అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)


అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

అక్రమ

(ఎన్. వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసం జూన్ 21, 2915 న సారంగ సాహిత్య వార పత్రికలో ప్రచురించబడినది)


చాల ఇష్టమైనవాళ్లు, కౌగిలిలోకి తీసుకొని ఆ స్పర్శను అనుభవించాలని అనిపించేవాళ్లు మూడడుగుల దూరంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరి మధ్య మాత్రమే అయిన సన్నిహిత, సున్నిత, ఆంతరంగిక సంభాషణ సాగించాలని అనిపించేవాళ్లు ఒక గజం అవతల నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? కాని మీకూ వాళ్లకూ మధ్య అడ్డుగోడ. వాళ్లు కనబడుతూనే వినబడుతూనే ఉంటారు. మీరు చెయ్యి చాపలేరు. అవతలివాళ్లు చెయ్యి అందించలేరు. వాళ్లను మీరు దగ్గరికి తీసుకోలేరు. మీ కంటి తడిని వాళ్ల మునివేలుతో తుడవలేరు. మీకూ వాళ్లకూ మధ్య రెండు ఇనుప జాలీల తెర, ఆ రెండు జాలీల మధ్య ఇటు మూడు అంగుళాలు అటు మూడు అంగుళాలు వదిలి ఇనుప ఊచలు. అప్పుడు మీ హృదయం ఎట్లా రవరవలాడుతుంది? దేహం ఎట్లా స్పర్శ కోసం తపిస్తుంది? అరచెయ్యి అవతలి అరచేతి వేడిని అనుభవించాలని ఎంత కొట్టుకులాడుతుంది? గుండెలోని మాటను చెప్పనూలేక, చెప్పకుండానూ ఉండలేక గొంతు తానే గుండెను ఎలా పొదివి పట్టుకుంటుంది? మనశ్శరీరాలు వాగర్థాల లాగ కలిసిపోయి ఏ అనంతవేదనను అనుభవిస్తాయి? సామీప్యమే సుదూరమైన ఆ కఠినమైన, భయానకమైన, దుఃఖభాజనమైన ఎరుక ఎలా ఉంటుంది?

పది సంవత్సరాల కింద అటువంటి అనుభవం ఎన్నోసార్లు కలిగింది.

నిజామాబాదులో రఘునాథాలయం అనే బోర్డు ఉన్న ఎత్తైన పెద్ద కోట సింహద్వారంలోంచి లోపలికి వెళ్లి, ఒక మలుపు తిరిగితే గుట్ట మీదికి ఓ వంద మెట్లుంటాయి. ఆ మెట్లన్నీ ఎక్కితే ఒక పక్కన పాత కాలపు గడీ బంకుల లాంటి వరండా, మరొక పక్కన కొండ అంచు పిట్టగోడ. ఆ వరండాను కూడ గదిగా మార్చి అక్కడ కాపలా జవాన్లు ఉంటారు గనుక అక్కడ కూచోవడానికీ నిలబడడానికీ వీల్లేదు. ఆ వరండాకూ ఇటు లోయ పిట్టగోడకూ మధ్య సరిగ్గా ముగ్గురు మనుషులు నిలబడగలిగినంత స్థలంలో అన్నిటికన్న పై మెట్టు. దాని అవతల ʹప్రధాన జైలుʹ అని రాసి ఉన్న దిట్టమైన తలుపు. ఆ తలుపు పైభాగంలో ఇనుప జాలీ, దాని వెనుక ఇనుప ఊచలు. ఆ వెనుక మరొక ఇనుప జాలీ. ఆ తర్వాత కటకటాల తలుపు. అక్కడినుంచి ఆరడుగుల నడవా. దానికి ఒకపక్కన జైలు అధికారుల గదులు. ఆ నడవా చివర కిందికి దిగడానికి నాలుగైదు మెట్లు. మెట్ల చివర మళ్లీ ఒక చిన్న చెక్క గేటు. అది దాటి లోపలికి వెళ్లి రెండు మలుపులు తిరిగి ఇరవై ముప్పై గజాలు నడిస్తే మళ్లీ గేటు. అది దాటితే నాలుగు వైపులా ఖైదీల బారక్ లు, మధ్యలో కాపలా జవాన్ల గది, దాని పక్కన నీళ్ల ట్యాంక్. అక్కడున్న బారక్ లలో ఒకదాంట్లో దాదాపు ఇరవై రోజులు నిర్బంధంలో గడిపి పది సంవత్సరాలు గడిచింది.

మహారాష్ట్ర ఔరంగాబాదులో జరిగిన అరెస్టు, మానసిక హింసతో, ప్రశ్నల వేధింపులతో మూడు రోజుల పాటు అక్రమ నిర్బంధం, అబద్ధపు ఆరోపణలతో నిజామాబాదులో కేసు, ఇరవై రోజుల పాటు నిజామాబాదు జైలు జీవితం, ఐదు సంవత్సరాల పాటు సాగిన విచారణ, ఆ విచారణలో పోలీసుల అబద్ధాలు ఒకటొకటిగా తుత్తునియలు కావడం, చివరికి కేసు కొట్టివేత, నిర్దోషిగా విడుదల ఎన్నో స్థాయిలలో నామీద ప్రభావం వేశాయి. అంతకు ముందు రెండు మూడు సార్లు పోలీసు నిర్బంధంలోకీ, జైలులోకీ కూడ వెళ్లాను. అంతకు ముప్పై సంవత్సరాల ముందు నుంచీ కుటుంబ సభ్యుల, మిత్రుల అరెస్టుల సందర్భంగా వారిని కలవడానికి జైలుకు వెళ్తూ ఉన్నాను. కాని ఈసారి అనుభవం పూర్తిగా కొత్తది. మన ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థల పనితీరు గురించి ఆ నిర్బంధం నాకు అనుభవైకవేద్యమైన పాఠాలు నేర్పింది. స్టేట్ వర్సస్ గంటి ప్రసాదం అండ్ అదర్స్ అనే ఆ కేసులో నా సహనిందితుడు, గురువు, మిత్రుడు గంటి ప్రసాదం హత్యకు గురయి రెండు సంవత్సరాలయింది. ఆ కేసు నాటికి విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా ఉండిన నేను ఇవాళ ఆ స్థానంలో లేను గాని, ఏ విశ్వాసాలతో ఆ నిర్బంధాన్ని అనుభవించానో ఆ విశ్వాసాలు ఇవాళ మరింత దృఢంగా ఉన్నాయి. పది సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, ఆ భయోద్విగ్న అనుభవాలను, అవి ఇచ్చిన అవగాహనలను పంచుకోవాలనిపిస్తున్నది.

ʹఆ అరెస్టు, కేసు, నిర్బంధం వ్యక్తిగతంగా నాకు సంబంధించినవి మాత్రమే కావు. అవి బహిరంగ ప్రజాజీవిత వ్యవహారాలు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పోలీసు వ్యవస్థ, పాలనా విధానాలు ఏ రకంగా ఉన్నాయో నగ్నంగా, బహిరంగంగా చూపిన వ్యవహారాలు. అందువల్ల ఆ అంశాలను తెలుసుకునే హక్కు, తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మన పన్నులలోంచి జీతాలు తీసుకుంటున్న పోలీసు వ్యవస్థ మనకోసం ఏం చేస్తున్నాయో, మనలో కొందరిని నిర్బంధించడానికి ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతున్నాయో, ఎన్నెన్ని కుయుక్తులు పన్నుతున్నాయో మనం సంపూర్ణంగా తెలుసుకోవలసి ఉందిʹ అని నా అరెస్టు సమయానికి ప్రజాతంత్ర వారపత్రికలో నేను రాస్తుండిన ʹఆఖరిపేజీʹ కాలంలో విడుదలై రాగానే రాశాను. (ప్రజాతంత్ర 2005 జూన్ 19-25)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ మధ్య 2004 అక్టోబర్ లో హైదరాబాదులో తొలివిడత చర్చలు జరిగాయి. రెండు పార్టీలకు చెందిన నక్సలైట్ల ప్రతినిధులతో ఆ చర్చలు జరిగాయి. ఒకటి అంతకు ముందు వరకూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) (పీపుల్స్ వార్) గా ఉండి, సరిగ్గా చర్చల సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) గా మారినది. మరొకటి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) (జనశక్తి). రెండో విడత చర్చలకు నవంబర్ లో ఆహ్వానిస్తామనే ప్రభుత్వ హామీతో, రెండువైపులా కాల్పుల విరమణ ఒప్పందంతో నక్సలైట్లు వెనక్కి వెళ్లారు. కాని ఆ రెండో విడత చర్చలు జరగనే లేదు. మళ్లీ ఆహ్వానిస్తామన్న ప్రభుత్వం ఆ ప్రస్తావనే మానేసి మళ్లీ నిర్బంధం ప్రారంభించి, జనవరి 2005 తర్వాత ఎన్ కౌంటర్లు, దాడులు, కూంబింగులు, అరెస్టులు మొదలుపెట్టింది.

ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది గనుక తామూ కట్టుబడి ఉండబోవడం లేదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. నక్సలైట్ల వైపునుంచి ప్రతిదాడులు, ఇన్ఫార్మర్ల హత్యలు, పోలీసుస్టేషన్లపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయం ఎలాఉన్నదో తెలుసుకోవాలని మావోయిస్టుపార్టీ రాష్ట్ర నాయకత్వం అనుకుంటున్నదనీ, విస్తృత ప్రజా సంబంధాలతో ప్రజాభిప్రాయం ఏమిటో చెప్పగల ప్రముఖులనూ, రచయితలనూ, పాత్రికేయులనూ కలవదలచుకున్నామనీ. అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్రకమిటీ మీడియా ప్రతినిధిగా ఉన్న బలరాం (గంటి ప్రసాదం) కబురు పంపారు. ఈ విషయం మాట్లాడడానికి నేను తనను కలవడం వీలవుతుందా అని అడిగారు. ప్రభుత్వ నిర్బంధం పెరిగిన స్థితిలో తన భద్రత దృష్ట్యా ఈ కలయిక రాష్ట్రం బైట జరిగితే మంచిదని, అందువల్ల రెండు రోజుల కోసం ఔరంగాబాదు రమ్మని అడిగారు. నాతోపాటు విరసం ఉపాధ్యక్షులు, అరుణతార మాజీ సంపాదకులు, కావలి జవహర్ భారతిలో తెలుగు అధ్యాపకులు వి. చెంచయ్య, అరుణతార సంపాదకులు పినాకపాణి, అరుణతార మేనేజర్ రవికుమార్ కూడ వస్తారని రాశారు.

నేను అప్పటికి ఇరవై సంవత్సరాలుగా పాత్రికేయుడిగా ఎట్లా ఉన్నానో, అట్లాగే విరసం సభ్యుడిగా కూడ ఉన్నాను. పాత్రికేయుడిగానూ, విరసం సభ్యుడిగానూ ఆయనను కలవడానికి నాకేమీ అభ్యంతరం కనిపించలేదు. నా వ్యక్తిత్వంలోని ఈ రెండు పార్శ్వాలమధ్య పెద్ద విభజన రేఖ ఉన్నదని నేనెప్పుడూ అనుకోలేదు. అట్లని పాత్రికేయ వృత్తి విధి నిర్వహణలోకి రాజకీయ విశ్వాసాలను తీసుకురాలేదు. మాట్లాడతానంటున్నది ఒక రాజకీయపార్టీ మీడియా ప్రతినిధి. మాట్లాడదలచుకున్నది పాత్రికేయుడిగా, విరసం సభ్యుడిగా ఉన్న నాతో. అటువంటప్పుడు అభ్యంతరం ఎందుకుండాలి? అంతకు ఆరు నెలల ముందే ఆ పార్టీ రాష్ట్రకమిటీ కార్యదర్శితో, ఇతర నాయకులతో స్వయంగా రాష్ట్ర హోంమంత్రి, మరి ముగ్గురు మంత్రులు వారంరోజులపాటు ప్రభుత్వ భవనంలోనే మాట్లాడారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాదులో ప్రభుత్వ మంజీర అతిథి గృహంలో ఉన్నప్పుడు వేలాది మంది కలిసి మాట్లాడారు. మరి నాకెందుకు అభ్యంతరం ఉండాలి?

నిజానికి ఆ పార్టీ మీద నిషేధం ఉన్న రోజుల్లోనే ఆ పార్టీ అగ్రనాయకులెందరినో డజన్లకొద్దీ పాత్రికేయులు రహస్యంగా కలిసి పత్రికలలో, ప్రచార సాధనాలలో ఎన్నో వార్తాకథనాలు, ఇంటర్వ్యూలు ప్రచురించారు. ఆ పార్టీ మీద నిషేధం ఉన్న రోజులలోనే ఎస్ ఆర్ శంకరన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొ. హరగోపాల్ తదితరులు ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసి, మాట్లాడి, తిరిగి వచ్చి తాము మాట్లాడిన విషయాలు అప్పటి ముఖ్యమంత్రికి తెలియజేశారు. నిషేధం ఉన్నరోజులలోనే తమ సంభాషణలను పుస్తకరూపంలో వెలువరించారు. మరి ఆ పార్టీ మీద నిషేధం కూడ లేనప్పుడు, నాయకులలో ఒకరిని కలవడానికి నాకెందుకు అభ్యంతరం ఉండాలి? ఇరవై సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో, పది సంవత్సరాలకు పైబడిన విలేకరి వృత్తిలో, ఇరవై రెండు సంవత్సరాలుగా విరసం సభ్యుడిగా కొన్ని వేల మందిని కలిసి, చర్చించి, పత్రికలలో రాసిఉన్న నేను ఇవాళ ఈయనను కలవడానికి ఎందుకు సంకోచించాలి?

అందుకే 2005 మే 28 సాయంత్రం కాచిగూడ – మన్మాడ్ ఎక్స్ ప్రెస్ లో ఔరంగాబాదు బయల్దేరాను. మర్నాడు ఉదయమే మహారాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ గెస్ట్ హౌజ్ లో నా పేరు మీదనే గది తీసుకున్నాను. కాసేపటికి ప్రసాదం, ఇతర మిత్రులు వచ్చారు. ఆ గదిలోనే ఆ రోజంతా, ఆ మర్నాడూ కూచుని మాట్లాడుకున్నాం. మే 30 సాయంత్రం ఏడు – ఏడున్నర మధ్య తలుపు తోసుకుని దాదాపు ఇరవై మంది ఆయుధధారులైన మఫ్టీ పోలీసులు వచ్చేదాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం.

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు. ఒకరోజంతా అక్కడ ఉంచి ప్రశ్నలతో వేధించారు. చంపుతామని బెదిరించారు. మర్నాడు రాత్రి వాహనాలు ఎక్కించి, ఏడెనిమిది గంటలు ప్రయాణం చేయించారు. మరొక చోట మళ్లీ రెండు రోజులు అట్లాగే కళ్లకు గంతలతో, చేతులు వెనక్కి విరిచికట్టి ఒక గదిలో నిర్బంధించారు. అప్పటిదాకా మాపక్కన ఉన్నవాళ్లు మమ్మల్ని పట్టుకున్న మూడో రోజు మధ్యాహ్నం, ʹఇక మామూలు పోలీసులు వచ్చి మీ బాధ్యత తీసుకుంటారుʹ అని చెప్పి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లాక అరగంటకు వచ్చిన పోలీసులు మమ్మల్ని అలాగే కళ్లకు గంతలతో, విరిచికట్టిన చేతులతో ఒక వ్యాన్ ఎక్కించి అరగంట ప్రయాణం చేయించారు. అక్కడ మా కట్లు విప్పదీస్తే అది నిజామాబాదు డిఐజి కార్యాలయం అని మాకు తెలిసింది.

అక్కడ పత్రికా సమావేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టినదాకా, అంటే మే 30 సాయంత్రం ఏడు నుంచి జూన్ 2 సాయంత్రం నాలుగు దాకా, దాదాపు 70 గంటలు మేం కళ్లకు గంతలతో, కట్టేసిన చేతులతో, ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి వీలులేకుండా, మధ్యలో ప్రశ్నల వేధింపులతో, చంపుతామనే బెదిరింపులతో నిర్బంధంలో, మా అదృశ్యం గురించి మా కుటుంబాలు ఎలా ఆందోళన పడుతున్నాయో వేదనతో ఉన్నాం. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల కంటె ఎక్కువసేపు కోర్టులో హాజరుపరచకుండా ఉంచుకోగూడదని, హింసించగూడదని, నిందితుల పట్లనైనా వ్యక్తిగత గౌరవాన్ని చూపాలని, చట్టబద్ధమైన విచారణలో నిస్సందేహంగా రుజువయ్యేవరకూ నిందితులను కూడ నిర్దోషులుగానే పరిగణించాలని చెప్పే చట్టాలు, ప్రజాజీవనంలో ప్రముఖులుగా, రచయితలుగా ఉన్న మాపట్లనే ఇంతగా ఉల్లంఘనకు గురైతే ఇక దేశంలో అనామకులకు, పేదలకు న్యాయం అందుతుందంటే ఎవరు నమ్ముతారు? చట్టం గురించి చదువుకుని, రాసే, మాట్లాడే, వ్యక్తీకరించుకోగలిగిన మమ్మల్నే పోలీసు వ్యవస్థ ఇలా వేధించగలిగితే, ఇక ఈ దేశంలోని కోట్లాది మంది నిరుపేద, నిరక్షరాస్య, అమాయక ప్రజానీకం మీద ఎంతటి దుర్మార్గం, దాష్టీకం అమలు కావడానికి అవకాశం ఉంది!

ఔరంగాబాదుకు మా ప్రయాణాలు, ఔరంగాబాదులో మా బస అన్నీ సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో ఉన్నాయి గనుక పోలీసులకు వాటిని తారుమారు చేయడం సాధ్యం కాలేదు. అందువల్ల మేం ఔరంగాబాదులో సమావేశమయ్యామనే నిజం చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మహారాష్ట్రలోని పట్టణానికి వెళ్లి అక్కడినుంచి ఐదుగురు వ్యక్తుల్ని ఎత్తుకురావడానికి చట్టబద్ధంగా వీల్లేదు గనుక నిజామాబాదులో అరెస్టు చేశామని అబద్ధం చెప్పారు. మేం ఔరంగాబాదు సమావేశం నుంచి నల్లమలకు తిరిగివెళ్తూ, నిజామాబాదు పరిసరాల్లో దిగి తచ్చాడుతుండగా జూన్ 2 మధ్యాహ్నం పోలీసుల చేతికి చిక్కామని కట్టుకథ అల్లారు. పోలీసు రచయితల భౌగోళిక పరిజ్ఞానం అంత ఘనంగా ఉంది! ఎవరైనా ఔరంగాబాదునుంచి నల్లమలకు వెళ్లదలచుకుంటే ఏమార్గంలో వెళతారో పటం చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. అందుకు నిజామాబాదు వెళ్లనక్కరలేదు. అంతేకాదు, నా హైదరాబాద్ తిరుగుప్రయాణపు టికెట్ మన్మాడ్ – కాచిగూడ ఎక్స్ ప్రెస్ లో మే 31 సాయంత్రానికి బుక్ అయి ఉంది. చెంచయ్య, పినాకపాణి, రవికుమార్ లకు తిరుగు ప్రయాణపు టికెట్లు హమ్ సఫర్ ట్రావెల్స్ బస్సులో మే 31 సాయంత్రానికి హైదరాబాదుకు బుక్ అయిఉన్నాయి. పోలీసులు మా జేబుల్లోంచి లాగేసుకున్న ఆ టికెట్లను చించివేసి ఉండవచ్చు గాని బుక్ చేసుకున్న ఆసాములు రాలేదని రైల్వేవారి దగ్గర, బస్సు కంపెనీ దగ్గర సాక్ష్యాధారాలు ఉండే ఉంటాయి.

ఏదయినా నేరం జరిగినప్పుడు, లేదా నేరం జరగబోతున్నదని తెలిసినప్పుడు ఆ నేరస్తులను, అనుమానితులను నిర్బంధంలోకి తీసుకుని, దర్యాప్తు జరిపి, న్యాయవిచారణ కోసం న్యాయస్థానం ముందుపెట్టి, తమ ఆధారాలు చూపి, శిక్ష విధించడం ఎందుకు అవసరమో వాదనలు వినిపించవలసిన బాధ్యత పోలీసు శాఖది. అందులోనూ శాంతిభద్రతల విభాగానిది. కాని మహత్తర ప్రజాపోరాటాల చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ సంప్రదాయం ఎప్పుడో కనుమరుగయి పోయింది. ప్రజలను నిష్కారణంగా అనుమానించడం, ప్రజాపోరాటాలను అణచివేయడం, పోరాట నాయకులను దొంగచాటుగా పట్టుకుని చంపడం, ప్రజల పక్షం తీసుకునే బుద్ధిజీవులను నిరంతర నిఘాతో వేధించడం, అందుకోసం తోచిన అబద్ధమల్లా చెప్పడం మాత్రమే పోలీసుశాఖకు తెలిసిన పనులయిపోయాయి.

ఈ క్రమంలో పోలీసులు మామూలు నేరాలను అరికట్టడం, ఆ నేరస్తులను పట్టుకోవడం, సరయిన దర్యాప్తు జరపడం, పటిష్టంగా నేరారోపణచేసి న్యాయవిచారణకు సహకరించడం వంటి అసలు పనులు మరచిపోయారు. ప్రజలను అణచివేయడం అనే ఒక్క పని చేస్తే చాలునని, అది చేస్తే లెక్క చూపనక్కరలేని నిధులూ, పదోన్నతులూ, ఇతర సౌకర్యాలూ కల్పిస్తామని పాలకులు పోలీసులకు నేర్పిపెట్టారు. ఎంతమందిని చంపితే అంత తొందరగా పదోన్నతులు కల్పించే దుర్మార్గమైన హంతక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షరాలా ప్రకటించి అమలు చేసింది. ఈ ప్రభుత్వ ప్రోత్సాహంవల్ల పోలీసులు ప్రజాపోరాటాలను అణచగలిగారో లేదో తెలియదు గాని, వాళ్లకు వృత్తిధర్మంగా ఉండవలసిన తెలివీ, నైపుణ్యమూ కూడ కోల్పోయారు. ఎవరి పని ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియని అరాచకం రాజ్యం ఏలడం మొదలయింది.

ఆ అరాచకంలో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ పోలీసుశాఖలోకెల్లా క్రూరమైన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ ఐ బి) అనే వ్యవస్థ తయారయింది. ఈ ఎస్ ఐ బి ఎవరికి జవాబుదారీయో ఎవరికీ తెలియదు. విప్లవకారులను దొంగతనంగా పట్టుకుని కాల్చిచంపడమే వాళ్ల పని. అందుకొరకు దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలో వాళ్ల స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏళ్ల తరబడి ఆ నగరాలలో తమకు కావలసిన వాళ్లకోసం వేటాడుతూ ఉండడం మినహా వాళ్లకు మరొక పని లేదు. ఔరంగాబాద్ లో మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ లో కూచుని మాట్లాడుకుంటున్న మామీద దాడి చేసినదీ, అక్కడ తాము నిర్వహిస్తున్న రహస్య స్థావరంలో ఒకరోజంతా పెట్టుకున్నదీ వాళ్లే. రెండున్నర రోజులపాటు మాతోపాటు ఉన్నది వాళ్లే. ఆ తర్వాత వాళ్లు మమ్మల్ని మామూలు పోలీసులకు అప్పగించి వెళ్లిపోయారు. వాళ్లను మేం చూడకుండా, గుర్తు పట్టకుండా ఉండడం కోసమే మా కళ్లకు గంతలు.

ఇక మమ్మల్ని నిజామాబాదులో అప్పుడే పట్టుకున్నట్టు శాంతిభద్రతల పోలీసులు చెప్పిన అబద్ధం మీద ఆధారపడి మా మీద కేసు నిర్మాణమయింది. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్ లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి నల్లమల వెళుతుండగా నిజామాబాదులో పట్టుకున్నామని అల్లిన కట్టుకథ మామీద నేరారోపణ. ఆ ఎఫ్ ఐ ఆర్ తో మమ్మల్ని జుడిషియల్ కస్టడీకి పంపించడానికి నిజామాబాదు మెజస్ట్రీటు ముందర హాజరు పరచవలసి ఉండింది. నిజామాబాదులో హాజరు పరుస్తామని చివరిదాకా చెపుతూ వచ్చారు. కాని అంతకు ముందురోజు సాయంత్రం నుంచే మా అరెస్టు వార్త టివిల్లో వచ్చినందువల్ల నిజామాబాదు కోర్టుకు చాలమంది రావడంతో, చివరి నిమిషంలో ఏదో సాంకేతిక కారణం చూపి బోధన్ మెజస్ట్రీట్ ముందర హాజరుపరిచారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120 (బి) (నేరస్వభావంగల కుట్ర), సెక్షన్ 121 (ఎ) (భారతప్రభుత్వంపై యుద్ధం చేయడానికి, లేదా యుద్ధాన్ని ప్రోత్సహించడానికి కుట్ర), సెక్షన్ 122 (భారత ప్రభుత్వంపై యుద్ధం చేసే ఉద్దేశ్యంతో ఆయుధాలు, తదితరాల సేకరణ) అనే అభియోగాలతో మా మీద కేసు నమోదు చేశారు. మా అక్రమ నిర్బంధం గురించీ, శారీరక, మానసిక చిత్ర హింసల గురించీ, పోలీసులు చెపుతున్న అబద్ధాల గురించీ బోధన్ మెజస్ట్రీట్ ముందు నేను పావుగంట పాటు వినిపించిన వాదన అరణ్యరోదన అయింది. చిన్నకోర్టులన్నిట్లోనూ న్యాయమూర్తులకు తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదనే గుర్తింపే ఉండదు. హాలులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పక్కన నిలబడి ఉన్న సర్కిల్ ఇనస్పెక్టర్ వైపో, డీ ఎస్పీ వైపో చూస్తూ వాళ్ల కనుసన్నలను బట్టి ప్రవర్తిస్తుంటారు.

మా అరెస్టుల గురించి మొత్తంగానూ, నా అరెస్టు గురించి ప్రత్యేకంగానూ చాల నిరసన వ్యక్తమయింది. అప్పటికి పదమూడు సంవత్సరాలుగా రోజుకు మూడు ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకోవలసిన డయాబెటిక్ గా ఉన్న నా ఆరోగ్య పరిస్థితివల్ల మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెందారు. అంతర్జాతీయ సంస్థల నుంచి స్థానిక సంస్థల దాకా మా అరెస్టులను ఖండిస్తూ, మాకు సంఘీభావం తెలుపుతూ ప్రకటనలు ఇచ్చాయి. సెక్రటేరియట్ లో జరిగిన పత్రికా సమావేశంలో నా ప్రస్తావన వస్తే స్వయంగా ముఖ్యమంత్రి ʹఆయనకు బెయిల్ పిటిషన్ దాఖలయితే ప్రభుత్వం వైపు నుంచి దాన్ని వ్యతిరేకించబోము. ఆయనను మళ్లీ పోలీసు విచారణకు పిలిపించబోముʹ అన్నారు. కాని నిజామాబాదు కోర్టులో నా బెయిల్ పిటిషన్ దాఖలు కావడానికి ముందే, విచారణకోసం తమకు అప్పగించాలని పోలీసులు కోరి ఉన్నందువల్ల నాకు బెయిల్ రాలేదు.

వెంటనే ముఖ్యమంత్రిని హైదరాబాదులోనూ, కర్నూలులోనూ పాత్రికేయ మిత్రులు ప్రశ్నించారు. ʹఏదో సమాచార లోపం వల్ల అలా జరిగిందిʹ అన్నారాయన! హైటెక్ ప్రభుత్వానికి అంత సమాచార లోపం! మళ్లీ ఐదు రోజుల తర్వాత రెండోసారి బెయిల్ దరఖాస్తు దాఖలయింది. కాని నిజామాబాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు నా బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించగూడదనే ఆదేశమేమీ లేదు. ఆయన అన్ని బెయిల్ దరఖాస్తులనూ వ్యతిరేకించినట్టే, ఈ దరఖాస్తును కూడ వ్యతిరేకించారు. అయినా మా న్యాయవాది వాదనలోని బలంవల్ల నేనూ, మిత్రులందరమూ బెయిల్ మీద విడుదలయ్యాం. అలా నిజామాబాదు జైలులో దాదాపు ఇరవై రోజులు ఉండే అవకాశం వచ్చింది.

నిజామాబాదు జైలు తెలంగాణ జనజీవితంలో, సాహిత్యంలో ముఖ్యమైనది. వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య వంటి మహామహులు నిజాం వ్యతిరేకపోరాటంలో ఆ జైలులో బందీలుగా ఉన్నారు. ʹనాతెలంగాణ కోటి రతనాల వీణʹ అని దాశరథి పద్యాలు రాసినది ఆ జైలులోనే. పోలీసులు చెరిపినకొద్దీ ఆ పద్యాలను మళ్లీ మళ్లీ గోడలమీద బొగ్గుతో ఆళ్వారుస్వామి రాసినదీ ఆ జైలు లోనే. ఆ జైలులోకి వెళ్లడం ఒక అపురూపమైన అనుభవం. అక్కడి గోడల మీద ఆరు దశాబ్దాల కింది దాశరథి, ఆళ్వారుస్వామి అక్షరాలు ఉన్నాయా అని వెర్రిగా వెతికాను. జైలు నుంచి బైటికి రాగానే ʹఖిలా జైలు – దాశరథి నుంచి ఇవాళ్టి దాకాʹ అని నేను రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధ లో అచ్చయింది.

జైలు జీవితం చిత్రమైనది. ఎవరు తయారు చేశారో, ఎందుకు తయారు చేశారో ఎవరికీ తెలియకుండానే ఖైదీలను శారీరక, మానసిక చిత్రహింసలకు గురిచేసే దారుణమైన నిబంధనలు అమలవుతుంటాయి. అన్నిటిలోకీ విచిత్రమైనది జీవితాన్ని కురచబార్చడం. ఉదయం ఆరింటికి బారక్ ల తాళాలు తెరుస్తారు. సాయంత్రం ఆరింటికి తాళాలు వేస్తారు. అంటే పన్నెండు గంటలు మాత్రమే బారక్ బైటి జీవితంతో సంబంధం ఉంటుంది. ఆ పన్నెండు గంటలలోకే మొత్తం ఇరవై నాలుగు గంటల జీవితాన్ని కుదించుకోవాలి. రోజుకు మూడు సార్లు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవలసిన రోగగ్రస్తుడిగా నాకు ఈ నిబంధన ప్రాణాంతకమయింది. ఖైదీలను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి రక్షించడానికి ఖైదీల దగ్గర అందుకు ఉపయోగపడే పరికరాలేవీ ఉండనివ్వగూడదని ఒక నిబంధన. అందువల్ల బారక్ లో నా దగ్గర ఇంజక్షన్ ఉంచుకోవడానికి వీలులేదు. అది జైలర్ గదిలో రక్షణలో ఉండేది. నా బారక్ తాళం తెరిచిన తర్వాత అరగంటకో, గంటకో ఏడు గంటల సమయంలో ఉదయపు ఫలహారం తినే ముందు జైలర్ గదికి వెళ్లి ఇంజక్షన్ తీసుకుని రావాలి. మధ్యాహ్న భోజనం పదకొండు, పన్నెండు మధ్య మళ్లీ జైలర్ దగ్గరికి వెళ్లి ఇంజక్షన్ తీసుకోవాలి. రాత్రి భోజనం బారక్ తాళాలు వేయక ముందే అంటే ఐదు, ఐదున్నర ప్రాంతాలలో పెడతారు గనుక మూడో ఇంజక్షన్ అప్పుడు తీసుకోవాలి. పోనీ ఆ అన్నం తీసుకుని పక్కన పెట్టుకుని కొన్ని గంటల తర్వాత తిందామనుకుంటే, ఆ మొద్దు బియ్యం అన్నం అరగంట ఆలస్యమైనా తినడం అసాధ్యం. అంటే కనీసం ఆరు-ఎనిమిది గంటల వ్యవధి ఉండవలసిన నా ఇన్సులిన్ ఇంజక్షన్లు నాలుగు-ఐదు గంటల వ్యవధికి మారిపోయాయి. మరొకపక్క సాయంత్రం ఇంజక్షన్ కూ ఉదయం ఇంజక్షన్ కూ మధ్య పన్నెండు గంటల వ్యవధి వచ్చింది. ఇన్సులిన్ మీద ఆధారపడే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంత ప్రమాదకరమైన పరిణామమో చెప్పనక్కరలేదు.

అలాగే జైలు జీవితం గొప్ప అనుభవం, మహత్తర పాఠశాల. జాలీ ములాఖాత్ సంభాషణలు మానవ సంబంధాల మీద ఇనుపతెరలు కప్పుతాయి. అతి చిన్న నేరాలు చేసినందువల్లనో, అసలు నేరాలే చేయకుండానో నెలల తరబడీ, సంవత్సరాల తరబడీ జైలులో గడిపే అమాయకుల విభిన్న జీవన దృశ్యాలు కంట తడి పెట్టిస్తాయి. జైలు గ్రంథాలయంలో దొరికే పుస్తకాలూ, దినపత్రికలూ తక్కువ గనుక దొరికిన ప్రతి అక్షరాన్నీ ఆబగా చదవడం అలవాటవుతుంది. సహఖైదీలతో ఎడతెరిపిలేని చర్చలు వాటికవే వివరంగా రాయవలసిన గ్రంథాలు అవుతాయి.

బెయిల్ మీద విడుదలైన తర్వాత ఐదు సంవత్సరాలపాటు ప్రతి నెలా రెండుసార్లు మేం నిజామాబాద్ కోర్టుకు హాజరు కావలసివచ్చింది. వాదనల సమయంలో పది రోజులు నిజామాబాదులోనే ఉండవలసి వచ్చింది. ఈ వాయిదాల కోసం ప్రతిసారీ కావలి, ప్రొద్దటూరు, కర్నూలు, హైదరాబాదు వంటి సుదూర ప్రాంతాలనుంచి గంటలకొద్దీ ప్రయాణాలు చేసి, కోర్టులో రోజంతా పడిగాపులు పడి, న్యాయస్థానం చుట్టూ తిరగడంలో ఐదు సంవత్సరాల విలువైన కాలం వ్యర్థమయింది. అలా మా సమయమూ, ఆర్థిక వనరులూ, ఆరోగ్యాలూ దెబ్బతిన్న తర్వాత మామీద నేరారోపణలను పోలీసు ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. అడిషనల్ సెషన్స్ జడ్జి సి వెంకటేష్ 2010 ఆగస్ట్ 2 న కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. మమ్మల్ని నిరపరాధులుగా వదిలేశారు. మరి మేం నిరపరాధులమైతే, మమ్మల్ని అపరాధులుగా నిరూపించడానికి విఫల ప్రయత్నం చేసినవాళ్ల అపరాధం మాటేమిటి?

పోలీసులు కేసు నడిపినతీరు తప్పులతడక అని వర్ణిస్తే అది చాల చిన్నమాట అవుతుంది. మా అరెస్టు చూపిన పత్రికాసమావేశంలో భయంకరమైన నేరం జరగబోతుండగా పట్టుకున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన పోలీసులు ఏ ఒక్క ఆరోపణనూ రుజువు చేయలేకపోయారు. అసలు ఎవరిమీదనైనా సెక్షన్ 120 (బి) కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయదలచుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వ అనుమతి, మెజస్ట్రీట్ అనుమతి తీసుకోవాలని చట్టం చెపుతుంది. కాని ఆ అనుమతి తీసుకోకుండానే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు, కేసు నడిపారు. పోలీసు రాజ్యం నడుస్తున్నదనడానికి, స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ చట్టవ్యతిరేక ప్రవర్తనకు అది తొలి నిదర్శనం. అసలు నేరారోపణలు అబద్ధం కనుకనే తర్వాత విచారణలో పోలీసు సాక్షులలో ఒక్కరు కూడ ఆ అబద్ధాన్ని రుజువు చేసే కథనం చెప్పలేకపోయారు. వాస్తవమయితే ఒకటే కథనం ఉంటుంది కాని అబద్ధం ఆడినప్పుడల్లా మారుతుంది. మమ్మల్ని నిజామాబాదు పొలిమేరల్లో అరెస్టుచేయడానికి ఒకే వాహనంలో వెళ్లామని చెప్పిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆ వాహనం తూర్పుకు వెళ్లిందని ఒకరు చెపితే పడమటికి వెళ్లిందని మరొకరు చెప్పారు. మమ్మల్ని నిజామాబాదులో అరెస్టు చేసేటప్పుడు చూశామని పంచనామా మీద సంతకం చేసిన ఇద్దరు సాక్షులు ఆటోడ్రైవర్లు. తమ ఆటోలను పోలీసులు జప్తు చేసుకుని పోలీసు స్టేషన్ లో పెట్టుకుంటే అడగడానికి వెళ్లినప్పుడు తెల్లకాగితాల మీద పోలీసులు తమ సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఆ కాగితాలేమిటో తమకు తెలియదనీ, మమ్మల్ని తామెప్పుడూ చూడలేదనీ, మా అరెస్టుకూ పంచనామాకూ తాము సాక్షులం కాదనీ చెప్పారు.

మరొక పోలీసు సాక్షి మమ్మల్ని అరెస్టు చేసినప్పుడు మాదగ్గర విప్లవ సాహిత్యం దొరికిందని చిలకపలుకులు అప్పగించాడు. ʹవిప్లవ సాహిత్యం అంటే ఏమిటిʹ అని మా న్యాయవాది ప్రశ్నవేశారు. ʹవిప్లవ సాహిత్యం అంటే బానిస సంకెళ్లు తెంచుకొండి అని ప్రజలకు చెప్పేదిʹ అని ఆ కానిస్టేబుల్ అమాయకంగా నిజం చెప్పాడు. ʹమరి అది మంచిపనే కదాʹ అని న్యాయమూర్తి అడగవలసి వచ్చింది. ʹమా డిపార్టుమెంటుకు మంచిది కాదుʹ అన్నాడా పోలీసు సాక్షి.

ఇక తాను చేయని అరెస్టులను చేశానని చెప్పుకోవలసి వచ్చిన దర్యాప్తు అధికారి మేం కుట్ర చేశామని చూపడానికి చాల ప్రయత్నించాడు. మాదగ్గర తాను జప్తు చేశానని ఆయన చెప్పిన ఒక్కొక్క వస్తువునూ చూపుతూ ʹదీనిలో కుట్ర ఉందాʹ, ʹదీనిలో కుట్ర ఉందాʹ అని మా న్యాయవాది ప్రశ్నించారు. ఏ ఒక్క వస్తువులోనూ కుట్రకు ఆధారం లేదని ఆ దర్యాప్తు అధికారి తన నోటనే చెప్పకతప్పలేదు. మరి కుట్ర చేశారనడానికి ఆధారం ఏమిటి అనే చివరి ప్రశ్నకు ʹఆధారమేమీ లేదుʹ అని దర్యాప్తు అధికారి ఒప్పుకున్నాడు.

దర్యాప్తూ లేదు, ఆ అధికారికి సంబంధమూ లేదు. కుట్రా జరగలేదు, అరెస్టు చేసినదీ ఆయన కాదు. సాక్షులుగా ప్రవేశపెట్టిన వాళ్లు సాక్షులూ కాదు. ఆధారాలుగా ప్రదర్శించినవి ఆధారాలూ కావు. అరెస్టు చేయడానికి వెళ్లామన్న పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు కాదు. అలా ఎన్నెన్నో ʹకాదుʹల మీదా, ʹలేదుʹల మీదా ఆధారపడి పోలీసులు మా నేరం రుజువు చేయదలిచారు.

మమ్మల్ని మావోయిస్టుపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడితో పాటు అరెస్టు చేశారు గాని అప్పటికి ఆ పార్టీ మీద నిషేధం లేదు. నిషేధం ఉన్నదో లేదో తెలియదని ఛార్జిషీటు తయారు చేసిన పోలీసు అధికారి అన్నాడు. అధికారికంగా నిషేధం లేకపోవచ్చు గాని నిషేధం ఉన్నట్టేనని తమకు ఉత్తర్వులు ఉన్నాయన్నాడు. ఆ ఉత్తర్వు చూపమంటే అది లేదన్నాడు. తాము చేస్తున్న పని అధికారికంగా సరైనదా కాదా, చట్టానికి లోబడినదా కాదా చెప్పలేని స్థితిలో పోలీసు అధికారులు ఉన్నారన్నమాట. అలా విచారణలో మా న్యాయవాది గొర్రెపాటి మాధవరావు చాల సమర్థంగా పోలీసుల అబద్ధాలనూ కట్టుకథలనూ అబద్ధపు సాక్ష్యాలనూ తుత్తునియలు చేశారు.

అయితే, ఇదంతా కేవలం పోలీసు అధికారుల, సాక్షుల సమర్థత, అసమర్థతలకు సంబంధించిన విషయం కాదు. స్వయంగా పాలకులే పోలీసుల శాఖకు ఈ అబద్ధపు సంస్కృతిని, హింసా సంస్కృతిని నేర్పిపెట్టారు. ʹప్రజలు మాకు శత్రువులు. మీరు మా ఉద్యోగులు గనుక ప్రజలు మీకూ శత్రువులే. మీరు వాళ్లను అలా తప్ప మరొకరకంగా చూడడానికి వీల్లేదు. వాళ్లను ఏమిచేసినా, వేధించినా, చిత్రహింసలు పెట్టినా, చంపినా ఫరవాలేదు. హక్కుల చట్టాలు రాతకోసం మాత్రమే, పాటించనక్కరలేదుʹ అని బ్రిటిష్ కాలంలో పాలకులు పోలీసుశాఖకు శిక్షణ ఇచ్చారు. (ʹఅన్నా తమ్ముడూ బంధువూ అని చూడకు, చంపడమే నీ ధర్మంʹ అని సరిగ్గా అర్జునుడికి కృష్ణుడు బోధించిన గీత లాగ!) 1947 తర్వాత కూడ పోలీసు శాఖ పాటిస్తున్నది అవే చట్టాలను, అదే సంస్కృతిని, అదే శిక్షణను. అంతకుముందరి వలసపాలకుల సేవ నుంచి ప్రజాసేవ స్థానానికి మారడానికి తగిన శిక్షణ లేదు. ఇక 1967 తర్వాత, నక్సల్బరీ ప్రజా ప్రజ్వలనం తర్వాత ప్రజలను శత్రువులుగా చూసే సంస్కృతిని మరింత పెంచారు.

అందువల్లనే అబద్ధాలు చెప్పడం, చట్టవ్యతిరేక దమనకాండ సాగించడం, తప్పుడు కేసులు తయారుచేయడం, అవి తప్పుడువి గనుక వాటిని రుజువు చేయలేకపోవడం, కేసులు పెట్టి సంవత్సరాల తరబడి వేధిస్తే చాలుననుకోవడం పోలీసులకు అలవాటయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కుట్రకేసు, పార్వతీపురం కుట్రకేసు, సికిందరాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు, బెంగళూరు కుట్రకేసు, ఔరంగాబాద్ కుట్రకేసు వంటి సుప్రసిద్ధమైన కుట్రకేసులలో ఒక్కకేసులోకూడ ప్రాసిక్యూషన్ తాను చేసిన నేరారోపణలను రుజువు చేయలేకపోయింది. ఒక్కకేసులో కూడ న్యాయస్థానాలు శిక్షలు విధించలేదు. ఇతర కేసుల సంగతి సరేసరి.

ʹమావోయిస్టు పార్టీ నాయకులు ఇద్దరితో (గంటి ప్రసాదం, సురేందర్) కలిసి కుట్రపన్నామని, ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం మేం ఆయుధాలు వగైరా సేకరించామని, అది శిక్షార్హమైన నేరమని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. కాని మేం కుట్ర చేశామని రుజువు చేసే ఒక్క సాక్ష్యాన్ని కూడ ప్రాసిక్యూషన్ చూపలేకపోయింది. మేం ఆయుధాలు వగైరా సేకరించామని, ఈ ప్రభుత్వ చట్టాల ప్రకారమైనా నేరం చేశామనడానికి ఒక్క ఆధారం కూడ చూపలేకపోయింది. మొత్తం కేసు అంతా మేం ఔరంగాబాదులో మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ లో కలిసి మాట్లాడుకున్నామనే ఆధారం తప్ప మరేమీ లేదు. అంటే మనుషులు కలిసి మాట్లాడుకోవడమే ఈ ప్రభుత్వానికి, పాలకులకు, పోలీసులకు తమను కూలదోసే కుట్రలా కనబడిందన్నమాట. ప్రభుత్వాలను కూలదోసే పని పాలకవర్గ ముఠాలు చేసుకుంటూనే ఉన్నాయి. మేం చేయదలచుకున్న పని ఈ వ్యవస్థను కూలదోసే శక్తులకు కలమూ గళమూ ఇవ్వడం. ఈ వ్యవస్థ దోపిడీ పీడనల మీద ఆధారపడి ఉన్నది గనుక, ప్రజల జీవనాన్ని దుర్భరం చేస్తున్నది గనుక ఈ వ్యవస్థను కూలదోయడం అవసరమనీ, అనివార్యమనీ, సహజమనీ, న్యాయమనీ మేం భావిస్తున్నాం. అందులో దాపరికమేమీ లేదు. అందుకొరకు మేం కుట్రలు చేయం. ప్రజలకు నిజాలు చెపుతాం. పోరాట అవసరం చెపుతాం. వారు పోరాడుతున్నప్పుడు అండగా నిలబడతాం. వారి పోరాటాలను గానం చేస్తాం. ఆ పోరాటాల గురించి ఎవరితోనైనా మాట్లాడుతాంʹ అని మా కేసు కొట్టివేత తర్వాత విరసం పత్రికా ప్రకటనలో ప్రకటించింది.
-ఎన్. వేణు గోపాల్
( ఇంకా ఉంది)

Keywords : venugopal, ganti prasad, virasam, journalists, telangana, police, maoists, nizamabad
(2021-01-20 06:15:14)No. of visitors : 2273

Suggested Posts


నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ

ఎవరైనా మావోయిస్టు రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీ సభ్యుడైనప్పటికీ, చివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ ప్రత్యేకమైన నేరం చేశాడని మీరు రుజువు చేస్తే తప్ప శిక్షించడానికి వీలులేదని స్పష్టం చేసిన బోం

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

మహాజనాద్భుత సాగరహారానికి ఐదేండ్లు -ఎన్ వేణుగోపాల్

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.....

Search Engine

అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌
దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్
more..


అక్రమ