సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

సెప్టెంబర్

ʹకొందరు వద్దంటే ఆగని చరిత్ర" (చూ. ఉట్టిని రత్నాకర్ రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రజ్యోతి, 15 సెప్టెంబర్ 2016) అని చెప్తూనే సెప్టెంబర్ 17 గురించి ఎవరికి అనుకూలమైన విషయాలను వారు ప్రస్తావిస్తున్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా లేదా స్వాతంత్ర్య దినంగా అధికారికంగా నిర్వహించాలని మాత్రం ఇటు సిపిఐ అటు బిజెపి రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఎన్‌డి‌ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత మొదటిసారిగా 1998 సెప్టెంబర్ 17న నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో అప్పటి ఉప ప్రధాని, హోంమంత్రి లాల్ కృష్ణ అడ్వానిని పిలిచి బిజెపి ఈ రోజును తెలంగాణ స్వాతంత్ర్య దినంగా నిర్వహించాలని ఒక డిమాండ్ ముందుకు తెచ్చింది. గత పద్దెనిమిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకున్నా ఈ డిమాండ్ తో అది తెలంగాణలో ఒకవైపు తెలంగాణ సెంటిమెంట్ తోను, మరోవైపు హిందుత్వ సెంటిమెంట్ తోను బలాన్ని పుంజుకునే ప్రయత్నం చేస్తున్నది.

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కట్టంగూరు ప్రకాశరెడ్డి (కమ్యూనిస్టు) నాయకత్వంలో అమరులైన వారికి పరకాలలో అమరవీరుల శిల్పాలు, భవనం, ఆవరణ నిర్మించి ప్రతి సంవత్సరం రజాకార్ల చేతుల్లో హత్యకు గురైన సుప్రసిద్ధ జర్నలిస్తు షోయెబుల్లా ఖాన్ సంస్మరణ దినం జరుపుతూ అది ఈ ద్విముఖమైన ప్రయోజనం కోసం పనిచేస్తున్నది. అది కమ్యూనిస్టుల నాయకత్వమైనా ఆర్యసమాజ్, కాంగ్రెస్ నాయకత్వమైనా, మొత్తంగా అంతకంటే పూర్వపు ఆంధ్రమహాసభ నాయకత్వమైనా తెలంగాణ ప్రజల పోరాటాన్ని బిజెపి మామూలు కంటికి కనిపించే అర్థంలో ముస్లిం వ్యతిరేక పోరాటంగా చూస్తున్నది. ఎందుకంటే రాజు ముస్లిం గనుక అతడు గ్రామస్థాయి నుంచి జాగీర్ల స్థాయి వరకు దుర్మారులైన భూస్వాములకు అండగా నిలిచి అకృత్యాలకు ప్రభువుగా బాధ్యత వహించాల్సినందుకు. అట్లాగే 1947-48లో రాజ్యాంగ వ్యతిరేక హంతక ముఠా రజాకార్ సైన్యాన్ని తయారు చేసి గ్రామాల మీదికి ఉసిగొల్పినందుకు.

దేశ విభజన జరిగినప్పడు వెళ్లిపోతున్న బ్రిటన్ ప్రభుత్వం బ్రిటిష్ ఇండియాలో భాగం కాని సంస్థానాల ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉంచింది. అవి స్వతంత్రంగా ఉండవచ్చు, ఇండియన్ యూనియన్ లో విలీనం కావచ్చు, లేదా పాకిస్తాన్ లో కలవవచ్చు. 1947 ఆగస్ట్ 15 తరువాత ఇండియన్ యూనియన్ లో విలీనం కావడానికి మూడు సంస్థానాలు మాత్రమే ముందుకు రాలేదు. వాటిలో హైదరాబాద్ సంస్థానం అన్నిటికన్నా పెద్దది.

ఈ హైదరాబాద్ నిజాంతో 1947 నవంబర్ 29న ఢిల్లీలోని నెహ్రూ పటేల్ ప్రభుత్వం యథాతథ ఒడంబడిక చేసుకున్నది. ఈ యథాతథ ఒడంబడిక ప్రసావన ఆంధ్రజ్యోతి 15 తేదీ సంచికలో ఎవరూ తేలేదు. అంటే, నెహ్రూ ప్రభుత్వం ఏర్పడే నాటికి హైదరాబాద్ లో ఉన్న నైజాం ప్రభుత్వాన్ని గుర్తించి సంబంధాలు పెట్టుకుంటుందని అర్థం. గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి కూడా సంస్థానాల విషయంలో జోక్యం చేసుకోగూడదనేదే సూత్రబద్ధమైన నిర్ణయం. గాంధీజీ మద్రాస్ ప్రయాణం చేయాల్సి వచ్చినప్పడు, అంటే బలార్షా నుంచి విజయవాడ వరకు రైలులో మౌన వ్రతం పాటించేవాడని కాళోజీ ఎప్పడూ చెబుతుండేవాడు. అయితే ఈ కాంగ్రెస్ నిర్ణయానికి భిన్నంగానే స్వామి రామానందతీర్థ నాయకత్వంలో 1936లో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడి ప్రథమ సత్యాగ్రహం చేసిందనేది కూడా అంతే నిజం. అందులో పాల్గొన్న రావినారాయణరెడ్డియే ఆంధ్ర మహాసభకు, ఆ తరువాత 1944లో భువనగిరిలో దాని అధ్యక్షుడై, కమ్యూనిస్టు పార్టీకి కూడా నాయకత్వం వహించాడు.

1946 జూలై 4న విసునూరు దేశ్ ముఖ్ కు వ్యతిరేకంగా కడివెండిలో దొడ్డి కొమురయ్య నాయకత్వంలో వ్యవసాయ కూలీల పోరాటం సాగినప్పడు దానిపై దొర ఏజెంట్ మిస్కిన్ కాల్పులు జరిపాడు. అందులో దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడు. ఆత్మరక్షణ కోసమైనా సరే ఆయుధం పట్టక తప్పదనే నిర్ణయం కమ్యూనిస్టు పార్టీ అప్పడే తీసుకున్నది. కాని రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగూం మొయినొద్దీన్ ల సంతకాలతో సాయుధ పోరాట పిలుపు 1947 సెప్టెంబర్ 11న గాని ఇవ్వలేదు. అంటే దేశ విభజన జరిగి ఢిల్లీ లో నెహ్రూ పటేల్ ప్రభుత్వం ఏర్పడినాకనే కమ్యూనిస్తు పార్టీ సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది. ఎవరికి వ్యతిరేకంగా అన్నట్లు? వర్గ దృష్టితో చూసినప్పడు ఫ్యూడల్ భూస్వామ్యానికి, రాచరికానికి వ్యతిరేకంగానే అయినప్పటికీ దీనికి ఢిల్లీలో అండగా ఉన్నది కొత్తగా ఏర్పడిన నెహ్రూ పటేల్ ప్రభుత్వం అని భావించినందువల్లనే కదా !

కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ సంస్థానాన్ని లేదా తెలంగాణను ఇండియన్ యూనియన్ లో విలీనం కావాలని కోరిందని ఉజ్జిని రత్నాకర్ రావు రాశారు. అయితే మరి సెప్టెంబర్ 17న విలీనం జరిగిన తరువాత కూడా కమ్యూనిస్టు పార్టీ 1951 అక్టోబర్ దాకా కూడా సాయుధ పోరాటం ఎందుకు కొనసాగించినట్లు? ఆయనే రాసినట్లు ఈ మూడు సంవత్సరాల కాలంలో మూడు వేల గ్రామాల్లో పది లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని ఎర్రరాజాన్ని చవిచూసిన పీడిత, పోరాట ప్రజలు ఆ భూములను, అధికారాలను పోగొట్టుకున్నందుకే కదా? మరి ఏ అర్థంలో సెప్టెంబర్ 17 సిపిఐ దృష్టిలో స్వాతంత్ర్య దినమైనా, విమోచన దినమైనా అవుతుంది? చివరకు పటేల్ కూడా కలుపుకోవడం (ఎన్నెక్స్) అని వాడాడు తప్ప, విజయోత్సాహంలో విమోచన అనలేదు.

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు. ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పక్షాలను ఇంతగా నిరాదరించిన ప్రభుత్వానికి, ఆ చర్చల్లో మాంట్ బూటెన్ వంటి వారి జోక్యం పట్ల మాత్రం అభ్యంతరం లేకపోయింది. చివరికి స్టేట్ కాంగ్రెస్ ను కూడ తోసిరాజని 1947 నవంబర్ 29న నిజాంతో యథాతథ ఒడంబడికను కుదుర్చుకున్నప్పడు, సంస్థానాన్ని ʹవిమోచనʹ చేయవలసిన అవసరం ఉందని నెహ్రూ - పటేల్ ప్రభుత్వం అనుకోనేలేదు. ఆ తరువాత హైదరాబాద్ లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున ఏజెంట్ జనరల్ గా నియమింపబడిన కె.ఎం. మున్షి హైదరాబాద్ ప్రధాని లాయక్ అలీల మధ్య జరిగిన చర్చల్లో రజాకార్ల అణచివేత, కమ్యూనిస్టుల అణచివేత మాత్రమే ప్రధాన అంశాలు అయ్యాయని స్వామి రామానంద తీర్థ ఆత్మకథ ఆధారంగా ఎన్. వేణుగోపాల్ రాశాడు. (చూ. ʹలేచినిలిచన తెలంగాణ, పే. 117)

కేంద్ర ప్రభుత్వంలో సంస్థాన మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, సర్దార్ వల్లభభాయ్ పటేల్ కు సన్నిహితుడుగా ఉన్న వి.పి. మినన్ రాసిన ʹఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ʹ చదివినా ఏడాదిన్నరకు పైగా జరిగిన చర్చల్లో ʹవిమోచనʹ అనే మాట రాలేదని మనకర్థం అవుతుంది.

భారత ప్రభుత్వం పోర్చుగీస్ పాలన నుంచి గోవాను ఆక్రమించుకున్నప్పడు (లోహియా నాయకత్వంలో దేశవ్యాప్తంగా సోషలిస్టులు దీన్ని ఇట్లాగే భావించారు. కేశవరావు జాధవ్, ఎంటి ఖాన్ వంటి వాళ్లు కూడా ఈ భావనతోనే గోవాకు వెళ్లి నిరసన తెలిపారు) ప్రభుత్వ పత్రాల్లోను, సైనిక పత్రాల్లోను దాన్ని ʹగోవా విముక్తిʹ గా ప్రస్తావించారు. తూర్పు పాకిస్తాన్ కు ముక్తి బాహినిని పంపి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసి, అది "బంగ్లాదేశ్ విముక్తి" అని అభివర్ణించారు. 1971లో లోక్ సభ లో ఇటు ఎ.కె. గోపాలన్, అటు వాజ్ పాయ్ ముక్తకంఠంతో ప్రధాని ఇందిరను బంగ్లాదేశ్ ను విముక్తం చేసిన అపరకాళి అని పొగిడారు. భారత ప్రభుత్వం, భారత సైన్యం ఈ రెండు సందర్భాల్లోను విముక్తి, విమోచన శబ్దాలు వాడింది గాని హైదరాబాద్ సంస్థాన విషయంలో ఎక్కడా ఆ మాట వాడలేదు.

మెర్జర్ , అనెక్సెషన్, ఆక్సెషన్, పోలీస్ యాక్షన్, అటాక్, యాక్షన్, మిలిటరీ ఆపరేషన్, నిజామ్స్ సరెండర్, ఎండ్ ఆఫ్ ఆసఫ్ జూహీ రూల్ లాంటి మాటలతోనే దాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. ఆ కాలపు కమ్యూనిస్టులలో కొందరు, ప్రజాస్వామికవాదుల్లో కొందరు ఆ చర్యను హైదరాబాద్ పై యుద్ధంగానే అభివర్ణించారు. "ఆ పనికి బాధ్యుడైన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గురించి ఆరాధనతో రాసిన వాళ్లు కూడా ఆయనను భారత యూనియన్ ను సమైక్యం చేసిన ఉక్కుమనిషిగానే అభివర్ణించారు గాని, హైదరాబాద్ ను విముక్తి చేసినట్టుగా చెప్పలేదు. సర్దార్ పటేల్ కూడ హైదరాబాద్ విమోచన అనే మాట వాడలేదు. (చూ. లేచినిలిచిన తెలంగాణʹ, పే. 122)

మరి ఇప్పడు సిపిఐకు ఈ పారవశ్యం ఏమిటి? ఏమి మారిందని? సాధించుకున్నవి పోవడం తప్ప?

1947 నవంబర్ లో యథాతథ ఒడంబడిక చేసుకున్న తరువాత ఇటు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఎంత ఉధృతమైందో, అటు రజాకార్ల దురంతాలు అంతే ఉధృతమైనవి. ఉస్మాన్ అలీ ఖాన్ కాశీం రజ్వీ చేతిలో తనకున్న స్వతంత్ర రాజ్యాకాంక్ష వల్ల బందీ అయ్యాడు. 1948 జూన్ లో ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్ర హైదరాబాద్ ఆకాంక్షను కూడా బహిరంగంగా ప్రకటించాడు. 1948 జులైలో ఇండియన్ యూనియన్ ప్రభుత్వం పార్లమెంట్ లో (అది సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికైంది కాదు, కానిస్టిట్యూంట్ అసెంబ్లీ) హైదరాబాద్ సంస్థానంలోని ఆంతరంగిక పరిస్థితులపై ఒక శ్వేతపత్రం ప్రకటించింది. ఇటు కమ్యూనిస్టుల, అటు రజాకార్ల దురంతాలతో హైదరాబాద్ సంస్థానంలో శాంతిభద్రతలు లోపించాయని.
తమ యథాతథ ఒడంబడికకు భిన్నంగా సంస్థానం ఆంతరంగిక విషయాల్లో ఇండియన్ యూనియన్ ప్రభుత్వం జోక్యం చేసుకున్నదని నిజాం ప్రభుత్వం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేసింది. దానికి జవాబు ఇవ్వడానికి ఇండియన్ యూనియన్ కు భద్రతా మండలి 1948 సెప్టెంబర్ 18 తేది గడువుగా పెట్టింది. ఈ లోపల వ్యూహం పన్ని సెప్టెంబర్ 18న హైదరాబాద్ సంస్థానం మీదికి ఆపరేషన్ పోలో పేరుతో సైన్యాన్ని పంపించింది. అయిదు రోజుల్లో ఈ ఆపరేషన్ పూర్తయింది. దాంతో సెప్టెంబర్ 18న ఈ ఫిర్యాదు ఇన్ ఫ్రక్చువస్ అయింది (అవసరం తీరింది) అని భద్రతా మండలి భావించింది. అయితే భద్రతా మండలిలో ఆ ఫిర్యాదు ఇంకా పెండింగ్ లో ఉండడం వల్లనే 1969లో ఇందిరా గాంధీ తెలంగాణ ఇవ్వలేదని ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలోను, ఇటువంటి సందర్భాల్లోను ఆ ప్రస్తావన వస్తూనే ఉన్నది.

ఇక్కడ మనం గమనంలోకి తీసుకోవాల్సిన విషయం అప్పటికింకా రాజ్యాంగ రచన జరగలేదు. రాజ్యాంగ నిర్దేశికత్వంలో సార్వత్రిక ఎన్నికలు జరగలేదు. ప్రథమ సార్వత్రిక ఎన్నికల తరువాత వచ్చినంత అధికారం కూడా నెహ్రూ పటేల్ లకు రాలేదు. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేసుకునే బాధ్యతను సర్గార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టాడు. ఆ విషయం డా. కె. లక్ష్మణ్ ప్రస్తావించాడు. వల్లభ్ భాయ్ పటేల్, కె.ఎం. మున్షీ జనరల్ జె.ఎన్. చౌదరీ, ఎం.కె. వెల్లోడిల వ్యూహంలో నిజాం లొంగిపోవడం, హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం కావడం జరిగింది. పటేల్, మున్షీ లకు ఉన్న సంఘ్ పరివార్ భావజాలం, సైన్యాధికారిగా జె.ఎన్. చౌదరీ, నంజప్ప, పళయనిప్పన్ల సైనిక శిబిరాల్లో చేసిన దారుణాలు, పాకాల చెరువు కింద కాలాపానీ అదంతా ఒక పీడకల, కమ్యూనిస్టులకు, వాళ్ల నాయకత్వంలో ఉన్న పీడిత, పోరాట రైతాంగానికి, గ్రామీణ ప్రజానీకానికి అది దాటి వచ్చిన అగ్నిగుండం.

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.

ప్రజల్లో ఎన్నడూ బలం లేని రజాకార్లు సెప్టెంబర్ 17 తరువాత ఆ శబ్దమే లేకుండా పోయారు. నిజాం రాజు సులభంగా లొంగిపోయాడు. కాని, యూనియన్ సైన్యం రజాకార్ల నెపంతో నలభై వేల మంది నుంచి రెండు లక్షల మంది ముస్లింలను హైదరాబాద్ కర్ణాటకలోను, మరాఠ్వాడలోను, హైదరాబాద్ నగరంలోను, మద్దూరు, లద్దనూరు వంటి గ్రామాల్లోను చంపిందని నిజనిర్ధారణ చేసి డా. జయసూర్య నాయకత్వంలోని పౌర ప్రజాస్వామిక హక్కుల బృందం పేర్కొన్నది. 1952 నవంబర్లో ముల్కీ ఉద్యమంపై జరిగిన కాల్పులపై విచారణ జరిపిన జగన్మోహన్ రెడ్డి కమిషన్ ముందు వాంగ్మూలం ఇస్తూ డా. జయసూర్య, ʹప్రపంచంలో ఇప్పడు మూడే మూడు దేశాలలో ఆక్రమిత సైన్యాలు ఉన్నాయి. అవి జర్మనీ, జపాన్, హైదరాబాద్ʹ అని అన్నాడు.

ఇందులో నిజానిజాలు తెలుసుకోవడానికి స్వయంగా తన ఆప్తమిత్రుడైన సుందర్ లాల్ ను ఈ అత్యాచారాలపై నిజనిర్ధారణ కొరకు నెహ్రూ పంపించాడు. నాలుగు దశాబ్దాల పాటు రహస్యంగా ఉండి ఈ మధ్యనే బయటపడిన ఆ నివేదిక ప్రకారం రెండు లక్షల మందు ముస్లింలను ఊచకోత కోయడం జరిగింది. ముస్లిం స్త్రీల మీద అత్యాచారాలకు, ముస్లింల ఆస్తుల దహనాలకు, విధ్వంసాలకు లెక్కలేదు. ఒకవేళ ఈ రెండు లక్షల మంది హత్య అనేది కొంత అతిశయోక్తి అనుకున్నా ఈ దమనకాండ దేశవిభజన సమయంలో పంజాబ్ లో జరిగిన మారణకాండతో పోల్చదగినదని ఎంతో మంది విశ్లేషకులు రాస్తున్నారు. (చూ. ʹ లేచినిలిచిన తెలంగాణʹ, పే. 125)

ఇదంతా చరిత్ర. ఇంతకూ ఈ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17 నాటికి బిజెపి అనే ఒక పార్టీ లేదు. హైదరాబాద్ సంస్థానంలో దానికంటూ ఒక సామాజిక భూమిక లేదు. ఆర్య సమాజ్ తప్ప ఆ రోజుల్లో హిందూ మత సంస్కరణలైనా చేపట్టిన ఒక రాజకీయ సంస్థ లేదు. రజాకార్ల దురాగతాలన్నీ గ్రామస్థాయిలో అత్యధికంగా హిందూ దొరలు, పెత్తందార్లు ప్రోత్సహించినవే.

ఇవ్వాళ చాలా స్పష్టంగా ఒక రాజకీయ ప్రయోజనం కొరకు ఈ రోజును స్వాతంత్ర్య లేదా విమోచన దినంగా బిజెపి నిర్వహించాలని డిమాండ్ చేయడం ఎవరైనా అర్థం చేసుకోగలరు. దాని వెనుక ఒక సంఘ్ పరివార్ శక్తి ఉన్నది. పైన అధికారంలో మోడీ, అమిత్ షాలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో వీళ్లు ద్విముఖ వ్యూహంతో ఎన్నికల్లో దిగారు. గుజరాత్ నమూనాను చూపారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధ్వంసపూర్వక అభివృద్ధి నమూనాగా మాత్రమే కాదు, గుజరాత్ మారణకాండ నమూనాగా కూడా. అది ఇవ్వాళ దండకారణ్యంలో, తూర్పు మధ్య భారతాల్లో ఆదివాసులపై, గుజరాత్, యుపి, హర్యానాలలో దళితులపై, ముజఫర్ నగర్ మొదలు హైదరాబాద్ పాతబస్తీ వరకు ముస్లింలపై అమలవుతూనే ఉన్నది.

కాని తాను ఏ సెప్టెంబర్ 17 తరువాత కూడా ఇండియన్ యూనియన్ కి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిందో ఆ రాజ్యాన్ని ఆ ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 17ను విమోచన దినంగా స్వాతంత్ర్య దినంగా జరపాలని సిపిఐ బిజెపి నోట్లో నోరు పెట్టి ఎందుకు అడుగుతుందో జవాబు చెప్పాలి.

తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించిన అవిభక్త కమ్యూనిస్టు పార్టీ వారసత్వం తనదే అని సిపిఐ భావిస్తున్నది. 1964 కమ్యూనిస్టు పార్టీ చీలిక తరువాత సిపిఐలోకి వచ్చిన వాళ్లందరు నెహ్రూను బలపరచిన వాళ్లని ఒక భావన ఉంది. నెహ్రూయే సోషలిజం తెస్తాడు గనుక 1948 సెప్టెంబర్ 17 తరువాత సాయుధ పోరాటం కొనసాగింపు అక్కర్లేదని ఆ నాయకత్వం చెప్పిందని ఆ శ్రేణులు భావించాయని కూడా ఒక ప్రచారం ఉంది. అది నిజమో కాదో సిపిఐ స్పష్టం చేయకపోతే ఈ డిమాండ్ కి, ప్రచారానికి బలాన్నిస్తుంది.

ఎందుకంటే 1951 అక్టోబర్ దాకా కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగించింది అవిభక్త కమ్యూనిస్తు పార్టీ. ఆ పార్టీలో బతికున్న వాళ్లు ఇప్పడు సిపిఐ, సిపిఐ (ఎంఎల్) పార్టీలలో కూడా కొందరు ఉండవచ్చు. వాళ్లు చాలా త్యాగాలు చేశారు. చాలామంది అమరులయ్యారు. ఆ త్యాగాలను, ఆ అమరత్వాలను మొత్తంగానే కమ్యూనిస్టు విప్లవ సంప్రదాయం పీడిత, పోరాట ప్రజలు స్మరించుకోవాల్సి ఉంటుంది. 1948 సెప్టెంబర్ 17, 1951 అక్టోబర్ మధ్యన త్యాగాలు చేసిన, అమరులైన పీడిత, పోరాట ప్రజలకు, కమ్యూనిస్టు నాయకులకు ఇవ్వాళ ఈ డిమాండ్ పెడుతున్న సిపిఐ ఏ సంజాయిషీ ఇస్తుంది?

- వరవరరావు

Keywords : hyderabad, polo, indian army, nehru, patel, bjp, hindutva, telangana
(2024-12-02 15:41:02)



No. of visitors : 4658

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సెప్టెంబర్