Menu

కాల్పుల విరమణ ప్రకటించి, శాంతి చర్చలు జరపాలి – అభయ్

anadmin 11 months ago 0 201

(మధ్యభారతంలో యుద్ధవాతావరణం నెలకొనడం పట్ల ప్రజాస్వామిక, హక్కుల సంస్థలు, ప్రగతిశీలవాదులు ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టు ఉద్యమ నిర్మూలన పేరుతో కేంద్రం సాగిస్తున్న ఆపరేషన్‌ కగార్‌ ఆదివాసీ సమాజానికి ముప్పుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనే డిమాండ్‌ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇప్పటికే తాము చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. తాజాగా మరోసారి మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ శాంతి చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్‌ చేసింది. ఆ ప్రకటన పూర్తిపాఠం కింద చదవవచ్చు.)

సమయావధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి, ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మా విజ్ఞప్తి

గత 2024 జనవరి నుంచి కేంద్ర, రాష్ట్ర పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాలు ఆపరేషన్ ‘కగార్’ పేరుతో మావోయిస్టు విప్లవోద్యమ ప్రాంతాల్లో వందలాది మంది మావోయిస్టులను, అమాయక ఆదివాసులను హత్య చేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అనేక ప్రజాస్వామిక, విప్లవ ప్రజా సంఘాలు, పార్టీలు, సామాజిక సంస్థలు, కార్యకర్తలు, ప్రగతిశీల, ప్రజాస్వామిక, విప్లవ మేధావులు వందలాది మంది ఉద్యమిస్తున్నారు. ఆపరేషన్ కగార్’ను తక్షణం నిలిపివేసి, కాల్పులు విరమించి ప్రభుత్వం, మావోయిస్టులు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

మా పార్టీ కేంద్రకమిటీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని నేను మార్చి 28వ తేదీన ఒక పత్రికా ప్రకటన విడుదల చేసాను. మా పీ.ఎల్.జీ.ఏ. బలగాల సాయుధ చర్యలను నిలిపివేయాలని మా కామేడ్స్ ఆదేశాలు జారీ చేసారు. శాంతి చర్చల కోసం మా పార్టీ వైపు నుంచి నేను ఇచ్చిన ప్రకటన, దండకారణ్యంలోని ఉత్తర్ పశ్చిమ్ సబ్ జోనల్ బ్యూరో వైపు నుంచి కామ్రేడ్ రూపేష్ ఇచ్చిన రెండు ప్రకటనలతో కలిసి ఇప్పటికే మూడు పత్రికా ప్రకటనలు విడుదల అయ్యాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఝార్ఖండ్ రాష్ట్రంలో బొకారో హత్యాకాండలో మా కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ వివేక్ తదితర కామ్రేడ్స్ ను హత్య చేసాయి. మిగతా మావోయిస్టులు లొంగిపోకపోతే ఇదే గతి పడుతుందని హెచ్చరికలు చేస్తున్నాయి. తాము భారతదేశ రాజ్యాంగంలో రాసుకున్న మనిషికి జీవించే హక్కును కాలరాచి వేస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యామని చెప్పుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఆయుధాన్ని ఆయుధంతోనే ఎదుర్కొంటామని బహిరంగంగానే మాట్లాడుతున్నాయి.

ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కర్రెగుట్టల ప్రాంతాన్ని దిగ్బందించి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి 10 వేల మంది పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాలను మోహరించి 5 రోజుల నుంచి పెద్ద ఆపరేషన్ సాగిస్తూ మా కామ్రేడ్స్ ఆరుగురిని హత్య చేయడమే కాకుండా పార్టీ నాయకత్వాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఒకవైపు మా పార్టీ ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా విప్లవకారులపై, ఆదివాసులపై హత్యాకాండలు సాగిస్తే శాంతి చర్చల కోసం కొనసాగుతున్న ప్రక్రియకు ఏమాతం అర్ధం లేకుండా పోతుంది. శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ హత్యాకాండలను ఆపాల్సిందిగా, దేశవ్యాప్తంగా ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సమయావధితో కూడిన కాల్పుల విరమణను ప్రకటించాల్సిందిగా మా పార్టీ కేంద్రకమిటీ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. శాంతి చర్చల కోసం, సమస్య పరిష్కారం కోసం మా న్యాయమైన ఈ డిమాండ్ కు మద్దుతు ప్రకటించాల్సిందిగా, శాంతి చర్చలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాల్సిందిగా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా యావత్తు ప్రజాస్వామికవాదులను, శాంతికాములను, పీడిత ప్రజలను, పీడిత సెక్షన్లను, పీడిత జాతులను మా పార్టీ కేంద్రకమిటీ కోరుతోంది.

అభయ్
అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad