ్వలేదు. కనీసంగా మృతుల వివరాలు కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి అంత్యక్రియలు జరిగిపోయేలా కుటుంబసభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు.

మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న

దశాబ్ద కాలంగా అమరుల బంధుమిత్రుల సంఘంలో క్రియాశీలకంగా, బాధ్యునిగా ఉంటూ ఈతరం వారికి అమరుల బంధుమిత్రుల సంఘం నేతగా సుపరిచితుడైనవాడు నర్సన్న. తుదిశ్వాస వరకూ నమ్మిన విలువల కోసం పోరాడుతూ ఆ విప్లవ కమ్యూనిస్టు సాంస్కృతిక విలువల ప్రతినిధిగా నిలిచినవాడు నర్సన్న.

విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !

కొడుకు చనిపోయిన కొంతకాలానికి పెద్ద కూతురు ప్రమీల కూడా బూటకపు ఎన్ కౌంటర్లో అమరురాలు అయ్యింది. ప్రమీల సహచరుడు మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అయిన రామచందర్ కూడా అమరుడే. ఇద్దరు పిల్లల్ని, అల్లుడిని కోల్పోయి తనలాంటి ఎందరికో తోడుగా నిలిచాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అమ్మల