వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)

వర్గపోరాట

-6-
1990 చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నిర్బంధంలో తాత్కాలిక సడలింపు దొరికింది. ఈ వాతావరణంలో గద్దర్ లాంటివాళ్లు తిరిగి బహిరంగ జీవితంలోకి వచ్చారు. గ్రామీణ ప్రాంతాలల్లో నిర్మాణాలను బలోపేతం చేయాలని, ప్రజాసంఘాలను, దళాలను సమన్వయం చేయాలని 1990 వరంగల్లు రైతుకూలీ మహాసభలు రాష్ట్రవ్యాపితంగా పది లక్షల మందితో జరిగాయి. అపరిష్కృతంగా ఉన్న దున్నేవారికి భూమి సమస్య ప్రధానంగా ప్రజారాజ్య కమిటీలు బలోపేతం చేసే దిశగా కొత్త ఉత్సాహంతో, చొరవతో ఆరు నెలల్లో బూర్జువా అధికారం చెలామణి కాని స్థితికి గ్రామాలు చేరుకున్నాయి. ఇదే కాలంలో ఊసరవెల్లిలా దేనిలోనైనా ఇమిడిపోగల అగ్రకుల బ్రాహ్మణీయ ప్రతినిధి పి.వి. నర్సింహారావు ప్రధానమంత్రి కావడంతో ప్రపంచీకరణ పేర చెత్త వినియోగ సరుకులు ప్రవాహం - ద్రవ్య పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తింది. వ్యవసాయ రంగంలో విధ్వంసకర నమూనాకు పారిశ్రామిక రంగం ఉత్పత్తి రంగం నుండి వ్యవసాయ, పారీశ్రామిక రంగాలను తొక్కేసి వినియోగ రంగం 11 శాతం నుండి 50 శాతం దాకా ఎదిగింది. పాత దళారి బూర్జువాలతో పాటు దొంగచాటుగా పబ్లిక్ సెక్టార్ ను వాడుకొని ఎదిగిన అంబాని లాంటి వాళ్లు పైకి వచ్చారు..
రామజన్మభూమి, బాబ్రీమసీదు కూల్చడం గోబెల్స్ ప్రచారం - కాంగ్రెస్ జాతీయ పోరాటపు ముసుగు అడ్డంగా ఎన్నడూ ఒకటి రెండు సీట్లురాని బిజెపిని ముందుకుతెచ్చింది. ఏవి నర్సింహారావు మరో ముఖం వాజ్ పే య్ అగ్రకుల బ్రాహ్మణీయ, వలస కొత్త ఎత్తుగడ - ప్రపంచవ్యాపితంగా అన్నిరకాల అభివృద్ధి నిరోధక శక్తులు మతంతో సామ్రాజ్యవాదం పెనవేసుకుపోయాయి. ఇది రాష్ట్రాల దాకా విస్తరించింది. ఎన్.టి. రామారావు స్థానే చంద్రబాబు నాయుడు డబ్బు సంచులతో, వెన్ను పోటుతో అధికారంలోకి ప్రవేశించాడు.
ప్రపంచబ్యాంకు ఆర్థిక విధానాల వల్ల బహుజనులు ఉపాధి కోల్పోయారు. పేద రైతుల భూమి సెజ్ ల పేర ఆక్రమించారు. సరుకు వినియోగంలో ఉత్పత్తిలో వెనుకబడిన ఆదివాసీ ప్రాంతాల మీద దాడులు చేసి, విస్తాపనకు గురిచేసి ఖనిజాలను చౌకగా దోచుకపోవడం తీవ్రతరమయ్యింది. అడవులు ఆదివాసీలు అనివార్యంగా యుద్ధ క్షేత్రాలుగా మారాయి.
భారతదేశంలోని కుల మత వైరుధ్యాలను ఉపయోగించు కోవడానికి అమెరికన్ సామ్రాజ్యవాదం ఎన్ జి ఓ సంఘాల్లోకి రకరకాల కులసంఘాలలోకి, కొన్ని విప్లవ గ్రూపుల్లోకి కూడా చొరబడి, ఫండింగు చేసి, రాజ్యాన్ని ఎదిరించి పోరాడే విప్లవోద్యమాల మీద బురద జల్లే ముసుగు సంస్థలు చాలా పుట్టుకొచ్చాయి. ఇవి దళిత, బహుజన, మహిళా, ఆదివాసీ ప్రజల్లో చీలికలు తేవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండతో ప్రచారానికి దిగాయి, టర్కీ విప్లవోద్యమం మీద మొదట ఆరంభించిన మంద్రస్థాయి యుద్ధాన్ని 2000 నాటికి ప్రపంచవ్యాపితంగా అమెరికన్ సామ్రాజ్యవాదం తీసుకుపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైంది. ఒక పక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయరంగం తీవ్రమైన విధ్వంసానికి గురైంది. అప్పటిదాక పోరాటంలో రాటుదేలిన రైతాంగం మీద మంద్రస్థాయి యుద్ధంలో భాగంగా పాశవిక దమనకాండ మొదలైంది. మిస్సింగులు, ఎన్ కౌంటర్లు, మాయం చేయడం, గ్రీన్ టైగర్స్, నయీం లాంటి రాజ్య ప్రేరిత ముఠాలు మొదలైన రూపాల్లో అణచివేత తీవ్రమైంది. ఆవరణ నుండి రాటుదేలిన నాయకత్వం ఉన్నందువల్ల విప్లవోద్యమం ఈ అన్నిరకాల దాడులను ఎదుర్కొంటూనే పురోగమించింది. దేశవ్యాపితంగా విస్తరించి విప్లవ శక్తుల ఏకీకరణకు కృషిచేసింది. 1992లో కలకత్తాలో లక్షలాది మందితో ప్రజా ప్రతిఘటన వేదిక నిర్మాణం జరిగింది. నిర్బంధం మధ్యనే దేశవ్యాపితంగా విప్లవ రాజకీయాలను ప్రచారం చేసిన గద్దర్ ఇతర కళాకారులు, అన్ని ప్రాంతాల కళాకారులతో మమేకమయ్యాడు.
పి.వి. నర్సింహారావు నాయకత్వంలోనే ఆశ్రిత బ్రాహ్మణీయ హిందుత్వ శక్తుల ఏకీకరణ జరిగింది. అమెరికాలోని నార్త్ కరోలినా లాంటి చోట్ల హిందుత్వ శక్తులు తర్ఫీదు పొందాయి. భారతదేశంలో విస్తరిస్తున్న విప్లవోద్యమాల మీద ఉక్కుపాదం మోపడానికి కేంద్రీయ విధానంలో భాగంగా గ్రేహౌండ్స్ లాంటి ప్రత్యేక విభాగాల నిర్మాణం జరిగింది. రాష్ట్రాల మధ్య సమన్వయం తీసుకొచ్చారు.
వీటన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్ లోని విప్లవోద్యమ ప్రాంతాల మీద మునుపెన్నడు లేనంత ఒత్తిడి పెరిగింది. ఎన్ కౌంటర్ హత్యల్లో అమరులైన వారిని బంధుమిత్రులకు అప్పగించాలని గద్దర్, వరవరరావు ప్రజాసంఘాలతో కలిసి పోరాటం చేపట్టారు. శవాల స్వాధీనం ఉద్యమ రూపం తీసుకోవడంతో గద్దర్ మీద ప్రభుత్వ ప్రమేయంతో ఏప్రిల్ 6, 1997లో కాల్పులు జరిగాయి, అయినా విప్లవోద్యమాలలో రాటుదేలిన ప్రజలు ఇలాంటి నిర్బంధాన్ని ప్రతిఘటించేందుకు దారులు వెతుకుతున్న క్రమంలో 1996ను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన డిక్లరేషన్ వచ్చింది, అది స్థానికంగా, భారతదేశంలో ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామాల క్రమంలో రూపొందింది. కులాల, అస్తిత్వాల, జాతుల, ప్రాంతాల సంఘర్షణలు విముక్తి కోసం కదులుతున్న సందర్భంలో వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో ముందుకు తీసుకుపోవాల్సిన వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రాజకీయార్థిక విశ్లేషణలతోపాటు వర్గపోరాటం ముందుకు తీసుకుపోవడానికి నిర్బంధకాలంలో విప్లవశక్తుల ఏకీకరణకు ఉద్దేశించబడింది. తెలంగాణ ఉద్యమాన్ని
దెబ్బతీయడానికి బెల్లి లలితను అతి కిరాతకంగా చంపారు. ఈ క్రమంలోనే 1997 తెలంగాణ జనసభ వరంగల్లో జరిగింది. వేలాది మంది నిర్బంధం అధిగమించి ఈ సభకు హాజరయ్యారు. ఆకుల భూమయ్య తెలంగాణ జనసభకు అధ్యక్షుడయ్యాడు. ʹ 1999లో గద్దర్ అఖిల భారత విప్లవ సాంస్కృతి సమితి (ఎఐఎల్ఎరి)కి కార్యదర్శి అయ్యాడు. 2001 దాకా ఆ సంస్థ ద్వారా దేశవ్యాపితంగా విస్తరించిన విప్లవోద్యమాల ఏకీకరణకు సంబంధించిన కార్యకలాపాలల్లో తన వంతు సాంస్కృతిక కర్తవ్యాలను ఆయన నిర్వహించారు.
-7-
1991 నుండి 1999 దాకా ఉత్పత్తి రంగంలో జరిగిన మార్పులను వర్గ పోరాటం నేపథ్యంలో అధ్యయనం చేయడానికి విప్లవోద్యమం పూనుకున్నది. మధ్యయుగాలనాటి భూస్వామ్య గ్రామీణ ప్రాంతాలల్లో నుండి దొరలు దాదాపుగా ఖాళీ చేసి పట్నాలకు వలసపోయారు. ఆ ఖాళీలో నూతన ప్రజాస్వామిక ప్రాథమిక నాయకత్వం రూపొందింది. వందల వేల ఎకరాలు గల కమతాలు తగ్గాయి. అనేక కారణాల రీత్యా ఒకటి నుండి అయిదు ఎకరాలలోపు పేద రైతుల సంఖ్య 65 శాతం గణనీయంగా పెరిగింది. ప్రపంచీకరణ వలన ఉత్పత్తి విధానంలో యంత్రాలు ఎరువులు, విత్తనాలు ప్రవేశించినా కూడా భూసామ్య సంబంధాలను పూర్తిగా తుడిచిపెట్టక విధ్వంసానికి గురిచేసింది. శ్రమ, దిగుబడి పెరిగి కూడా దోపిడి, పీడన పెరిగి గిట్టుబాటు ధరలు లేక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి.
కౌలు రైతుల సంఖ్య పెరిగింది. విప్లవోద్యమం మీద ఉక్కుపాదం తీవ్ర నిర్బంధం మధ్య ఈ ఒత్తిడి నుండి నిలదొక్కుకోవడం, తప్పుకోవడంలో కదంతొక్కారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయం గ్రేహౌండ్స్ లాంటి పోలీసులు, ఇన్ ఫార్మర్లు నల్లదండు ముఠాలు పెరిగాయి. ఈ నిర్బంధంలోనూ ఉత్తర తెలంగాణ గెరిల్లాజోన్లో ప్రజలు అనేక త్యాగాలతో ప్రతిఘటించారు. దక్షిణ తెలంగాణ, సీమాంధ్ర, నల్లమల కేంద్రంగా, ఉత్తరాంధ్ర ఎఓబిగా వీరోచితంగా పోరాడారు.
ఈ పరిణామాలను, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో జరిగిన పరిణామాలను అధ్యయనం చేయడానికి సాకేత్ రాజన్ తో పాటు మరో ఎదుగురు ప్రతి గ్రామంలో, జిల్లాలో క్షేత్ర స్థాయిలో తిరిగి నివేదిక తయారుచేశారు. 1974 నుండి ఈ ప్రాంతంలో ప్రజాఉద్యమాల నాయకుడిగా ఎదిగిన నల్లా ఆదిరెడ్డి (శ్యామ్) ఈ నివేదికల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటించినాడు. శ్యామ్ అమరుడైన తరువాత శ్యామ్ ఏరిన రచనలు ప్రచురించబడిన వుస్తకంలో తన పరిశీలనలను, తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
అప్పటికి కేంద్ర కమిటీలోను, పొలిట్ బ్యూరోలోను సభ్యులుగా ఉన్న శ్యామ్, రాష్ట్ర కమిటీ కార్యదర్శి సంతోష్ రెడ్డి, ఉత్తర తెలంగాణ కార్యదర్శి మురళీని కొయ్యూరు ఎన్ కౌంటర్ పేర చంపడం విప్లవోద్యమానికి అతి పెద్ద విఘాతం. ఈ మృతవీరుల పార్ధివ దేహాలను బంధుమిత్రులకు అప్పగించడానికి గద్దర్, వరవరరావు ప్రజలతో కలిసి పెద్ద పోరాటమే చేశారు. ఆ తరువాతనే గ్రామాలు తరిమివేసిన దొరలు- పట్టణాలు పట్టిన దొరలు కొత్త అవతారంతో కొత్త భాషతో తెలంగాణ ఉద్యమంలో ప్రవేశించారు. ఇలాంటి చొరబాటును అడ్డుకోగల్గిన పటిష్టమైన రహస్య ప్రజా కమిటీల నిర్మాణం బలహీనంగా ఉండటంతో అడ్డుకోలేకపోయాయి.అభివృద్ధి ముసుగు తొడిగి మేక తోలు కప్పుకొని మళ్లీ భయం భయంగా దొరలు గ్రామాల్లోకి అడుగు పెట్టారు. వర్గపోరాటం ద్వారా నిర్మాణం - యుద్ధం ద్వారా నూతన ప్రజాస్వామ్యంలోకి చేరే లక్ష్యం బలంగా అమలు కాలేదు. గ్రామీణ వ్యవసాయరంగంలో అంచెలంచెల అభివృద్ధి విధ్వంసకర వలస పెట్టుబడిదారుల జోక్యం పెరిగింది. ఉత్తర తెలంగాణ ఆ తరువాత రక్తసిక్తమయ్యింది. వందలాది కార్యకర్తలు అమరులయ్యారు. తాత్కాలికంగా ఖాళీచేసి గెరిల్లాలు నల్లమల, ఎఓబి, దండకారణ్యం తరలిపోయే క్రమంలో చాలా నష్టాలు తప్పలేదు.
అనేక రూపాల ప్రతిఘటనలో భాగంగా అలిపిరి ఘటన, దాని తర్వాత నిర్బంధం, ఈ మొత్తానికి బాధ్యులైన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాకు ప్రతినిధి అయిన చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చారు. 2004లో ప్రభుత్వానికి విప్లవోద్యమాల నాయకుల మధ్య చర్చలు జరిగాయి. చర్చలు పిల్లికి, ఎలుకలకు మరో గెంతుకు సన్నాహాలవంటివి, ఈ చర్చలల్లో విప్లవోద్యమం తరపున రామకృష్ణతోపాటు మిగతా ఎంఎల్ పార్టీల నాయకులు రియాజ్, అమర్, గద్దర్, వరవరరావు, కళ్యాణ్ రావు లాంటి అనేక మంది పాల్గొన్నారు. ఆనాటి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను - విప్లవోద్యమం యుద్ధంతోపాటు నిర్మించే సమాజాన్ని లక్షలాది మందిలోకి ఒక గొప్ప ఎజెండాగా తీసుకపోవడంలో విప్లవశక్తులు సమన్వయంతో కృషిచేశాయి. సాంస్కృతిక సేనానులుగా గద్దర్, వరవరరావు, కళ్యాణ్ రావు ప్రచారంలో పాలుపంచుకున్నారు.
చర్చల మధ్యలోనే మావోయిస్టు పార్టీ ఏర్పడటం భారత పీడిత ప్రజలకు ఒక గొప్ప భరోసాను కలిగించింది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో చురుకుగా పాలుపంచుకున్నది విప్లవోద్యపు శక్తులే. గద్దర్ తెలంగాణ ప్రజా ఉద్యమానికి సామూహిక చైతన్య గానమయ్యాడు. వేలమంది కళాకారులు, ప్రజలు మిలియన్ మార్చ్ గా సకల జనుల సమ్మెగా నినదించారు. గ్రామాలు తరిమేసిన దొరలు ధైర్యంగా గులాబి కండువాలు కప్పుకొని ప్రజా నాయకులుగా గ్రామాల్లోకి, పట్టణాల్లోకి తిరిగి అడుగుపెట్టారు. వలన పెట్టుబడి కొత్త ముసుగు తొడుక్కున్నది. దళారి బూర్జువా వర్గం సామ్యవాద భాషను సంతరించుకున్నది.
-8-
ఈ పరిణామాలన్నింటిలో గద్దర్ ఘర్షణ ఐక్యతతో 2012 దాకా విప్లవోద్యమంతో కొనసాగారు. 1995 నుంచి గర్జర్కు విప్లవోద్యమంతో ఘర్షణ మొదలైంది. విప్లవోద్యమం ఆయనను వివరణ అడగరం, అది సస్పెన్షన్ దాకా వెళ్లడం, తిరిగి గద్దర్ ఆత్మవిమర్శ చేసుకొని కొనసాగడం.. ఇదంతా పదిహేనేళ్లకు పైగా జరిగింది. ఈ మధ్యలోనే ఆయన అనేక సందర్భాల్లో చారిత్రాత్మక పాత్ర పోషించారు. కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తిరిగి మళ్లీ 2012లో విప్లవోద్యమం గద్దరును వివరణ అడగవలసిన పరిస్థితి ఏర్పడింది. గద్దర్లో ఘర్షణ తీవ్రమయ్యింది. చివరకు 2013 వరకు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. తానెందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో గద్దర్ అనేకమార్లు అనేక పద్ధతుల్లో చెప్పాడు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆ ఉద్యమంలో పనిచేసిన వాళ్లలో చాలా మంది తెలంగాణవాదులు ప్రభుత్వంలో చేరిపోయారు. మొట్టమొదటిసారిగా ఇలాంటి శక్తులు అవసరం లేకుండా ప్రభుత్వం నడవడం అసాధ్యం అనేది పాలకులు గుర్తించారు. సాంస్కృతిక కళాకారులందరికీ ఉద్యోగాలిచ్చారు. రాజకీయ నాయకులు, వారి యంత్రాంగం సాయుధంగా తప్ప గ్రామాలల్లో పట్టణాలలో తిరుగలేని ఒక అప్రకటిత నూతన ప్రజాస్వామిక తొలి రాజ్యాధికారం స్థానే విప్లవోద్యమాలల్లో నుండి ఎదిగిన నాయకత్వాన్ని తమతో కలుపుకొని గ్రామాల్లోకి అర్థవలస అర్ధభూస్వామ్యం అడుగుపెట్టింది. కోల్పోయిన భూములు, అధికారం తిరిగి సంపాదించడానికి తమ యంత్రాంగాన్ని బలోపేతం చేసింది. సామ్రాజ్యవాద ఆధునిక టెక్నాలజీతో ఆధునీకరించిన పోలీసు వ్యవస్థతో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో రాజ్యాధికారం బలపడింది. నిలదొక్కుకున్నది. ఈ క్రమంలో కొంత మంది హత్యలకు గురయ్యారు.
ఈ క్రమంలో విప్లవోద్యమానికి దూరమైన గద్దర్ మాట, పాట నీళ్లలో నుండి బయటపడిన చేపలాగ ఒంటరిదయ్యింది. దానికి తోడు వెన్నులో బుల్లెట్టు నొప్పి, చర్చల కాలంలో ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో కొన్ని ఎత్తేసినా, కొన్ని కొట్టుడుపోయినా కొన్ని మిగిలే ఉన్నాయి. దీంతో బూర్జువా పార్టీలు ఎక్కే గడపా దిగే గడపా అన్నట్లు అత్యంత విషాదకరమైన ఒంటరి ప్రయాణం చేశాడు. ఇందులో ఆయనను పాటనే ఓదార్చింది.
బూర్జువా పార్టీలకు - వారి మరుగుజ్జు వ్యక్తిత్వాలకు - ఒదగని రూపం, స్వరం గద్దర్, నిర్బంధంలో ఆదిలాబాద్ జిల్లాలో గ్రామం ఖాళీ చేసి వెళ్లిపోతే ఒంటరిగా గ్రామంలో మిగిలిన ఒకే ఒక్క ఆదివాసీలాగ గద్దర్ విషాదంగా, నిశ్చలితుడిగా, వృద్ధాప్యంలో మిగిలిపోయాడు.
గతంలో ఇలాంటి స్థితిలో ఉన్న వందలాది మందిని విప్లవోద్యమం తిరిగి అక్కున చేర్చుకున్నది. మారిన భౌతిక పరిస్థితుల్లో మూడోతరం నాయకత్వానికి అలాంటి అవగాహన ఉన్నా కూడా మిగతావారి విషయంలో జరిగినట్లుగా గద్దర్ విషయంలో జరుగలేదు. అందుకు గద్దర్ కూడా చొరవచూపకపోగా తను ఎంచుకున్న మార్గంలో ఆయన మరింత ముందుకు పోవడంతో విప్లవోద్యమానికి ఆ అవకాశమే లేకుండాపోయింది. విప్లవోద్యమంతో తన గత సంభాషణ లేఖలను, ప్రభుత్వం తుపాకి తూటాను వెన్నులో ఉంచుకొని మృతి చెందినట్లుగా మీడియాలో
అతని సన్నిహిత మిత్రులు వెల్లడించారు.
-9-
గద్దర్ విప్లవోద్యమ పార్టీకి రాజీనామా చేసిన తరువాత ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉండింది. వైయక్తిక ఆలోచనల నుండి తన గత జీవితంలోని క్షేత్రస్థాయి అనుభవాలను, ప్రజల్లో తన స్థానాన్ని సంయమనంతో బేరీజు వేసుకోవాల్సింది. సమాజంలో కలగల్సిపోయి ప్రజల దుఃఖాన్ని తనలోకి ఒంపుకున్న నొప్పిని అనుభవించిన వ్యక్తికి ఇదంతా పశ్చాత్తాప పడదగినదో, ప్రదర్శించగదినదో కాదు, ఇక్కడి దాకా రాకుండానే చూసుకోవాల్సింది. విప్లవోద్యమానికి బయట ఆ నొప్పిని గ్రహించగల్గిన వెరెవ్వరూ లేరు. వారు విప్లవోద్యమం కన్నా దగ్గరి వారు కాదు. దృఢంగా ప్రజల పక్షాన నిలబడి, యుద్ధ రణనినాదంగా భూమి ఆకాశం దద్దరిల్లే విధంగా ఘర్జించిన వ్యక్తి... మతి చెడిన టివిల ముందు అట్లా బేలగా కూర్చొని చెప్పే మాటలన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని అర్ధం చేసుకోలేనంత అమాయకుడు కాదు గద్దర్. అలాంటి సందర్భంలో పాత కొత్తలు కలిపి చెప్పడం సాధ్యం కాదు. లక్షలాది ప్రజల ముందు వారి ప్రజల గుండె చప్పుడైన ఆ పాటలు ఇలాంటి సన్నివేశాలకు నప్పేవికాదు. లక్షలాది ప్రజల ముందు దుంకిన గద్దర్ అట్లా కూర్చోవడమే ఒక విషాదం.
బూర్జువా పార్లమెంటరీ ఓటు రాజకీయాలు ఎంత హింసాత్మకమో, ఎంత డబ్బుతో కూడుకున్నవో గద్దర్ కు తెలియనిది కాదు. కానీ ఆ వైపు వెళ్లిపోయారు. ఏ ఉద్దేశంతో తిరిగినా వ్యక్తిగతంగా గద్దర్ తన్నుతాను గాయపర్చుకొని దిగజార్జుకునే వ్యవహారమే ఇదంతా, లొంగిపోకుంటే వాళ్లు గద్దర్ కు సీటు ఎలా యిస్తారు? తమకన్న కడుపుకోతను పాడిన గద్దర్ దగుల్బాజీ రాజకీయాల ఓట్లు అడిగితే ప్రజలు ఎట్లా వేస్తారు?
ʹపాత సమాజవు కుళ్లును మరెవ్వరు చిత్రించనంత కళాత్మకంగా చిత్రించిన టాల్ స్టాయ్ - ఆ సమాజపు గర్భంలో నుండి తెలెత్తుతున్న కొత్త సామాజిక శక్తులను గుర్తించలేక దుఃఖితుడై చివరకు మతిచెడి మతం దగ్గరికి పరుగెత్తాడు ʹ అన్నాడు. లెనిన్ తన నివాళి వ్యాసంలో (ఇవే పదాలు కాదు - అర్థం అదే ) గద్దర్ దాదాపు నలభై సంవత్సరాల విప్లవోద్యమంలో సాంస్కృతిక సేవానిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి దిక్కు మాలిన బ్రాహ్మణ పూజారులకు మోకరిల్లరం, ప్రజలను మాయచేసే దేవాలయాలు చుట్టూ తిరగడం విప్లవోద్యమ ప్రజలను ఎంత క్షోభకు గురిచేయగలదో ఆయన ఆలోచించలేదు. అది ప్రజలను తీవ్రంగా కలత పెట్టింది.
రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షుడిగా అంబేద్కర్ నవంబర్ 1949 రాజ్యాంగం అమల్లోకి రాబోయే ముందు యిచ్చిన ఉపన్యాసం చరిత్రాత్మకమైంది. ముగ్గురు సభ్యులు మాత్రమే దాన్ల కమ్యూనిస్టులు - భూములు, ఫ్యాక్టరీలు సమస్త ప్రైవేటు ఆస్తిని - జాతీయం చేయాలనే డిమాండ్ ను రాజ్యాంగ పరిషత్తు ముందుంచి ప్రస్తావించారు. రకరకాల కూటముల సంఘర్షణాత్మకమైన ఉద్రిక్త సమయంలో రాజ్యాంగం ఒక అనివార్యమైన తాత్కాలిక
ఒప్పందంగా పేర్కొన్నారు. ఈ రాజ్యాంగం రాజకీయ సమానత్వాన్ని ఇస్తున్నదని, సామాజిక సమానత్వాన్ని సాధించాలని అన్నారు. అది ʹసాధ్యం కాకపోతే తిరిగి పోరాడవల్సింది ప్రజలేనని చెప్పారు. స్వంతాస్తిని రద్దు చేయని రాజ్యాంగం ప్రజలకు హక్కులను ప్రసాదించగలదనుకోవడం గతితార్కిక చారిత్రిక అవగాహన కానే కాదు .
ఇవ్వాళ్ల రాజ్యాంగానికి ఏపాటి విలువ ఉన్నదో స్పష్టమవుతున్నది. జడ్జీలను హతమార్చిన వారు బూర్జువా ప్రజాస్వామ్యం పేరుతో అత్యున్నత పదవులకు చేరి ఏంచేస్తున్నారో ప్రతి సగటు పౌరుడికి తెలిసిందే.
ఇప్పుడు బూర్జువా పార్లమెంటరీ రాజ్యాంగ యంత్రాంగం తన నియంతృత్వానికి అంబేడ్కర్, రాజ్యాంగం అనే మేకతోలు కప్పుతున్నది. దీన్ని గుర్తించకపోవడం, ఇంకా రాజ్యాంగం మీద నమ్మకం పెట్టుకోవడం సాంస్కృతిక సేనానిగా గద్దర్ కు తగని పని. విచిత్రంగా రివిజనిస్టులు, యధాతథవాదులు, మతిచెడిన సాంప్రదాయిక మేధావులు విప్లవోద్యమం పురోగమిస్తున్న సమయంలో రాజ్యాంగమే సకల రోగాల పరిహారమని ఒక గందరగోళం సృష్టిస్తున్నారు. గద్దర్ దానికి గురయ్యాడు.
రాజ్యంగ బద్ధంగా రైతులకు భూములు పంచుతామని వాగ్దానం చేసి విఫలమైన అప్పటి మార్క్సిస్టు పార్టీ ప్రముఖ రైతాంగ నాయకుడు, రెవెన్యూ మంత్రి హరేకృష్ణ కోనార్ తప్పుడు భూపథకం వాగ్దానం వల్లనే కదా 1967లో నక్సల్బరీ రైతాంగ సాయుధ పోరాటం ఆరంభమయ్యింది. జోతేదార్లు అక్రమంగా కాజేసిన తమ భూములు రైతాంగం ఆక్రమించుకోగానే అదే ప్రభుత్వం సాయుధ పోలీసులను దించి అణచివేసింది. తెలంగాణ సాయుధ పోరాటం వినోభాబావే భూదానోద్యమం, పి.వి. నర్సింహారావు 1972 గరిష్ట భూపరిమితి చట్టం నుండి ఎన్నెన్నో జరిగాయి. చివరికి సంవత్సరం పాటు ఢిల్లీలో రైతాంగం మహత్తర పోరాటం చేశారు. ఇవన్నీ రాజ్యాంగం ఏమిటో స్పష్టం చేశాయి. కానీ గద్దర్ రాజ్యాంగం పట్టుకొని తిరిగాడు. దానితో ఏం సాధించాడు?
ఈ పదేండ్లు పిచ్చి మూకలు, విషపు నాగులు గద్దర్ ను చుట్టుముట్టిన కాలం. ఆయనను మరింత హింసకు గురిచేసిన కాలం. గద్దర్ ప్రజలకు ఒక పాఠం. ఒక గుణపాఠం. దీని వల్లే గద్దర్ మరణం తరువాత కూడా విప్లవ వ్యతిరేక శక్తులు ఆయనను హైజాకు చేయడానికి అవకాశమేర్పడింది కదా.
అయినా గొప్ప మనసుతో, క్షమా గుణంతో గ్రామాలల్లో రైతాంగ శ్రామిక మహిళలు నాట్లేసే సమయాన ఆయన గురించి పాటలు పాడుకున్నారు.
వెన్నలాంటి మనసురో ఓ గద్దరన్న
తల్లిలాంటి మనుసురో ఓ గద్దరన్న..... అంటూ తమ నివాళిని తెలిపారు. అదే తల్లి లాంటి పార్టీకి జీవధాత, విప్లవోద్యమ అమరుడు ఆనంద్ చివరి మాట ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ʹసోషలిజం రాకున్నా ఎంచుకున్న మార్గంలో చాలా ముందుకు నడిచాం, విప్లవ
పునాదులు బలంగా పడ్డాయి. పాలకులు ఎన్నిపాట్లు పడినా ప్రజలను మభ్యపెట్టలేరు. పార్టీ మంత్రసాని పని మాత్రమే చేయగలుగుతుంది. ప్రజలే పూనుకొని విప్లవాన్ని విజయవంతం చేస్తారుʹ అన్నాడు
యాభై సంవత్సరాల విప్లవోద్యమంలో తర్ఫీదైన ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఏది ఏమైనా గద్దర్ మనకాలపు నొప్పిని గానంచేసిన సాంస్కృతిక సేనాని, గద్దర్ తన మరణం మీద రాసుకున్నపాటను ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి.
మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో
ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో
ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో
చిరిగిన ఆ ధోతి రుమాలును ఎవరు చుట్టుకుందురో
అలిగిన ఆ గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో
ఆ చిన్నబోయిన చేతికర్రతో సాము ఎవరు చేసేదరో
ఆ పగిలిపోయిన డప్పుపై దరువులెవరు వేసెదరో
ఆ చినిగిపోయిన డోలకు ఆత్మను ఎదకు ఎవరు హత్తుకునెదరో
ఆ తెగిపోయిన వీణ తీగలను నరాలెవరు అల్లెదరో
అమరుల స్వప్నాల గీతములు ఆలపించేదెవ్వరో
కన్నతల్లి గర్భ శోఖమును ఏ శిశువు తీర్చునో
చిత్తు బొత్తు పాటలను ఏర్చి పేర్చేదెవ్వరో
మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరో
చేతులెత్తి శరణుగోరితే - చేరదీసెదెవ్వరో
కాటికి కాలుసాపుతె పాడె మోసేదెవ్వరో
ఆ తుపాకులకు ఎదురునడిసినా తూటనెవరు దాసెదరో
నాతూట నెవరు దాసెదరో- నాతూట నెవరు దాసెదరో -
గద్దరన్నతో పాటు అనేక ఒత్తిడులు అనుభవించిన గద్దరన్న సహచరి విమలక్క, కుమారుడు సూర్యుడు, కూతురు వెన్నెలకు ప్రగాఢ సంతానం. గద్దరన్నకు కన్నీటి జోహార్లు.
ప్రజలందరిలాగే గద్దర్ మంది పాటలో తడిసిన వాడిగా, అత్యంత నొప్పితో అంతిమ యాత్రలో పాల్గొన్న సియాసత్ ఎడిటర్ నాయకుడు అలీఖాన్ గారు గద్దర్ అంత్యక్రియలు జరగకముందే గుండెపోటుతో అమరుడయ్యాడు. అంతిమయాత్రను పద్ధతిగా నిర్వహించడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యంవల్లే ఆయన ఆకస్మికంగా చనిపోయారు. ఆయనకు కన్నీటి జోహార్లు.
(అరుణతార, సెప్టెంబర్ 2023 సంచికలో ప్రచురితమైనది)

Keywords : gaddar, allam rajayya, cpi maoist, jananatyamandali
(2024-04-21 23:26:00)No. of visitors : 658

Suggested Posts


వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)

సుదీర్ఘకాల సహచరుడు, ఆత్మీయుడు, మా వసుధైక కుటుంబ సభ్యుడు కామ్రేడ్ గద్దరన్న ఆగస్టు 6, 2023 అమరుడయ్యాడు .

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


వర్గపోరాట