Menu

మీ జ్ఞాపకాలతో జీవిస్తాం…మీ ఆలోచనలతో ముందుకుపోతాం

anadmin 6 hours ago 0 12

అమరుల బంధుమిత్రుల సంఘం 24 ఆవిర్భావ సభ
జూలై 18 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాట్రగడ్డ హాలు, హైదరాబాదు
జీవితంలో ఆనందాలను మర్చిపోగలమేమోగాని దు:ఖాలు ఎన్నటికీ దూరం కావు. కష్టాలన్నిటిలోకి కళ్ల ముందు మరణాలు తీరని విషాదంగా మిగిలిపోతాయి. కన్నవాళ్ల ముందే బిడ్డలు మరణించడం, జీవితమంతా కలిసి ఉంటారనుకున్న సహచరులు అర్ధాంతరంగా వెళ్లిపోవడం, తల్లిదండ్రులెవరో తెలియని బాల్యాన్ని గడపడం, తోడబుట్టిన వాళ్ల కోసం ఏండ్ల తరబడి నిరీక్షించి చివరికి మృతదేహాన్ని చూడాల్సి రావడం, ఇంకొందరి చివరిచూపు కూడా దక్కకపోవడం జీవితాంతం కలచివేస్తూనే ఉంటుంది. మానిపోని ఆ గాయాన్ని మోసుకు తిరగడం దుర్భరంగా ఉంటుంది. మరణించిన ఆ వ్యక్తులు కుటుంబ పరిధిని దాటిన వాళ్లవాళ్లయితే ఆ విషాదం సామాజిక విషాదంగా మారుతుంది.
కొంత మంది చైతన్యవంతమైన వ్యక్తులు కుటుంబాలను, రక్త సంబంధాలను దాటి సమాజంలోకి వెళతారు. మనుషులందరూ బాగుండాలని కోరుకుంటారు. మానవ జీవితం అర్థవంతం కావాలని ప్రయత్నిస్తారు. ఉదార్తమైన, ఉన్నతమైన సంబంధాల్లో మనుషులు జీవిస్తే ఎంత గొప్పగా ఉంటుందో కలగంటారు. దాన్ని నిజం చేయడానికి ప్రజలను సమీకరిస్తారు. వాళ్లతో కలిసి సృజనాత్మకమైన పనులు చేస్తారు. కానీ ఇవి అవినీతి పాలకులకు నచ్చవు. తమ ఆధిపత్యాలు కూలిపోతాయని కత్తులు దూస్తారు. మంచి కోసం ప్రయత్నిస్తున్న మనుషులను హత్య చేయిస్తారు.
ఈ హింస వందల వేల సంవత్సరాలుగా నడుస్తోంది. మరణించిన వాళ్లంతా తమ చివరి క్షణాల్లో ‘నేను మరణించినా, లక్షోప లక్షలై తిరిగి వస్తాను..’ అని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కన్నుమూశారు. ఆ మరణం, ఆ చివరి సందేశం కుటుంబ సభ్యులను కలచి వేస్తుంది. తమ రక్త సంబంధీకులు నడచిన దారి ఏమిటో తెలుసుకోవాలని ఆరాటపడేలా చేస్తుంది. కానీ హింసకు పాల్పడిన వాళ్లు విప్లవకారుల రక్తసంబంధికుల వేదన పట్టించుకోరు. పైగా తాము చంపేసిన వాళ్లు నడచిన మానవీయ విలువల దారిని చెరిపేయాలనుకుంటారు. వాళ్ల త్యాగం ఎవ్వరికీ కనపడకుండా చేయడానికి సమాజాన్నంతా చీకటి మయం చేయాలనీ ప్రయత్నిస్తారు.
కానీ సమాజం దీన్ని అంగీకరిస్తుందా? ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ల కుటుంబ సభ్యులు మౌనంగా రోదిస్తూ ఉండాలా? హింస లేని లోకం కోసం నేలకొరిగిన వాళ్ల గురించి మనసు విప్పి నాలుగు మాటలు మాట్లాడుకోవద్దా? మనుషులు లోలోపల కుమిలిపోతూ ఎంతకాలం ఉంటారు? అందుకే బంధుమిత్రులు తనివితీరా దు:ఖించాక లేచినిలబడతారు. ఈ వలపోతను… అమరుల కోసం వీరగానంగా మలుచుకుంటారు. వీరుల జీవితాన్నే పాటలుగా పాడతారు. వాళ్ల రూపాలను తమ జ్ఞాపకాల్లో పదిలపరుచుకుంటారు. చనిపోయిన వాళ్లు చెప్పి వెళ్లిన మాటలను తమకు తెలిసిన భాషలోకి మార్చుకొని, నలుగురు కలిసిన చోటల్లా తలపోసుకుంటారు. మనుషులు చనిపోయినా, వాళ్ల ఆలోచనలు ఆగిపోవని గుండెకోతతో నిరంతరం మాట్లాడుతుంటారు.
ఇప్పుడు మనం పోయిన జూలై నుండి ఇప్పటివరకు అమరులైన మోడెం బాలకృష్ణ, చంద్రవాసు, జాడి వెంకటి, కడారి సత్యనారాయణరెడ్డి, కాత రామచంద్రారెడ్డి, హిడ్మా, రాజే, వారితో పాటు మరో నాల్గురు ఆదివాసీ వీరులు, పడ్కాల్ స్వామి, పాక హనుమంతు, రంగబోయిన భాగ్య, మెట్టూరి జోగారావు (టెక్ శంకర్)లను, వివిధ రాష్ట్రాల్లో అమ‌రులైన ఆదివాసీ, ఆదివాసేతర‌ వీరుల‌ను స్మరించుకుందాం. మన కుటుంబాల్లో పుట్టి పెరిగి, మంది కోసం ప్రాణాలు త్యాగం చేసిన మన రక్త సంబంధీకులందరినీ స్మరించుకుందాం. వాళ్లు మన కడుపున పుట్టి ఉండవచ్చు. మనతోపాటు ఎంగిలిపాలు తాగి పెరిగి ఉండవచ్చు. మనతో జీవితాన్ని పంచుకొని ఉండవచ్చు. కానీ వాళ్లు అంత మాత్రానికే గౌరవనీయులు కాలేదు. పేద ప్రజల కోసం ప్రాణాలిచ్చిన గొప్పవాళ్లు. మనకు స్ఫూర్తినిచ్చేవాళ్లు. వాళ్ల ఎడబాటు మనకు దు:ఖమే. కానీ గర్వకారణం. అలాంటి అద్భుతమైన వ్యక్తులు మన కుటుంబాల్లో పుట్టారని, మనతో కలిసి జీవించారని, ఈ లోకాన్ని మార్చడానికి జీవితమంతా ప్రయత్నించి వీరమరణం చెందారని కలిసి మాట్లాడుకుందాం. అమరుల జ్ఞాపకాలను తలపోసుకుందాం. మన దు:ఖాన్ని పంచుకుందాం. మిత్రులకు, ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు ఆనందరికీ ఆహ్వానం. తప్పక రండి.
సంస్మరణ సభ
జూలై 18, 2026 శనివారం ఉదయం 10 గంటలకు అమరులకు నివాళి
సుభాష్ నగర్ స్థూపం దగ్గర, సికింద్రాబాద్
నిర్వహణ: సత్య
అమరుల బంధుమిత్రుల సంఘం 24వ ఆవిర్భావ సభ
మధ్యాన్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా
సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాట్రగడ్డ హాల్, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు
కార్యక్రమం
2.30 గంటలకు అమరుల స్థూపం ఆవిష్కరణ
3.00 గంటలకు సభ ప్రారంభం
అధ్యక్షత: భవాని
పుస్తకావిష్కరణ: అమరుల కుటుంబసభ్యులు
మైదానమా.. మౌనం వీడు(అమరుడు పాక హనుమంతు రచనలు) పరిచయం: ఎన్ వేణుగోపాల్(వీక్ష‌ణం ఎడిట‌ర్‌)
ప్రజాయుద్ధ సంకేతం(కా. పాక హనుమంతు స్మృతి రచనలు) పరిచయం: ప్రొ. లక్ష్మణ్(సిఎల్‌సి-తెలంగాణ‌)
4 గంటలకు
అధ్యక్షత: అంజమ్మ
వక్తలు: డి. సురేష్‌కుమార్(ఐఎపిఎల్‌)
చిలుకా చంద్రశేఖర్(సిఎల్‌సి-ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)
ప్రొ. హరగోపాల్
ఝాన్సీ(పివొడ‌బ్ల్యూ)
ప్రజాకళామండలి, అరుణోదయ, ఎబిఎంఎస్, విరసం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి

  • అమరుల బంధుమిత్రుల సంఘం
Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad