ముహుర్తాలు ముగిశాయి. అంతా అయిపోయిందనే అధికారిక ప్రకటనలూ వచ్చాయి. అయినా… అడవింకా రగులుతూనే ఉంది. జల్ జంగల్ జమీన్ నినాదమింకా మార్మోగుతూనే ఉంది. అడవి ఎదను తొలుస్తున్న రాక్షస యంత్రాలకెదురు ఆదివాసీ నిలబడే ఉన్నాడు. నిన్నటిదాకా అండగా నిలిచిన అన్నల దండు ఇప్పుడు కనిపించకపోవచ్చు… గూడెం చుట్టూ తుపాకుల క్యాంపులు మొలిచాయి కావచ్చు… అయినా, ఈ నేలలో పాతుకుపోయిన అతడి అస్థిత్వపు వేళ్లను పెకిలించడం అంత సులభం కాదు. ఎందుకంటే అతడింకా పోరాటంలోనే ఉన్నాడు. నిర్భందాలకు తలొగ్గని తిరుగుబాటు కేతనం అతడు.
ఆపరేషన్ కగార్ లక్ష్యాన్ని సాధించిందనీ, ఇక విప్లవోద్యమం ఒక చరిత్ర మాత్రమేనని చెబుతున్న పాలకులు – ఇప్పుడు అడవిని చెరబట్టేందుకు తెగ ఉబలాటపడుతున్నారు. వనరుల దోపిడీ కోసం విచ్ఛలవిడిగా మైనింగ్ కంపెనీలను ఎగదోస్తున్నారు. దశాబ్దాలుగా అడవిలోకి అడుగుపెట్టలేకపోయిన కార్పొరేట్ కంపెనీలు… అన్నలు లేని అరణ్యాన్ని ఇప్పుడు కబ్జాపెట్టేందుకు కదిలివస్తున్నాయి. కానీ, అక్కడి ఆదివాసీలు మాత్రం తమ కాళ్ల కింది నేలను కోల్పోవడానికి సిద్ధంగాలేరు. ఒడిశాలో వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా పెల్లుబికిన ప్రజా పోరాటమే అందుకు తాజా నిదర్శనం. నియంగిరి నుంచి హస్దియో, సూరజ్‌గడ్, సరండా ఇలా దండకారణ్యంలోని అటవీ ప్రాంతాలంతటా ఆదివాసీ ప్రజలు గనుల తవ్వకానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. లాఠీ తూటాలను లెక్కజేయకుండా ధిక్కారాన్ని ప్రదర్శిస్తున్నారు.
కానీ, “సబ్ చంగా సీ” అంటోంది సర్కారు. అంతా బావుందని బుకాయిస్తున్న సర్కారు – ఆదివాసీ పోరాటాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త పాట ఎత్తుకుంది. నక్సలిజం కారణంగా ఆధునికతకు దూరంగా బతికిన ఆదివాసుల జీవితాల్లో ఇక వెలుగులు నింపుతామంటోంది. బయటి ప్రపంచంతో అడవిని అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తామంటోంది. అందుకోసం పర్యాటకమనే మంత్రాన్ని జపిస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు టూరిజం తప్ప ఇక ఏ ఇజానికీ భవిష్యత్తు లేదనే వాదనను ముందుకు తెచ్చి ప్రజల తిరస్కారానికి గురయ్యాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే వాదనతో ముందుకొచ్చింది.
దేశ సహజ వనరులు దోచుకునేందుకు కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానం పలుకుతున్న నయా పాలసీ ఇది. నెత్తురింకిన నేలను అత్తరువాసనల కొత్త అవతారంలో చూపించే కుట్ర పేరే ఇప్పుడు టూరిజం. గద్దల్లా వాలిపోతున్న మైనింగ్ కంపెనీలకు ఖనిజసంపదనంతా పళ్లెంలో పెట్టి అప్పగించేందుకు పర్యాటక ముసుగులేస్తున్న ముచ్చట ఇది. సాయుధ బలగాల సంరక్షణలో సాగుతున్న కాసుల వేటకు పర్యాటక వృద్ధి అనే ముద్దుపేరు పెట్టుకుంది సర్కారు. బస్తర్‌లో ఇప్పుడిదే జరుగుతోంది. తమిళ జాతి విముక్తి పోరాటాన్ని వేదికైన జాఫ్నాను పర్యాటక ప్రాంతంగా మార్చిన శ్రీలంక సర్కారు దారిలోనే ఇప్పుడు భారత సర్కారు నడుస్తోంది.
దశాబ్దాల పాటు అన్నలు తిరుగాడిన చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు, తెలంగాణలోని ములుగు అటవీ ప్రాంతాల్లో ఇప్పుడు కొత్త వెంచర్లు ప్రారంభం కానున్నాయి. నిన్నటి వరకు విప్లవోద్యమానికి నెలవుగా నిలిచిన బస్తర్‌ను ఇప్పుడు టూరిజం మ్యాప్‌లో నిలబెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. బస్తర్‌లో ‘ట్రైబల్ టూరిజం సర్క్యూట్’ అభివృద్ధి పేరుతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భద్రతా దళాల శిబిరాల నడుమ ‘ఎకో-టూరిజం’ ప్రాజెక్టులు పురుడుపోసుకుంటున్నాయి. నిన్న మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు నిలిచిన చోట రేపు పర్యాటక హోర్డింగులు వెలుస్తాయి కాబోలు. తెలంగాణలోని ములుగు, ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇదే తరహా మార్పులు జరుగుతున్నాయి. సరెండర్ పాలసీల పేరిట ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు పర్యాటక శాఖలో ఉద్యోగాలిస్తామంటోంది. టూరిస్టు గైడ్లుగా, రిసార్ట్ సిబ్బందిగా ఉపాధికల్పిస్తామంటోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లొంగిపోయిన పలువురు మావోయిస్టులను గిరిదర్శకులుగా నియమించింది. ప్రభుత్వాలు ఎన్ని తాయిళాలు ప్రకటించినా లొంగిపోయిన వాళ్ల జీవితాలు భద్రతాబలగాల నిఘా నీడలో గడవాల్సిందే.
నిజానికి – అడవిలోకి విశాలమైన రహదారులు చొచ్చుకుపోతోంది పర్యాటకుల కోసం కాదు, అక్కడి కొండలను పిండి చేసి ఖనిజ సంపదను తరలించే టిప్పర్ల కోసం. ఆదివాసీ గూడాల మధ్య హోటళ్లు, రిసార్టులు వెలిసేదీ స్థానికుల ఉపాధి కోసం కాదు, వారి అస్తిత్వాన్ని తుడిచిపెట్టే సాంస్కృతిక దాడుల కోసం. పర్యాటక ముసుగులో ఖనిజ సంపద విస్తారంగా గల అటవీ ప్రాంతాలను వ్యూహాత్మక స్వాధీనం చేసుకోవడం, టూరిజం ముసుగులో సాయుధ బలగాల క్యాంపులను విస్తరించడం, దశాబ్దాల ప్రజా పోరాటాల గుర్తులను తుడిచివేసి, నేలను ఒక ‘వ్యాపార వస్తువు’గా మార్చడం ఇప్పుడు జరుగుతున్న కుట్ర. రేపొద్దున పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం కూడా కార్పొరేట్ సంస్థలకు వెళ్తుంది తప్ప, సర్వం కోల్పోయిన స్థానిక ఆదివాసీ ప్రజలకు ఏమీ ఒరగదు.
బస్తర్‌లో ఇప్పటికీ లక్షలాది ఆదివాసీలు దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఆదివాసీ హక్కుల పేరిట ఉన్న చట్టాలేవీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వాల దృష్టిలో ఆదివాసీలంటే కేవలం మ్యూజియంలో వింతైన వస్తువులలాంటి వాళ్లు. నగరవాసుల కాలక్షేపం స్థాయికి ఆదివాసీ నృత్య ప్రదర్శనలను దిగజార్చిన వర్తమానం కళ్లముందరి చరిత్రే. ఇలాంటి పాలకులు ఆదివాసీల సంక్షేమాన్ని కాంక్షిస్తారంటే ఎలా నమ్మగలం. దశాబ్దాలుగా మావోయిస్టుల పేరుతో ఆదివాసీలపై భద్రతా బలగాలు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. వందలాది మంది ఆదివాసీలను హత్యచేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఊర్లకు ఊర్లు తగలబెట్టారు. వేలాదిమంది ఆదివాసీలను అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్లలో బంధించారు. ఇంతటి హింసకాండకు సాక్ష్యంగా నిలిచిన నేలకు – ఇప్పుడు పర్యాటకమనే కొత్త సొగబులు అద్దుతోంది సర్కారు.
శ్రీలంకలో ఎల్‌టీటీఈ ఉద్యమాన్ని నెత్తుటేరుల్లో ముంచిన తరువాత ముల్లైతీవు వంటి ప్రాంతాల్లో జరిగిన దారుణాలను కప్పిపుచ్చుతూ, అక్కడ యుద్ధ స్మారకాలను పర్యాటక కేంద్రాలుగా మార్చారు. “ఇక్కడే ఎల్‌టీటీఈ అధినేత నివసించేవాడు, ఈ యుద్ధ ట్యాంకర్‌ను తమిళ పులులే తయారు చేశారు, ఈ కూలిన గోడల కిందే వందలాది మంది తమిళ టైగర్స్ చనిపోయారు” అంటూ పర్యాటకులకు అక్కడి రక్తసిక్త చరిత్రను పరిచయం చేశారు. ఇప్పుడు బస్తర్‌లోనూ అదే ఫార్ములా సిద్ధమవుతోంది. స్థానిక ఆదివాసీలను తమ సొంత నేల నుండి వెలివేసి, అక్కడ దేశ విదేశీ పర్యాటకుల కోసం విలాస కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నమిది. “ఇక్కడే మావోయిస్టు దళపతి నేలకూలింది, ఇక్కడే నక్సలైట్లు ఆదివాసీ పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్లు, ఇక్కడే.. మావోయిస్టుల స్థూపాలు ఉండేవి” అంటూ రేపొద్దున పర్యాటకులకు ఈ కొత్త టూరిస్ట్ గైడ్‌లు దండకారణ్యాన్ని పరిచయం చేస్తారు కాబోలు.
కానీ… ఇక్కడ పర్యాటకమంటే ఆహ్లాదం కాదు, దోపిడీకి అస్త్రం. యుద్ధ క్షేత్రాలను విహార యాత్రాకేంద్రాలుగా మార్చడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.. ఆ నేల మీద భూమిపుత్రుల హక్కులను కాలరాయడం. బస్తర్ లాంటి ప్రాంతాల్లో పర్యాటక రిసార్టులు వెలుస్తున్నాయంటే, అక్కడ ప్రజల ప్రతిఘటనను అణచివేసి, పారామిలటరీ బలగాల పహారాలో మైనింగ్ మాఫియాకు మార్గం సుగమం చేయడమే. ఇప్పుడు పరుచుకుంటున్న రోడ్ల మీదుగా కార్పొరేట్ కంపెనీలు ఖనిజ సంపదను తరలించుకుపోతాయి. పర్యాటకం పేరుతో సాగుతున్న ఈ ‘వార్ టూరిజం’ నిజానికి పర్యావరణం మీద, మానవ హక్కుల మీద జరుగుతున్న దాడి.
శ్రీలంకలో యుద్ధం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా తమిళ-సింహళీయుల మధ్య ఐక్యత సాధ్యంకాలేదు. పర్యాటక రంగం మూడు పూలు ఆరు కాయలుగా అభివృద్ధినొందినా.. ఒక జాతి గుండెగాయం మానలేదు. ప్రభాకరన్ బంకర్ ముందు పర్యాటకులు సెల్ఫీ తీసుకోవడం చూసినట్లు… పచ్చని అడవిలోకి చొచ్చుకొచ్చిన క్యాంపుల్లో, పసిపిల్లల్ని బలితీసుకున్న తుపాకుల ముందు కూడా- రేపు పర్యాటకులు ఫొటోలు తీసుకోవచ్చు. రేపు – రోడ్లు విస్తరిస్తాయి, రిసార్టులు వెలుస్తాయి, పర్యాటకుల రాకపోకలు పెరుగుతాయి. కానీ ఆ దారుల్లో ఇంకిన నెత్తురుకీ, కోల్పోయిన జీవితాలకీ – ఏ టూరిజమూ జవాబు చెప్పలేదు.

మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడి మరణం
చివరి రక్తం బొట్టు వరకు విప్లవ పంథా కోసం నిలబడ్డ యోధుడు కామ్రేడ్ రాజు దాదా
విద్రోహ కాలంలో విప్లవ పంథా కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడు కామ్రేడ్ రాజు దాదా
తెలంగాణలో ఉద్యమకారులకు NIA నోటీసులు
మావోయిస్టు నాయకులు దేవ్ జీ, సంగ్రామ్ లను కోర్టులో హాజరుపర్చాలి-కూనంనేని డిమాండ్
పాట్నా జైలులో CPI(మావోయిస్టు) పోలిట్‌బ్యూరో సభ్యుడు ప్రమోద్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష 