(అరుణతార సంపాదకీయం)
నెలన్నరగా మావోయిస్టు పార్టీలో తీవ్రమైన పరిణామాలు జరుగుతున్నాయి. వందేళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమంలో, నక్సల్బరీ నుంచి ఆరంభమైన విప్లవోద్యమంలో మావోయిస్టు పార్టీ పాత్ర గణనీయమైనది. అది చేసిన ప్రయోగాలు, నడచిన ప్రయాణ మార్గాలు, సాధించిన విజయాలు, అసాధారణ త్యాగాలు ఒక నిర్మాణంగా ఆ పార్టీవి మాత్రమే కావు. అవి భారత సమాజానివి. నాలుగు తరాల ప్రజలవి. ఆధునిక ప్రజా పోరాట చరిత్రవి. అందువల్ల ఆ పార్టీకి చెందిన ఏ విషయాన్నయినా సమాజమంతా పట్టించుకుంటుంది. అనుకూల, ప్రతికూల వైఖరులతో సహా స్పందిస్తుంది. ఆ పార్టీ నిర్మాణ విస్తృతికన్నా దాని చుట్టూ ఉండే అభిమాన, సానుభూతి ప్రపంచం అనేక రెట్లు విశాలమైనది. తెలుగు మేధో రంగం మావోయిస్టు అనుకూల, వ్యతిరేక ప్రాతిపదికల మీద దశాబ్దాలుగా సంవాదంలో ఉన్నది. మావోయిస్టు నిర్మాణ బలానికన్నా దాని భావజాల, సిద్ధాంత బలం ఎక్కువని రాజ్యమేగాక పౌర సమాజంలోని వ్యతిరేక మేధావులు కూడా గుర్తిస్తారు. విప్లవం చేయగల దార్శనికత, తెగువ, త్యాగనిరతి, నిబద్ధత వల్ల ఈ పాతికేళ్ల అంతర్జాతీయ ప్రజా పోరాటాల్లో గౌరవనీయ, విశ్వసనీయ స్థానం సంపాదించుకుంది. దానికి ఎన్నో సహేతుక, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. భారత ప్రజా జీవితంలోకి ఆ ఉద్యమం ఎన్నెన్నో నూతన ఆలోచనలను, విలువలను, చైతన్యక్రమాలను ప్రవేశపెట్టినట్లే.. ఈ సమాజం నుంచి, దాని గత వర్తమాన చరిత్రల నుంచి ఆ ఉద్యమం ఎంతో స్వీకరించింది. భవిష్యత్‌కు అవసరమైన రాజకీయార్థిక, సాంస్కృతిక, నైతిక నిర్మాణ ప్రయత్నాలు చేసింది. కనీసం ఈ ఒక్క కారణం వల్లనే అనేక సంక్షోభాల మధ్య కూడా అది ప్రభావశీలశక్తిగా ఇంత కాలం నిలబడింది. భావాల, పోరాటాల, విలువల, స్వప్నాల సంఘర్షణా కూడలిగా రుజువు చేసుకున్నది.
అట్లాంటి ఉద్యమానికి ప్రాణప్రదమైన దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాను విడిచిపెట్టి ఆ పార్టీ సీనియర్ నాయకులిద్దరు మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాల ముందు సైనిక దుస్తులతో, ఆయుధాలతో లొంగిపోయారు. ఆ ఇద్దరినీ రెండు వందల యాభై మంది దాకా అనుసరించారు.
సహజంగానే ఈ చర్యకు సమాజం దిగ్భ్రాంతి చెందింది. పైగా అది కేవలం వ్యక్తుల లొంగుబాటుగాకాక ‘సాయుధ పోరాట విరమణ’ అనే ప్రకటనతో జరిగింది. నక్సల్బరీ ప్రజ్వలన నుంచి విప్లవోద్యమం స్వీకరించిన పోరాట మార్గం తప్పని, అది అతివాదమని, ఇక అది పనికి రాదని, అందువల్ల సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని వారు ప్రకటించారు. ఆ నిర్ణయం ఆ ఇద్దరిదేనని, తాము పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రజలకు, విప్లవానికి ద్రోహం చేయబోమని మిగతా నాయకత్వం స్పష్టం చేసినప్పటికీ, వాళ్ల లొంగుబాటు తీవ్ర ప్రభావాన్నే చూపింది. ప్రజా ఆకాంక్షలు, విముక్తి మార్గాలు, భవిష్యదాశల గురించిన రాజకీయ, భావజాల, సాంస్కృతిక చర్చగా ఇది మేధోరంగాన్ని ఆవరించింది.
చాలా విషాదకరంగా ఈ పరిణామం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు నిర్మూలనా యుద్ధం చేస్తున్న తరుణంలో జరిగింది. లక్షల సైనిక బలగాలు, వైమానిక దాడులు, అతి పెద్ద ఎత్తున సూక్ష్మస్థాయి ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్‌తో విప్లవోద్యమ ప్రాంతాల్లో అంతర్యుద్ధం పోలిన అణచివేతను ప్రభుత్వం కొనసాగిస్తున్న సందర్భంలో లోపలి నుంచి సాయుధ పోరాట విరమణ అనే వాదన వచ్చింది. లొంగుబాట్లు జరిగాయి.
అయితే ఇది విప్లవోద్యమ అధికారిక వైఖరి కాదు కనుక దీన్ని సాయుధ పోరాట విరమణ అనడానికి లేదు. ఆయుధాలతో ఇంతగా లొంగిపోవడాన్ని సాధారణ అర్థంలో సాయుధ ప్రతీఘాతుకత్వమనీ, విద్రోహమనీ అంటారుగాని, ఆ మాటలేవీ జరిగిన ఈ పరిణామాన్ని సంపూర్ణంగా సూచించలేవు. ఈ వైపు నుంచి చూస్తే వాళ్లు రాజ్యానికి ఆయుధాలు అప్పగించడం కేవలం ప్రతీకాత్మక చర్య మాత్రమే. పోరాట ప్రజల చైతన్యం నుంచి, ప్రజలు నిర్మించే చరిత్ర నుంచి వర్గపోరాటాన్ని పెకలించివేయాలనుకోవడమే వాళ్ల అసలు ఉద్దేశం అని సులభంగానే గ్రహించవచ్చు. అది సాధ్యమవుతుందా? చరిత్ర దాన్ని అనుమతిస్తుందా? అనేక రూపాల్లో నిత్యం సాగే వర్గ సంఘర్షణను నిర్దిష్ట రాజకీయార్థిక సాంస్కృతిక కార్యక్రమంలోకి మళ్లించకుండా ప్రజా జీవితం అర్థవంతమైన తీరం చేరుకుంటుందా? ప్రజా పోరాటాలు లేకుండా ఎన్నటికైనా, ఎన్ని ఎగుడుదిగుళ్లతోనైనా చరిత్ర ఒక గుణాత్మక దశలోకి చేరుకుంటుందా? విప్లవోద్యమం తప్ప ఇలాంటి చారిత్రక ప్రయాణానికి ముందుండి నడిపించే నాయకురాలు ఇంకెవరు? అనే ప్రశ్నలు ఉన్నాయి.
విప్లవాన్ని, వర్గ యుద్ధాన్ని, సాయుధ పోరాటాన్ని ఇంత విశాలమైన అర్థంలో చెప్పుకుంటే, దాన్ని సాధించే దారిలో అనన్య సామాన్యమైన త్యాగాలు ఉన్నట్లే విద్రోహాలూ ఉంటాయి. త్యాగానికీ, ద్రోహానికీ సాధారణ జీవితార్థం ఏమైనా కావచ్చుగాని, రాజకీయ స్థాయిలో ఆ రెంటినీ వర్గపోరాటం నుంచి వేరు చేయలేం.
అందువల్ల కూడా ఈ సమస్య కేవలం వ్యక్తులకు పరిమితమైనదే కాదు. వర్గ యుద్ధం ముమ్మరమయ్యాక త్యాగం, ద్రోహం సామాజికం అవుతాయి. అందుకే విప్లవాన్ని దాని చారిత్రకతలోంచి చూడాలి. దాని రాజకీయ సిద్ధాంత పునాదుల మీద నిర్మించాలి. వైజ్ఞానిక, సాంస్కృతిక, భావజాల ఆచరణగా తీర్చిదిద్దాలి. దీనికి ఆయుధం తప్పనిసరేగాని ఆయుధమే నెరవేర్చే పని కాదు ఇది. యుద్ధకాలంలో ఒక పనిముట్టుగా ఆయుధం కీలకమేగాని, నిర్ణయాత్మకమేగాని, దాన్ని కూడా నడిపించే రాజకీయాలకు, తాత్వికతకు ఇంకా చాలా ప్రాధాన్యత ఉంటుంది. గత యాభై ఏళ్ల అన్వేషణలో విప్లవోద్యమం ఈ స్థూల అవగాహనతోనే పని చేస్తున్నది. ఈ దేశ విప్లవానికి అవసరమైనవన్నీ సమకూర్చుతున్నది. కొంతమంది విప్లవకారుల చేతుల్లోంచి ఆయుధాలు రాజ్యం చేతిలోకి వెళ్లినంత మాత్రాన వర్గ పోరాటం తుడిచిపెట్టుకపోదు. ప్రజా జీవితంలోంచి సాయుధ పోరాటం శాశ్వతంగా రద్దు కాదు. విప్లవోద్యమ పంథా తల్లకిందులైపోదు. రాజకీయాలు ప్రజల చేతిలో ఉంటాయి. ప్రజల చైతన్యంలో భాగమవుతాయి. ఆ పని చేయడానికి ఒక వాన్‌గార్డ్ కావాలి. దానికి ఒక పంథా ఉండాలి. ఈ సంగతి తెలుసు కాబట్టే రాజకీయ పంథా తప్పని, దాన్ని విసర్జించాలని అనడమే లొంగుబాటు సారాంశం. ఈ విషయం లొంగిపోయిన వాళ్లు చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. వాళ్లు లొంగిపోయిన తీరుకంటే విప్లవోద్యమ పంథాను ధ్వంసం చేయాలనుకోవడమే ఇందులో ప్రధానం.
కాబట్టి ఈ వివాదంలో ఎవరు ఏ వైఖరి తీసుకున్నా అది రాజకీయమే. అది వర్గపోరాట సారమే. నెలన్నరగా తెలుగు సమాజంలో అట్లాంటి వర్గ వ్యక్తీకరణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లొంగుబాటు చుట్టూ ఉన్న అంతర్గత వైఖరులను, సాంకేతిక సమస్యలను విప్లవోద్యమం ఎట్లా పరిష్కరించుకుంటుందనేది వేరే సంగతి. అది పూర్తిగా వాళ్ల నిర్మాణ విషయం. ఒక వేళ ఈ పరిణామం వల్ల కొంతనో, కాస్త ఎక్కువగానో ఉద్యమానికి నష్టం జరిగితే తిరిగి కూడగట్టుకోవాల్సిందే. కగార్ పేరుతో జరుగుతున్న నష్టాలను అధిగమించి విప్లవోద్యమం ముందుకుపోగలదా? అనే ప్రశ్నకు ఇది అనుబంధ ప్రశ్న మాత్రమే.
ఈ స్థితి రావడానికి సాయుధ పోరాట రాజకీయ పంథాయే కారణమని లొంగిపోయిన నాయకులే అనడంతో అనేక మంది పరిశీలకులకు, వ్యతిరేకులకు బలం వచ్చింది. వాళ్లకు ఇది సరికొత్త అవకాశమేగాని ఈ వాదనలేవీ కొత్తవి కాదు. దశాబ్దాలుగా ఉన్నవే. ఎప్పటికప్పుడు తన ఆచరణ ద్వారా దీర్ఘకాలిక ప్రజాయుద్ధమంటే ప్రజాపంథా అని విప్లవోద్యమం నిరూపిస్తూ వచ్చింది. అయినా సరే ఈ సందర్భంలో మరోసారి రూపొందుతున్న ఈ వర్తమాన ప్రపంచంలో నిలబడి ఈ సంక్షోభంలోని లోతైన అర్థాలను గ్రహించి తన అవగాహనను విస్తరించుకోవలసిందే. చాలా ఓపికతో, సంయమనంతో ఈ సవాళ్లన్నిటినీ అధిగమించగల దీర్ఘకాలిక వ్యూహాత్మకతను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకోవలసి ఉన్నది. అది మాటలకంటే ఆచరణతోనే సాధ్యమవుతుంది.
అతివాద ముద్ర మోసిన దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథా ఈరోజు బైటా, లోపలా ఎన్ని సంక్షోభాలనైనా ఎదుర్కోవచ్చు. కానీ యాభై ఏళ్లుగా అనేక విజయాలను అదే పంథా సాధించిందనే వాస్తవం విస్మరించడానికి లేదు. సునిశిత ఆలోచనలను, సైద్ధాంతిక సంపత్తిని, సృజనాత్మక మానవ ఆచరణను ఈ పంథాయే ఎత్తి చూపించింది. మానవులు ఎంత శక్తిసంపన్నులో, ఎన్ని అద్భుత ప్రయోగాలు చేయగలరో తిరుగులేని విధంగా రజువు చేసింది. వీటన్నిటి వల్లనే గత పాతికేళ్లలో కూడా ఈ శతాబ్దపు ప్రపంచ విప్లవోద్యమంలోనే భారత మావోయిస్టు ఉద్యమం గణనీయ విజయాలు సాధించి స్ఫూర్తివంతంగా నిలిచింది. తన పంథా వల్లనే భారత రాజ్యానికి, సామ్రాజ్యవాదానికి కంటగింపు అయింది. విప్లవోద్యమం ఇప్పుడు ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభానికి లోపలి వ్యక్తుల అంచనాలు, వైఖరులు మాత్రమే కారణం కాదు. కగార్ యుద్ధం నుంచి ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసికెళ్లాలనే విషయంలోని భిన్నాభిప్రాయాలే ఏకైకం కాదు. సజీవమైన ఉద్యమంలో అలాంటిన్నీ ఉండేవే. ఒక్కోసారి అవే ముందుకు నడిపిస్తాయి. కానీ ఇప్పుడు జరిగింది అది కాదు. విప్లవోద్యమ నిర్మూలనకు డీప్ స్టేట్ అనుసరించిన కుట్రపూరిత విధానాల్లో దీన్ని వివరంగా చూడవలసి రావచ్చు.
హిందుత్వ ఫాసిస్టు స్వభావాన్ని పూర్తి స్థాయిలో సంతరించుకున్న భారత రాజ్యానికి విప్లవోద్యమంపట్ల ప్రత్యేకమైన రాజకీయ, సైద్ధాంతిక ద్వేషం ఉన్నది. బైటికి నిరంతరం ఆయుధాల చుట్టూ మాట్లాడుతున్నది. తన సాయుధ సంపత్తినంతా వినియోగించి దాడి చేయడానికి తగినట్లు ఆయుధాలు కేంద్రంగా విప్లవోద్యమాన్ని వక్రీకరిస్తున్నది. తన అణచివేతకు తగినట్లు క్రూరమైన కథనాన్ని తయారు చేసుకుంటున్నది. నిజానికి హిందుత్వ కార్పొరేట్ నియంతృత్వ రాజ్యం గురించి విప్లవోద్యమానికి ఉన్న అంచనాలకు తగినట్లే అది ప్రవర్తిస్తున్నది. అది ఆయుధాల దగ్గరి నుంచి విప్లవ సిద్ధాంతం, సంస్కృతి, భావజాలం ఆనుపానుల దాకా వెళ్లి అక్కడా యుద్ధం చేస్తోంది. అంతిమంగా విప్లవ సిద్ధాంతాన్ని, పంథాను రూపుమాపడానికి ప్రయత్నిస్తున్నది. ఈ వైపు నుంచి చూస్తే సాయుధ పోరాట విరమణ అనే వాదన సరిగ్గా కగార్ యుద్ధ ప్రతిఫలనమని ఎవ్వరైనా గ్రహించగలరు. వివరాలు ఇంకెన్నయినా ఉండవచ్చు. ఎంత విశ్లేషణ అయినా ఇవ్వవచ్చు.
ప్రభుత్వం ఎంచుకున్న విప్లవోద్యమ నిర్మూలన పథకంలో ప్రజల నుంచి ఉద్యమాన్ని వేరు చేయడం ఒక కోణం. అందుకే ఇంత భీకర యుద్ధం చేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఎంత అననుకూలత ఉన్నా సరే, దీనికి ప్రతి వ్యూహాన్ని అనుసరించాల్సిందేగాని ప్రజల్ని వదిలి, ఆయుధాలను రాజ్యానికి సమర్పించడం ప్రతీఘాతుకం అవుతుంది. ఆ రకంగా కూడా ఆయుధాలు వదలాలనే రాజ్యం కోరికను తీర్చడానికీ, ప్రజలను విప్లవ రాజకీయాలకు దూరం చేయాలనే వ్యూహాన్ని అమలు చేయడానికీ లొంగిపోయిన వాళ్లు ప్రయత్నించినట్లయింది.
సరిగ్గా ఇట్లాగే కొందరు మేధావులు విప్లవాన్ని ఆయుధాలు కేంద్రంగా చూస్తున్నారు. దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాలోని విస్తారమైన ప్రజా ఆచరణను, రాజకీయ సిద్ధాంత అవగాహనను తమ ఇష్టం వచ్చినట్లు కుదించి ఆయుధం దగ్గరికి తీసికెళ్లారు. రాజ్యం చేతిలోని ఆయుధం గురించి ఏనాడూ మాట్లాడని వాళ్లు విప్లవకారుల ఆయుధాల గురించి విరివిగా మాట్లాడుతున్నారు. పైగా సాయుధ పోరాటమే విప్లవమనీ, విప్లవమంటే విప్లవ పంథా అనీ అనుకుంటున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయుధ ఆరాధనే విప్లవం అనుకోవడం వల్ల త్యాగం చేయడమే విప్లవకరమని అనుకుంటున్నారనే వాదనలు కూడా చేస్తున్నారు. ఆయుధానికి అటూ ఇటూ ఎన్ని రకాల వాదనలో లెక్క లేదు. నిజానికి వీళ్లు విప్లవాన్ని కాంక్షించేవాళ్లే అయితే అంతర్యుద్ధంతో, అంతర్గత విద్రోహంతో ఒక పోరాటశక్తిగా మావోయిస్టులు బలహీనపడటం ఆందోళన కలిగించి ఉండాలి. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా సరే, ఈ సమాజాన్ని క్రియాశీలం చేస్తున్న ఉద్యమం సంక్షోభంలో పడటం ప్రజలకు నష్టదాయకమనుకొని ఉండాల్సింది. కాకపోగా మావోయిస్టు పంథా పట్ల తమ భిన్నాభిప్రాయాలను, వ్యతిరేకతలను చాటుకోడానికి దీన్ని సమయానుకూలంగా కొందరైనా భావించారు.
విప్లవోద్యమానికేమో ప్రజలు కేంద్రం. చైతన్యవంతంగా వాళ్లు నిర్వహించే వర్గపోరాటం ప్రధానం. ఆయుధాలు అనివార్యం. సమస్త సంపదలు, అధికారాలు, జైళ్లు, సైనిక బలగాలు, లెక్కలేనన్ని ఆయుధాలు చేతిలో పెట్టుకొన్న నియంతృత్వ వ్యవస్థను ప్రజలు ఖాళీ చేతులతో ఎట్లా ఎదుర్కోగలరు? ఈ నియంతృత్వం నానాటికీ బలిసిపోతున్న తరుణంలో, సమాజం మరింత సంక్లిష్టంగా మారిపోతున్న సమయంలో, కనీస ప్రజాస్వామిక పోరాటాలకు అవకాశం మూసుకపోయిన సందర్భంలో సాయుధ పోరాట అవసరం మరింత పెరిగిపోయింది. చట్టబద్ధ, సాయుధ పోరాటాల కలయికగా యాభై ఏళ్లు కొనసాగిన దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా ప్రాసంగికత పెరిగింది. ఇది గ్రహించాలంటే ఎంత నేర్చుకోవాలి? ఎంత వాస్తవ దృష్టి అలవర్చుకోవాలి. ఎంత ఆధునిక చైతన్యాన్ని స్వీకరించాలి? ఇవేవీ లేకుండా సాయుధ పోరాట పంథాను కేవలం ఆయుధానికి కుదించే వాళ్లు ప్రజలను నిరాయుధులను చేసే వాదనలు లేవదీస్తారు.
ఈ వాదనలకు ధీటైన, హేతుబద్ధ ప్రతివాదనలు ఎన్నో ఉన్నాయి. కానీ వీటిని ఆచరణలో ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ఆ శక్తి విప్లవోద్యమానికి ఉన్నదని దాని సైద్ధాంతిక పటుత్వం, వాస్తవిక దృష్టి నమ్మకాన్ని ఇస్తున్నాయి. ఎన్నో యుద్ధాల్లో నష్టపోయి, గెలిచి విప్లవోద్యమం ఈ తీరానికి చేరుకున్నది. సమాజంలో జరుగుతున్న వర్గపోరాటం రాజకీయ నిర్మాణంలో కూడా అనివార్యం కాబట్టి ఈ యాభై ఏళ్లలో ఎన్నో అంతర్గత సంఘర్షణలను, విద్రోహాలను అనుభవించి రాటుదేలింది. అయినా సరే, ఇవ్వాళ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం సామాన్యమైనది కాదు కాబట్టి, దీన్నుంచి విప్లవోద్యమం వెనువెంటనే తెప్పరిల్లి కార్యక్షేత్రంలో, మేధో రంగంలో ఆవరించిన ఈ అననుకూలతలను ఆచరణతో ఎదుర్కోగలదా? అనే సందేహం కూడా కలగవచ్చు. కేంద్ర హౌం అమిత్‌షా పెట్టిన గడువు ఇంకా ఉన్నప్పటికీ, ఆయనకంటే అత్యుత్సాహంగా కొందరు మేధావులు అప్పుడే మావోయిస్టు ఉద్యమాన్ని ఓడిపోయిన పోరాటాల జాబితాలో కలిపేస్తున్నారు.
ఒక నిర్మాణంగా మావోయిస్టు పార్టీకన్నా, నాలుగు తరాల ప్రజలు గడిస్తున్న విప్లవానుభవం భారతదేశ చరిత్రలోనే అత్యంత గాఢమైనది. లోతైనది. బహుముఖమైనది. అది నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలతో సహా ప్రజా ఉద్యమాలన్నిటికంటే ఉన్నతమైనది. ఇరవై ఒకటో శతాబ్దపు ప్రత్యేక స్థలకాల చారిత్రక పర్యావరణంలో ఒక అద్భుత విప్లవ నమూనాగా నిలిచింది. అదంతా ఆపరేషన్ కగార్‌తో ధ్వంసమైపోతుందా? ఒకరిద్దరు నాయకుల సాయుధ, రాజకీయ ప్రతీఘాతుకత్వంతో రద్దయిపోతుందా? విస్తారమైన ప్రజా పోరాటాల చరిత్రలో, సామాజిక సాంస్కృతిక వికాసంలో ఇదొక దశగా ముగిసిపోతుందా? ఎంత కుంగిపోయినా సరే విప్లవ నిర్మాణం, విప్లవోద్యమం ఈ అంతర్ బహిర్ సంక్షోభాన్ని దాటి తిరిగి పుంజుకుంటుందా? చరిత్ర ఏ వైపు నడుస్తుంది? చరిత్రను విప్లవోద్యమం ఏ వైపు నడిపిస్తుంది?
భావోద్వేగ రహితంగా నిజ చరిత్ర నిర్మాణ క్రమం మీద ఆధారపడి చేయవలసిన గంభీరమైన విశ్లేషణ ఇది.
సరికొత్త ప్రయోగాలతో విప్లవోద్యమం ఎట్లా నిరూపించుకుంటుందో ఎదురు చూడాల్సిన కాలమిది.
- పాణి

పాట్నా జైలులో CPI(మావోయిస్టు) పోలిట్‌బ్యూరో సభ్యుడు ప్రమోద్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష
‘అప్రతిహత’ విప్లవ గాథ – ముసాఫిర్
అరెస్టును లొంగుబాటుగా చూపించడంలో మర్మమేంటి?
తల్లికి మావోయిస్టు పార్టీ నాయకుడు పాక హనుమంతు @ గణేష్ లేఖ
ఏ మార్గాన్ని అనుసరించాలి?
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జర్మనీ,టర్కీ లలో కార్యక్రమాలు 