మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1

మార్గ‌ద‌ర్శి


(విర‌సం పున‌ర్ముద్రిస్తున్న చెర‌బండ‌రాజు సాహిత్య స‌ర్వ‌స్వానికి సంపాద‌కుడిగా అల్లం రాజ‌య్య రాసిన ముందుమాట‌. జూలై 3, ఆదివారం హైద‌రాబాదులోని సుంద‌ర‌య్య విజ్ఙాన కేంద్రంలో చెర 40 వ‌ర్థంతి స‌భ‌)

Part 1

విశ్వవ్యాప్తంగా సామ్రాజ్యవాదం పూర్తిగా విస్తరించి ` తను ఆర్థిక మాంద్యంలో కూరుకపోయి స్థానిక ఉత్పత్తి శక్తుల మీద ` ఉత్పత్తి సంబంధాల మీద తీవ్రమైన ప్రభావం చూపిన కాలమది. అన్ని దేశాలల్లో దోపిడీ, హింసా, నిరుద్యోగం పెరిగిపోయాయి. వాటికి కారణాలేమిటో తెలియని ప్రజలు తీవ్రమైన భావోద్వేగాలకు లోనయ్యారు. కోపోద్రిక్తమైన యువకులు, విద్యార్థులు పారిస్‌లో తిరుగుబాటు చేశారు. హోచిమిన్‌ నాయకత్వంలో క్రూరమైన జిత్తులమారి అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు పోరాటం పతాకస్థాయికి చేరింది. అది రష్యా సోషల్‌ సామ్రాజ్యవాదంగా రూపొందుతున్న కాలం. చైనాలో కొత్తగా రూపొందుతున్న పెట్టుబడిదారీవర్గానికి వ్యతిరేకంగా మావో సాంస్కృతిక విప్లవానికి పిలుపునిచ్చిన కాలం..ఇలా ప్రపంచవ్యాపితంగా పెను సంచలనాలు ` యుద్ధాలు చెలరేగుతున్న కాలం అది.
మన దేశంలో నెహ్రూ మార్కు బూటకపు సోషలిజం విఫలమయ్యింది. భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలోని వైరుధ్యాలను అర్థం చేసుకోలేక పోరాడే ప్రజలకు నాయకత్వం వహించే చొరవ కోల్పోయింది. వర్గపోరాటం స్థానే వర్గ సామరస్యం వల్లిస్తూ రివిజనిజంలో కూరుకుపోయి రెండుగా చీలింది. దేశం జాతుల బందీఖానాగా, ఉత్పత్తి శక్తుల బందిఖానాగా మారింది. గ్రామాలు సుదీర్ఘ కాలం కులాల కాన్‌సంట్రేషన్‌ క్యాంపులుగా మారి ఉత్పత్తి శక్తుల వికాసానికి ఆటంకమయ్యాయి. దీంతో చావో రేవో తేల్చుకొని పోరాడవలసి వచ్చింది. ఈ పోరాటాలన్నిట్లో సరైన నిర్మాణం, నాయకత్వం లేక వేలాది మంది విద్యార్థులు కదం తొక్కుతున్న కాలం అది.
అలాంటి గడ్డుకాలంలో తెలంగాణా సాయుధ పోరాటం జరిగి(1948`51), నాయకత్వ విద్రోహం వలన విరమించబడిన నేపథ్యం గల నల్గొండ జిల్లాలోని అంకుశాపురంలో బద్దం బాలనర్సింహ 1944లో పుట్టి గాయాల నొప్పుల స్థితిలో బాల్యం గడిపాడు. ఆ సంవత్సరం తెలంగాణాలో ఆంధ్ర మహాసభ అతివాద, మితవాద గ్రూపులుగా చీలింది. ఆయన బాల్యం రక్తసిక్త తెలంగాణా సాయుధ పోరాటం అతలాకుతలంతో గడిచింది. అయిదవ తరగతి నాటికి బాల నర్సింహ పేరు స్కూల్లో భాస్కరరెడ్డిగా మారింది. ఇలాంటి ఒత్తిడి చిత్తడిలో కౌమారపు స్వేచ్ఛా కాంక్ష కలలు గన్నాడు. పలవరింతల మధ్య కవిత్వం ఓదార్చింది. కవిత్వం పూనిన తరువాత చదువు పట్టు తప్పింది. ఈ గడబిడల మధ్యనే పదహారో ఏట శ్యామలతో పెండ్లి జరిగింది.
పేద రైతు కుటుంబంలో శ్యామల వ్యవసాయ పనుల్లో గొడ్డు చాకిరీలో ఉండగా భాస్కర్‌రెడ్డి రవీంద్రుడు, శరత్‌ కలల్లో తేలిపోతూ బెంగాల్‌లోని శాంతినికేతన్‌కు పయనమయ్యాడు. ఆయనకు కవిత్వమొక తీరని దాహం. శాంతినికేతన్‌ ధనికులదేగాని పేదలది కాదని అర్థమయ్యింది. తిరిగి ఇంటికి చేరిండు. టీచర్‌గా ఉద్యోగం. మకాం హైదరాబాదుకు ` అక్కడ కె.యాదగిరిరెడ్డి (నిఖిలేశ్వర్‌)తో పరిచయం (1962). కనిపించే కకావికలైన జీవితాలకు వెనుకగల కారణాలేమిటో తెలియక ఒంటరిగా కవిత్వమనే కలల ప్రపంచంలో తిరుగుతున్న భాస్కర్‌రెడ్డికి అలాంటి కోపోద్రిక్త హైదరాబాదు పట్టణ జీవితం, కవుల గుంపు పరిచయమయ్యింది.
పాత దారులన్నీ మూసుకుపోయి, ధ్వంసమై, కాళ్లు, కీళ్లు సడలిపోయి కదలలేని స్థితిలో ఉన్న ప్రపంచంలో ఇమడలేని యువకులు ` తీవ్రమైన కోపోద్రిక్తతలో `1965 నాటికి హైదరాబాదులో దిగంబర కవులుగా రూపొందారు. కలకత్తాలో యాంగ్రీ పోయెట్స్‌ ప్రపంచవ్యాపితంగా బీటిల్స్‌ లాంటి వాళ్లు ఇదే కాలంలో వచ్చారు. పాతదాన్ని కూలగొట్టడం, రూపొందుతున్న కొత్తదేమిటో తెలియని అసహనం చెలరేగిన ఉద్వేగాల సారాంశం వీరందరి కవిత్వ లక్షణం.
అట్లా బద్దం భాస్కర్‌రెడ్డి చెరబండరాజుగా, నిఖిలేశ్వర్‌, నగ్నముని, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవయ్యగా తమ పేర్లు మార్చుకొని తీవ్రమైన నిరసనతో దిగంబర కవిత్వం రాసి ప్రచురించారు. నిస్తేజమైన తెలుగు సాహిత్య వాతావరణంలో పెను సంచలనం లేపారు. పాత కొత్త సాహిత్యాల మధ్య తీవ్రమైన ఘర్షణకు దిగంబర కవిత్వం తెరదీసింది. అందులో చెర కవిత్వం అత్యంత సాహసోపేత విస్పోటనలాంటిది. శ్రీశ్రీ ʹమహాప్రస్థానంʹ తరువాత పెను సంచలనం రేపిన కవి చెరబండరాజు. భయం, గియంలేని కవిత్వం అది. ʹనన్నెక్కనివ్వండి బోనుʹ, ʹవందేమాతరంʹ లాంటి కవితలు రాశారు. సంప్రదాయ కవిత్వరీతులను ఈ కవితలు బద్దలు కొట్టాయి.
ఇలాంటి తీవ్రమైన ఒత్తిడిలో నుంచి 1967 మార్చి నాటికి పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలోని నక్సల్బరీలో సిపియం నుండి విడిపోయిన చారుమజుందారు, కానుసన్యాల్‌, జంగల్‌ సంతాల్‌ రైతాంగ తిరుగుబాటుకు పిలుపునిచ్చారు. ఖోడె గ్రామంలో జోతేదారుల పొలాల్లోని పంటలు ప్రజలు తెచ్చుకున్నారు. ఇది రైతాంగ విస్పోటనం. మే 25నాడు పోలీసులు కాల్పులు జరుపగా 9 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఈ సంఘటనతో రైతాంగంలో పెద్దఎత్తున తిరుగుబాటు ఆరంభమయ్యింది. నక్సల్బరీ తిరుగుబాటు ఆ జిల్లా అంతా వ్యాపించి 52 రోజుల నిలబడ్డది. దేశవ్యాప్త గ్రామీణ ప్రజలకు ఈ తిరుగుబాటు వార్త గాలికన్నా వేగంగా చేరింది.
చారుమజుందారు తన మిత్రులతో కలిసి ` ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అంతకు ముందు నుంచే చారుమంజుందార్‌ ʹతెరాయిʹ డాక్యుమెంట్లు రాయడం మొదలు పెట్టి ఈ పోరాటానికి ఒక రాజకీయ రూపం యిచ్చారు.
అదే సంవత్సరం అక్టోబర్‌లో శ్రీకాకుళం గిరిజన ప్రాంతంలో ఉద్యమం ఆరంభమయ్యింది. వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రాహి నాయకత్వంలో 1967 అక్టోబర్‌ 31న మొండెంఖల్లు గ్రామంలో జరిగిన ఊరేగింపు మీద జరిగిన పోలీసు కాల్పుల్లో కోరన్న, మంగన్న చనిపోయారు. గిరిజన పోరాటం సాయుధ పోరాటంగా మారింది. శ్రీకాకుళం మొత్తం పోలీసు క్యాంపుగా మారింది. నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటాలు భారతీయ భాషా సాహిత్యాల్లో కొత్త ఒరవడిని తెచ్చాయి. తెలుగు సాహిత్య రంగంలో యువకులైన అనేకమంది కవుల్లో తీవ్రమైన భావోద్వేగాలను రేపాయి.
1969లో వరంగల్లులో లోచన్‌, వరవరరావు, ఎక్స్‌రే లాంటి వాళ్లు తిరుగబడు కవులుగా దిగంబర కవిత్వానికి భిన్నమైన కవిత్వాన్ని వెలువరించారు. ఈ నేపథ్యంలో 1970లో విశాఖలో శ్రీశ్రీ షష్టి పూర్తి జరిగింది. తెలుగు రచయితలు, కవులు అనేకమంది పాల్గొన్న ఈ సభలో విశాఖ విద్యార్థుల పేర ʹరచయితలారా మీరెటు వైపుʹ అనే కరపత్రం రచయితలను సూటిగా ప్రశ్నించింది. రచయితలు, కవులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది.
ఫలితంగా హైదరాబాదులో జులై 4నాడు విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. శ్రీశ్రీ, కొ.కు., రావిశాస్త్రి, కారా, కె.వి.రమణారెడ్డి, వరవరరావు, నిఖిలేశ్వర్‌, జ్వాలాముఖి లాంటి అనేక మంది కవులు, రచయితలు విరసాన్ని ఏర్పాటు చేశారు. చెరబండరాజు విరసం వ్యవస్థాపక సభ్యుడు.
ఆ తరువాత విరసం మొదటి మహాసభలు ఖమ్మంలో జరిగాయి. ఆ సభలకు శ్రీకాకుళం, నక్సల్బరీ పోరాటాలను సమర్థిస్తూ ʹరaంరaంʹ కవితా సంకలనం తీసుకువచ్చారు. చెరబండరాజు కవిత్వం మారిపోయింది. చెర లోలోపల రగులుతున్న లావాకు దారి దొరికింది.
ప్రజల దగ్గరికి పోవడానికి పాట సాధనమని విరసం భావించింది. చెర ʹకొలిమంటుకున్నాది ` తిత్తినిండా గాలి పొత్తంగా ఉన్నదిʹ పాట రాశారు. చెరబండరాజు తన కంఠ నరాలు పొంగే పాటగాడుగా మారిపోయారు. ప్రవాహం మొదలైంది. సమస్త ఉద్వేగాల ఉరవడి చెరలో ఒక ప్రవాహంగా మారి వేగాన్ని అందుకుంది. కథలు, పాటలు, కవిత్వం పదునెక్కుతున్నాయి. నాటికలు, నాటకాలు, విరసం ఆశయాలతో ʹదారి పొడుగునాʹ నవల ఈ కాలంలో రాశారు. ʹపోలీసుʹను హీరోగా తీసుకొని ʹచిరంజీవిʹ కథ రాశారు. ఈ కథ ʹఇప్పుడు వీస్తున్న గాలిʹ(1970) కథల పుస్తకంలో అచ్చయింది. అందుకు ఈ పుస్తకాన్ని నిషేధించారు. ఈ కథ ఆ రోజుల్లో తీవ్ర సంచలనం రేపింది. ఆ కాలంలో ఇన్ని సాహిత్య ప్రక్రియల్లో విప్లవోద్యమంతోపాటు రాసిన వారు అరుదు.
1970లో బి.నర్సింగరావు, భూపాల్‌, గద్దర్‌ లాంటి వాళ్లు కలిసి ʹఆర్ట్స్‌ లవర్స్‌ʹగా ఏర్పడ్డారు. పాట ప్రయాణం ప్రజల్లోకి షురువయ్యింది. అందులో చెరబండరాజు పాటల ఊట చెలిమ అయ్యారు.
1971లో చెరబండరాజు 27 సంవత్సరాల వయసులో విరసం కార్యదర్శి అయ్యారు. ఇది ఒక సాహసోపేత నిర్ణయం. అప్పటికే చెరబండరాజు ప్రభుత్వానికి తీవ్రమైన కవిగా మారారు. ఆగస్టులో పీడీ యాక్టు కింద అరెస్టు చేసి జైల్లో వేశారు. అప్పటి నుండి చెరబండరాజు జీవితంలో అరెస్టులు, జైలు జీవితం పరంపర కొనసాగింది. అయినా కవిత్వం, పాటలు, నవలలు రాయడం ఉధృతమయ్యింది. విరసం పురిటినొప్పులు పడుతున్న ప్రజా ఉద్యమాలే చెర సర్వస్వం అయ్యాయి.
1972లో చైనా ఎర్ర రంగస్థలం స్ఫూర్తితో ʹజన నాట్యమండలిʹ ఏర్పాటుతో మరింత చొరవతో ప్రజల్లోకి వెళ్లే ఆచరణ మొదలైంది. చెర పాటలు పూర్తిగా మారిపోయాయి. బ్యాలేలు ` కొండలు పగిలేసినాం లాంటి డప్పు డ్యాన్సులు ` అనేక రకాలుగా పాట సాగింది. అప్పుడు చెరబండరాజు, గద్దర్‌ పాటలు తెలంగాణా పల్లెల్లోకి ప్రవహించాయి.
1973 అక్టోబర్‌ 11న ʹమీసాʹ కింద అరెస్టు, 1974 మే 18న ʹసికింద్రాబాదు కుట్రకేసుʹలో అరెస్టు, జైలు జీవితం ` 1974లో ఉద్యోగం పోవడం, ఆర్థిక ఇబ్బందులు ` జైలులో తీవ్రమైన తలనొప్పి, అల్సర్‌ ` 1975లో విడుదల. 1975 జూన్‌ 26న భారతదేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన నాడే ఆంతరంగిక భద్రతా చట్టం కింద మళ్లీ అరెస్టు, జైలు. జైలులో ఉండగానే అక్టోబర్‌ 1976లో మొదటి బ్రైన్‌ ట్యూమర్‌ ఆపరేషన్‌ జరిగింది.21.3.77న ఎమర్జెన్సీ ఎత్తివేత, చెర విడుదలయ్యాడు.1979 నవంబర్‌ 3న రెండవసారి ఆపరేషన్‌ జరిగింది. 1980లో ఉద్యోగంలో చేరారు. 1981 జూలై 28న మూడవ ఆపరేషన్‌. తరువాత 1982 జూలై 2న చెరబండరాజు అమరులయ్యారు. అప్పటికి చెర వయస్సు 38 సంవత్సరాలు మాత్రమే. తన పదేండ్ల వయస్సు నుండి నశించిపోతున్న పాత సమాజంలో రూపొందుతున్న కొత్త సమాజం పడే తీవ్రమైన ఘర్షణలో చెరబండరాజు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విప్లవ కవిగా, గాయకుడుగా, నాటకకర్తగా, రచయితగా, ఉద్యమ కార్యకర్తగా, తీవ్ర నిర్బంధంలో విరసం కార్యదర్శిగా సృజనాత్మక కృషి చేశారు. యుద్ధ, నిర్బంధ వీరోచిత పోరాట రంగంలో చెరబండరాజు సరోజ్‌దత్తా, పాణిగ్రాహిలా కార్యకర్తగా, నాయకుడిగా జీవించారు. ప్రజాసాహిత్యం, ప్రజా పోరాటాలే ఊపిరిగా చివరి దాకా కొనసాగారు.
ఇది విప్లవోద్యమాల్లో, భారతీయ సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో అపురూపమైన విషయం.
2
శ్రీశ్రీ, గద్దర్‌, శివసాగర్‌లాగా చెరబండరాజు తెలుగు ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ కల్గిన కవి. ʹకొండలు పగలేసినంʹ, ʹఏ కులమబ్బిʹ లాంటి పాటలు తెలియనివారు అరుదు. ఆ ముగ్గురికన్నా ఎక్కువగా మరాఠీ, పంజాబీ, బెంగాలీ, హిందీ, కన్నడ, మళయాలం లాంటి ఇతర భారతీయ భాషల్లోకి చెరబండరాజు కవిత్వం, పాటలు వెళ్లి దేశవ్యాపితంగా అత్యంత ప్రజాదరణ పొందారు. మూడు తరాలకు పరిచయమున్న చెరబండరాజు పాటలు విప్లవోద్యమాల దారి పొడుగునా ఇప్పటికీ పల్లెల్లో, పట్టణాల్లో, గనుల్లో, అడవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి.
చెరబండరాజు తన పది సంవత్సరాల వయస్సు నుండి కవిత్వం రాస్తూనే ఉన్నారు. ఆయన అమరుడయ్యే నాటికి దాదాపు ఇరువై ఎనిమిది సంవత్సరాలు కవిగా, రచయితగా, గాయకుడిగా ఉన్నారు. తొలిదశలో కంద పద్యాలు రాసినా ` చివరికి పాటే ఊపిరిగా బతికారు.
1982 జూలై 2న చివరిశ్వాస ఒదిలే వరకూ చెరకు సాహిత్యమే ప్రాణం. కవిత్వం, పాట, కథ, నవల, నాటికలు, నాటకాలు..జీవితం ఎన్ని రకాలుగా మలుపులు తిరిగిందో, ఎన్ని భావోద్వేగాలకు లోనయ్యిందో అన్నీ ఎప్పటికప్పుడు రాస్తూనే వచ్చారు. ఆ రచనే ఆయనను తన వైయక్త జీవితంలో నుండి ` కులాలు ఘనీభవించిన పల్లెల నుండి పట్నాలకు, గనులకు, కార్ఖానాలకు, అడవులకు చేరి లక్షలాది, కోట్లాది మంది ప్రజలను కలిపింది. ఈ ప్రయాణంలో ఎన్ని ఎదురుదెబ్బలో, గాయాల నొప్పులో. జైలు, ఆనారోగ్యం, పేదరికం ఆయనను ఆపలేకపోయాయి.
సాహిత్యం ఆయన్ని ఉన్నకాడ ఉండనీయ లేదు. పల్లె ఎల్లలు దాటి పట్నం, శాంతి నికేతన్‌, ప్రజాస్వామ్య కలతో కూడిన ప్రయాణం. సాహిత్యం ఒక అన్వేషణగా మారింది. ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు ఉన్న వైరుధ్యంలో, మారని దోపిడీ హింసాత్మక అర్ధవలస, అర్ధ భూస్వామిక వ్యవస్థపై దేశవ్యాప్త విప్లవోద్యమ పోరాటాలు రూపుదిద్దుకునే కాలంలో ఆయన రచన సాగింది. ప్రపంచంలోని యావత్తు కోపోద్రిక్త యువకులందరు సామ్రాజ్యవాదాన్ని, తమ దేశంలోని దోపిడీ వ్యవస్థలను కూలదోసే నిర్మాణాల కోసం దారులు వెతుకుతున్న కాలంలో మార్క్సిజం `లెనినిజం`మావో ఆలోచన వల్ల పెను కుదుపులకు లోనైన కాలంలో చెర దిగంబర కవిగా ʹవందేమాతరంʹ లాంటి కోపోద్రిక్త గీతాలు రాశారు. విప్లవ కవిగా, రచయితగా రూపొందారు.
ఆ పాటల కోసం, కవిత్వం కోసం మూడుమార్లు జైలు జీవితం గడిపారు. కుటుంబం కకావికలం అయ్యింది. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీనికి తోడు తీవ్రమైన అనారోగ్యం. ఒక కమ్మరి కొలిమిలాగా మండిన చెర మెదడులో ట్యూమర్‌కు మూడుసార్లు ఆపరేషన్‌ జరగడంతో నెలల తరబడి హాస్పిటల్లో గడిపాల్సి వచ్చింది. రకరకాల సంఘర్షణాత్మక యుద్ధభూమిలో చెరబండరాజు కవిగా, నాయకుడుగా, వీరులు చరిత్ర నిర్మాతలనే భావన నుంచి ప్రజలే చరిత్ర నిర్మాతలుగా రూపొందుతున్న సంక్లిష్ట చారిత్రాత్మక స్థలంలో కాలంతోపాటు నడిచారు. ʹముంజేతిని ఖండించిన ` పిడికిటకత్తి వదలననేʹ ధీరోదాత్తుడుడుగా నిలిచారు.
3
విడిగా సంకలనాలుగా వచ్చిన చెర సాహిత్యాన్ని ఆయన మరణానంతరం చెరబండరాజు పాటలు, కవితలు కొన్ని కలిపి పీపుల్స్‌ బుక్స్‌ పేరుతో 1982లో ఒక పుస్తకంగా అచ్చయ్యాయి. ఆ సమయంలో మొదటిసారి ఆయన సాహిత్యం చదివి ఫేర్‌ చేసే అవకాశం కేవీఆర్‌ నాకు ఇచ్చారు. అప్పుడే విరసం కత్తిపాట పేరుతో ఎంపిక చేసిన పాటలు ఒక సంకలనంగా తీసుకొచ్చింది. ఈ పుస్తకం ఇంగ్లీషు అనువాదం 1985లో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి ప్రచురించింది. 2003లో విరసం చెరబండరాజు సాహిత్య సర్వస్వం నాలుగు సంపుటాలను ప్రచురించింది. మళ్లీ ఇప్పుడు మరోసారి ʹచెర సమగ్ర సాహిత్యంʹ రెండు సంపుటాలుగా తీసుకొస్తోంది. పాటలు, కవితలు, నాటకాలు, నాటికలు, జీవనరేఖలు ఒక సంపుటంగా, కథలు, నవలలు ఒక సంపుటంగా దాదాపు 12 వందల పేజీలు అచ్చువేస్తోంది. ఆయా కాలాల్లో ఈ విడి సంపుటాలకు, సమగ్ర సాహిత్యానికి కొడవటిగంటి కుటుంబరావు, పురాణం సుబ్రమణ్యశర్మ, పి.రామకృష్ణారెడ్డి, వరవరరావు, చేకూరి రామారావు, రావిశాస్త్రి, కళ్యాణరావు, వి.చెంచయ్య, కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావులాంటి వాళ్లు విలువైన ముందుమాటలు రాశారు. ఇప్పుడు మూడో తరానికి చెరబండరాజు సమగ్ర సాహిత్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం.
దిగంబర కవి నుండి అమరులయ్యేదాకా ` ʹవందేమాతరంʹ, ʹనన్నెక్కనివ్వండి బోనుʹ నుండి ` ʹగోదావరి పొరలుతోందిʹ ` జగిత్యాల జైత్రయాత్ర 1978 దాకా దాదాపు 170 కవితలు రాశారు. అందులో కొన్ని పాటలు. దాదాపుగా ఈ కవితలు, పాటలన్నీ కూడా అంతకు ముందు మరే సాహిత్యం వెళ్లనంతగా జనంలోకి వెళ్లాయి.
భారతదేశంలోని అర్ధవలస, అర్ధభూస్వామిక దోపిడీ, హింసాత్మక పరిస్థితుల మీద తీవ్రమైన ఆగ్రహం ప్రకటించడంతో మొదలైన చెర కవిత్వం.. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ రైతాంగ పోరాటాలు ఆరంభమైన దాకా అనేక దశలను ఆనాటి వర్గపోరాట స్థితి, చైతన్యాల మేరకు చిత్రించాయి. అనగా, తెలంగాణా సాయుధ పోరాటం అనుభవించిన ఆటుపోటులుÑ నక్సల్బరీ, శ్రీకాకుళాలు గడించిన అనుభవాలు, గుణపాఠాలు చెర సాహిత్యం నిండా కనిపిస్తాయి. ప్రజల దైనందిన జీవితంలోని దోపిడీ పీడనకు వ్యతిరేకంగా పెల్లుబుకిన పరిమాణాత్మక పోరాటాలు ` 1967 నుండి 1977 దాకా అనేక ప్రయోగాలు, తీవ్ర నిర్బంధాలు ` అరెస్టులు, జైళ్లు, దేశవ్యాపితంగా సుమారు 16 వేల మంది యువకుల హత్యాకాండ, వేలాది మంది యువకుల నిర్బంధం ` చివరకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఫాసిస్టుగా మారి అత్యయిక పరిస్థితి.... ఇలాంటి సంక్షోభ కాలంలో మునుపెన్నడూ లేని విధంగా భారతదేశ చరిత్రలో పది సంవత్సరాల కాలం విప్లవోద్యమం నిలదొక్కుకుని, అన్ని రకాల ప్రజల్లోకి పురోగమించిన కాలంలో ` చెరబండరాజు ఆ సమస్త ఉద్విగ్నతలను కవిత్వీకరించారు. గొంతెత్తి పాడారు. విరసానికి, జననాట్యమండలికి, గద్దర్‌, చెరబండరాజు, శివసాగర్‌, వంగపండు ప్రసాదరావు పాటలు ఆ కాలంలో ఊపిరులయ్యాయి. నక్సల్బరీని, శ్రీకాకుళాన్ని తెలుగు ప్రాంతాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోకి వీరు తీసుకపోయారు.
ఇదే ప్రయత్నంలో చెర రెండు నాటకాలు ` ʹగ్రామాలు మేల్కొంటున్నాయిʹ (1974), ʹగంజినీళ్లుʹÑ నాటికలు ` ʹపల్లె పిలుస్తోందిʹ (1965), ʹవెన్నెల్లో మంటలుʹ, ʹఘర్షణʹ (1971), ʹటెంపరరీ లేబర్‌ʹ (1973 రాసి ప్రదర్శించారు. ఈ నాటకాల్లో వస్తువు ` ముందే చెప్పుకున్నట్లు ఆ పది సంవత్సరాల విప్లవోద్యమం. అది ఒక ప్రజాపోరాటంగా ఎదగడానికి పడిన పురిటి నొప్పులు.
1965 నుండి ʹపల్లె పిలుస్తోందిʹ కథ నుండి ʹచిరంజీవిʹ దాకా పదమూడు కథలు రాశారు. పల్లెలో భూస్వామిక బంధనాల నుండి, పట్టణాల్లో అధిక ఖర్చులు తట్టుకోలేక మళ్లీ పల్లెకు పయనం ` ఇప్పటికీ లక్షలాది కోట్లాది మంది యువకులు పల్లెకు పట్నానికి మధ్య దిక్కుతోచక పూటగడవక తచ్చాడుతున్నారు. కరోనా సమయంలో ` వందల, వేల మైళ్లు నడిచిన వైనం మనకు తెలుసు.
మన చుట్టూ ఏం జరుగుతోందో? తెలుసుకోడానికి పల్లెలో దోపిడీ లెక్కలు తెలువని తండ్రీ కొడుకులు చదువుకునే కథ ʹఒకే దీపం కిందʹ. ʹసశేషంʹ కథ మహిళలను ఆస్తిగా చూసే పితృస్వామిక భావజాలాన్ని చిత్రించింది. అందమైన భార్య మీద నిరంతరం అనుమానం కథ. ఇట్లా అనేక సామాజిక రుగ్మతలు ` రైతుకూలీ సంఘాలు ` యువకుల సాహసోపేత పోరాటం కతల నిండా రాశారు. తామాడ చినబాబును కాల్చిచంపిన ఘట్టంలో ` మతి చెలించిన కానిస్టేబుల్‌ రామ్మూర్తి ఆ ఘటనలో పాల్గొన్న డియస్‌పిని చంపడమే కాక ` ʹʹమీరు ప్రభుత్వం కాదు ` ఈ తుపాకులు తయారు చేసేవాళ్లు ప్రభుత్వం ` తుపాకులు అప్పగించి దేశం కోసం వీరుల్లాగా పోరాడండిʹʹ అంటాడు ʹచిరంజీవిʹ కథలో. అప్పటికీి ఇప్పటికీ ఇలాంటి సాహసోపేతమైన కథ మళ్లీ రాలేదు.
చెరబండరాజు కథలు మాయా మర్మంలేనివి. రచయితకు వస్తువుకు గాఢమైన అభినివేశం, సంబంధం గల కథలు. అందుకే ఆయనకు సాహిత్యం, జీవితం వేరువేరు కాదు, రెండూ ఒక్కటే.
చెర రాసిన నాలుగు నవలలు ఆయన రూపొందిన క్రమాన్ని, ఆయన నివసించిన స్థల కాలాల్లో జరిగిన విప్లవోద్యమాలను మరింత విస్తృతంగా, విమర్శనాత్మకంగా రూపుకట్టాయి. నక్సల్బరీ విప్లవోద్యమం కరీంనగర్‌ ` ఆదిలాబాదు రైతాంగ పోరాటాలుగా పురోగమించడానికి ముందు నశించి పోవాల్సిన పాతకు ` రూపొందవల్సిన కొత్తకు మధ్య వైరుధ్యాల ఘర్షణ ` ఐక్యతలను చిత్రించాయి. ఆ పది సంవత్సరాల పరిణామాలకు ` ముఖ్యంగా పరిమాణాత్మక పోరాటాలకు అవి గుణాత్మక పోరాటాలుగా ఎదగడానికి పదే సంఘర్షణను, తయారీ నిర్మాణాన్ని, అందులోని భావోద్వేగాలను ఆ నవలలు చిత్రించాయి. మొత్తంగా 1967 నుండి 1977కు మధ్యకాలానికి సంబంధించిన నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమ గతి క్రమాన్ని ఈ నాలుగు నవలలు చిత్రించాయి.
మొదటి నవల ʹదారి పొడుగునాʹ 1970`1971 కాలానికి సంబంధించింది. రaాన్సీ ` రంగయ్య అనే విప్లవకారుని సహచరి ` రaాన్సీ జైల్లో తన ఆత్మకథలాగా రాసిన నవల.
నక్సల్బరీ ఆరంభమై గ్రామాల్లో విస్తరిస్తున్న క్రమంలో ` రైతులు కమిటీలుగా ఏర్పడిన దశలో ` రైతులు భూ ఆక్రమణ చేపట్టారు. భూస్వాముల పంటలు తెచ్చుకున్నారు. గతంలో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం, తెభాగా, పునర్‌ వాయిలార్‌ లాంటి చోట్ల వ్యూహం, సరైన ఎత్తుగడలు లేక కొద్దికాలంలో పోరాటాలు సమసిపోయాయి. భారతీయ సమాజాన్ని విశ్లేషించి ప్రధాన వైరుధ్యాన్ని గుర్తించడంలో భారత కమ్యూనిస్టు పార్టీ విఫలమైంది. భారతదేశం అర్ధ భూస్వామిక ` అర్ధవలస దేశంగా ఉన్నదని, దేశంలో భూస్వామ్యానికి, ప్రజలకు మధ్య గలదే ప్రధాన వైరుధ్యమని నక్సల్బరీ చెప్పింది. కనుక పల్లెల్లో ప్రజా రాజ్యం స్థాపించి ` పట్టణాలను చుట్టుముట్టాలనే ఎత్తుగడలతో ` అంతిమంగా నూతన ప్రజాస్వామిక విప్లవం జయప్రదం చేయాలనే వ్యూహంతో ఆనాటి మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ ఏర్పడింది. చారుమజుందార్‌ గ్రామాల్లో భూస్వామ్యాన్ని నిర్మూలించడానికి ` ప్రస్తుత పరిస్థితుల్లో మన కర్తవ్యాల పేరిట ʹఆయుధాలు చేపట్టండి ` ఘర్షణకు సాయుధ యూనిట్‌ను నిర్మించండి, రాజకీయంగా సాయుధ యూనిట్‌ను విద్యావంతం చేయండి ` వ్యవసాయ విప్లవం జయప్రదం చేయండి ` రైతుసభ, ట్రేడ్‌ యూనియన్లకే పరిమితమైన రివిజనిజాన్ని బద్దలు కొట్టండిʹ అని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళంలో 1967 అక్టోబర్‌లో గిరిజన పోరాటం ఆరంభమయ్యింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితిలో ` గ్రామాల్లో ఈ కార్యకలాపాలను ఎలా విజయవంతం చేయాలి? అందుకు తగిన నిర్మాణం ఏర్పడని పరిస్థితుల్లో ` కానుసన్యాల్‌తో కలిసి నలుగురు సభ్యుల బృందం చైనాకు వెళ్లి మావోను కలిశారని సుమంతా బెనర్జీ రాశారు.ʹʹఅశేష ప్రజానీకాన్ని విప్లవోద్యమంలో భాగం చేయాలి. లేదంటే తెలంగాణా సాయుధ పోరాటం లాగే అణచివేస్తారుʹʹ అని మావో వారికి సలహా యిచ్చారని అందులో ఆయన అంటారు.
ఆ తర్వాత సునీతల్‌రాయ్‌ చౌదరి నాయకత్వంలో భారత విప్లవకారుల సమన్వయ కమిటీ ఏర్పడింది. దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, చండ్రపుల్లారెడ్డి, కొల్లా వెంకయ్యలతో ఆంధ్రప్రదేశ్‌ విప్లవ సమన్వయ కమిటీ ఏర్పడింది. నాగిరెడ్డి నక్సల్బరీ వెళ్లి, అక్కడ నెలరోజులు తిరిగి వచ్చారు. 1968లో అఖిల భారత సమన్వయ కమిటీ ఏర్పాటయ్యింది. తర్వాత విభేదాలు ` ఎన్నికల్లో పాల్గొనాలని కొందరు, బహిష్కరించాలని కొందరు.
జనవరి 19`21, 1969లో ఆంధ్రలో విప్లవోద్యమాన్ని విస్తరింపచేయడానికి గుత్తికొండబిలం సమావేశం జరిగింది. దీనికి చారుమజుందార్‌ హాజరయ్యారు. 1969లో అఖిల భారత మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ ఏర్పడింది. బీహార్‌లో కన్హయ్‌ చటర్జీ నాయకత్వంలో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఏర్పడింది. కలకత్తా, గోపివల్లభ్‌పూర్‌ లాంటి చోట్ల వేలాది మంది విద్యార్థులు, యువకులు ఉద్యమాల్లో పాల్గొన్నారు. సైన్యం రంగంలోకి దిగి 72 రోజుల్లో చాలా మందిని అరెస్టు చేసి జైళ్లల్లో కుక్కారు. తెలంగాణాలో ములుగు ప్రాంతంలో చండ్రపుల్లారెడ్డి, రామనర్సయ్యల నాయకత్వంలో దళాలు ఏర్పడి పని చేస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల్లో కదలిక మొదలయ్యింది.
సెప్టెంబరు 1971లో సికింద్రబాదు కుట్ర కేసులో చెర, వరవరరావు, యం.టి.ఖాన్‌లను అరెస్టు చేసి ` కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తిలతో కలిసి కుట్ర చేశారని జైల్లో వేశారు. ఆ విధంగా శ్రీకాకుళ పోరాట అనుభవంతో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం అమలు చేసింది.
ఇలాంటి నేపథ్యంలో చెర ʹదారి పొడుగునాʹ నవల రాశారు. ఇందులో రaాన్సీ సహచరుడు రంగయ్య విప్లవకారుడు జైల్లో ఉంటాడు. బూర్జువా కోర్టులను బహిష్కరిస్తాడు.
వెంకటయ్య, డేవిడ్‌ రహస్యంగా పని చేసే విప్లవ కార్యకర్తలు. రaాన్సీని కలుస్తుంటారు. కరపత్రాలు పంచుతుంటారు. వరంగల్లులో గుడిసెల పోరాటం ` గుడిసెను చుట్టుముట్టి పోలీసులు వారున్న గుడిసెను కాలబెడతారు. మాస్టారు, పెద్దన్నా, బాలామణీ తప్పించుకుంటారు. రaాన్సీ, నీలమ్మా, రాజన్నా పోలీసులకు దొరికిపోతారు. రaాన్సీ జైలు నుండి తన కథ రాస్తుంది. ఇంకా స్పష్టమైన కార్యక్రమం రూపొందని కాలంలోని విప్లవోత్సాహ స్థితికి సంబంధించినది ఈ నవల.
రaాన్సీని చిత్రహింసలు పెట్టి నాయకుల గురించి చెప్పమంటారు. రంగయ్యకు ఉరిశిక్ష వేస్తారు. ʹʹనా కథ అయిపోయినట్టే. కానీ, నేనెవరి కోసమైతే ఇక్కడికొచ్చానో, ఆ ప్రజల కోసం పోరాడే వేలాది, లక్షలాది మంది యువతీ యువకుల కథలు ఇప్పుడిప్పుడే ఆరంభమౌతున్నాయి.
మీ కళ్లూ, చెవులూ, చేతులూ అటువైపే ఉంచండి!ʹʹ
నవల ఈ వాక్యాలతో ముగుస్తుంది. ఈ వాక్యాలు కొనసాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమాని కంతటికీ వర్తిస్తాయి. అనేక వైరుధ్యాల భారతదేశంలో అనేక ఆటుపోట్ల మధ్య యాభై ఐదేళ్లుగా కొనసాగుతున్న విప్లవోద్యమంలో చేరి భావవాదాన్ని వదిలించుకొని భౌతిక వాదులుగా వర్గపోరాటంలో తర్ఫీదు కావాల్సిన కోట్లాది నేటి యువకులందరికీ చేరవల్సినవి.
రెండవ నవల ʹనిప్పురాళ్లుʹ ` శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటాన్ని తెలంగాణా నేపథ్యంలో 1972లో రాసిన నవల. వెంపటాపు సత్యనారాయణలాగే గోపాల్‌ అనే టీచర్‌ చిన్నారంలో పని చేస్తుంటాడు. అక్కడ రామిరెడ్డి భూస్వామి. గ్రామంలో భూస్వామిక దోపిడీ, పీడన ` గోపాల్‌ రాత్రి బడి నడపడం ` గ్రామంలో జరిగే దోపిడీ పీడనలను ప్రశ్నించడం ` పట్నంలో కండెక్టరు బక్కారెడ్డి పార్టీతో సంబంధాలు ` ఆఖరుకు చిన్నారం నుండి గోపాల్‌ కొండపాలెం ట్రాన్స్‌ఫర్‌` అక్కడ రైతుకూలీ పోరాటాలు ` భూముల ఆక్రమణ ` లంబాడీలు అటవీ ప్రాంతం` కల్లోలిత ప్రాంతంగా ప్రకటన ` పోలీసుల కాల్పులు ` రెండు తుపాకులు గుంజుకొని అడవిలోకి వెళ్లడం ` గోపాల్‌, బక్కారెడ్డి అజ్ఞాతవాసం ` పట్టుకున్న వారికి యాభైవేల రూపాయల బహుమతి ప్రకటన...
విప్లవోద్యమం గ్రామాల్లోకి వెళ్లి పనిచేయడం ` భూ ఆక్రమణ ` రైతుకూలీ ఉద్యమం నిర్మించడం ` సాయుధ పోరాటంగా పరిణామం చెందడం ఈ నవలా వస్తువు.
విప్లవోద్యమం గ్రామాలకు, పట్టణాలకు విస్తరించడం ఎలా? అని ఆ కాలంలో చర్చోపచర్చలు జరుగుతుండేవి. కొంతమంది యువకులు కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లో ` గ్రామీణ ప్రాంతాలను అధ్యయనం చేయడం మొదలు పెట్టారు. 1972లో ʹఆర్ట్‌ లవ్వర్స్‌ʹ జననాట్యమండలిగా ఏర్పాటయ్యింది. చెర పాటలు రాస్తున్నారు. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి రైతాంగాన్ని సమీకరించి సాయుధ పోరాటం ఆరంభించాలనే సిద్ధాంత అవగాహన, క్షేత్రస్థాయి అనుభవంతో కలిపి రాయడానికి చెర ప్రయత్నం చేశారు.
ఒక గ్రామంలోనో, ఒక ఫ్యాక్టరీలోనో పోరాటం ఆరంభమైతే ఏమౌతుంది? దాన్ని ఎట్లా విస్తరించాలి? అందుకు తగిన పోరాట రూపాలు, అధ్యయనం ఇంకా శాస్త్రీయంగా రూపొందని కాలం. అంటే, ఇంకా ʹకొంతమంది వీరులే చరిత్ర నిర్మాతలుʹ అనే అవగాహన నుండే ఆనాటి సాహిత్యం అనివార్యంగా వెలువడిరది. అందుకు భిన్నంగా ప్రజా ప్రమేయంతో వర్గ పోరాటాలు ఇంకా ఆరంభం కాలేదు. కాని ఆంధ్రప్రదేశ్‌లో మార్క్సిస్టు`లెనినిస్టు పార్టీ ఏర్పడి పని చేస్తున్నది. సీతారామయ్య, రామనర్సయ్య లాంటి వాళ్లు నాయకులు. కలకత్తాలో చారుమజుందారును అరెస్టు చేశారు. చిత్రహింసలు పెట్టి అలీపూర్‌ పోలీసుస్టేషన్‌లో1972 జులై 28న చంపేశారు. దేశవ్యాపితంగా యువకుల్లో అనేక ఉద్వేగాలు చెలరేగాయి.
మూడవ నవల ʹమా పల్లెʹ. 1974`1975 కాలానికి సంబంధించిన నవల. చెర సికింద్రాబాదు కుట్ర కేసులో అండర్‌ ట్రయల్‌ ప్రిజనర్‌గా ఉన్నప్పుడు రాశారు. దేశవ్యాపిత ఉద్యమాలను నిర్మించాలనే లక్ష్యంతో 1974 మే 1న సెంట్రల్‌ ఆర్గనైజింగ్‌ కమిటీగా ఆంధ్రప్రదేశ్‌ కమిటీ సభ్యులతో పాటు ఏర్పడింది. స్పష్టంగా ఏమి చేయాలి అనే ఆలోచన నిర్మాణ రూపం తీసుకుంటున్న దశ అది. ఉస్మానియాలోంచి, వరంగల్లులోంచి అనేక మంది విద్యార్థులు పూర్తికాలపు కార్యకర్తలుగా వచ్చారు. 1967 నుండి ఇప్పటిదాకా అంటే ఆరేండ్ల అనుభవాలను సమీక్షించుకొని ʹవిప్లవానికి బాటʹ రచించుకున్నారు. విప్లవోద్యమ నాయకత్వం పైనుంచి ఏర్పడి పని చేయడానికి భిన్నంగా కింది నుంచి కార్యకర్తలు వచ్చి నాయకులుగా ఎదగడం ఒక ముందడుగు.
12.10.1974 ప్రగతిశీల విద్యార్థి సంఘం ` అదే రోజు రాడికల్‌ విద్యార్థి సంఘం ఏర్పడింది. విద్యార్థులు, యువకులు విప్లవాన్ని నిర్మించి, కొనసాగించే శక్తిగా విప్లవోద్యమం గుర్తించడం జరిగింది.
ఈ నేపథ్యంలో విద్యార్థులు ఏమి చేయాలి? అనే ఆలోచనతో చెర ʹమా పల్లెʹ నవల రాశారు.
రంగనాయకులు పోలీసు. అతని కూతురు రమ, మేనల్లుడు చంద్రం. విద్యార్థి ఉద్యమాల నుండి రూపొందుతున్న కార్యకర్త. అప్పటికే సీతారామయ్య గారి కుమారుడు చంద్‌, సత్యమూర్తి, కొల్లిపర రామనర్సింహారావు ఆదిలాబాదు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. సత్యమూర్తి చనిపోయినట్లుగా వార్త ప్రచారమయ్యింది. చెర తీవ్రంగా కలత చెందారు.
ఈ నేపథ్యంలో వెంటనే ʹమాపల్లెʹ నవల రూపొందింది. రాఘవరావు (సత్యమూర్తి) అనే ఉపాధ్యాయుడ్ని పోలీసైన చంద్రం మామ రంగనాయకులు కాల్చి చంపుతాడు. ఇవ్వాల్సిన యాభైవేల రూపాయల బహుమతి పైఅధికారులు నొక్కేస్తారు. విద్యార్థి సంఘం వల్ల అన్నీ తెలుసుకుంటున్న చంద్రం, రమల వలన `కొత్త సామాజిక విషయాలు రంగనాయకులకు తెలుస్తుంటాయి. రంగనాయకులకు పాత పోలీసు అభిప్రాయాలకు కొత్తగా రూపొందుతున్న గతితార్కిక అభిప్రాయాలకు ఘర్షణ తీవ్రమై పిచ్చివాడౌతాడు. క్రమంగా చంద్రం గ్రామంలో రైతాంగ పోరాటాలు ఆరంభమై ఆయన పూర్తి కాలపు కార్యకర్తగా పోరాటంలోకి వెళ్లిపోవడంతో నవల ముగుస్తుంది.
ఇక నాల్గవ నవల ʹప్రస్థానంʹ. ఈ నవల రచనాకాలం 1975`1976.
అర్ధవలస, అర్ధభూస్వామిక వ్యవస్థలో పేదరైతులు తమ భూములు పోగొట్టుకొని కూలీలుగా మారడం ` పొట్ట గడవక పట్నాల బాట పట్టడం ` కార్మికునిగా మారిన తరువాత ` రెక్కలుతప్ప మరే ఆస్తిలేని కార్మికవర్గం విప్లవశక్తిగా రూపొందుతుంది అనే మార్క్సు మాటకు నవలా రూపం.
అయితే మిగతా మూడు నవలల కన్నా ʹప్రస్థానంʹలో గ్రామంలోని ఉత్పత్తి శక్తులకు ` ఉత్పత్తి సంబంధాలకున్న వైరుధ్యాన్ని చెర మరింత లోతుగా శాస్త్రీయంగా చిత్రించడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కులం, పితృస్వామ్యం లాంటి అంశాలను చిత్రించారు. వైయుక్తిక వాస్తవాల నుంచి సత్యాన్ని తెలుసుకొనే క్రమం ఆరంభమైంది.
కోటయ్య పేద రైతు. అతని సహచరి మణెమ్మ, కొడుకు బుచ్చాలు. కిష్టయ్య మధ్యతరగతి రైతు. కాంతారావు భూస్వామి. తిరుపతయ్య షావుకారి. గౌరయ్య, అతని సహచరి కమల రైతుకూలీలు. వీళ్లందరు ఊపిరి సలుపనివ్వని భారతీయ భూస్వామిక గ్రామాల్లో పెనులాడినవాళ్లే.
కిష్టయ్య పొలం దగ్గర కాంతారావును చంపడంతో నవల ముగుస్తుంది. అప్పటికి క్రూరులైన దొరలను తుదముట్టించడం, వర్గ శత్రు నిర్మూలన అమలు చేస్తున్న కాలం. స్థూలంగా చెర సమగ్ర సాహిత్యం రూపొందిన కాలం ` స్థలం ` రాజకీయ నేపథ్యం కూడా అదే. అయితే చెర సాహిత్యం ` గ్రామీణ ప్రాంతంలోని ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల మధ్య వైరుధ్య మూలాలను వెతకడానికి ప్రయత్నం చేసింది. అదే విధంగా పట్టణ మధ్యతరగతి నేపథ్యాన్ని చిత్రించింది. ముఖ్యంగా ఉత్పత్తి శక్తుల బందిఖానాగా మారిన ఉత్పత్తి సంబంధాలు మార్చే క్రమం మీద తెలుగు సాహిత్యంలో మునుపెన్నడూ లేని విధంగా దృష్టి పెట్టింది.
ఆ కాలంలో ఇలాంటి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా స్పష్టమైన వ్యూహం, ఎత్తుగడలతో నిర్మాణంకాని అసంఘటిత పోరాటాల ప్రయాణం ` క్రమంగా గుణాత్మక దిశగా మారే తొలి ప్రయాణం చెరబండరాజు సాహిత్యంలో కన్పిస్తుంది.

(ఇంకా ఉంది)
కిందికి రోల్ చేస్తే 2వ భాగం ఉంటుంది

Keywords : chera, cherabanda raju, allam rajayya, virasam
(2024-03-04 02:53:55)No. of visitors : 1376

Suggested Posts


మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2

భారతదేశంలో 1857 నుండి జరుగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవ పోరాటాలు ` కొన్ని ప్రాంతాల్లో, కొంత పరిమిత కాలంలో ` పరిమాణాత్మక దశల్లో అనేకచోట్ల వందలాదిగా జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మార్గ‌ద‌ర్శి