వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)

వర్గపోరాట

17-09-2023

సుదీర్ఘకాల సహచరుడు, ఆత్మీయుడు, మా వసుధైక కుటుంబ సభ్యుడు కామ్రేడ్ గద్దరన్న ఆగస్టు 6, 2023 అమరుడయ్యాడు . వేలాది మంది ప్రజలు దిగ్భ్రాంతితో, దుఃఖంతో - కళవెలపడుతూ ఆయన పాటలా నగరంలోకి పోటెత్తారు. గద్దర్ భాగమైన నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని క్రూరంగా అణచివేసిన రాజ్య యంత్రాంగానికి, సంస్కృతికి సంబంధించిన వాళ్లు, బూర్జువా పార్టీల నాయకులు వారి వారి ప్రయోజనాల కోసం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమ యాత్రను సరైన పద్ధతిలో నిర్వహించలేక, అస్తవ్యస్తంచేసి ఆ విషాద వాతావరణాన్ని మొరటుగా హైజాక్ చేశారు. యంత్రాంగం వైఫల్యం వలన గద్దర్ ఆత్మీయ మిత్రుడు-సియాసత్ పత్రిక సంపాదకుడు జహీర్ అలీఖాన్ మృతి చెందాడు . ఆయన అమరత్వం మరింత బాధాకరం.
జీవితం పట్ల విసుగుచెంది, అనారోగ్యంతో ఇల్లు విడిచి అనామకంగా గడ్డకట్టిన చలిలో ఒక రైల్వేస్టేషన్లో 20 నవంబర్, 1910లో లియో టాల్ స్టాయ్ చనిపోయాడు. అది తెలిసిన రష్యా రైతాంగం, ప్రజలు వీధుల్లోకి దుఃఖంతో వచ్చారు. లక్షలాది మందిని అదుపుచేయడం జారిస్టు ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. అలాంటి ప్రజా ప్రతిస్పందన మన కాలంలో గద్దర్ అంత్యక్రియల్లో కన్పించింది. ఆయన పాటలు మరోసారి గ్రామాలల్లో, పట్టణాలల్లో ప్రజలు అత్యంత విషాదంగా కదంతొక్కుతూ పాడుకున్నారు. అన్ని రకాల పత్రికలు, ప్రచార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను, ఆయన రాజకీయ ఆచరణను, పాటలను ఈ సందర్భంగా గుర్తు చేశాయి.
మునుపెన్నడు తెలుగులో ఏ రచయిత, గాయకుడు, రాజకీయ నాయకుడి విషయంలో జరుగనంత విస్తృతంగా అంత్యక్రియల సందర్భంలో ఆయన గతాన్ని వెలుగులోకి తెచ్చాయి. మొత్తంగా అనేక నిర్బంధాలలో, బలిదానాల మధ్య నలిగిన విప్లవోద్యమ నిర్మాణాల నుండి ఎదిగిన ప్రజలు- ప్రజా వ్యతిరేకులు గద్దర్ అమరత్వం సందర్భంలో మరోమారు అలజడికి, కదలికకు లోనయ్యారు.
క్షేత్రస్థాయి ఆచరణను ఆత్మవిమర్శ విమర్శతో సరిదిద్దుకొని పురోగమించాలంటే తప్పులను నిజాయితీగా గుర్తించి ఒప్పుకోవాలని అంటారు మావో. ఇప్పుడు భౌతికంగా వీటిని ఆచరించజాలని స్థితి గద్దర్ ది. కనుక ఆయన జీవించిన కాలాన్ని విమర్శనాత్మకంగా చూస్తూ సుదీర్ఘకాలం సాంస్కృతిక సేనానిగా నడిచిన సహచరుని మరణం బాధాకరం అని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. కనుక ఇప్పుడు ఆయన ఆచరణను బేరీజు వేయడంలోని స్థలకాల పరిస్థితులు అనేక తీవ్రమైన భావోద్వేగాలను రేపుతాయి. వాటిని జాగ్రత్తగా అదుపులో ఉంచుకుంటూనే ఆయనను అంచనా వేయాలి.
చరిత్ర నిరంతరం పునర్ నిర్మాణమవుతుంది. కొన్ని పాక్షిక సత్యాలుగా కాలక్రమంలో సత్యాలుగానో అబద్దాలుగానో పోరాట క్రమంలో నిరూపితం అవుతాయని అందరూ ఎరిగిందే . కులం. భారతీయ సమాజంలో పునాదిగా గుర్తించడానికి ఎంత అంతర్గత పోరాటం జరిగింది. ఇవ్వాళ్ల ఎవరి ఆచరణ ఏమైనప్పటికీ కమ్యూనిస్టు పార్టీలన్నీ కులాన్ని పునాదిగా అంగీకరించాయి. కౌట్ స్కీ, ప్రతిపాదించిన రివిజనిస్టు ఆర్థికవాదం ప్రపంచవ్యాపితంగా ఆధునిక రివిజనిజంగా ఎట్లా సమాజాలను తొలిచి వేసిందో విప్లవోద్యమాలకు తెలుసు. కనుక విప్లవ శక్తులు ఇలాంటి సమయాలల్లో సంయమనం పాటించాలి. గద్దర్ మరణ సందర్భంలో కుల, మత, వర్గ, లింగ, అధిపత్య కంఠస్వరంతో ఎవ్వరూ మాట్లాడటం తగినది కాదు.
-2-
హింసాత్మకమైన భారతీయ సమాజంలో భావపరంగా జరుగుతున్న అనేక జీవన్మరణాల పోరాటాల క్రమంలో గద్దర్ పెనుగులాడి ఆఖరిగా భౌతికంగా, ఆగస్టు 6, 2023న అమరుడయ్యాడు. భారతదేశంలో మన కాలంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వర్గ పోరాటంలో, నశించిపోతున్న - రూపొందుతున్న పాత కొత్త సామాజిక శక్తుల భీకర యుద్ధంలో అనేకమార్లు గాయపడిన తీవ్రమైన నొప్పులతో ఆడిపాడిన ప్రజా కళాకారుడు గద్దర్. మందిలో మారుమోగే పాటలా - అన్ని రకాల పీడనల్లో ఏ రక్షణ కవచాలు లేకుండా నిలబడిన పీడిత ప్రజల నుండి రూపొందిన వ్యక్తి. అనివార్యంగా బతకడం కోసం చేసే పోరాటాల్లో, శ్రమశక్తిని కోల్పోయిన పీడిత ప్రజల ఒళ్లంతా పచ్చిపుండే. అలాంటి సామూహిక నొప్పులు బృందగానం గద్దర్. ప్రజా సమూహాల్లో కలిసిపోయిన అతని కంఠస్వరం, శరీరం, ఆహార్యం ఒక సామూహిక పోరాట శక్తిగా మార్పు చెందుతూ వచ్చింది.
పాత కొత్తల మధ్య వర్గ పోరాటం భీకరమైంది. ఈ సంకుల సమరంలో శత్రువులెవరో, మిత్రులెవరో రూపొందే క్రమంలో ఒకరినొకరకం గాయపరుచుకుంటాం. గురి కుదిరే దాకా - యుద్ధంలో రాటుదేలే దాకా -చలనక్రమంలో ఈ స్థితి వ్యక్తులకే కాదు - సంస్థలకు మినహాయింపు కాదు. ఈ నొప్పి అతి తీవ్రమైన సామాజిక నొప్పి, గద్దర్ మరణించిన సందర్భంలో ఈ సామాజిక నొప్పి బహు విధాలుగా సలిపి వేలాది మంది ఆయన అంత్యక్రియలకు అనేక ఉద్వేగాలతో హైదరాబాద్ కు పోటెత్తారు. పీడిత ప్రజలు నిరంతర రోదనలాగా పాటలు వీధుల్లో పోటెత్తాయి.. దుఃఖం పాటలుగా మారుమోగడం అరుదైన సన్నివేశం...
వ్యక్తిగత ఆస్తి ప్రజా సమూహాలను కులాలుగా, వర్గాలుగా, జాతులు, ప్రాంతాలు, లింగ ప్రాతిపదికగా అనేక ముక్కలు చేసింది. ప్రజలను తమ శ్రమ నుండి, శ్రమ శక్తి నుండి సృజనాత్మక సామూహిక చైతన్యం నుండి పరాయీకరణ చేసింది. ఇలాంటి తలకిందుల సమాజాన్ని తమ త్యాగాలతో, పోరాటాలతో నిలబెట్టే క్రమంలో లక్షలాది కోట్లాది మంది యోధులు భాగమయ్యారు. మన తరంలో అలాంటివారితో నూతన ప్రజాస్వామిక వ్యక్తి రూపంగా నక్సల్బరీ పోరాటం సాగుతున్నది. గద్దర్ అందులో భాగమైనందునే వేలాదిమంది అభిమానులు ఆయన అంత్యక్రియలకు పోటెత్తారు.
ఈ సందర్భంలో అనేక మాద్యమాలల్లో మాటలు, అభిప్రాయాలు, వాదనలు ఎన్ని వినిపించినా మన కాలంలో కొనసాగుతున్న విప్లవోద్యమాల నిర్మాణంలో, పురోగమనంలో గద్దర్ భాగం. గద్దర్ ను మన స్థలకాలాల్లో జరిగిన విప్లవోద్యమాల నిర్మాణంలోను, పురోగమనంలోను వెతుకాలి. ఎంతటి వారైనా వ్యక్తుల స్వీయాత్మక ఆలోచనలతో, బలాబలాలతో విప్లవోద్యమాలు రూపొంది నడిచేవికావు. వర్గ పోరాటానికి వ్యూహం - ఎత్తుగడలుంటాయి. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తలెత్తే, తీవ్రమయ్యే వైరుధ్యాలను సకాలంలో గుర్తించి - శాస్త్రీయంగా అధ్యయనంచేసి - మార్క్సిజం లెనినిజం మావోయిజం ఇచ్చిన చైతన్యంతో వర్గ పోరాటంలో భాగంగా పరిష్కరిస్తూ పురోగమించాల్సిందే. జ్ఞానం ఆచరణ, గుణపాఠాల పరంపరల సమిష్టి పోరాటాల క్రమం ఇది. విప్లవ సాహిత్యంలోను - కళారూపాలల్లోను ఇదే గతితార్కిక పద్ధతి అనుసరించాలి, విప్లవోద్యమ నిర్మాణానికి ఒక వర్తులాకార క్రమం ఉంది. అదేమిటో తెలుసుకోకుండా ఈనాటి స్థితులను అర్థం చేసుకోజాలము.
😚
1960 నుండి మధనపడ్డ చారుమజుందారు రైతాంగ సాయుధ పోరాటానికి 1967 మార్చ్ లో పిలుపునిచ్చారు. దీనికి సుదీర్ఘ నేపథ్యం ఉంది. ఇది ప్యారిసు కమ్యూన్ దగ్గర ఆరంభమైంది. 1871 పారిస్ కమ్యూన్ తాత్కాలిక రాజ్యాధికారం చేపట్టి తక్షణమే రాజ్యాంగ యంత్రాంగాన్ని రద్దుచేయక, బ్యాంకులను స్వాధీనం చేసుకోక ముఖ్యంగా ప్రజలను సాయుధం చేయలేక విఫలమయ్యింది. లెనిన్ ఈ దిశగా ప్రజలను నడిపి రష్యాలో, ఇరువై నాలుగు గంటల్లో సమస్త వనరులను జాతీయంచేసి, శ్రామిక వర్గ అధికారాన్ని స్థాపించాడు. అధికార యంత్రాంగం, ఆర్థిక శక్తి ఒక దేశానికే సంబంధించినది కాదని - అది మొత్తం ప్రపంచాన్ని రెండు యుద్ధ శిబిరాలుగా మారుస్తుందని సామ్రాజ్యవాదం యుద్ధం గురించి చెప్పాడు. అది రెండవ ప్రపంచ యుద్ధంగా మారింది. స్టాలిన్ నాయకత్వంలో రష్యా అప్పటికి నిలదొక్కుకున్నా పునాదిలో ఉండే రాజ్యాధికారం, యంత్రాంగం ఫైనాన్స్ పెట్టుబడి కలిసి రష్యాను కూలగొట్టాయి.
ఈ అనుభవాల నేపథ్యంలో మహా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం నడిపి కార్మిక, కర్షక రాజ్యాధికారాన్ని చైనాలో ఏర్పాటు చేశారు. మళ్లీ ఆర్థికవాదం కొత్త పద్ధతిలో 1966 నాటికి తలెత్తి చైనా కుళ్లడం మొదలైంది. సాంస్కృతిక విప్లవం గ్రేట్ డిబేట్ ఎంత జరిగినా అప్పటికే ఆలశ్యమైంది. సోషలిస్టు శిబిరమేది లేనిదశలో ఫైనాన్స్ పెట్టుబడి ముసుగు దొంగల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రివిజనిజం ప్రపంచ ప్రజల్లో వ్యాపించిన కల్లోల సమయంలో ఊపిరాడని గుండెజబ్బు మనిషి చారుమజుందారు రైతాంగ సాయుధ పోరాట ప్రతిపాదన చేశాడు. నిరంతరం పోరాటంలో ఉన్న ఆదివాసులు నక్సల్బరితో వెంటనే సాయుధమయ్యారు.
చారుమజుందారు. 1960 నుండి మధనపడి మధనపడి - సాయుధ పోరాటమే మార్గమని దేశవ్యాపితంగా ఎవరూ గుర్తించక ముందే గుర్తించాడు. మావో ఈ నిప్పు రవ్వను ʹవసంత మేఘగర్జనʹగా గుర్తించాడు. కేవలం నలుభై ఎనిమిది రోజులు మాత్రమే సాగిన నక్సల్బరీని కమ్యూనిస్టు ప్రభుత్వం నెత్తుటేర్లలో ముంచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నిప్పు రవ్వ గురించి అర్థమయ్యింది.
వ్యక్తులు, ప్రజారాశులు తమను తాము నిర్మించుకుంటూ పాతరోతను శస్త్ర చికిత్స చేసుకునే లోలోపలి అతి హృదయ విదారపు పరిస్థితుల్లో రివిజనిస్టు ప్రభుత్వం చారును 1972లో జైలు నిర్బంధంలో హత్య చేసింది. సరిగ్గా అప్పుడే తూప్రాన్ నుండి దళితుడైన కోపాద్రిక్త యువకుడు గద్దర్ వచ్చాడు . ఆర్ట్ లవర్స్ ఉన్న నర్సింగరావు లాంటి వాళ్లు ʹజననాట్య మండలిʹగా 1972లో ఏర్పడ్డారు. గద్దర్ గోచీ గొంగడి, కాళ్లకు గజ్జెలుతో అలాంటి యుద్ధ భూమిలో దుంకాడు, ఆయన తయారీ వెనుక నర్సింగరావు, భూపాల్, ఎల్.ఎస్.ఎన్. మూర్తి లాంటి ఎందరెందరో సమిష్టి కృషి ఉన్నది. అప్పటికి శ్రీకాకుళం రక్తసిక్తమయ్యింది. కొండపల్లి చందులాంటి వారిని హత్యచేశారు. పార్వతిపురం కుట్రకేసులో వందలాది మందిని నిర్బంధించారు.
" రచయితలారా మీరెటువైపు ప్రజలవైపా - పాలకులవైపా ?" అనే విద్యార్థుల సవాల్ తో , పాణిగ్రాహి స్ఫూర్తితో - నక్సల్బరీ, శ్రీకాకుళ ప్రేరణతో 1970కే విరసం ఏర్పడి ప్రజా పోరాటాలకు బాసటగా నిలబడి ఉన్నది. నెహ్రూ టైపు అతుకుల బొంత మిక్స్డ్ ఎకానమీ బలవడటానికి పబ్లిక్ సెక్టారులో ఉత్పత్తయిన భారీ యంత్రాలు కాజేసి పబ్లిక్ సెక్టారును దివాళా తీయించారు. బ్యాంకులను కొల్లగొట్టారు. వ్యవసాయరంగం అర్ధవలన అర్ధభూస్వామ్య ఉత్పత్తి విధానంతో దేశం అస్తవ్యస్తమయ్యింది. వ్యవసాయంలోని కొద్దిపాటి మిగులు వ్యవసాయం మీద ఆధారపడిన 70 శాతం ప్రజలకు చెందకుండా వ్యవసాయానికి నామమాత్రపు పెట్టుబడిలేక గ్రామసీమలు ఆకలితో అలమటించాయి.
ఈ ఒత్తిడిలో నుండి దేశవ్యాపితంగా నిర్మాణం లేని అనేక మంది ప్రజలు వీధుల్లో కదంతొక్కారు. యువతరం మునుపెన్నడు లేనంతగా మార్క్సిజాన్ని "అధ్యయనం చేయడం ఆరంభించారు. అసలు నాయకుడే కాదన్న బక్క పలుచని చారుమజుందార్ చంపబడి యూనివర్సిటీలలో ఊపిరి పోసుకున్నాడు. నక్సల్బరీ, శ్రీకాకుళం గాయం మునుపెన్నడు లేనంతగా ఇంకా ముదరని, గ్రామీణ పురిటి వాసన పోని మధ్యతరగతిని తీవ్రంగా కలిచివేసింది. అది తెలుగు ప్రాంతంలో - దిగంబర, తిరుగబడు కవులుగా, విరసం, జననాట్య మండలిగా, వ్యక్తులుగా అయితే చెరబండరాజు, గద్దర్, వరవరరావులుగా వేలాది మంది లోలోపలి సంఘర్షణాత్మక తలపోతగా ప్రజల్లో మారుమోగింది. 1970 ప్రపంచవ్యాపిత దురాశపూరిత ఆర్థిక మాంద్యం భారతదేశంలో అత్యవసర పరిస్థితి 1975 వాటికి పతాక స్థాయిలో ఉన్నది. అలాంటి కోపోద్రిక్త యువకులను దేశవ్యాపితంగా ముప్పైవేల మందిని చిత్రహింసల కొలిమిలోకి దించిన ఇందిరా ప్రభుత్వం వందలాది మందిని హత్యచేసింది. ప్రజల పోరాట స్థాయిని బట్టి హత్యాకాండ స్థాయి ఉంటుంది.
1972 నుంచి ఎమర్జెన్సీ దాక విప్లవోద్యమంలో, దేశంలో సాగిన తీవ్ర సంఘర్షణలలో అనేక మంది సృజనాత్మక వ్యక్తులు తయారయ్యారు. వారిలో గద్దర్ ఒకరు. విప్లవోద్యమాలు, వ్యక్తులు, సమూహాలు, సంస్థలు, అన్ని రకాల బూర్జువా పార్టీలను, రివిజనిస్టు నిర్మాణాలను, భావజాలాలను ఒదులుకొని కొత్తగా నిర్మాణమైన కాలం అది.
అర్ధవలస - అర్ధభూస్వామ్య వ్యతిరేక వర్ణపోరాటంతో- మార్క్సిజం , లెనినిజం, మావో ఆలోచన విధానం అనే శాస్త్రీయ విజ్ఞానంతో, 99 డిగ్రీల దాకా నీరు మరిగినట్లే ఈ కాలం మరుగుతున్న దశలో కవులు, కళాకారులు తమ శక్తి వంచన లేకుండా విప్లవోద్యమం రూపుకట్టడానికి ప్రయత్నం చేశారు. శివసాగర్, గద్దర్ మాత్రమే కాదు చెరబండరాజు, గూడ అంజయ్య, వరవరరావు ఇవి పేర్లు మాత్రమే కాదు. సృజన ఒక వేదిక. వందలాది మంది కళాకారుల కఠోర సాధన ఫలితం.బీదల పాట్లు, గొల్ల సుద్దులు, డాన్సులు అనేక పాటలు కలిసిన పరిమాణాత్మక దశ పతాక స్థాయికి చేరుకుంది. ఇవన్నీ కలిసే అత్యవసర పరిస్థితి ఎత్తివేత, నెహ్రూ మార్క్ బూటక సోషలిజం కొత్త ముసుగులో బ్యాంకుల జాతీయీకరణ, ఇరువై సూత్రాల పథకాలుగా ముందుకు వచ్చాయి.
అప్పటికే యూరప్, రష్యా ఫైనాన్స్ పెట్టుబడి స్థానే వియత్నాంలో ఓడిపోయిన అమెరికా భారతదేశంలో కొత్త దళారీ పెట్టుబడిదారులను రంగం మీదకి దించింది. భారతదేశంలోని వర్గ సంబంధాలనే కాదు కుల, లింగ తదితర అన్ని వైరుధ్యాలను వాడుకోవడానికి ప్రజాసామ్యం ముసుగులో బ్రాహ్మణ, వైశ్య కులాలనే కాదు మిగతా అగ్రకులాలను ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే- అన్ని కులాలను రీఆర్లనైజు చేసింది. ఇది అత్యంత రహస్యంగా జరిగిన పని, శూద్రకులాలు కొన్ని అగ్రకులాల సరసన చేరాయి. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దాక కుట్రలు కుతంత్రాలతో పెట్టుబడి తన చెత్త సరకుల మార్కెట్ల విస్తరణ చేసింది. అన్ని రకాల మాయోపాయాలతో సిబఏ లాంటి గూఢచర్యంతో విస్తరించింది. దాని కొనసాగింపే ప్రాంతీయ బూర్జువా పార్టీల పుట్టుక, వికాసం.
-4-
ఈ నేపథ్యంలోనే మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో వ్యవసాయ విప్లవాన్ని 1976లో ప్రకటించింది. వ్యవసాయ విప్లవం అర్ధవలస - అర్ధభూస్వామ్య దేశంలో ప్రధాన వైరుధ్యం భూస్వామ్యానికి - రైతాంగానికి మధ్య ఉన్నదని ప్రకటించింది. దున్నేవారికి భూమి ప్రాతిపదికన రైతాంగ పోరాటాలు ఆర్థిక పోరాటంగా ఆరంభమై రాజకీయ పోరాటాలుగా సాయుధ గెరిల్లా పోరాటాలుగా స్థావర ప్రాంతాలుగా అడవి ఉద్యమంలోకి విస్తరించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చారుమంజుందార్ రైతాంగ సాయుధ పోరాటపు వ్యూహంలోని సరైన ఎత్తుగడలు పది సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు నుండి రూపొందాయి. ప్రజలే చరిత్ర నిర్మాతలుగా రూపొందిన కాలమది.
శివసాగర్, చెర, గద్దర్, వివి - సృజనలో ఒక స్పష్టమైన మార్గం ఏర్పడింది, సరిగ్గా ఈ సందర్భంలోననే ʹభారతదేశం భాగ్యసీమరాʹ అని గద్దర్ గర్జించాడు. వరవరరావు అదే విషయాన్ని సభల్లో తన ఉపన్యాసంతో వివరించి చెప్పారు. మాట - పాట కలిసి జననాట్య మండలి బీదల పాట్లను స్థానిక సమస్యలతో స్క్రిప్ట్ లేకుండా వందల ప్రదర్శనలిచ్చింది. అప్పటికది కల మాత్రమే. ఈ కలను సాకారంచేసే ప్రయత్నాలు ములుగు, జన్నారం, మెదక్ జిల్లాలల్లో హత్యాకాండలతో బెడిసికొట్టాయి. అక్కడక్కడ ప్రజల ప్రమేయం లేకుండా జరిగిన వర్గ శత్రువు నిర్మూలన తీవ్ర నిర్బంధంతోపాటు లేదు అనుభవాలనే మిగిల్చింది.
ఈ నేపధ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలుగా కదలడానికి జననాట్య మండలి ప్రజల దగ్గరికి వెళ్లి 1974లోనే గ్రామాల బాట పట్టి అమరులైన గిరాయిపల్లి వీరుల స్ఫూర్తితో చైనా ʹఎర్రరంగ స్థలంʹ అనుభవాలను అమలుపరిచింది. ఈ ప్రభావమంతా 1974లో ఏర్పడిన రాడికల్ విద్యార్థి సంఘం మీద పడింది. 1977 తర్వాత రాడికల్ విద్యార్థులు, జననాట్య మండలి గ్రామాల్లోకి ప్రవేశించాయి. ఉమ్మడిగా వేసవిలో గ్రామాలకు తరలిన వీరోచిత తెగింపు పోరాటం 1977 నుండే వరంగల్లు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలల్లో తిరిగి ఆరంభమయ్యింది. గద్దర్, గూడ అంజన్న లాంటి వారి పాటలు ధైర్యాన్ని, బలాన్ని, చొరవను యువకులైన విద్యార్థులకు కలిగించాయి. గ్రామాల నుండి గ్రామాలనానుకొని ఉన్న చిన్న పట్టణాలను విప్లవోద్యమం చుట్టుకున్నది. 8 సెప్టెంబర్, 1978 జగిత్యాల జైత్రయాత్ర కన్నా ముందు జననాట్య మండలి అల్లం నారాయణ, పాముల రాంచందర్ నాయకత్వంలో వందల గ్రామాలల్లోకి వెళ్లిన రాడికల్ విద్యార్థులు దాదాపు 116 గ్రామాలల్లో ముందు చిన్న పట్టణాలల్లో, వేలాది మంది ప్రజలల్లో ప్రదర్శనలిచ్చింది. ఆ వరుసలో ఆఖరు సమావేశం - జగిత్యాల జైత్రయాత్రగా సాగిన యాభై వేల రైతాంగం మధ్యకు ʹబీదలపాట్లʹ నాటకం, అల్లం వీరయ్య లాంటి ఎందరివో పాటలు వచ్చి చేరాయి.
ఇది సిలిగురి డివిజన్లో మే 18, 1967 నాడు రాంజోతే గ్రామంలో జరిపిన రైతాంగ కార్యకర్తల సభ లాంటిది. ఊహించని విధంగా ఆ సభకు ఆనాడు పదిహేను వేల మంది రైతాంగం హాజరయ్యారు. ఈ రోజే సాయుధ పోరాట పిలుపు యివ్వడం జరిగింది. దీని వెనుకున్న పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు వారు, కానుసన్యాల్, జంగల్ సంతాల్, శాంతిముండాతో పాటు మరో పద్నాలుగు మంది ఉన్నారు. ఆ తరువాత ఆ సంఖ్య పెరిగింది. సరిగ్గా కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని కమిటీ నాయకుల సంఖ్య అప్పటికి పరిమితమే. కాని జగిత్యాల జైత్రయాత్ర తరువాత అన్ని జిల్లాల్లో పార్టీ సభ్యత్వం ఉప్పెనలా పెరిగింది. లెనిన్ ʹఏమిచేయాలిʹ అవగాహనతో ఈ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గుగనుల ప్రాంతంలో ఇదే సమయంలో కార్మికవర్గ పోరాటాలు ఆరంభమయ్యాయి.
ఈ మొత్తం రైతాంగ విప్లవోద్యమం, కార్మికవర్గ విప్లవోద్యమ భావోద్వేగ, సాంస్కృతిక వ్యక్త రూపం గద్దర్ బృందం నాయకత్వం వహించిన జననాట్య మండలి. దానికి విరసం మేధావి వర్గంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న రాజకీయ, వర్గపోరాట కేంద్రంగా తోడైంది. కుమార్ పల్లి వరవరరావు ఇల్లు, సృజన, బి. నర్సింగరావు, గర్జర్ అల్వాల్, వెంకటాపురం జననాట్య మండలి అధ్యయన, తర్పీదు కేంద్రాలయ్యాయి.
క్షేత్రస్థాయి రైతాంగ ప్రజాపోరాటాలు, సాంస్కృతిక సైన్యమైన జననాట్యమండలి, విరసం లాంటి కళా, మేధోశక్తులు ఈ మూడింటిని సమన్వయం చేయాల్సిన ప్రజా పోరాటాల విప్లవ పార్టీ లక్ష్యం ఒకటే అయినా క్షేత్రాలు - పని విధానాలు వేరు వేరు. క్షేత్రస్థాయి ఆచరణ నేపథ్యంలో విరసంలోని మేధావుల మధ్య జరిగిన చర్చలు - ఎదిగివస్తున్న, రూపొందుతున్న మధ్యతరగతి మేధావుల్లో రకరకాల వాదాలకు వివాదాలకు తావిచ్చాయి. జననాట్య మండలిలో కూడా ఇదే స్థాయిలో చర్చలు జరిగాయి.
గద్దర్ మరణం తరువాత ఎవరి పద్ధతిలో వారు
వాదవివాదాలు వ్యక్తం చేశారు. సారాంశంలో వీటికి క్షేత్ర స్థాయి ఆచరణకు - మేధావులకు మధ్య ఉన్న అంతరమే కారణం. ఒక్కొక్కప్పుడు ప్రజలతో మమేకత్వం చెందని మేధత్వం గిడసబారుతుంది. క్షేత్రస్థాయిలో పోరాటాలను అర్ధం చేసుకోవడంలో ఎంత క్షోభ పెడుతుందో గమనించాలి. అందరూ నిరంతరం ఆత్మవిమర్శ చేసుకుంటూ ఈర్యా ద్వేషాల్లాంటి భూస్వామిక భావాల నుంచి విముక్తమై ప్రజాస్వామీకరించబడాల్సిందే. ఇలాంటివన్నీ మన లోపల ఎంతమేరకున్నాయనేది మనకు తెలుస్తుంది. పోరాడే ప్రజలకు తెలుస్తుంది. సుదీర్ఘకాలం విప్లవోద్యమాన్ని నడుపుతున్న నాయకత్వానికి తెలుస్తుంది. నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం లక్ష్యం దిశగా ఘర్షణ, ఐక్యతతో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.
ఈ మార్పు క్రమం ఇప్పటిది కాదు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నదే - విప్లవోద్యమం పురోగమించినకొద్ది ప్రజానుకూల, వ్యతిరేక శక్తుల విభజన వైఖరి తాత్విక, రాజకీయార్థిక, వర్గపోరాట రంగంలో మరింత స్పష్టంగా వ్యక్తమౌతుంది. విప్లవోద్యమం ఎదుగుదలకు ఇదే కొండగుర్తు, నక్సల్బరికన్నా ముందు ఈ పోలరైజేషన్ చాలా మందకొడిగా సాగింది. అంతేకాక వాటిని అంచనా వేసే మా మార్క్సిస్టు - లెనినిస్టు - దృక్పథం వర్గ పోరాటంలాగే సాగింది. డాంగే నుండి అనేక మంది రాసిన సాహిత్యంలో ఇది చూడవచ్చు. అది వ్యక్తుల, పార్టీ వైఫల్యంగా కన్పిస్తున్నా కూడా రెండవ ప్రపంచ యుద్ధానంతర పరిణామాలల్లో అర్ధవలస - అర్ధభూసామ్య విధ్వంసకర ఉత్పత్తి విధానంలో ఉంది.
యూరప్ విప్లవాలల్లో జరిగిన ఇలాంటి పోలరైజేషను మార్క్స్, ఎంగిల్స్ తమ జీవితకాలమంతా విశ్లేషించారు. విప్లవ శక్తులను విప్లప ద్రోహులను వేరు చేశారు. లెనిన్ మరింత ముందుకు పోయి తను చనిపోయేదాక అనేక విప్లవేతర విద్రోహ ముఠాలు విప్లవోద్యమంలో ఎట్లా ఉంటాయో వివరంగా ఖచ్చితంగా విశ్లేషించారు. ఆ తదనంతరం మావో ఆ పనిచేశారు. మన దగ్గర నక్సల్బరీ తర్వాతనే మావో చెప్పినట్లు భారతదేశ స్థలకాలాలల్లో మార్క్సిజం వెలుగులో అధ్యయనం ఆరంభమయ్యింది, అది వర్గపోరాటాల ఆవరణ క్రమంలోనే.
-5-
విప్లవోద్యమాలల్లో వీరోచితంగా అనేక త్యాగాలతో కదిలిన దళిత బహుజన మహిళా ఆదివాసులు విప్లవ పోరాటాలల్లో బాటలు వేశారు. తమ ఉత్పత్తి క్రమంలో పొందిన జ్ఞానాన్ని, చరిత్రను, విస్మరణకు గురైన, విధ్వంసమైన వక్రీకరించబడిన బ్రాహ్మణీయ భూస్వామిక సాంప్రదాయిక చరిత్రలోకి, జ్ఞానంలోకి పోరాటంలాగే కొత్త భాషతో, కొత్త వ్యక్తీకరణతో విస్తరించారు. అప్పటిదాకా వీరులు, అగ్రకులాల చరిత్ర స్థానంలో ఆదివాసీ పోరాటకారులు ముందుకు వచ్చారు. అంబేడ్కర్, పూలే, పెరియార్ లాంటి అనేక మంది ఉత్పత్తికులాల పోరాట యోధులను తాత్విక రాజకీయ వర్గపోరాట రంగం మీదికి తెచ్చారు. మార్ని మార్క్సిజాన్ని భారతీయ సామాజిక స్థలకాలాల్లో నిర్మించడమంటే వర్గపోరాటం ముందుకు
తెచ్చిన తాత్విక, రాజకీయార్థిక సమస్యలను పరిష్కరించడమే. ఇంతదాకా సకల సంపదలను హస్తగతం చేసుకున్న అగ్రకులాల భూస్వామ్య ఆధిపత్య భావజాలానికి, కొత్తగా పీడితవర్గంలో అభివృద్ధి చెందిన ఉత్పత్తి కులాల భావజాలానికి మధ్య దాదాపు అన్ని విప్లవ పార్టీల్లో అన్ని స్థాయిల్లో భీకరమైన పోరాటం ఆరంభమయ్యింది. ఆదివాసీలు జాతుల సమస్యను ముందుకు తెచ్చారు. ఈ పోరాటంలో తన సహచరులందరిలాగా గద్దర్ తన వంతు కృషి చేశాడు. ఉత్పత్తి కులాల తరపున వర్గంలాగే భారతదేశంలో కులం పునాదిలో ఉంది అనే అంబేడ్కర్ భావజాలంతో మారోజు వీరన్న పోరాడాడు. పూలే, అంబేద్కర్ అధ్యయనం విప్లవ పార్టీల్లో మార్క్సిజంతో పాటు ఉండాలని వాదించాడు. అప్పటి రాడికల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు డా. గోపినాథ్ నాయకత్వంలో కులం మీద సెమినార్లు నిర్వహించాడు.
కులం గురించిన ఈ అనుభవం విప్లవోద్యమంలో మొదటి నుంచీ ఉన్నది. రైతకూలీ సంఘాలల్లో నాయకత్వం విషయంలో - కులం ప్రతిచోట ఈ వైరుధ్యాన్ని, ఘర్షణను ముందుకు తెచ్చింది. ముప్పాల లక్ష్మణరావు రాసిన "ఎత్తుండి పిడికిల్లు" కథలో గ్రామాలల్లో ఇలాంటి ఘర్షణ వాతావరణాన్ని చిత్రించాడు. ʹఏలరో ఈ మాదిగ బతుకుʹ గద్దరు పాట - ʹఊరు మనదిరా వాడమనదిరా! దొర ఏందిరో, వాని పోకడేందిరోʹ లాంటి అనేక పాటలు వచ్చాయి. ఈ పోరాట ఆయుధాలను, అధ్యయనాన్ని, చైతన్యాన్ని కలిగించింది మార్క్సిజం లెనినిజం, మావో ఆలోచన విధానం. ముఖ్యంగా సాంస్కృతిక విప్లవ ప్రేరణే పార్టీ మీదనే *బంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్" అనే మావో నినాదం ప్రపంచ వ్యాపితంగా ఉన్న అట్టడుగు ప్రజానీకానికి స్పూర్తినిచ్చింది. ఈ వర్షపోరాటం విప్లవ శ్రేణుల్లో తీవ్రమైన భావోద్వేగాలకు కారణమయ్యింది.
గిడసబారిన తెలంగాణ భూస్వామిక గ్రామాలల్లో బీహార్, జార్ఖండ్ గ్రామాలల్లో అంతకు ముందటి సాయుధ పోరాటాలకు. భిన్నంగా విప్లవోద్యమం దళితులు, బహుజనులు, ఆదివాసులు, మహిళల పక్షాన నిలబడటం నక్సల్బరీ తరువాతనే జరిగింది. ఇది పునాదులను పెళ్లగించింది. మహారాష్ట్రలో దళిత్ పాంథర్ ఉద్యమం, విప్లవోద్యమం ఈ ప్రశ్నలను ముందుకు తెచ్చాయి.
దున్నేవానికే భూమి - కూలిరేట్ల పెంపు, ఆశ్రితకులాల వెట్టి పనుల రద్దు, ప్రజా పంచాయితులు దొరలు అక్రమంగా తీసుకున్న దండగలు వాపను లాంటి పోరాటాలు రైతుకూలి సంఘాలు బలోపేతమై విస్తరించి నిర్వహించాయి. మొదట గ్రామాలల్లో దొరలు తమ గుండాలతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో పోరాటంలో ముందు నిలిచిన రైతు కూలీల సంఘాల నాయకత్వంలో ప్రజలు దొరల గడీల మీద దాడులకు పూనుకున్నారు. బంజరు, షికం భూముల ఆక్రమణ ఒక ఉద్యమంగా సాగింది. ఆర్ధిక పోరాటాలు విస్తరించి రాజకీయ పోరాటాలుగా రూపుదిద్దుకున్నాయి. జగిత్యాల, సిరిసిల్లా తాలుకాలు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి ప్రభుత్వం పోలీసు, సి ఆర్ పి ఎఫ్ బలగాలతో గ్రామాలల్లో తొలి విడత నిర్బంధం తెచ్చింది. లక్ష్మింరాజం, పోశెట్టి, శివయ్య దళితులను దొరల గుండాలు హత్యచేశారు. కార్యకర్తలు రహస్యంగా పనిచేయాల్సి వచ్చింది. రక్షణకోసం ఒకరికొకరుతో మొదలై ముగ్గురి దళాలుగా మొదట రైతాంగ సాయుధ పోరాట రూపం సంతరించుకున్నాయి. ప్రజా సంఘాలు కొత్త నిర్మాణ రూపాల్లోకి మారే క్రమంలో రాజకీయ శిక్షణ అవసరమయ్యింది. వేలాది మంది ప్రజా సంఘాలల్లో సంఘటితమైనా గూడా రైతాంగ సాయుధ పోరాట లక్ష్యంలోకి పూర్తి కాలపు కార్యకర్తలుగా పదుల సంఖ్యలో ఎదిగారు.
విప్లవోద్యమం ఉత్తర తెలంగాణను గెరిల్లా జోన్ గా ఈ జిల్లాలకు ఆనుకొని ఉన్న అడవీ ప్రాంతాలను స్థావర ప్రాంతాలుగా విస్తరించే లక్ష్యంతో అడవి ఉద్యము మీద కేంద్రీకరించింది. రాష్ట్రవ్యాపితంగా ఉన్న కార్యకర్తలను సింగరేణి కార్యకర్తలను మూడింట రెండు వంతులు అడవి ఉద్యమ విస్తరణలోకి విస్తరించారు. 1969 నుండే ఆరంభమైన ఈ కేంద్రీకరణ - విస్తరించి ఆదివాసుల అధ్యయనం పెరిగింది. నక్సల్బరి, శ్రీకాకుళం పోరాట అనుభవం అంతకు ముందటి తెలంగాణ సాయుధ పోరాట అనుభవంతో మైదాన ప్రాంతం నుండి వచ్చిన రైతాంగ, కార్మిక కార్యకర్తలు ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం భారతీయ విప్లవోద్యమంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. గ్రామాల క్షేత్రస్థాయిలోని వైరుధ్యాలకు, ఆదివాసీ పోరాటాల సమన్వయానికి మధ్య పాతతరవు నాయకత్వానికి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. అప్పుడు కేంద్ర నాయకుడిగా శివసాగర్ ఉన్నాడు. ఈ సందర్భంలోనే 20 ఏప్రిల్, 1981 ఇంద్రవెల్లి మారణకాండ జరిగింది. ఒక రకంగా దాన్ని అన్ని శక్తులు ఏకమై అధిగమించడంతో క్షేత్రస్థాయి నాయకత్వానికి దారి సుగమమయ్యింది. ఆదివాసుల చరిత్ర అధ్యయనం ʹకొమురంభీంʹ ఆవిష్కరణ - ఆదివాసుల పొరకలసార్లుగా ప్రవేశించిన పోరాట కార్యకర్తలను అక్కున చేర్చుకొని కడుపుల దాచుకున్నారు. అదే సమయంలో పెద్ది శంకర్ అమరత్వం - మహారాష్ట్రతో సంబంధాలు - ఉద్యమాన్ని దండకారణ్యంలోకి ఏడు దళాలతో విస్తరించడం ఊపందుకున్నది. ఇదొక కొత్త చేర్పు. నక్సల్బరి, శ్రీకాకుళ ఉద్యమాలు తిరిగి పుంజుకొని వేసిన ముందడుగు.
అగ్రనాయకత్వంలోని స్వీయాత్మక ధోరణులకు, క్షేత్రస్థాయి అనుభవాలకు సంఘర్షణ తీవ్రమైంది. ఇది ఆర్థిక, రాజకీయ, సాయుధ పోరాటాల సమన్వయపరిచే లక్ష్యానికి సంబంధించింది. ఈ లక్ష్యంలో ఆర్థిక పోరాటాలకే ప్రాధాన్యతనివ్వాలనే వాదన సాయుధ పోరాటాన్ని అతివాదంగా మార్చింది. ఆర్థిక, రాజకీయ, సాయుధ పోరాటాల సమన్వయం అవసరాన్ని క్షేత్రస్థాయి నాయకత్వం డిమాండ్ చేసింది. ఈ రోజులల్లో - సాహిత్యం, కళలు కూడా ఈ ఉద్వేగాల వాతావరణంలోకి లోనయ్యాయి. నిర్భంధం తీవ్రతరమై గ్రామాలనిండా బార్డర్ సెక్యూరిటీ పోలీసులతో నింపేశారు. ప్రజానాయకుడు దేవేందర్ రెడ్డి ఆచూకి ఒక ద్రోహి యివ్వడంతో పోలీసులు చుట్టుముట్టి కాల్చిచంపారు...
విప్లవోద్యమం 1981 మేలో కరీంనగర్ లో రైతుకూలీ మహాసభలు జరిపింది. రాష్ట్రవ్యాపితంగా అన్ని జిల్లాల నుండి లక్షకు పైగా రైతాంగం పాల్గొన్న ఈ సభ ప్రధానంగా ఆర్థిక పోరాటాలను విస్తరిస్తూనే ప్రజలు సాధించుకున్న భూములు, హక్కులు - కాపాడుకోవాలంటే ప్రజాసంఘాలు రాజకీయంగా తర్పీదు కావాలని చర్చించింది. పటిష్టమైన పార్టీ నిర్మాణం లేకుండా పెరుగుతున్న నిర్బంధాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని, ప్రజలు అన్ని రకాలుగా తర్ఫీదు కావాలని, ప్రజా మిలీషియా అవసరం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలను దాదాపు -మూడు నాలుగు నెలల ముందే పోరాట ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులతో జననాట్యమండలి గద్దర్, వంగపండు, సంజీవ్, నర్సింగరావు, సుందిల్ల ధర్మన్న లాంటి వాళ్ల సమిష్టి కృషితో ప్రాక్టీసు చేసి రూపొందించిన పాటలు, కళారూపాలు, నాగేటి చాళ్లల్లో లాంటి నాటకంతో విజయవంతంగా ప్రదర్శించారు.
అయితే ఆ తరువాత పోరాటం పురోగమనానికి తగినట్లుగా కేంద్ర నాయకత్వపు మందకొడితనం సమస్యగా మారింది. ఉన్నత రూపంలోకి తీసుకపోవాల్సిన సైనిక పరమైన అంశాలకు, మొత్తంగా క్షేత్రస్థాయి పోరాటాలకు - నాయకత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ కాలంలోనే కె.యస్. హాస్పిటల్ -నుండి తప్పించుకొని తిరిగి విప్లవోద్యమంలోకి వచ్చారు. పార్టీలో ముందుకు పోవాల్సిన అంశాలకు, నిలిచిపోయిన అంశాలకు మధ్య ఘర్షణ అప్పటికి నాయకులుగా ఉన్న శివసాగర్, కె.యస్.ల మధ్య ఎవరు అగ్రనాయకులనే చర్చగా మారింది. శివసాగర్ అసమ్మతిగా ఉండగానే కె.యస్. నాయకుడయ్యాడు.
ఈ సంఘర్షణ వాతావరణంలోనే దండకారణ్య పర్స్పెక్టివ్ తో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల పోరాటాల రక్షణ స్థావరాలుగా నల్లమల, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ గెరిల్లా పోరాటాల అభివృద్ధికోసం కొత్త రాజకీయ తీర్మానంతో పని ముమ్మరమైంది.
ఆ తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నక్సలైట్లే దేశభక్తులని అధికారంలోకి వచ్చింది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుపర్చింది. క్రోనీ క్యాపిటల్ తో అధికారంలోకి వచ్చిన వీళ్లంతా హైదరాబాద్ లోని నైజాం భూములు ఆక్రమించి బలోపేతం అయ్యారు. తెలంగాణ పల్లెల్లో గ్రామాలు ఖాళీ చేసిన రెడ్డి వెలమ దొరల స్థానంలో బహుజన నాయకత్వాన్ని తీసుకవచ్చింది. దోపిడి పీడన తీవ్రతరం చేయడానికి అధికార వికేంద్రీకరణ పేరుతో -మండలాలు ఏర్పాటు చేసింది. మొత్తంగా విచ్ఛిన్నమైన పాత తెలంగాణ భూస్వామిక ఉత్పత్తి విధానంతో ఉత్పత్తి సంబంధాలలో విధ్వంసకర వెల్లువ కొత్త ఉత్పత్తి విధానం - ఉత్పత్తి సంబంధాలు తేవడం వీటి లక్ష్యం.వీటికి - విప్లవోద్యమాలు నెలకొల్పిన ప్రాథమిక నూతన ప్రజాస్వామిక ఉత్పత్తి సంబంధాలకు మధ్య తీవ్రమైన ఘర్షణ మొదలయ్యింది. బూర్జువా రాజకీయాలు కుల విభజనను తిరిగి రంగం మీదికి తెచ్చాయి. మునుపెన్నడు లేని విధంగా గ్రామాలల్లో కార్యకర్తల లిస్టు తయారు చేసి అన్ని రకాల కొత్త నిర్బంధ రూపాలు అమల్లోకి తెచ్చాయి. మిస్సింగ్ ఎన్ కౌంటర్ హత్యలు ముమ్మరం చేశారు. పెద్దఎత్తున చుట్టివేత, అణచివేత జరిగింది. ఎన్టీఆర్ భర్తరఫ్, తిరిగి అధికారంలోకి రావడం దరిమిలా నిర్బంధం తీవ్రమైంది. జననాట్యమండలి కార్యక్రమాలకు అవకాశం లేకుండాపోయింది. గద్దర్, వి.వి. లాంటి అనేక మంది పక్క రాష్ట్రాల్లోకి వెళ్లి దేశవ్యాపితంగా విప్లవోద్యమ ప్రభావాన్ని ముమ్మరం చేశారు. గద్దర్, దండకారణ్యంలో సంజీవ్ తో కలిసి వందలాది మంది చేతన నాట్యమంచ్ సాంస్కృతిక కార్యకర్తలకు తర్పీదునిచ్చారు. ఈ పరిస్థితి మధ్యనే విప్లవోద్యమంలో మరో సంక్షోభం. ఇది 1990 దాకా కొనసాగి కె.యస్. బహిష్కరణకు దారితీసింది. కేంద్రంలో, రాష్ట్రంలో రెండో తరం నాయకత్వం వచ్చింది. నాయకత్వ మార్పుతో తిరిగి అన్ని రాష్ట్రాలల్లో విప్లవోద్యమాలు ఊపందుకున్నాయి.

Keywords : gaddar, allam rajayya, jananatyamandali, cpi maoist,
(2024-04-21 21:48:58)No. of visitors : 675

Suggested Posts


వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)

1990 చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నిర్బంధంలో తాత్కాలిక సడలింపు దొరికింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


వర్గపోరాట