పార్టీలో పని చేస్తున్న ఇద్దరు కోవర్టులను ప్రజా కోర్టులో విచారించి, వారి తప్పులను ఒప్పించడం జరిగిందని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామ రాజు డివిజన్ కమిటీ ప్రకటించింది. ఆ తరువాత ప్రజల అభిప్రాయం మేరకు వారిద్దరిని విడిచిపెట్టేశామని కమిటీ కార్యదర్శి ఆజాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆజాద్ ప్రకటన పూర్తి పాఠం…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యూహాత్మక సూరజ్ కుండ్ బహుముఖ దాడిలో ఆపరేషన్ ‘కగార్’ మోసపు ఎత్తుగడలతో ప్రజాయుద్దాన్ని నిర్మూలించలేరు
విప్లవ ద్రోహులను, కోవర్ట్ లను పార్టీ, ప్రజలు ఎన్నటికీ క్షమించరు
రాజ్ కుమార్, అర్జున్ లను ప్రజాకోర్టులో పెట్టి విచారించి-విడిచి పెట్టాము
గుంటూరు జిల్లా, మాచర్ల గ్రామానికి చెందిన కాకర్ల రవి కుమార్ PDSU విద్యార్థి సంఘంలో పనిచేస్తూ 2016లో పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడై రిక్రూట్ అయ్యడు. 2023 ఏప్రిల్ నెలలో రవిలో వస్తున్న మార్పులను, ప్రవర్తనను, వ్యవహార పద్ధతిలో తప్పుడు భావాలు, లంపెన్ బుద్దులు తలెత్తడంతో ఇంటికి పంపించడం జరిగింది. కాకర్ల రవితో పాటు భార్య కల్పన పోలీసుల ఎదుట సరెండర్ అయి పోలీసు ఇన్ ఫార్మర్ గా, విప్లవ ద్రోహిగా మారాడు. పార్టీలో పని చేస్తున్న క్రమంలో పరిచయం ఉన్న వ్యక్తులను కూడా పోలీసు ఇన్ ఫార్మర్స్ గా, కోవర్టుగా తయారు చేశాడు. అందులో భాగంగా అర్జున్, రాజ్ కుమార్ లను కోవర్టులుగా తయారు చేశాడు.
గాలి నారాయణ రెడ్డి అలియస్ రాజ్ కుమార్ వయస్సు 36 సంవత్సరాలు. తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, తల్లి రంగమ్మ అనంతపురం జిల్లా, చెన్న కొత్తపల్లి మండలం, వర్రం పల్లి గ్రామంకు చెందిన వాడు. 2020 అక్టోబర్ లో సోషల్ మీడియా ద్వారా పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడై పూర్తికాలం కార్యకర్తగా రిక్రూట్ అయ్యాడు. 2023 జనవరి 7 వరకు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పని చేస్తున్న క్రమంలో శబరి ఏరియా, వెంకటాపురం గ్రామం దగ్గర అరెస్టు అయినాడు. పోలీసులు అరెస్టు చేసి 15 రోజులు పోలీసు కస్టడీలో చిత్రహింసలు పెట్టారు. నీవు ఇన్ ఫార్మర్ గా మారాలని లేకపోతే నీపై అనేక కేసులు పెట్టి 30 సంవత్సరాలు జైలులో వేస్తామని భయభ్రాంతులకు గురిచేసినా లొంగకపోవడంతో 2 కేసులు పెట్టి జైలుకు పంపారు. సంవత్సరం తరువాత బెయిల్ పై జైలు నుండి అడుగుపెట్టగానే పోలీసులు విజయవాడ తీసుకొని పోయారు. SIB గేటు దగ్గర పట్టుకొని DSP అశోక్, ఏటపాక SPతో పాటు ఇంటలిజెన్స్ అధికారులు 5 రోజులు పాటు కోవర్టు పని చేయాలని ఫుల్ మోటివేషన్ చేసినా వినకపోవడంతో కాకర్ల రవిని పిలిపించి ఒప్పించారు. లేకపోతే మళ్ళీ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. కోవర్టుగా పని చేయడం తప్ప నీకు మార్గం లేదని అయోమయంలోకి తోసేసారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో కోవర్టుగా ఒప్పుకొని 2024 ఫిబ్రవరిలో మళ్ళీ పార్టీలో పని చేస్తానని వచ్చాడు. పోలీసులు, కాకర్ల రవి కాంటాక్టులో ఉంటూ పార్టీకి ద్రోహం చేయపూనుకున్నారు.
దుండి తేజ అమర్ నాథ్ అలియాస్ అర్జున్ వయస్సు 25 సంవత్సరాలు. తండ్రి ముసలరెడ్డి, తల్లి లక్ష్మి బాపట్ల జిల్లా, చీరాల గ్రామానికి చెందిన వ్యక్తి. పార్టీ రాజకీయాల పట్ల విశ్వాసంతో దోపిడీ లేని రాజ్యాధికారంకై పోరాడాలని నిర్ణయించుకొని 2021 డిసెంబర్ నెలలో పూర్తికాలం కార్యకర్తగా రిక్రూట్ అయినాడు. అప్పటి నుండి 2024 ఫిబ్రవరి వరకు పార్టీకి, ప్రజలకు విశ్వాసంగా పార్టీ క్రమశిక్షణను అమలు చేస్తూ పని చేశాడు. పని చేస్తున్న క్రమంలో కగార్ దాడిని రాజకీయంగా అర్థం చేసుకోకపోగా కాకర్ల రవి మాటలు నమ్మి కోవర్టు గా తయారు అయినాడు. SP రాకేష్ కూడా మెల్లగా అర్జున్ కు పరిచయం అయి నీవు డేరాల సమాచారం, నాయకత్వం సమాచారం ఇవ్వాలి నీకు ఎలాంటి హాని కలగకుండా నేను చూసుకుంటానని చెప్పాడు. అర్జున్ ప్రజల పట్ల, పార్టీ పట్ల విశ్వాసాన్ని కోల్పోయి కోవర్టు పని చేయడానికి ఒప్పుకున్నాడు. పోలీసులకు పార్టీ సమాచారం అందజేస్తూవచ్చాడు. OSD భరత్ తో పాటు పలు పోలీసు అధికారులు ఈ దుష్ట పథకానికి పాల్గొన్నారు.
భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ విజయానికై పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ని నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మక సూరజ్ కుండ్ బహుముఖ దాడిలో భాగంగా ఆపరేషన్ కగార్ దాడిని ప్రజలపై, పార్టీపై ఆఖరి యుద్ధాన్ని ప్రకటించింది. దేశంలోని ఆకలి చావులను, నిరుద్యోగాన్ని నిర్మూలించలేని ఈ దోపిడీ పాలకవర్గాలు ప్రజాపోరాటాలను నిర్మూలించడానికి ఎంతో శ్రద్ధ వహిస్తున్నాయి. అమాయక ఆదివాసీ ప్రజలను, పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి, డబ్బుల ఆశ చూపించి ఇన్ ఫార్మర్ గా, కోవర్టు లుగా తయారు చేసి నిజాయితీ లేని మనిషిగా భవిష్యత్తు తెలియని అంధకారంలోకి నెట్టివేస్తున్నారు.
ఈ మోసపుకారి యుద్ధము పార్టీకీ, ప్రజలకు కొత్తమీ కాదు. మీ మోసపు ఎత్తుగడలతో విప్లవోద్యమాన్ని నిర్మూలించలేరు. ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధ చరిత్రను చదివినా అంతిమంగా ప్రజలదే విజయమనేది జగమెరిగిన సత్యమే. భారత అర్థ వలస, అర్థ భూస్వామ్య వ్యవస్థ కూలిపోక తప్పదు, నూతన ప్రజాస్వామిక విప్లవం రాక తప్పదు. దోపిడీ పాలక వర్గాల మోచేతి నీళ్ళు తాగే పోలీసు కుక్కల మాటలు నమ్మకండి. ఇన్ ఫార్మర్స్, కోవర్టుగా తయారు కాకండి అంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
రాజ్ కుమార్, అర్జున్ లను క్యాడర్ ముందు, ప్రజల ముందు పెట్టి – తప్పులను ఒప్పించడం జరిగింది. ఆ తరువాత ప్రజల అభిప్రాయం మేరకు విడిచిపెట్టడం అయింది.
ఆజాద్,
కార్యదర్శి,
భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామ రాజు డివిజన్ కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

పాట్నా జైలులో CPI(మావోయిస్టు) పోలిట్బ్యూరో సభ్యుడు ప్రమోద్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష
‘అప్రతిహత’ విప్లవ గాథ – ముసాఫిర్
అరెస్టును లొంగుబాటుగా చూపించడంలో మర్మమేంటి?
తల్లికి మావోయిస్టు పార్టీ నాయకుడు పాక హనుమంతు @ గణేష్ లేఖ
ఏ మార్గాన్ని అనుసరించాలి?
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జర్మనీ,టర్కీ లలో కార్యక్రమాలు 