మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు
( మహాశ్వేతా దేవి గురించి 05 అక్టోబర్ 2012 న విప్లవ రచయిత వరవర రావు రాసిన వ్యాసం)
మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే, బేగంపేట విమానాశ్రయమే ఉండి ఉంటే ఆమె ఆ రోజు అక్కడ కలకత్తా నుంచి వచ్చి దిగి ఉంటే బయటికి వస్తూనే చీమల దండులా వస్తున్న జనాన్ని చూసి ఆమె ఇటు వచ్చి ఉండేది. ఇపుడంతా బైపాస్లు కదా. జిఎంఆర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగితే గచ్చిబౌలీ మీదుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి హైదరాబాద్ తాకకుండా అంతా సైబరాబాద్ ప్రయాణమే. ఈ సైబరాబాద్ అల్లావుద్దీన్ అద్భుతదీపం సృష్టికర్త ఇప్పడు, ఇన్నాళ్లకు, తొమ్మిదేళ్లకు పల్లెలను పలవరిస్తూ పల్లెబాట పట్టాడు. పల్లేరు కాయలు, పరిగ తప్ప పంటలు లేని పల్లెబాట. తానూ, తదనంతరం వారూ దక్కన్ పీఠ భూమి మీంచి విధ్వంస పూర్వకంగా తుడిచేసిన పల్లెబాట. ఎనభై గ్రామాలు, రైతుల జీవితాలు దురాక్రమించి నిర్మాణమైన ఈ సుందర విమానాశ్రయంలో ఇప్పడేనట ఆమె దిగడం. ఎట్లా ఉంది ప్రయాణం? అని అడిగాను. హంస తూలికా తల్పం వలె ఉంది అన్నది. పక్షుల ఈకలన్నీ పీకి కుషన్ చేసి ఆ సోఫాల్లో కూర్చొని ఇక్కడే మీ దగ్గర జీవవైవిధ్య సదస్సు చేస్తున్నారట కదా. నూటా తొంభై మూడు దేశాల జీవవిధ్వంసకారుల సభ అన్నది.
బేగంపేట విమానాశ్రయంలో దిగగానే అక్కడ మట్టి తీసుకొని నా నుదుటిలో పెట్టుకుంటానుʹ అన్నది చాలాకాలం క్రితం కలకత్తాలో కలిసినపుడు. అప్పటికింకా ఆమె జాదవ్ పూర్ లో ప్రభుత్వ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ క్వార్టర్స్ లో కిరాయికి ఉంటున్నారు. అప్పటికే ఆమెకు జ్ఞానపీఠ్ లు, మెగసెసే అవార్డులు వగైరా వచ్చి ఉన్నాయి. సీగల్ వాళ్ళూ ఆమె రచనలన్నీ ఇంగ్లిష్ లోకి తెచ్చారు. ఆ రోజుల్లో ఆమెకు నోబెల్ సాహిత్య బహుమానం కూడా వస్తుందనుకున్నారు. నేనూ, నా సహచరి హేమలత ఆమె దగ్గరికి వెళ్లగానే కావలించుకొని నీకోసమే నిరీక్షిస్తున్నాను. కూర్చో మని లోపలికి వెళ్లి వచ్చి నెల్సెన్ మండేలా సంతకం ఉన్న జిరాక్స్ కాపీ నా చేతికిచ్చింది. ఇదిగో ఈ సంతకం కోసం, ఈ మనిషి కరచాలనం కోసమే మెగసెసే అవార్డు తీసుకున్నాను అని ఆమె చెప్తుంటే ఆమె బలహీనమైన సంజాయిషీకి నాకు జాలేసింది. ʹఇప్పడు మండేలా మాత్రం ఎక్కడ మండుతున్నాడు. నేనూ, శివసాగరూ, ఇంకా చాలా మంది తెలుగు కవులం గతంలో ఇట్లా మనిషంటే మండేలాలా ఉండాలని పులకించిపోయిన వాళ్లమేʹ అన్నాను.
అక్టోబర్ 1 సాయంత్రం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గెస్ట్ హౌజ్ లో ʹమలుపుʹ ప్రచురణలు కె.బాల్ రెడ్డితో పాటు, నేను, నా సహచరి హేమలత వెళ్లి ఆమెను కలిసాం. బయట భోరున వర్షం కురుస్తున్నది. తెలంగాణ ప్రజల మీద కురిసిన బాష్పవాయు గోళాల దుర్మార్గానికి సెప్టెంబర్ 30 సాయంత్రం నుంచే ఆకాశం ఎడతెగకుండా దుఃఖిస్తున్నట్లున్నది. ఈ జీవవైవిధ్య విధ్వంసం కాలంలో ఆ ఆకాశం కళ్ళెవ్వరు తుడవాలి?! ఆమె వెంట కలకత్తా నుంచే ఒక అటెండర్ వచ్చాడు. కలకత్తాలో ఆమె కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఆమెను కనిపెట్టుకొని ఉంటున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె సంతాల్ ఆదివాసుల కోసం దశాబ్దాలుగా నడుపుతున్న ʹవృత్తికాʹ (వార్త, సమాచారం) అనే పత్రికా నిర్వహణలో కూడ సహకరిస్తున్న వ్యక్తి. విశ్వవిద్యాలయం వాళ్లు కూడా హెల్త్ సెంటర్ నుంచి ఒక మెడికల్ అసిస్టెంట్ ను నియోగించారు. ఆ ఇద్దరూ ఆమెను ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు. కాళ్లు వాపులు తగ్గలేదు. ఏమైనా తినే ముందు ఇన్సులిన్ తీసుకోవాలి.
అయినా కలకత్తాలో చూసినప్పటికన్నా కొంచెం ఆరోగ్యంగానే కనిపించింది. 2013 జనవరి 14 మకర సంక్రాంతి రోజు ఆమె ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ప్రవేశిస్తుంది. సహస్ర చంద్రదర్శనం ఎప్పడో అయిపోయింది. బహుశా సహస్ర సూర్యదర్శనాలు కూడా అయిపోయాయేమో. ఎనభై ఏడేళ్లు పెద్దవయస్సు కాదు రచయితకు అన్నదామె.
ʹనిజమే, ప్రజా నాట్యమండలి స్థాపన నుంచి, విరసం, అరుణోదయల దాకా, ఇప్పటిదాకా మా తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న కానూరి వెంకటేశ్వరరావుకు ఇప్పడు 97 ఏండ్లు, తెలంగాణ వైతాళికులలో ఒకరు, ఆఖరి శ్వాస దాకా తెలంగాణ న్యాయం కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ తన 97వ ఏట కన్నుమూశాడʹని చెప్పాను.
ʹతిరగడం లేదు.. హైదరాబాద్ కు చాన్నాళ్లకు వచ్చాను. తెలంగాణ పోరాటాల గడ్డ మీద ఇక్కడి అమరుల రక్తసిక్త దేహాలతో, పాదాలతో తడిసిన మట్టి తీసి పాపిటలో సింధూరంలా పెట్టుకుందామంటే మీ కొత్త విమానాశ్రయంలో మట్టే కనిపించలేదు. మనం మట్టి మనుషులం కదా. మనకు మనుషులు కావాలి. మట్టి కావాలి. మట్టి మనుషులు కావాలిʹ అంది.
ʹతిరగడం లేదు గానీ పెద్ద ఇల్లు కట్టాను. రోజూ బెంగాల్ నాలుగు చెరుగుల నుంచి నా నుంచి ఏదో సహాయం కోరుతూ ఎవరో ప్రజలు వస్తూనే ఉంటారు. జంగల్ మహల్ నుంచి బాధితులు వస్తూంటారు. ఫోన్లు వస్తుంటాయి. అక్కడ వాళ్లకు తాగడానికి నీళ్లు లేవు. విద్యుత్తు లేదు. ప్రాథమిక చికిత్సకు ఆసుపత్రులు లేవు. మమతకు చెప్తే అక్కడామెకు అందరూ మావోయిస్టుల వలె కనిపిస్తారు. వాక్యానికి వాచ్యార్థం, వ్యంగ్యార్థం అని రెండు కర్తవ్యాలు ఉంటాయమ్మ అని ఆమెకు చెస్తే అర్థం కాదు. కార్టూన్ అంటే అర్థం కాని మనిషికి వ్యంగ్య ప్రయోజనం ఎక్కడ అర్థమవుతుంది? ఎంఎ బెంగాలీ చదివిందట కాని ఆమె నా సంతాలీ ప్రజలంతటి విద్యావంతురాలు కాదుʹ అన్నది. బుద్ధదేవ్ బాగా పుస్తకాలన్నా చదివేవాడు. ఈమెకు భావాలంటే భయంʹ అన్నది.
నిన్న సాయంత్రమే వస్తే మా మార్చ్ కు తీసుకపోయేవాళ్లం. మూడు లక్షల మందికి పైగా వచ్చారు" అన్నాను. ʹవిన్నాను అంటుంటే మధుమేహ వ్యాధి వల్ల, వృద్ధాప్యం వల్ల తెల్లగా పాలిపోతూ, నీళ్ళూరుతున్న ఆమె కళ్లు క్షణం సేపు మిలమిలా మెరిసాయి. ʹప్రజలున్న చోట, ప్రజా పోరాటాలు ఉన్న చోట నేనుంటాను. నా హృదయ స్పందనలతో ఉంటాను" అని పిడికిలి ఎత్తి అన్నది. ఆమె రాకకు, ఆమెకు కేంద్రీయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవ సత్కారం చేయడానికి కృషి చేసిన ఆదివాసి, దళిత అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణ, సుప్రసిద్ధ హిందీ రచయిత జయప్రకాశ్ కదం, అకడమిక్ స్టాఫ్ కాలేజీలో ఉన్న హిందీ ప్రొఫెసర్ రాజు మొదలైన వారు కూడా అక్కడ ఉన్నారు.
ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంʹ అని అడిగింది. తెలంగాణ ప్రజలు ఎప్పడూ పోరాట ప్రజలే. ఎప్పడూ ఉద్యమకారులే. అందుకే నాకు తెలంగాణ అంటే ప్రేమ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి చాలా చదివాను. చాలా తెలుసుకున్నాను. నక్సల్బరీ కన్నా ముందు మాకు అదే కదా తొలి ప్రేరణ. ఇప్పుడు రాష్ట్ర సాధన పోరాట సాహిత్యం నాకు కావాలి. ఇంగ్లిష్ లో ఉంటే పంపించండి అన్నది.
మలుపు ప్రచురణలు తెలుగు చేయించి వేసిన ఆమె తొలి చారిత్రక నవల ʹఝాన్సీ కీ రాణిʹ ప్రతిని ప్రచురణకర్త కె.బాల్ రెడ్డి ఆమెకు అందిస్తుంటే స్వీకరిస్తూ ఆమె ఝాన్సీలో ఇప్పటికీ జనపదాల్లో ప్రచారంలో ఉన్న ఒక జానపద గీతం పాడింది. నేను ఆ జానపద గీతాల నుంచి చరిత్రను, కథను అల్లాను. స్త్రీలు ఎప్పడూ పోరాటకారులే. ఎందుకంటే వాళ్లు కష్టజీవులు. అణిచివేతకు నిరంతరం గురవుతుంటారు. అందుకని వాళ్లకెప్పడూ ధర్మాగ్రహం ఉంటుందిʹ అన్నది.
ʹఆత్మకథ రాస్తున్నారా అని అడిగాను. అందుకోసమే ఆమె ఇల్లు కట్టుకుని, అందరికీ తెలిసిన ఇంటి నుంచి మారిందని, అందుకే సాధారణంగా ఎక్కడికీ వెళ్లడం లేదని విన్నాను. అదే మాట అడిగితే ఈ ఇల్లు కూడా అందరికీ తెలిసిపోయింది కదా. పైగా నందిగ్రాం నుంచి వరుసగా సింగూరు, లాల్ గడ్ ఇట్లా ప్రజా పోరాటాలు పెల్లుబికి తన పని పెరిగిందని, బాధితులకు మందులు సేకరించడం, వైద్య సహాయాన్ని పంపించడం - ఇదే పని పెరిగిందని చెప్పింది. రాజకీయ ఖైదీల విడుదల మొదలు, ఉద్యోగాలు కోల్పోయిన రైల్వే కార్మికుల సమస్యల వరకు ఎప్పడూ ఏదో పని గురించి ప్రజలకు తెలియజేయడం, ప్రభుత్వాన్ని హెచ్చరించడం, రెగ్యులర్ గా బెంగాలీ పత్రికకు రాసే కాలమ్స్ రాయడం – ʹవృత్తికాʹ పత్రిక పనులు - దాని కోసం ఆదివాసులను ఇంటర్వ్యూలు చేసి వాళ్ల భాషలోనే అచ్చెయ్యడం పనులే సరిపోతాయన్నది.
ఇదే జీవితం కథ. నిత్య పోరాటాల కథ. ఇంకేం స్వీయ జీవితం అన్నది. "ఫ్రాంటీయర్లో నా బసాయిటుడు మరణించడు" (My Basai Tudu will not die) అని రాసిన చిన్న లేఖ వంటి రచన చదివాను - కేరళలో సిపిఎంలో పార్టీలో ఇద్దరు నాయకుల మధ్య వచ్చిన తగాదాలో ఒక కార్యకర్తను చంపడం గురించి రాసారు కదా అన్నాను. అతడు ఆదివాసి కార్యకర్త - సిపిఎంలో ఒక పక్షం అయినందుకు కాదు. కేరళలో తక్కువగా ఉన్న ఆదివాసి జనాభాలో ఎవ్వరూ వాళ్ల గురించి పట్టించుకోనపుడు ఒక మారుమూల పల్లెలో ఆయన వాళ్ల మధ్యలో పనిచేస్తున్నాడు. ఆయనను తమ స్వార్థ రాజకీయాల కోసం చంపేసారు. నా బసాయిటుడుకు నమూనా అయిన వ్యక్తి కూడా బెంగాల్లో ఇటీవలనే తన తొంభై ఆరవ ఏట మరణించాడుʹ అని చెప్పింది. దాని మీంచి కాసేపు చర్చ వలసపాలన కాలం నుంచి ఆదివాసులను నేరస్తులుగా చూసే రాజ్య వ్యవస్థ మీదికి మళ్లింది.
ఆదివాసి సమస్యలపై ఆదివాసి దళిత అధ్యయన కేంద్రం, కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన సదస్సులో కూడా ఆమె పాల్గొన్నది. అక్కడ అనుకోకుండా గద్దర్ కలిసాడని, ఆయన ఉత్సాహంగా పాటలు పాడి, తనతో కూడా బలవంతంగా పాట పాడించాడని చెప్పింది. సభ్య సమాజం అనాగరికులుగా భావించుకునే ఆదివాసులంత నాగరికులు మరెవరూ కాదన్నది. వాళ్లు మన కోసం అడవులు, నదులు, పర్వతాలు కాపాడుతున్నారు. దానర్థం - అవి మానవ వనరులని కాదు - అవి మానవ జీవితానికి పెనవేసుకున్న ప్రకృతి సంపద అని. మన కోసం అంటే మన భావితరాల కోసం కూడా అనాదిగా కాపాడుతున్నది వాళ్లే అన్నది. అంతే తప్ప ఖనిజాలుగా, నీళ్లుగా, రియల్ ఎస్టేట్ గా, సరుకుగా మార్చి బడా కంపెనీలకు, విదేశాలకు అమ్ముకోవడానికి కాదు. పరస్పరం ఆధారాధేయాలుగా జీవించడానికి. వాళ్ల సామాజిక నిర్మాణం చూడండి - ఎంత ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఎవరూ ఎవరికన్నా ఎక్కువ కాదు. ఎవరూ ఎవరికన్న తక్కువ కాదు. వరకట్నాలు, లైంగిక అత్యాచారాలు అక్కడ లేవు. భారతదేశంలో ఇంకేమైనా పర్యావరణ సమతుల్యత మిగిలిందంటే అది ఆదివాసుల వల్లనే. బ్రిటిష్ వాళ్లు అడవి కోసం చట్టాలు రచించి, వందలాది ఆదివాసి తెగలను నేరస్వభావం గల జాతులుగా నమోదు చేసిన శిక్షా స్మృతి ఇంకా కొనసాగుతున్నదని అన్నది. ప్రైవేట్ ఆస్తిని కాపాడుకోవడానికి ఆదివాసులను నేరస్తులుగా చిత్రిస్తున్న ఆధిపత్య నేర వ్యవస్థను ప్రశ్నిస్తూ, ప్రతిఘటిస్తూ ఆమె ఆరు దశాబ్దాలుగా పోరాడుతున్నది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆమె నాయకత్వంలో అటువంటి పోరాటాల ఫలితంగానే నేరస్త జాబితాల నుంచి ఆదివాసి జాతులకు విముక్తి లభించింది. ఆంధ్రప్రదేశ్ లో స్టువర్టుపురం వంటి చోట ఈ చట్టాలు, సభ్య సమాజం అట్లా చూసే దృష్టి మనకు తెలుసు. ఎరుకల, డక్కలి, చెంచు వంటి జాతులను చట్టంలోనే కాదు, సభ్య సమాజం అనుమానంగా చూడడం, నేరారోపణలకు లక్ష్యంగా చూడడం ఇప్పటికీ మన అనుభవంలో ఉన్న విషయాలే.
విడిపోయే ముందు మళ్లీ మళ్లీ దగ్గరికి తీసుకుంటూ, మళ్లీ కలుస్తామో లేదోనన్నట్లు వీడ్కోలు చెప్తున్నప్పుడు రచయితలం, సామాజిక కార్యకర్తలం కదా. మనది క్రిమినల్ ట్రైబ్ (నేరస్తుల జాతి) మనమెక్కడున్నారాజ్యం మనను నేరారోపణలతో కలుపుతూనే ఉంటుందిʹ అంటూ అందరినీ ఒకరొకరిని కావలించుకొని నుదుటిపై ముద్దు పెట్టుకున్నది.
చక్రాల బండి (వీల్ చెయిర్)పై అట్లా ఆమె జీవన సంధ్యలోకి, ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్న కాంతిపుంజం వలె అనిపించింది.
- వరవరరావు
హైదరాబాద్
05 అక్టోబర్ 2012
Keywords : mahaswetadevi, telangana, bengal, jungal mahal, mamatha benerji, death
(2024-09-06 04:15:46)
No. of visitors : 5181
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ... |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |