విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

విమోచన

17-09-2023

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ అని బ్లాక్ మెయిల్ చేస్తూవచ్చిన సంఘ పరివారం ఇప్పటికి చాలమందిని లొంగదీసింది. అలా లొంగిపోయినవారి జాబితా ఇంకా పెరిగిపోతోంది. మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక భావజాల పక్షం చేస్తున్న ప్రయత్నాలకు ఎవరెవరు ఏ ప్రయోజనాలకొరకు లొంగిపోదలచుకున్నారో వారి వారి ఇష్టం గాని, సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన కిందికి తెచ్చిన రోజు. అలా తేవడం కోసం, పోలీస్ చర్య పేరుతో జరిపిన సైనిక దాడి విజయం సాధించిన రోజు. విలీనం అనే మాట వాడడం కూడ కష్టం. ఆ మాటలోకూడ విలీనమయ్యేవారి ఆమోదం ఉందనే అర్థం ఉంది. 1948 సెప్టెంబర్ 17 చర్యకు నిజంగా తెలంగాణ ప్రజామోదం ఉందా అనేది సందేహాస్పదమే.
ʹముస్లిం పాలన కింద ఉండిన హైదరాబాదు హిందూ ప్రజలకు 1948 సెప్టెంబర్ 17 న కేంద్రప్రభుత్వం విమోచన కలిగించిందని, అందువల్ల హైదరాబాద్ రాజ్యాధీశుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయిన ఆ తేదీని హైదరాబాద్ విమోచన దినంగా జరపాలʹని సంఘ పరివారం వాదిస్తున్నది. అసలు హైదరాబాద్ ముస్లిం పాలన కింద ఉండిందనేదే అర్ధసత్యం. పాలకుల మతవిశ్వాసం ఇస్లాం కావచ్చుగాని, వారు ఆధారపడింది ఇటు ʹహిందూʹ భూస్వాముల మీద, అటు ʹక్రైస్తవʹ వలసవాదుల మీద. చివరికి మతోన్మాదులుగా పేరుపడిన రజాకార్ల సైన్యం కూడ హిందూ జాగీర్దార్ల, దేశ్ ముఖుల, భూస్వాముల తరఫున, వారి గడీలలో విడిదిచేసి, తిని తాగి, పేద ప్రజల మీద, పోరాడుతున్న రైతు కూలీల మీద హంతక దాడులు చేసింది. అందువల్ల అసలు 1948 నాటి హైదరాబాద్ పాలనను, రజాకార్ల దాడులను ముస్లిం పాలనగా, ముస్లిం మతదాడులుగా చిత్రంచడమే ఒక కుట్ర.

అది ఒక నిరంకుశ పాలన అనే మాట, దాని నుంచి ప్రజలు విముక్తిని కోరుకున్నారనే మాట నిజమే. కాని 1948 సెప్టెంబర్ 17 ఆ విముక్తిని కూడ సాధించలేదు. హైదరాబాద్ రాజ్య పాలన 1950 జనవరి 26 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదనే సాగింది. ఆతర్వాత కూడ 1956 నవంబర్ 1 దాకా ఆయన రాజప్రముఖ్ గా కొనసాగాడు. దుర్మార్గమైన భూస్వామ్య వ్యవస్థను నెలకొల్పి, ప్రజల గోళ్లూడగొట్టి పన్నులు వసూలుచేసి ప్రపంచంలోనే అత్యంత ధనికులలో ఒకడుగా పేరుపడ్డ నిజాం ఆస్తులను ఈ ʹవిమోచనʹ తర్వాత స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగించలేదు సరిగదా, ఆయనకే ఎదురుగా రాజభరణం, నష్టపరిహారాలు అందజేశారు. ఆయన ఆస్తులలో అత్యధిక భాగాన్ని, ఆయన అధికారాలను యథాతథంగా ఉంచారు. ఎవరి నుంచి విమోచన సాగినట్టు? ఎవరికి విమోచన దొరికినట్టు?

ఇంకొకవైపు నుంచి చూస్తే నిజాం పాలన నుంచి, భూస్వామ్య పీడన నుంచి విముక్తి కోరుతూ పోరాటం ప్రారంభించిన ప్రజలు ఆ పోరాటాన్ని 1948 సెప్టెంబర్ 17 తర్వాత ఆపివేయలేదు. ఆ రోజుతో ఏదో మార్పు వచ్చిందని ప్రజలు భావించలేదు. గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చాడని ప్రజలు చెప్పుకున్నారు. అందుకే ఆ తర్వాత మూడు సంవత్సరాలపాటు ప్రజలు సాయుధ పోరాటం కొనసాగించారు. తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్ 18 నుంచి 1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. తెలంగాణ సాయుధ రైతాంగపోరాటంలో 1946 జూలై 4 నుంచి 1948 సెప్టెంబర్ 17 దాకా నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు, అకృత్యాలు ఎక్కువ. ఆ పోరాట క్రమంలో ప్రజలు సాధించుకున్న విజయాలన్నిటినీ నెహ్రూ - పటేల్ సైన్యాలు ధ్వంసం చేశాయి. ప్రజలు ఆక్రమించుకున్న భూస్వాముల భూములను మళ్లీ భూస్వాములకు కట్టబెట్టాయి. రజాకార్లను అణచడం అనే పేరు మీద రెండు లక్షల మంది అమాయక ముస్లిం ప్రజలను ఊచకోత కోశాయి. ఆ బీభత్సకాండకు నాందిపలికిన సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా అభివర్ణించడం అర్థ రహితం.

ఇంతకూ సమకాలీన చరిత్రకారులు, పరిశీలకులు ఎవరూ ఆ తేదీని విమోచన దినంగా పేర్కొనలేదు. స్వయంగా ఆ సైనికదాడిని నడిపిన వాళ్లు, మంత్రాంగం నెరపినవాళ్లు, సమర్థించినవాళ్లు కూడ దాన్ని విలీనం, పోలీసు చర్య వంటి మాటలతోనే సూచించారు గాని విమోచన అనలేదు. కొన్ని సంవత్సరాల కింద సంఘపరివారం ప్రారంభించిన ʹవిమోచనʹ ఆలోచన ఇవాళ అన్ని రాజకీయపక్షాలకు అంటుకున్నట్టుంది. అందరికన్న ఎక్కువ ఆశ్చర్యకరంగా ఆ తేదీన మొదలుపెట్టి తెలంగాణ సాయుధపోరాట వార్షికోత్సవాలు జరపాలని సిపిఐ, సిపిఎం నిర్ణయించుకున్నాయి. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటానికి సంకేతాత్మక ప్రారంభమైన దొడ్డి కొమరయ్య అమరత్వ దినం (1946 జూలై 4) గాని, సాయుధ సమర ప్రారంభానికి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూమ్ మొహియుద్దీన్ లు పిలుపు ఇచ్చిన 1947 సెప్టెంబర్ 11 గాని, సాయుధ పోరాటాన్ని అధికారికంగా విరమించిన 1951 అక్టోబర్ 20 గాని సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భం అవుతాయి గాని, తమ కార్యకర్తలను ఇతోధికంగా చంపడానికి కారణమైన, తాము అప్పుడు ఏమార్పూ లేదని భావించి పోరాటం కొనసాగించిన తేదీకి ఇవాళ ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ పోరాట అమరుల త్యాగాల సాక్షిగా వామపక్షాలు సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది.

ఇంకా విచిత్రంగా ప్రత్యేక తెలంగాణ వాదులలో కొందరు కూడ హైదరాబాద్ విమోచన దినాన్ని గుర్తిస్తున్నారు. నిజానికి 1948 సెప్టెంబర్ 17 ను అందరికన్న ఎక్కువగా వ్యతిరేకించవలసినవారు ప్రత్యేక తెలంగాణ వాదులు. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని రద్దు చేయడం ప్రారంభమయిన చీకటి రోజు అది. హైదరాబాదు రాజ్యం, అందులో భాగంగా తెలంగాణ చిత్రపటం చెరిగిపోయి, ఇవాళ తెలంగాణ వాదులు చెపుతున్న ʹఆంధ్ర వలసపాలకుల పాలనʹకు నాంది పలికిన రోజు అది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో 1956 నవంబర్ 1 న స్థిరపడిన ప్రక్రియకు తొలి అడుగు పడినది 1948 సెప్టెంబర్ 17 ననే.

చారిత్రక వాస్తవాలతోగాని, జరిగిన చరిత్రతోగాని, సమకాలీన ఆధారాలతోగాని, తదనంతర పరిణామాలను బట్టిగాని ఎంతమాత్రం అంగీకరించలేని ʹవిమోచన దినాన్నిʹ జరపడానికి సంఘపరివారానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం, సమాజాన్ని నిట్టనిలువునా చీల్చే ప్రయోజనం ఉంది. కాని చరిత్ర తెలిసినవారు, తెలియని వారు, ఆ చరిత్రలో భాగమయినవారు, ఆ చరిత్రవల్ల ధ్వంసమయినవారు అందరికందరూ ఆ సంబరాలకు పరుగెత్తి పోవడమేనా? అవి ఎవరి సంబరాలో, మనం పాల్గొనవచ్చునో లేదో కనీస ఆలోచన ఉండనక్కరలేదా?

-- ఎన్ వేణుగోపాల్, వీక్షణం సంపాదకులు, రచయిత, విశ్లేషకుడు, కవి
(ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనది)

Keywords : nizam, telangana, hyderabad state, nehru, vallabhabai,
(2024-12-02 22:01:22)



No. of visitors : 997

Suggested Posts


పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్

అడాల్ఫ్‌ హిట్లర్‌ నాయకత్వంలో జర్మనీలో ఎనబై సంవత్సరాల కింద సాగిన నాజీ పాలన ఒక దుర్మార్గం నుంచి మరొక దుర్మార్గానికి ఎలా పయనించిందో గతంగా, గడిచిపోయిన పీడకలగా, చరిత్రగా మాత్రమే చదువుకున్న వారికి, ఇవాళ నరేంద్ర మోడీ - అమిత్‌ షా పాలన దాన్ని వర్తమానంగా దృశ్యమానం చేస్తున్నది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


విమోచన