అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు


అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

అమరుడు


ఆ ఇద్దరి గురించి ఆది లేదా ఆదర్శ దంపతులు అని రాయాలని నేను చాలాసార్లు అనుకున్నాను. అట్లా రాస్తే ఆ తర్వాత వాళ్లనంత ఫ్రీగా కలవలేనేమో అనిపించి మానుకున్నాను. మూడేళ్లుగా బొజ్ఞాతారకం గురించిన ఆలోచనలు అశ్రుసిక్తం కాకుండా వచ్చేవి కావు. బ్రెయిన్ ట్యూమర్ అటువంటి భయంకర వ్యాధి. చెరబండరాజును, మా దామోదరరావు అన్నయ్యను ఆ క్యాన్సర్తో బాధపడడం దగ్గరగా చూసాను. ముగ్గురూ ఆ వ్యాధి ముందు ఓడిపోయారు గాని లొంగిపోలేదు. వీరిలో తారకం గారయితే పూర్తి విశ్రాంత జీవితం గడపాల్సిన వయసులో కూడా దానినొక సవాల్గా స్వీకరించాడు. ఈ మూడేళ్ల కాలంలోనూ అటు దళితుల, విప్లవకారుల పక్షాన వ్యవస్థ, రాజ్యహింసలకు వ్యతిరేకంగా పీడిత ప్రజలను సంఘటితం చేసి గ్రామాల్లో పట్టణాల్లో పోరాడాడు, న్యాయస్థానంలో పోరాడాడు. ఇటు తండ్రి జీవిత చరిత్ర రాసాడు. ʹచరిత్ర మార్చిన మనిషిʹగా కేవలం తన తండ్రి అయిన ఒక వ్యక్తి గురించి కాదు. ఆది రుద్రాంధ్ర మహోద్యమంలో బొజ్జా అప్పలస్వామి పాత్ర గురించి. "శతాబ్దాలుగా వెట్టి చాకిరీతోనూ పాలేరుతనాలతోనూ దీనంగా, దుర్భరంగా, నిస్సహాయంగా జీవితాలు గడుపుతూ ఆత్మగౌరవం అనే మాటకు ఆమడదూరం పెట్టబడిన వర్గాల ఆ వర్గాలను పురోగమన మార్గంలో నడిపించిన ఉద్యమశక్తుల గురించిʹ. ʹహిందూ సమాజపు సామాజిక నిర్మితిపైనా, మత మౌఢ్యపు దౌర్బల్యాలపైనా సమరం సాగించిన ఉద్యమశక్తుల సమాహారంగా ఆయన ఆది రుద్రాంధ్ర మహోద్యమాన్ని దృశ్యమానం చేశాడు.

నేను 1960లో ఎం.ఎ.లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరినపుడు ఫైనల్ ఇయర్లో ఉన్న విజయభారతి గారిని నా క్లాస్మేట్ రావిభారతి గారు పరచయం చేసారు. రావిభారతి కూడ ఎం.ఎ. ఫైనల్ ఇయర్లో ఉండాల్సింది గానీ పరీక్షలు, ప్రసవకాలం ఒకటే అయి మా క్లాస్మేట్ అయింది. రావిభారతి రావినారాయణరెడ్డి గారి కూతురు. విజయభారతి బోయి భీమన్న గారి కూతురు. అప్పటికంతే. అప్పటికదే మాకెంతో పులకింత, విజయభారతిగారు ఎం.ఎ. అయిపోయి నిజామాబాద్ లో లెక్చరర్ గా చేరినట్లున్నారు. 1966 నుంచి స్పాట్ వాల్యూయేషన్లో కలుస్తుండే వాళ్లం. 1968 స్పాట్ వాల్యూయేషన్ సందర్భంగా తెలిసింది ఆమెకాసంవత్సరమే వివాహమైందని. మా సహాధ్యాయి వే నరసింహారెడ్డి చొరవతో ఈ నవదంపతులకు ఆమెకు తెలిసిన లెక్చరర్స్ మంతా నారాయణగూడ తాజ్ మహల్లో విందు ఏర్పాటు చేశాం. బొజ్జా తారకం గారిని అప్పడు చూశాను. ఆయనప్పటికి కాకినాడలో లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మీరు సృజన ద్వారా తెలుసు. ఎన్జీవో నాయకుడు శ్యాంసుందర్ ఇస్తుంటాడుʹ అని చెప్పాడు. ఆ రోజుల్లో కాకినాడలో శ్యాంసుందర్ కేవలం ఎన్జీవో నాయకుడే కాదు, దిగంబర కవులకు, విప్లవోద్యమానికి వీరాభిమాని.

ʹనాలాగే గోదావరిʹ అని ఇటీవల తారకం గారు ఒక కవితా సంకలనం తెచ్చారు. ʹగోదావరి సముద్రంలో కలిసిన చోట పుట్టాను నేను. గంగ హిమాలయాల్లో పుట్టింది. గోదావరి త్రయంబకంలో పుట్టింది. జనాన్ని చూసి జనుల నాదాన్ని చూసి. హర్షామోదాన్ని చూసి భగ్న హృదయావేశాలను చూసి రక్తనాళాలన్నీ పొంగి ఖంగున మోగి వాయువులా విజృంభిస్తే కన్నీళ్లు పొంగితే మాటలు పేర్చాను. పాటలు కూర్చాను. అవి అలలై జలలై సెలయేల్లై జనం నదిలో పొంగి ప్రవహిస్తుంటే..

ʹనది పుట్టిన నా గొంతుక నదిమి పట్టారుʹ అని రాసారు. ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టండి అని సూచించాడట కవి మిత్రుడు కె. శివారెడ్డి నది పట్టిన గొంతుక కవిత ఎమర్జెన్సీలో చంచల్ గూడ (హైదరాబాద్) జైల్లో 1976లో పుట్టింది. ఆయన ఆశించినట్లుగానే ఈ నలభై ఏళ్ల ఆయన ప్రజా ఉద్యమ జీవితం వల్ల ఈ కవిత ʹజనసంద్రంలో కలిసిపోయింది.

ఆ కలిసిపోవడానికి ఆయన తాత తండ్రుల నుంచి వచ్చిన పోరాట సంప్రదాయం, బ్రహ్మసమాజం, అంబేడ్కరిజం ప్రభావాలతో పాటు గోదావరిని ఎదురీది వచ్చిన ఆయన పోరాట జీవితం నిండుదనాన్నిచ్చింది. ఈ గోదావరి సముద్రంలో కలిసే చోటనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఇండియన్ యూనియన్ సైన్యాల నుంచి తప్పకొని గోదావరిలో దూకి ఈదుతుండగా మృత్యుంజయుడిని చంపేశాయి.

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం. అంబేడ్కర్ అసోసియేషన్, బీడీ కార్మికుల సంఘం, విప్లవ రచయితల సంఘం, పౌరహక్కుల సంఘం, భారత చైనా మిత్రమండలి - ప్రజా ఉద్యమ సంఘమేదైనా డణీ నిర్మాణంలో భాగమాయన. ఆ పోరాట నది గొంతుక ఆయన.

1970లో విరసం ఏర్పడగానే ఆయన విరసం కార్యవర్గ సభ్యుడయ్యాడు. నిజామాబాద్లో చంద్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సిపిఐ ఎంఎల్ రాజకీయ విశ్వాసాలనామోదించిన రచయితలెందరో విరసంలో చేరారు. కె.ఎన్. రావు, సి.ఎచ్. మధు, నారాయణ మొదలైనవారు. నిజామాబాద్లో బహుముఖీన కార్యకలాపాల వల్ల ఆయనకు నిజమాబాద్ వదిలి విరసం కార్యవర్గానికి గానీ, కార్యకలాపాలకు గానీ రావడం వీలయ్యేది కాదు. పాలిటెక్నిక్ లో పనిచేసే వరంగల్ మిత్రుడు మల్లేశ్వరరావు, బత్తుల పున్నయ్యల ఆహ్వానంపై నేనే రెండు మూడుసార్లు నిజామాబాద్, కామారెడ్డిలకు వెళ్లాను. ఆయనింట్లోనే ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకూ విజయభారతి గారి ఆత్మీయమైన ఆతిథ్యాన్ని చవిచూస్తూనే ఉన్నాను. వేలాది మందితో కూడిన విరసం సభల్లో గంగిరెడ్డి రాసిన ʹనాందిʹ నాటక ప్రదర్శన కూడా ఉండేది.

నక్సల్బరీ, శ్రీకాకుళాలు సెట్ బ్యాక్ కు గురయిన తర్వాత కూడా గోదావరి లోయ ఎమర్జెన్సీ దాకా నిలబెట్టిన నిప్పుల జెండాకు న్యాయవాదిగా, కవిగా, ఉద్యమశాలిగా నిజామాబాద్లో ఆయనందించిన స్వరమే 1975 జూన్ 26న ఎమర్జెన్సీ ప్రకటించి జులై 4న సిపిఐ ఎంఎల్ పార్టీలను నిషేధించిన రాత్రి ఆయనే చెప్పినట్లు ఆ జిల్లాలో ఆయనే మొదటి వ్యక్తిగా అరెస్టు కావడానికి కారణమైంది.

ʹనీతో చెప్పలేదు. నేను వెళ్తున్నపుడు, నన్ను పోలీసులు పట్టుకున్నపుడు నీతో చెప్పలేదు. నన్ను చూస్తూ నిలబడిపోయావు. నీ కళ్ల నిండా నీళ్లు, నీ కన్నీళ్లు తుడవడానికి నా చేతులకు సంకెళ్లు, నీతో చెప్పలేదు. నీ కన్నీళ్లు నాకొక్కడికే కాదని, కోటి కోటి బాధాతప్త హృదయాలకు నివాళని. ఆశా కిరణాలని. అరుణార్ణవ కెరటాలనిʹ.

ఆయనను మొదట నిజామాబాద్ జైల్లో పెట్టారు. నిజామాబాద్ జైలు ఎత్తైన కొండ మీద ఉంది. పెద్ద పెద్ద మెట్లు ఎక్కి వెళ్లాలి. దేవాలయాన్ని నిజాం ప్రభుత్వం జైలుగా మార్చిందంటారు. ʹఎవర్నో ఒకరిని బంధించడానికే రెండూను. నిజాం ప్రభుతం కవిత్వం రాసినందుకు దాశరధిని ఇదే జైల్లో ఉంచారు. రచయితగా నేను రెండోవాడిని అని రాసుకున్నాడు. మొదట డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ కింద అరెస్టు చేసి బెయిలుపై విడుదలయితే మీసా కింద అరెస్టు చేసి హైదరాబాద్ చంచల్గూడ జైలుకు పంపారు. వరంగల్ జైలు అధికారులపైకి నక్సలైట్ ఖైదీలను దాడికి పురికొల్పుతున్నానన్న ఆరోపణతో నన్ను వరంగల్ జైలు నుంచి చెంచల్గూడ జైలుకు బదిలీ చేశారు. అప్పటికే చెరబండరాజు, తారకం మొదలైన వారు ఆ జైల్లో ఉన్నారు.

ఒక ఏడాదికి పైగా సన్నిహితంగా తారకంగారితో కలిసుండే అవకాశం ఈ జైల్లో కలిగింది. ఇరవై నాలుగు గంటలు కలిసుండే అవకాశం ఉన్న జైలు జీవితం మనుషుల్ని అర్థం చేసుకోవడానికి మిగతా అన్ని సందర్భాలకన్నా చాలా విలువైనది. తారకం గారిలోని జ్ఞానసంపద, వైవిధ్యభరితమైన ప్రతిభ ఇక్కడ చూసాను. నిరంతర అధ్యయనపరుడు. అద్భుతంగా పాటలు పాడేవాడు. మృదంగం, హార్మొని, తబలా ఎంతో సంగీత వాద్యజ్ఞానంతో వాయించేవాడు. షటిల్ కాక్ ఆడటంలో దిట్ట. హిందూ ధర్మ శాస్త్రాలను, కఠోపనిషత్ వంటి క్లిష్టమైన ఆధ్యాత్మిక అంశాలను మార్కిస్ట్ దృక్పథంతో విశ్లేషించి, విమర్శించి దక్షిణ భారతానికే ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ అయిన దేశముఖ్ ను, బిజెపి నాయకుడు బంగారు లక్ష్మణ్ ను అప్రతిభుల్ని చేసేవాడు. ఎంతో సరదాగా, హాయిగా, మానవీయంగా తోటి ఖైదీల పట్ల ప్రవర్తించేవాడు. నాగిరెడ్డి కుట్ర కేసులో నాలుగేళ్ల శిక్ష పడిన డిటెన్యూలనందరినీ హైదరాబాద్ కు తరలించినపుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం నుంచి కూడా పోరాటంలో ఉన్న కమ్యూనిస్టు యోధుడు బండ్రు నర్సింహుల్ని రోజుల తరబడి ఇంటర్వ్యూ చేసి చాల నోట్స్ తీసుకున్నాడు. 1977 ఫిబ్రవరిలో పెరోల్ మీద విడుదలైనపుడు జైలు గేట్లో ఎస్ఐబి ఇన్ స్పెక్టర్ రామారావు జడ్తీ చేయించి ఆ నోట్స్ ను లాక్కొని తారకం గారి కళ్లముందే కాల్చివేసాడు.

ʹఇద్దరు డిటెన్యూలు చాల గొప్ప విషయాలు చెప్పారు నాకు. వారి దగ్గర రోజూ కొంతసేపు కూర్చొని నోట్స్ రాసుకున్నాను. ఇంతవరకూ తెలుగు సాహిత్యంలో రాని విషయాలు సేకరించాను. గత యాభై ఏళ్ల చరిత్ర అది. రెండు ప్రాంతాల గాథ అది. రెండు పోరాటాల కథలు. చాల గొప్ప కథలు. ఇద్దరివీ గొప్ప అనుభవాలే. రెండు నవలలుగా రాయాలనుకొన్నానుʹ అని ఎంతో బాధగా రాసుకున్నాడు. ఆ రెండో వ్యక్తి ఎవరో ఇప్పడు నాకు జ్ఞాపకం లేదు.

బొజ్ఞాతారకం గారు నవలలు రాయదల్చుకుంటే ఎంతో అద్భుతంగా రాసి ఉండేవారని డెబ్భయ్యోపడిలో పడినాక రాసిన ఆత్మకథాత్మక నవల ʹపంచతంత్రంʹ చదివిన వాళ్లు ఊహించుకోగలరు.

ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన సిపిఐ ఎంఎల్ పక్షాన లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత విజయభారతి గారు తెలుగు అకాడమీకి పదోన్నతిపై రావడంతో హైదరాబాద్ కు మారి, ఇక్కడ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. ఆయన కార్యక్షేత్రం ఇక్కడి నుంచి రాష్ట్రానికి, దేశానికి విస్తరించింది. ఏపిసిఎల్సి ఉపాధ్యక్షుడుగా, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడుగా ఆయన వందలాది సభల్లో రాజ్యహింసకు, దళితులపై హింసకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఉద్యమాలు, పోరాటాలు నిర్మించాడు. కారంచేడు మారణకాండకు నిరసనగా ప్రభుత్వ న్యాయవాద పదవికి రాజీనామా చేశాడు. అప్పడే ఆయన కత్తి పద్మారావు ప్రధాన కార్యదర్శిగా దళిత మహాసభను స్థాపించాడు. విజయనగర్ కాలనీ (చీరాల)లో కారంచేడు బాధితులకు ఈ దళిత మహాసభ పునరావాసం కల్పించినప్పడు డానీ నాయకత్వంలో విరసం, దివాకర్ నాయకత్వంలో జననాట్యమండలి, కె. సుధ నాయకత్వంలో ఆర్ఎస్ యూ చివరిదాకా ఎంతో క్రియాశీలంగా వాళ్లకు అండగా ఉన్నారు. బాధితుల హక్కుల కోసం వారితో కలిసి పోరాడారు. గద్దర్ రాసిన ʹదళితపులులమ్మ పాట, ఈ ఉద్యమానికి ఒక మిలిటెంట్ పరిష్కారం అమరుడు కారుమంచి శేషప్రసాద్ విప్లవోద్యమ నాయకత్వం దళిత ఉద్యమంతో సృజనాత్మకంగా చేసిన జోక్యం ఫలితమే. బొజ్జా తారకం గారు కోర్టులో ఈ కేసును వాదించాడు. అక్కడి నుంచి చుండూరు కేసును హైకోర్టులో వాదించే దాకా ఆయన నిరంతరం కోర్టులో, బయట దళితులపై జరిగిన దాడులు, అత్యాచారాలు, హింసాకాండలకు వ్యతిరేకంగా పోరాడాడు. చుండూరు పోరాటం సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి నిందితులు ఇరవై నాలుగు గంటల్లో లొంగిపోకపోతే ప్రభుత్వం వాళ్ల భూములను స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించాడు. అప్పడు సిపిఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ అంతమాత్రమే కాదు, ఆ భూములు బాధితులకు పంచాలి అని డిమాండ్ ముందుకు పెట్టింది. ఇది బాధితులకు, ఆ ప్రాంతపు దళితులకు, మొత్తంగా ప్రజాస్వామ్యవాదులకు ఎంతో ఆశ్వాసాన్నిచ్చింది. దీని కొనసాగింపుగానే బొజ్జా తారకం గారు అధ్యక్షుడుగా, తెనాలి కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్, గతంలో ఆర్వైఎల్ అధ్యక్షుడు, విరసం సభ్యుడుగా ఉన్న పి.జె. వర్ధన్ రావు కన్వీనర్ గా చుండూరు దళితుల న్యాయపోరాట కమిటీ ఏర్పడింది. తెనాలిలో ఈ కమిటీ ఏర్పాటు చేసి మేం హైదరాబాద్ తిరిగి వచ్చేవరకే కన్వీనర్గా రాజీనామా ఇవ్వకపోతే పి.జె. వర్ధన్రావును చంపేస్తామని ఇంటి మీదికి అప్పటి శాసనసభ స్పీకర్ ఆలపాటి ధర్మారావు గూండాలను పంపించాడు. అట్లా కారంచేడు, చుండూరు పోరాటాలు ఎంతో సంఘర్షణాత్మకంగా సాగినవి. పోరాడి స్పెషల్ కోర్టు సాధించుకొని బి. చంద్రశేఖరరావు, శివనాగేశ్వరరావు న్యాయవాదుల పోరాట ఫలితంగా ఎంతో కొంత న్యాయం పొందిన చుండూరు బాధితులు కొన్నాళ్లు పోయాక ఇన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అది ఎట్లా కోల్పోయారో ఈ హిందూ అగ్రవర్ణ న్యాయాన్ని మనం చూశాం. ఈ కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్లుగా నియమితులైన బొజ్జా తారకం గారు, వి. రఘునాథ్ లకు జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కంటెమ్ట్ ఆఫ్ కోర్డు ఉత్తర్వు ఇవ్వడం, అయినా వాళ్లు దృఢంగా నిలబడడం కూడా చూశాం.

రామచంద్రపురంలో త్రిమూర్తులు దళితుల శిరోముండనం చేసిన ఘటన నుంచి పాతపెల్లిలో బ్రాహ్మణ పూజారి రెచ్చగొట్టడంతో బోయలు దళితుల ఇళ్లు తగులబెట్టిన సందర్భం దాకా ఆయన చేపట్టని పోరాటం లేదు. ఇంక లక్షింపేట దళితుల భూ నిర్వాసితత్వం, హత్యలకు వ్యతిరేకంగా ఆయన నాయకత్వంలో ప్రారంభమైన పోరాటం ఇంకా ముగియనేలేదు. ఇంతలో రోహిత్ వేముల ఆత్మహత్య రూపంలో స్మృతిబద్ధ హత్యలు సెంట్రల్ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యాలయాల్లో మొదలయ్యాయి.

దేవాలయాన్ని ఒక జైలుగా పోల్చిన తారకం గారికి హిందుత్వం అన్నా బ్రాహ్మణీయ భూస్వామ్య భావజాలమన్నా ఎంత అసహ్యం, ఎంత ఆగ్రహమంటే 1990లో బిఎస్పి పార్టీలో చేరినవాడు 1994లో మాయావతి బిజెపితో పొత్తు పెట్టుకోగానే బిఎస్పికి రాజీనామా చేశాడు. ఇపుడు రాందాస్ అతాలే బిజెపి ప్రభుత్వంలో చేరగానే నిరసనగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ʹఆర్గనైజర్ʹ అంబేడ్కర్ను హిందువుగా చిత్రిస్తూ ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేసినప్పడు కె.వై. రత్నం, లక్ష్మినారాయణ, కె. సత్యనారాయణలకు పురమాయించి తన మార్గదర్శకత్వంలో తాను కూడ కలిసి ఇంగ్లిష్ లో 89 అర్థసత్య ప్రతిపాదనలను, వాదనలను పరాస్తం చేస్తూ ఖండిస్తూ, సోపపత్తికంగా పొత్తం రాసాడు.

అంబేడ్కర్ ఆశించిన ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎజిటేట్ (చైతన్యపరచు, కూడగట్టు, ఉద్యమించు) అనే ఆశయాన్ని దళితుల విషయంలో ఆచరించినవాడు తారకం. ఆయన దళితుల సమస్యను కేవలం అంటరానితనం, ఆత్మగౌరవం దృష్టితోనే చూడలేదు. భూమిపై అధికారం దృష్టితో చూశాడు. అందుకే నేల, నాగలి, మూడు ఎద్దులుʹ, ʹకులం-వర్గంʹ వంటి విశ్లేషణాత్మకమైన పుస్తకాలు రాశాడు. భారతీయ వ్యవసాయ సమాజాల్లో నాగలి కింద రెండెడ్లే కాదు, మూడో ఎద్దు వెట్టి మాదిగ, భారతీయ సమాజాల్లో కులంలో వర్గం ఉంది. వర్గంలో కులం ఉంది.

ఈ అవగాహనతోనే ఆయన మావోయిస్టు పార్టీతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో చర్చలు జరిపినప్పడు ప్రజాస్వామిక హక్కులు, భూ సంస్కరణలు అనే అంశంపై నాలుగు రోజుల పాటు జరిగిన విశ్లేషణాత్మక వివరమైన చర్చలో క్రియాశీలంగా, మధ్యవర్తిగా పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏర్పడిన ప్రజా భూమి కమీషన్ చైర్మన్గా తెలంగాణలో కరీంనగర్ (రాజారాం సహకారంతో) మొదలైన చోట్ల, రాయలసీమ చితూరు (నరేంద్రనాథ్ సహకారంతో) మొదలైన చోట్ల, ఆంధ్రలో తూర్పు గోదావరి జిల్లా మొదలు శ్రీకాకుళం వరకు స్వయంగా భూ సంబంధాలను అధ్యయనం చేశాడు. ఈ కమీషన్ కన్వీనర్ గానే చిక్కుడు ప్రభాకర్ ఆయనకు సన్నిహితుడయ్యాడు.

1990 వరంగల్ రైతు కూలీ సంఘం మహాసభల పిలుపు మేరకు తెలుగు నేలంతటా వేలాది ఎకరాల భూములు భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు స్వాధీనం చేసుకోవడం, ఏడాది తిరగకుండానే గ్రామాల్లో పోలీసు క్యాంపులు, ఎన్కౌంటర్లు ప్రారంభం కావడంతో 1996-97 వరకు తెలంగాణ ఒక నెత్తుటి ఏరు అయింది. ప్రభుత్వం పీపుల్స్ వార్ తో చర్చలు జరపాలనే ప్రతిపాదనతో ఎస్.ఆర్. శంకరన్ నాయకత్వంలో కన్సర్న్ సిటిజన్స్ కమిటీ ఏర్పడింది. అందులో బొజ్జా తారకం గారు కూడా ఉన్నారు. ఈ కమిటీని ఎక్కువగా వేధించిన అంశం తెలుగు నేల మొత్తంగా ప్రత్యేకించి తెలంగాణలో ఈ ఘర్షణ మూలంగా పడావు భూములు (ఫాలో ల్యాండ్స్) వేల ఎకరాలుగా ఏర్పడి సామాజిక ఉత్పత్తి కుంటుపడుతున్నది, కనుక చర్చల ద్వారా సత్వర భూసంస్కరణలు అమలు చేయాలి.

నక్సల్బరీ, శ్రీకాకుళ, గోదావరి లోయ పోరాటాల ప్రభావంతో విప్లవోద్యమంలోకి వచ్చిన తారకం గారు ఆదివాసులకు జల్ జంగల్ జమీన్లపై ఉండే హక్కు గురించి పోరాడడంలో ఆశ్చర్యం లేదు. అది 1/70 అమలు చేయాలని డిమాండ్ చేసే సందర్భాల్లో కావచ్చు. 1989లో ఎన్టిఆర్ ప్రభుత్వం 1/70 రద్దు చేయాలని ప్రయత్నించినప్పడు ప్రతిఘటించడంలో కావచ్చు. ఎల్లవేళలా ఆయన ఆదివాసీ పోరాటాలకు ముందున్నాడు.

ఆదివాసుల పోరాటాల్లో ఆయన నిమగ్నత ఎంత కంఠదఘ్నమైందంటే 2009లో ప్రజలపై యుద్ధంగా మొదలైన గ్రీన్ హంట్ ఆపరేషన్ దాడిని ఖండిసూ బి.డి. శర్మతో పాటు దేశమంతా తిరిగాడు. 2012 జూన్లో బసగూడ మారణకాండలో 27 మంది ఆదివాసులు పిల్లలు, స్త్రీలతోపాటు అమరులైనప్పడు వెళ్లిన సిడిఆర్ఒ ముప్పై ఇద్దరు బృందానికి నాయకత్వం వహించి వెళ్లాడు. వానలు, వరదలు, బురదలో రెండు రోజులు ట్రాక్టర్ పై సుకుమా, దంతెవాడ జిల్లాలు తిరిగాడు. ట్రాక్టర్ బయనెట్ పై కూర్చుని ట్రాక్టర్ తిప్పతున్న ఆదివాసి గెరిల్లా చెప్పిన పోరాట చరిత్ర విని చలించిపోయాడు. ఆ ఆదివాసి గెరిల్లా మరెవరో కాదు, ఇరవై ఏళ్లుగా ఆదిలాబాద్ మంగి దళం నిర్మిస్తున్న విప్లవోద్యమానికి నాయకుడైన చార్లెస్ - శోభన్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గడ్చిరోలిలో ఆయనతోపాటు మహేశ్, అనిల్ అనే మరో ఇద్దరు కామేడ్స్ ను పట్టుకుని బూటకపు ఎన్కౌంటర్లో చంపేసింది.
తిరిగి వచ్చాక ఈ విషయాలు చెపూ ఉంటే ఆయన కళ్లల్లోని తడిలో వెలుగును గురించి నేను ʹనిజమైన వీరులు నేల నుంచి వస్తారుʹ అనే వ్యాసంలో రాసాను.

ముస్లిం మైనారిటీలపై హిందుత్వ వ్యవస్థ చేసే దుష్ప్రచారాన్ని రాజ్యహింసను ఎన్నో ప్రజాసంఘాల కన్నా ముందు నుంచే వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నిర్మాణం చేశారు తారకం గారు. తొంభైల ఆరంభంలో జూబ్లీహిల్స్ పై జరిగిన ఫసియొద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ మొదలు, మక్కా మసీదు బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పులు, వికారుద్దీన్ అతని సహచరుల బూటకపు ఎన్కౌంటర్లు, అన్నిటినీ వ్యతిరేకిస్తూ ఆయన కోర్టులో, బయటా ఉద్యమాలు నిర్మించాడు.

2007లో ఏర్పడిన రాజకీయ ఖైదీల విడుదల కమిటీకి కెజి కన్నబిరాన్ అమరత్వం తర్వాత అధ్యక్షుడయి, అఖిల భారత సీనియర్ రాజకీయ ఖైదీల డిఫెన్స్ కమిటీ బాధ్యతలు కూడా చేపట్టాడు. 2014లో అనారోగ్యంతోనే కలకత్తాలో జరిగిన సిఆర్పిపి రెండవ మహాసభల్లో పాల్గొన్నాడు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సుశీల్ కుమార్ రాయ్ దీర్ఘకాల జైలు జీవితంతో అనారోగ్యం పాలై, చివరకు క్యాన్సర్తో చావు బతుకుల్లో ఉన్నప్పడు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ప్రొ. హరగోపాల్, ప్రొ. గిలానీలతో పాటు రిప్రజెంట్ చేసి మొదట ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించి తర్వాత విడుదల చేయించారు.

ఎన్నో ఎన్కౌంటర్ హత్యల విషయంలో నిజనిర్ధారణలు చేసి ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే అని శ్రీకాకుళ పోరాటకాలం నుంచే చెప్తూ పోరాడుతున్నది ఎపిసిఎల్సి. హక్కుల సంఘాలన్నిటి తరఫున హైకోర్టులో ఎన్కౌంటర్లను హత్య కేసులుగా నమోదు చేయాలని వాదించినప్పడు కెజి కన్నబిరాన్, కె. బాలగోపాల్ తదితర పదిమంది న్యాయవాదులు, అమికస్ క్యూరీ, సి. పద్మనాభరెడ్డిలతో పాటు చివరి దాకా దృఢంగా వాదించిన వారిలో తారకం గారు ఉన్నారు. ఈ వాదనల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ హైకోర్డు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఎన్కౌంటర్లను హత్యకేసులుగా నమోదు చేయాలని తీర్పునిచ్చింది. పోలీసు అధికారుల సంఘం సుప్రీంకోర్టులో దీనిపై స్టే తెచ్చినప్పడు ఆ కేసును ఎట్లా వాదించాలో న్యాయ సూక్ష్మాలతో సూచనలు చేసినది కూడా తారకం గారే.

ఒక న్యాయమైన, ప్రజాస్వామికమైన డిమాండ్ గా తెలంగాణను, ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచాడు గనుకనే ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా కొనసాగిన గ్రేహౌండ్స్ గాలింపు చర్యలను, బూటకపు ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండించారు. లంకపెల్లి, మొదుగుట్ట ఎన్కౌంటర్లను ఖండించడమే కాకుండా శృతి, సాగర్ల ఎన్కౌంటర్ పై రౌండ్ టేబుల్లో పాల్గొన్నాడు. భావోద్వేగానికి గురయి ఆగ్రహావేశాలతో ఆయన చేసిన ప్రసంగమే ప్రేరణగా పది పార్టీలు, 371 సంస్థలతో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టిడిఎఫ్) ఏర్పాటయిందని అనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ ఏర్పడేనాటికే ఆయన బ్రెయిన్ ట్యూమర్కి గురయ్యాడు. కనుక ఆయన ఆ సంస్థ ఉద్యమ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయాడు. ఆఖరి శ్వాస వరకు కూడా ఆయన ఆ సంస్థ కన్వీనర్గా ఉన్నాడు.

2014 సెప్టెంబర్ 21న మావోయిస్తు పార్టీ ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంలో ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయాలను చర్చించడానికి ఏర్పడిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభ్యుల్లో ఆయనే ప్రథముడు.
ఐదు దశాబ్దాలు దళిత, విప్లవ ఉద్యమాల విశ్వసనీయత అంతగా చూరగొన్న మానవీయ వ్యక్తిత్వం మరెవ్వరిలోనూ చూడం. ఆయనకు వివక్ష వేదన స్వానుభవమే. పోరాట చైతన్యమూ వారసత్వంగానే వచ్చాయి. తండ్రి తారకం అనే పేరుతో సహా ఇంట్లోకి తెచ్చిన బ్రహ్మ సమాజ సంస్కరణ దృష్టి ఆయన జీవనశైలిని ప్రభావితం చేసింది. నలుపులోని స్పష్టత, స్వచ్చత ఆయన తెల్లని ఆహార్యంలో వ్యక్తమయ్యేవి. రాజ్యాంగ ఉపోద్ఘాతం, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, న్యాయశాస్త్ర సృజనాత్మక వ్యాఖ్యానం, అన్వయింపు మొదలు రాజ్యం అణచివేత సాధనం గనుక అది రద్దయ్యేంతవరకు వర్గపోరాటాలు వర్గరహిత సమాజ లక్ష్యంగా సాగుతాయన్న అవగాహన, చైతన్యాలను జీర్ణం చేసుకునే దాక ఆయన అధ్యయనం, ఆచరణ ఒక దీర్ఘ ప్రయాణం.

లక్షల ప్రతులు అమ్ముడుపోయి, ముప్పై వేల పుస్తకాలు పోలీసులు కొని తగలబెట్టి ఆ పుస్తకం చేతిలో ఉండడమే అండ అని ప్రజలు భావించి, నేరమని పోలీసులు భావించిన ʹపోలీసులు అరెస్టు చేస్తేʹ పుస్తకంలో ఈ దీర్ఘ ప్రయాణ కృషి కనిపిస్తుంది.

ఆయనకు భారతీయ సమాజాలను అర్థం చేసుకొని, విశ్లేషించి, వ్యాఖ్యానించడానికి ఈ ప్రాపంచిక దృక్పథం ఎంతో దోహదం చేసింది. అందుకే ఆయన పీడిత ప్రజల అదిమిపట్టిన గొంతు నుంచి పెకిలి వచ్చిన నది పుట్టిన గొంతుక అయ్యాడు. కామేడ్ ఇన్ ఆర్చ్ - మన రెక్కల్లో, బొక్కల్లో తన రెక్కలతో, బొక్కలతో, చూపులతో, మాటలతో, నడకతో, నడతతో నడిచిన సాంస్కృతిక యోధుడయ్యాడు.
ʹనాలాగే గోదావరిʹ అన్న భావకుడిప్పడు భౌతికంగా మన మధ్యలేడు. కాని ఒక న్యాయపోరాట చైతన్యంగా మనలో అతడు గోదావరిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాడు.

-వరవరరావు 18ー09ー2016

Keywords : bojja tharakam, virasam, varavararao, struggle, telanagana, andhrapradesh, maoists
(2019-02-19 01:35:09)No. of visitors : 1603

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

ప్రజల కోసం సముద్రం వలె గర్జించిన తారకం - విరసం

తండ్రి దళిత ఉద్యమ వారసత్వాన్ని చిన్న వయసు నుండే స్వీకరించిన తారకం గారు సాంస్కృతిక కార్యకర్తగా, విద్యార్థి ఉద్యమకారుడిగా తన సొంతవూరిలో దళిత యువకుల్ని సంఘటితం చేశారు. వర్గపోరాట రాజకీయాలతో ప్రభావితమై విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనారు....

ఉన్మాదుల ఇష్టారాజ్యానికి సమాజాన్ని వదిలేస్తారా?

ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత పై హిందుత్వ మతోన్మాదుల దాడిని ఖండిస్తూ ఈ దాడికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని విప్లవ రచయితల సంఘండిమాండ్ చేసింది.

Search Engine

బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
more..


అమరుడు