ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు

ఆయన

16-05-2022

భీమా కోరేగాం కేసులో నిందితురాలు షోమా సేన్ భర్త తుషార్ కాంతి భట్టాచార్యకు మే 9 న ఫోన్ చేశాను. ఆమె నాలుగు సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతుండగా, ఆయన ఒంటరిగా బైట అనుభవిస్తున్న వేదన కథను నాతో పంచుకోగలరా అని అడగడానికి. సరిగ్గా ఆరోజునే 1991లో తాము పెళ్లి చేసుకున్నామని ఆయన చెప్పాడు. ʹనా వివాహ దినోత్సవాన నేను మరీ మరీ ఒంటరిగా ఉన్నాననిపిస్తోందిʹ అన్నాడాయన. వాళ్ల పెళ్లి అంటే, వాళ్లిద్దరూ ఇరవై మంది మిత్రుల సమక్షంలో తాము ఉమ్మడిగా తమ జీవితాలను అణగారిన ప్రజానీకం కోసం వెచ్చిస్తామని చేసిన వాగ్దాన ప్రకటన సందర్భం. అంతే. ఆ రకంగా భారత సమాజపు అనుల్లంఘనీయమైన వర్గ విభజన రేఖను వాళ్లు దాటారు. ఎలాగంటారా?!

షోమా తండ్రి ముంబాయిలో ఒక వ్యాపార ప్రకటనల సంస్థలో క్రియేటివ్ హెడ్ అనే ఉన్నత స్థానంలో ఉండేవాడు. వాళ్ల కుటుంబం బాంద్రాలో ఉన్నత మధ్యతరగతి జీవితాన్ని గడుపుతుండేది. షోమా ఒక కార్మిక నాయకుడిని పెళ్లి చేసుకుని, అతనితో కలిసి జీవించడానికి మురికివాడలకు పయనించింది. వాళ్ల జీవితాల్లోకి పాప కోయెల్ ప్రవేశించింది. కొన్నాళ్లకు ఆ వివాహ బంధం విచ్ఛిన్నం కాగా షోమా 1987లో నాగపూర్ కు వెళ్లిపోయింది. అక్కడ దళితులు నడిపే విద్యా సంస్థ డా. మధుకర్ రావు వాస్నిక్ పి డబ్ల్యు ఎస్ కాలేజిలో ఇంగ్లిష్ లిటరేచర్ అధ్యాపకురాలిగా చేరింది.

తుషార్ తండ్రి ఇప్పుడు తెలంగాణలో ఉన్న సిర్పూర్ కాగజ్ నగర్ అనే చిన్నపట్నంలో గుమస్తాగా పనిచేస్తుండేవాడు. తుషార్ ఏడుగురు తోబుట్టువులలో ఒకరు. వాళ్లలో ముగ్గురు మగపిల్లలను – ఆలోక్, కలోల్, తుషార్ లను ప్రతిరోజూ ఉదయం ఒక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త వచ్చి ఆటలు ఆడించడానికి తీసుకువెళ్తుండేవాడు. తుషార్ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు ప్రచారక్ ఇందిరాగాంధీని దూషించడం మొదలుపెట్టాడు. ʹమీరు ఆర్ ఎస్ ఎస్ సాంస్కృతిక సంస్థ అని చెప్పుకుంటారు గదా. ఇక్కడ రాజకీయాలెందుకు మాట్లాడుతున్నారుʹ అని తుషార్ నిలదీశాడు. ఆ తెలివైన పిల్లవాడు అప్పటికే నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల గురించీ, 1968 పారిస్ విద్యార్థి తిరుగుబాటు గురించీ చదివి ఉన్నాడని ఆ ప్రచారక్ కు తెలియదు.

తుషార్ అధ్యయనమే ఆయనలో కుల వర్గ అంతరాలను బద్దలు గొట్టాలనే కోరికను ప్రేరేపించింది. సరిగ్గా ముంబాయిలో షోమాకు కూడ అధ్యయనం వల్లనే అటువంటి ప్రేరణలే కలిగాయి. ఆ ప్రేరణలే వాళ్లను ఒకే మార్గం మీద నడిపించాయి, ఒక్కచోటికి చేర్చాయి. తన భావజాల ప్రత్యర్థులను జైళ్లకు పంపించే భారత రాజ్యంతో తలపడే చోటు అది.

జైలుతో తుషార్ సంబంధం చాల ముందే, ఆయన పదో తరగతిలో ఉన్నప్పుడే మొదలైంది. ఆయన చేరిన ఒక నవయువకుల బృందం గోడల మీద విప్లవ నినాదాలు రాస్తుండేది. తమ విప్లవ స్ఫూర్తిని చాటుకోవడానికి, పొరపాటుగానే అయినా వాళ్లు మహాత్మా గాంధీ పాలరాతి విగ్రహానికి ఎర్రజాజు పూశారు. తర్వాత కొన్నాళ్లకే ఆ విగ్రహాన్ని ఎవరో పగులగొట్టారు. వెంటనే ఈ పిల్లలను అరెస్టు చేశారు. కాకపోతే ఆ నేరారోపణ అబద్ధమని న్యాయస్థానం వారిని విడిచిపెట్టింది. ఆ తర్వాత తుషార్ తమ హక్కుల కోసం పోరాడే కార్మికులను సంఘటితం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు.

1987లో నాగపూర్ లోని ఖపర్ ఖేడా థర్మల్ పవర్ ప్లాంట్ లోని కార్మికుల దుర్భరమైన పని పరిస్థితులను చూసి తుషార్, కార్యకర్త అనురాధతో, ఆమె భర్త, డూన్ స్కూల్ మాజీ విద్యార్థి కోబడ్ గాంధీలతో కలిసి అక్కడి కార్మికులను సంఘటితం చేయడం మొదలుపెట్టాడు. ఆ సంవత్సరమే తుషార్ కు టైఫాయిడ్ వచ్చింది. చికిత్స కోసం, విశ్రాంతి కోసం అనురాధ ఆయనను షోమా ఇంట్లో ఉంచింది. అక్కడ షోమా సపర్యలతో తుషార్ కోలుకున్నాడు. వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. వాళ్ల మార్క్సిస్టు విశ్వాసాలూ, బెంగాలీ నేపథ్యమూ ఆ ప్రేమను బలోపేతం చేశాయి. కోయెల్ కూడ తుషార్ ను పాపా అని పిలవడంతో ఆ సంబంధం మరింత బలపడింది.
కాని ఆ కుటుంబాన్ని రాజ్యం చెప్పనలవి గాని వేదనకు గురిచేసింది.

ఇక్కడ విచిత్రం ఏమంటే నాగపూర్ లో షోమా తన మధ్యతరగతి మూలాల్లోకి తిరుగుప్రయాణం ప్రారంభించింది. స్త్రీ చేతన అనే మహిళా సంస్థను స్థాపించి తన పని మీద కేంద్రీకరించింది. అవును, చైతన్యవంతులైన పౌరులందరి లాగే ఆమె దళితుల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా ఎలుగెత్తింది. గడ్చిరోలి లోని నిరుపేద ఆదివాసుల కుటుంబ సభ్యులు గణనీయమైన సంఖ్యలో నాగపూర్ జైళ్లలో ఉండగా, వారికి అంతదూరం రావడం కష్టమనీ, వారికోసం గడ్చిరోలిలోనే జైలు ఏర్పాటు చేయాలనీ హైకోర్టులో కేసు వేసింది.

ఎవరి హృదయమైనా ఆదివాసుల కోసం రవరవలాడుతున్నదంటే రాజ్యానికి ఉలికిపాటు కలుగుతుంది.

షోమా, తుషార్ ల బాధలు 2018 జూన్ 6న భీమా కోరేగాం కేసులో ఆమె అరెస్టు కావడంతోనే ప్రారంభం కాలేదు. ఆ వేదన 2007లో మొదలైంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర బీహార్ మూడు ప్రాంతాలను కలిపిన ట్రిపుల్ యు అనే అజ్ఞాత మావోయిస్టు విభాగానికి ఆయనే నాయకుడు అని ఆరోపిస్తూ 2007లో ఆయనను అరెస్టు చేశారు. ఆ జంటను విడదీశారు. ʹఆ రోజుల్లో షోమానే నా బలంʹ అన్నాడు తుషార్. అలాగే తుషార్ అన్న కలోల్ కూడ ఆయనకు మద్దతు ఇచ్చాడు. అప్పటికి ఆయన ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ కు తెలంగాణ కార్యదర్శి. తుషార్ మీద ఏడు కేసులు పెట్టారు. కాని న్యాయస్థానాలు అన్ని కేసులనూ కొట్టివేసి ఆయనను నిర్దోషిగా విడుదల చేశాయి. 2013 ఫిబ్రవరిలో ఆయన జైలు నుంచి స్వేచ్ఛలోకి బైటికి వచ్చాడు.

అప్పటికి షోమా ఆర్ టి ఎం నాగపూర్ యూనివర్సిటీ ఇంగ్లిష్ శాఖలో అధ్యాపకురాలైంది. ʹఅపరాధ భావనతో నన్ను నేను చంపుకుంటూ, నా సంపాదనను దాచుకోవడమో, లేదా ఆ సంపాదనను ఈ వయసులో కాస్త సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి వాడుకోవడమోʹ అనే ఎంపికే మిగిలిందని షోమా తన స్నేహితురాలు, జర్నలిస్టు జ్యోతి పున్వానికి రాసింది. ఆమె ఇప్పుడు, ఒక చిట్టడవి ఎదురుగా అపార్ట్ మెంట్ లో ఇద్దరు సహాయకులు, ఒక డ్రైవర్ లతో మెరుగైన జీవితం గడిపే అవకాశం వచ్చింది. ʹమా ఇద్దరి పరస్పర విరుద్ధ జీవిత విధానాల మధ్య రాజీ కుదుర్చుకోవడానికి నాకు రెండు సంవత్సరాలు పట్టిందిʹ అన్నాడు తుషార్. ఆయన పుస్తకాలు అనువాదం చేస్తూ, తమ భవనం మీద మిద్దె తోటను సంరక్షిస్తూ కాలం గడపడం మొదలు పెట్టాడు.
ఈ ప్రశాంత జీవనం 2018 జూన్ 6న బద్దలైపోయింది. తన తల్లి జైలు నిర్బంధంతో కోయెల్ అల్లకల్లోలమైపోయింది. ఇరుగు పొరుగువాళ్లు ముఖం చాటేశారు. ఇంట్లో సహాయం చేస్తుండే పని మనిషి ఇతర ఇళ్లవాళ్ల ఒత్తిడి వల్ల ఈ ఇంట్లో పని మానేసింది. గ్లకోమా (కంటి వ్యాధి) తో, ఆర్థ్రైటిస్ (కీళ్ల వ్యాధి) తో, హైపర్ టెన్షన్ (తీవ్ర రక్తపోటు) తో షోమా జైలు జీవితాన్ని ఎట్లా తట్టుకోగలుగుతుంది అనే ప్రశ్న ఎవరో తననే అడుగుతున్నట్టు తుషార్ మనసులో ప్రతిక్షణమూ గుసగుస వినిపిస్తుండేది. కంప్యూటర్ ముందు కూచుని ఒక్క వాక్యం కూడ రాయలేక రోజంతా ఖాళీ కంప్యూటర్ తెరను చూస్తూ ఉండేవాడు. చివరికి సైకోథెరపీ తీసుకుంటే గాని ఈ మనసులో గుసగుస అదుపులోకి రాలేదు.

తుషార్ షోమాను ఏప్రిల్ 28న కలిశాడు. ఆమె విచారంగా, నిరాశగా ఉన్నట్టనిపించింది. తన నిర్బంధం త్వరలో ముగిసిపోయే అవకాశం లేదనే సంపూర్ణమైన ఎరుకతో కలిగిన నిరాశ అది. ఎందుకంటే భీమా కోరేగాం కేసులో విచారణ ప్రారంభం కావడానికి మొదటి మెట్టు అయిన ఆరోపణల నిర్ధారణే ఇంకా జరగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ʹపౌరహక్కుల పరిరక్షణకూ, మానవ హక్కులను గౌరవించడానికీʹ కట్టుబడి ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఒక అఫిడవిట్ లో ఇటీవలనే చెప్పింది. షోమా, తుషార్ లకు ఇది ఒక క్రూర పరిహాసంలా ధ్వనించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి వారిద్దరి 31 సంవత్సరాల వివాహ జీవితంలో ఇద్దరూ కలిసి తొమ్మిది సంవత్సరాలు జైళ్లలోనే గడిపారు. ఆ జైలు నిర్బంధ కాలం ఇంకా సాగుతూనే ఉంది.

(సీనియర్ జర్నలిస్టు అజాజ్ అష్రఫ్ ముంబాయి పత్రిక మిడ్ డే లో తన శీర్షిక ʹమండే బ్లూస్ʹ లో మే 16న రాసిన వ్యాసానికి తెలుగు: ఎన్ వేణుగోపాల్)

Keywords : bk16, bk15, shomasen, tushar kanth battacharya, varavararao,
(2024-07-14 12:49:47)No. of visitors : 899

Suggested Posts


ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు

అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆయన