Menu

తన క్లయింట్ల కంటే ఎక్కువకాలం జైలులో ఉన్న న్యాయవాది

anadmin 7 hours ago 0 19

“నా క్లయింట్ల కంటే ఎక్కువ కాలం నేనే జైలులో ఉన్నాను,” అని 57 ఏళ్ల న్యాయవాది సురేంద్ర గ్యాడ్లింగ్ తరచుగా తన కుటుంబంతో సరదాగా అంటూ ఉంటారు. 2018 ఎల్గార్ పరిషద్-భీమా కోరెగావ్ కేసులో అరెస్టు అయిన 16 మందిలో, గ్యాడ్లింగ్ మాత్రమే ఇప్పటికీ జైలులో ఉన్నారు; ఆయన బెయిల్ పిటిషన్ బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. 84 ఏళ్ల ఫాదర్ స్టాన్ స్వామి 2021లో కస్టడీలో ఉండగానే కన్నుమూయగా, మిగిలిన 14 మంది బెయిల్‌పై బయట ఉన్నారు.
ఎల్గార్ కేసులో పూణే పోలీసులు గ్యాడ్లింగ్‌ను అరెస్టు చేసిన ఏడాది తర్వాత, 2019లో మహారాష్ట్ర పోలీసులు ఆయనను 2016 నాటి గడ్చిరోలిలోని సుర్జాగఢ్ అగ్నిప్రమాద కేసులో అరెస్టు చేశారు. ఇనుప ఖనిజాన్ని తీసుకెళ్తున్న 76 వాహనాలను తగులబెట్టే కుట్రలో ఆయన పాత్ర ఉందని పోలీసులు ఆరోపించారు. సుర్జాగఢ్ కేసులో అరెస్టు అయిన వారు అదే ఏడాది బెయిల్‌పై విడుదలవగా, గ్యాడ్లింగ్ బెయిల్ పిటిషన్‌ను ఇంకా సుప్రీంకోర్టులో వినాల్సి ఉంది; విచారణ ప్రారంభం కావాల్సి ఉంది.
ఎల్గార్ కేసు సాగుతూనే ఉంది — కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంకా ఆరోపణలు నమోదు కాలేదు, విచారణ ప్రారంభం కాలేదు. ఒకరి తర్వాత ఒకరుగా మిగిలిన నిందితులకు బెయిల్ లభించింది; సాంస్కృతిక కార్యకర్తలు రమేష్ గైచోర్, సాగర్ గోర్ఖే జనవరి 27న తాజాగా విడుదలయ్యారు.
నాగ్‌పూర్‌లో నివసిస్తున్న గ్యాడ్లింగ్ భార్య మీనల్ (51), ఒక ట్యూషన్ టీచర్. ఆమె మాట్లాడుతూ, “ఇప్పుడు ఆయనొక్కరే జైలులో ఉన్నప్పటికీ, మిగిలిన వారు విడుదలైనందుకు ఆయన సంతోషంగా ఉన్నారు. తను ఏ తప్పూ చేయలేదనే నమ్మకంతో ఆయన ధైర్యంగా ఉన్నారు. ఈ నిజం ఇచ్చే ధైర్యమే ఆయనను, మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది,” అని అన్నారు. గ్యాడ్లింగ్‌కు ఇద్దరు పిల్లలు — కుమారుడు న్యాయవాది, కుమార్తె చదువుకుంటోంది.

గ్యాడ్లింగ్‌ను 2018 జూన్ 6నాడు నాగ్‌పూర్‌లో అరెస్టు చేశారు. పూణేకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని భీమా కోరెగావ్ వద్ద జనవరి 1న జరిగిన హింసను ప్రేరేపించారనే ఆరోపణలను ఆయనతో పాటు ఇతరులపై పూణే పోలీసులు మోపారు. భీమా కోరెగావ్ అనేది 1818లో జరిగిన ఒక యుద్ధానికి గుర్తుగా నిర్మించిన స్మారక స్తంభం ఉన్న ప్రాంతం. ఆ యుద్ధంలో దళిత సైనికులతో కూడిన బ్రిటిష్ సైన్యం పీష్వా పాలనను ఓడించింది. ప్రతి ఏటా జనవరి 1న ఈ వార్షికోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో సందర్శకులు అక్కడికి వస్తుంటారు.
2018 జనవరి 1నాడు ఈ స్మారకాన్ని సందర్శిస్తున్న వారిపైన గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ తర్వాత చెలరేగిన హింసలో సమీప గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరణించారు. స్థానిక పోలీసులు మొదట మితవాద సంస్థల నాయకులు మిలింద్ ఎక్బోటే, శంభాజీ భిడేలపై FIR ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. అయితే, ఆ తర్వాత త్వరలోనే పూణే పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తూ, ఒక రోజు ముందు (డిసెంబర్ 31, 2017) జరిగిన ‘ఎల్గార్ పరిషద్’ కార్యక్రమమే ఈ హింసకు ప్రేరణ అని ఆరోపించారు. ఈ కార్యక్రమం మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు జరిగిన కుట్ర అని కూడా తర్వాత అభియోగం మోపారు .
ఆ తరువాత పూణే పోలీసులు దేశవ్యాప్త సోదాలు నిర్వహించి గ్యాడ్లింగ్‌తో పాటు ఇతరులను అరెస్టు చేశారు. వారి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, నిందితులు అమెరికాకు చెందిన ‘ఆర్సెనల్ కన్సల్టింగ్’ అనే డిజిటల్ ఫోరెన్సిక్ సంస్థ నిర్వహించిన విచారణను ఆధారంగా చూపుతున్నారు. పోలీసులు “సాక్ష్యాలు” అని పేర్కొంటున్న పత్రాలను మాల్వేర్ ఉపయోగించి తమ పరికరాల్లో పెట్టారనివారు వాదిస్తున్నారు.
గడ్చిరోలి, చంద్రపూర్ వంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ‘ఉగ్రవాద వ్యతిరేక చట్టం’ (ఉపా) కింద కేసులు ఎదుర్కొంటున్న వారి తరపున వాదించినందుకే గ్యాడ్లింగ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన సహచరులు చెబుతున్నారు—ప్రస్తుతం ఆయన కూడా అదే చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఒక దళిత కూలీ, రిక్షా కార్మికుడి కుమారుడైన గ్యాడ్లింగ్, మొదట రైల్వేలో అప్రెంటిస్‌గా పని చేయడం ప్రారంభించారు. కానీ త్వరలోనే న్యాయశాస్త్రం వైపు ఆకర్షితులై, తన కుటుంబంలోనే మొదటి లాయర్ అయ్యారు. 90వ దశకం ప్రారంభంలో నాగ్‌పూర్ ట్రయల్ కోర్టుల్లో యువ న్యాయవాదిగా ఉన్నప్పుడు, ఆయన తరచుగా తన క్లయింట్లను కలిసేవారు—వీరిలో చాలామంది పొరుగు జిల్లాల నుండి వచ్చిన దళిత, ఆదివాసీ సముదాయాలకు చెందినవారు. వీరికి న్యాయవాదిని సంప్రదించడం అనేది ఒక పెద్ద సవాలుగా ఉండేది.
“జైలులో ఉన్న తమ కుటుంబ సభ్యులను చూడటానికి వెళ్లేందుకే డబ్బులు లేని అప్పట్లో, మంచి లాయర్‌ను పెట్టుకోవడం అంటే వారికి అసాధ్యమైన విషయం. తన రెగ్యులర్ క్రిమినల్, సివిల్ ప్రాక్టీస్‌తో పాటు, ఆయన వీరి కేసులను ఉచితంగా (ప్రొ బోనో) లేదా వారు ఎంత ఇస్తే అంత తీసుకుని వాదించడం మొదలుపెట్టారు,” అని మీనల్ తెలిపారు.

ఎంతోమంది విచారణ ఖైదీలు తమ తరపున వాదించడానికి లాయర్ లేకుండా ఏళ్ల తరబడి జైలులోనే ఉండిపోయేవారని గ్యాడ్లింగ్ గురించి తెలిసిన తర్వాత, వారి కుటుంబ సభ్యులు మారుమూల ప్రాంతాల నుండి నాగ్‌పూర్‌కు ప్రయాణించి వచ్చేవారు అని ఆమె గుర్తు చేసుకున్నారు. “ఇప్పుడు ఆయన జైలులో ఉండటంతో, అరెస్టు అయిన వారి కుటుంబాలు ఎంతటి కష్టాలను ఎదుర్కొంటాయో నాకు అర్థమవుతోంది. జైలులో వారికి కనీస అవసరాలైన బట్టలు, మందులు అందించడం కూడా ఎంత కష్టమో తెలుస్తోంది,” అని ఆమె అన్నారు. గ్యాడ్లింగ్ తన క్లయింట్లుగా ఉన్న మహిళా ఖైదీల కోసం అవసరమైన వస్తువులను కొని పంపమని తనను అడిగేవారని ఆమె గుర్తు చేసుకున్నారు.
అతి త్వరలోనే ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన దగ్గర ఇంటర్న్‌లుగా, జూనియర్ అసోసియేట్లుగా పనిచేసిన న్యాయవాదులు.. గ్యాడ్లింగ్ ఒక సాక్షిని క్రాస్-ఎగ్జామిన్ చేస్తుంటే చూడటానికి ఎప్పుడూ ఒక ప్రేక్షక సమూహం ఉండేదని గుర్తు చేసుకుంటారు. స్కూలు, కాలేజీ రోజుల్లో ఆయన నేర్చుకున్న సంగీతం, నాటక కళలను కోర్టులో సమర్థవంతంగా ఉపయోగించేవారు.
“ఆయన కేసును సిద్ధం చేస్తున్నప్పుడు, ఛార్జ్‌షీట్లు చదువుతున్నప్పుడు లేదా వాదనల వ్యూహాలను రచిస్తున్నప్పుడు జూనియర్లు అందరూ ఆయనతో పాటే ఉండేవారు. అయితే, కోర్టులో మాత్రం ఆయన ఒక అప్పటికప్పుడు చేసే అద్భుత ప్రదర్శనలా) ఏదైనా కవితను లేదా మరాఠీ జానపద గేయాన్ని ఆలపించేవారు. ఆయన గంభీరమైన స్వరం కోర్టు గదుల అంతటా వినిపించేది. ఆయన వాదనలను చూసి నేర్చుకోవడానికి కోర్టు గదిలో ఎప్పుడూ న్యాయవాదుల గుంపు వేచి ఉండేది,” అని 2008 నుండి గ్యాడ్లింగ్‌తో కలిసి పనిచేసి, ఆపై స్వతంత్ర న్యాయవాదిగా మారిన జగదీష్ మేష్రామ్ తెలిపారు.
గడ్చిరోలి జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలలో ఎక్కువమంది మావోయిస్టు సానుభూతిపరులుగా లేదా మద్దతుదారులుగా ముద్రపడిన గ్రామస్థులేనని, అలాంటి తప్పుడు అరెస్టుల కేసులలో గ్యాడ్లింగ్ చాలామందిని నిర్దోషిగా విడుదల చేయించారని మేష్రామ్ గుర్తు చేసుకున్నారు. అయితే, మావోయిస్టు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో అరెస్టు అయిన ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ ప్రొఫెసర్ జీ.ఎన్. సాయిబాబా తరపున ఆయన చేసిన వాదనే అధికారుల దృష్టిని ఆయనపై పడేలా చేసింది.
ఎల్గార్ కేసులో నిందితుడిగా ఉన్న మరో కార్యకర్త అరుణ్ ఫెరీరాకు కూడా గతంలో మావోయిస్టు సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చినప్పుడు గ్యాడ్లింగ్ ఆయన తరపున వాదించారు. అలాగే, 2006లో ఒక దళిత కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దారుణంగా హత్యకు గురైన ‘ఖైర్లాంజీ మారణకాండ’ కేసులో బాధితుల తరపున కూడా ఆయన నిలబడ్డారు.
ఆరోగ్య సమస్యలు, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జైలులో తన ఆయుర్వేద మందులకోసం చేసిన పోరాటం, తన తల్లి, వదినల మరణంలాంటి ఇబ్బందులెన్ని ఎదురైనా గ్యాడ్లింగ్ తను అనుభవిస్తున్న వేదనను తన స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు ఎప్పుడూ తెలియనివ్వలేదని మీనల్ చెప్పారు.
2021లో కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్‌పైన విడుదలైనప్పుడు, ఆయన తాను ప్రాక్టీస్ చేసే నాగ్‌పూర్ కోర్టుకు వెళ్ళి అక్కడ, ఎప్పటిలాగే తోటి న్యాయవాదుల సమక్షంలో, ఈ కేసులో మరో నిందితుడైన గైచోర్ జైలు జీవితంలోని కష్టాల గురించి రాసిన ఒక పాటను పాడి వినిపించారు.
ఆ సమయంలో ఆయన వారితో ఇలా అన్నారు: “నేను బయట ఉన్నప్పుడు మానవ హక్కుల కోసం కొంత పని చేశాను, కానీ జైలుకు వెళ్ళిన తర్వాత అది ఏ మాత్రం లెక్కకు రాదని నాకు అర్థమైంది; అక్కడ చేయాల్సింది ఇంకా చాలా ఉంది.”

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో
వ్యాస రచయిత:సదాఫ్ మోదక్
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad