అడవి గర్భాన ఆరని నిప్పు. అది దశాబ్దాలుగా, కాదు… శతాబ్దాలుగా చల్లారని నిప్పు. మధ్యప్రదేశ్‌లోని పన్నా నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్-బస్తర్ కొండల వరకు, జార్ఖండ్‌లోని సంతాల్ పరగణాల నుంచి ఒడిశాలోని నియమ్‌గిరి కొండల వరకు… ఆ నిప్పు రవ్వ ఒకే ఒక్క నినాదాన్ని వినిపిస్తోంది. “ఈ నేల మాది!” ఆ నేల బిడ్డలు వినిపిస్తున్న నినాదం ఇది.
ఇది కేవలం భూమి కోసం జరుగుతున్న పోరాటం కాదు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, రేపటి తరాలను బతికించుకోవడం కోసం సాగుతున్నపోరాటం. విల్లంబులు చేతబూని తెల్లదొరలకెదురు పోరాడిన ఆదివాసీలు ఇప్పుడు చితిపోరాటం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ మధ్యలో ప్రశాంతంగా పారుతున్న కెన్ నదికి విషాదగీతాన్ని నేర్పిస్తోంది సర్కారు. దేశంలోనే మొట్టమొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు (కెన్ – బేత్వా లింక్) పేరుతో నిర్మిస్తున్న దౌధన్ డ్యామ్ కింద, పన్నా, ఛతర్‌పూర్ జిల్లాల్లోని ఇరవైకి పైగా గ్రామాలు జలసమాధి కానున్నాయి. వేలాది కోల్, గోండ్ తెగల కుటుంబాలు తాము పుట్టిపెరిగిన నేలను వదులుకోవాల్సి వస్తోంది.
గొడ్డలి తగిలిన ప్రతి చెట్టుతో పాటు, ఒక అడవి బిడ్డ గుండె కూడా నేలకొరుగుతుంది. రిజర్వాయరులో ఒక తరం జ్ఞాపకాలన్నీ మునిగిపోతాయి.
దాదాపు తొమ్మిది వేల హెక్టార్ల భూమి ముంపుపాలవుతుంది. అందులో సగానికి పైగా టైగర్ రిజర్వ్ ఫారెస్టే. ఈ ప్రాజెక్టు పుణ్యమాని లక్షలాది చెట్లు నేలకూలుతున్నాయి. కూలే చెట్లతో పాటు తరతరాల చరిత్రను కప్పేసే కుట్ర జరుగుతోంది. తగిన పరిహారం, గౌరవప్రదమైన పునరావాసం లేకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “న్యాయం చేయండి, లేదంటే చంపండి” అంటూ మహిళలు మెడలకు ఉరితాళ్లు వేసుకొని, నదిలో చితి పేర్చుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశపు అభివృద్ధి నమూనా అసలు రూపాన్ని బట్టబయలు చేస్తున్న దృశ్యాలివి. అటవీ హక్కుల చట్టం (FRA) కల్పించిన నిర్ణయాధికారాన్ని కాగితాల్లో బంధించి, బలవంతంగా ఆదివాసీలను అడవినుంచి గెంటివేసే ఈ ప్రయత్నం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ.
ఈ కథ మధ్యప్రదేశ్‌కే పరిమితం కాదు. ఇది దేశం నలుమూలలా వేర్వేరు రూపాల్లో, వేర్వేరు పేర్లతో పునరావృతమవుతున్న ఒకే విషాద గాథ.
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజ, సూరజ్‌పూర్ జిల్లాల్లో విస్తరించిన దట్టమైన అడవిలో, పర్సా, పర్సా ఈస్ట్-కేటే బసన్, కేటే ఎక్స్‌టెన్షన్ లాంటి బొగ్గు గనుల బ్లాకుల కోసం లక్షలాది చెట్లు నరికేస్తున్నారు. ఏనుగులు, పులులు, చిరుతల ఆవాసమైన ఈ అరణ్యం నేడు యంత్రాల మోతతో వణుకుతోంది. బస్తర్ అటవీ ప్రాంతంలో ఇనుము, ఉక్కు కర్మాగారాల కోసం లక్షలాది ఎకరాల అడవిని గుల్లగుల్ల చేస్తోంది సర్కారు. గ్రామాలకు గ్రామాలనే తుడిచిపెట్టేస్తున్న తీరును ఇప్పటికీ ఆదివాసీలు వ్యతిరేస్తున్నారు. గ్రామసభల అనుమతి లేకుండానే గనుల తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.
అటు జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఇదే కథ. ముందుగా భద్రతా బలగాల మోహరింపు, తర్వాత “అభివృద్ధి” మంత్రోచ్ఛరణ, చివరికి కార్పొరేట్ కంపెనీల గుత్తాధిపత్యంలోకి అటవీ సంపద. గాయపడి తల్లడిల్లుతున్న అడవి రోదన మాత్రం పాలకవర్గాలకు వినిపించదు.
దశాబ్దాల పాటు ఆదివాసీలకు అండగా నిలిచిన మావోయిస్టు ఉద్యమం, ప్రభుత్వ బలగాలు, గనుల మాఫియా అడవుల్లోకి చొచ్చుకురాకుండా అడ్డుకుంది. ఉద్యమం బలహీనపడ్డాక, బహుళజాతి సంస్థలకు ఎర్రతివాచీ పరిచిపరిచి ఆహ్వానిస్తోంది సర్కారు.
ఒక్కో ప్రాంతాన్ని మావోయిస్టు రహిత ప్రాంతంగా సర్కారు ప్రకటించడం… ఆయా ప్రాంతాల్లో గనుల లీజుల కోసం దరఖాస్తుల వర్షం కురవడం యాదృచ్ఛికం కాదు. అభివృద్ధి ముసుగులో అడవిలోకి బుల్డోజర్లు పరుగుతీస్తున్నాయిప్పుడు. ఈ విధ్వంసాన్ని ప్రమోట్ చేసేందుకూ.. కార్పొరేట్ కంపెనీలకు, ఇప్పుడు బ్రాండ్ అంబాజిడర్లు కూడా దొరికారు.
దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో పనిచేసి, చివరకు సర్కారు ముందు సాగిలపడ్డ మాజీలు ఇవాళ ప్రభుత్వ యంత్రాంగానికి వంతపాడడం వింతకాకపోయినా అసహ్యమనిస్తోంది. గడ్చిరోలిలో ఘనంగా లొంగిపోయిన ఒకాయన ఈ మధ్య పోలీసు పహారాలో "మహారాష్ట్ర దర్శన్" చేశారు. పర్యాటక ప్రాంతాల్ని సందర్శించి సర్కారు అభివృద్ధి నమూనాను కీర్తించారు.
రహదారుల నిర్మాణాన్ని, అజంతా-ఎల్లోరా శిల్పకళా వైభవాన్ని కొనియాడారు. కానీ పారిశ్రామికీకరణ నీడలో నిర్వాసితులవుతున్న వేలాది ఆదివాసీల కన్నీళ్లు మాత్రం ఆయనకు కనిపించ లేదు. తమ ఉద్యమం విఫలమైందని, ప్రభుత్వ అభివృద్ధి నమూనానే గొప్పదంటున్న ఈ మాజీలు… తమ దిగజారుతనాన్ని మార్పు పేరిట ప్రదర్శించుకుంటున్నారు.
కార్పొరేట్ కీర్తనలు ఆలపిస్తున్న వీళ్లకు అడవి బిడ్డల ఆర్తనాదాలు మాత్రం వినిపించకపోవడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదనుకోండి. కాళ్లకింద నేలను కాపాడుకునేందుకు కొట్లాడుతున్న ఆదివాసీలను వదిలేసి…. పాలకుల ప్రచార యంత్రాంగంలో పావులుగా మారిన మాజీలు చేస్తున్నది… దశాబ్దాల పోరాట చరిత్రకు, అమరుల త్యాగాలకు తీరని ద్రోహమే.
మావోయిస్టు ఉద్యమం బలహీనపడొచ్చు, కొందరు నాయకులు లొంగిపోవచ్చు, సిద్ధాంతాలు దారి మళ్లొచ్చు… కానీ అణచివేతకు వ్యతిరేకంగా ఎగిసే ఆగ్రహ జ్వాల మాత్రం ఆరదు. ఏ బుల్డోజరూ, ఏ లొంగుబాటూ దాన్ని ఆర్పలేదు. ప్రజాస్వామ్యంపై నమ్మకంతో చితి ఉద్యమాన్ని నడుపుతున్న చేతులు రేపు మళ్లీ అవసరమైతే విల్లంబులు అందుకుంటాయి.

మీ జ్ఞాపకాలతో జీవిస్తాం…మీ ఆలోచనలతో ముందుకుపోతాం
కన్నబిడ్డల జ్ఞాపకాలు నిలుపుకోవడమూ నేరమా? రాకేశ్ స్థూపాన్ని కూల్చేసిన పోలీసులు
వార్ టూరిజం : జాఫ్నా టూ బస్తర్ – ముసాఫిర్
మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడి మరణం
చివరి రక్తం బొట్టు వరకు విప్లవ పంథా కోసం నిలబడ్డ యోధుడు కామ్రేడ్ రాజు దాదా
విద్రోహ కాలంలో విప్లవ పంథా కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడు కామ్రేడ్ రాజు దాదా 