Menu

సమ్మక్క, సారలమ్మలను ఎందుకు తలచుకోవాలి?

anadmin 2 months ago 0 113

(2000 ఫిబ్రవరిలో వరంగల్ విరసం యూనిట్ ప్రచురించిన కరపత్రం, ఈ కరపత్రాన్ని రాసింది వీక్షణం సపాదకులు, రచయిత, కవి ఎన్.వేణుగోపాల్)

మన శ్రమనూ, సంపదనూ దోచుకునే వాళ్లే మన సంస్కృతిని కూడా దోచుకుంటారు. మన చరిత్రను, మన జీవన విధానాన్ని, మన జ్ఞాపకాలను, మన వీరులను మనకు కాకుండా చేస్తారు. నిన్నమొన్న మన మధ్య రక్తమాంసాలతో, కలలతో, ఆకాంక్షలతో బతికిన మనుషులను మాయం చేసి వాళ్ల స్మృతిని ప్రమాదంలేని దేవతాస్తుతిగా మార్చేస్తారు. జీవితకాలంలో వాళ్లు కొనసాగించిన పోరాట పటిమను రద్దు చేస్తూ వాళ్లను మర్యాదస్తులుగా మార్చేస్తారు.
ఈ దేశంలో పాలకవర్గాలు వందల సంవత్సరాలుగా విజయవంతంగా అమలు చేస్తున్న కుట్ర ఇది. ఆ పాలకవర్గాలు సాధారణంగా హైందవ, బ్రాహ్మణీయ పాలకవర్గాలు గనుక మన సంస్కృతిలోని, అంటే ఆదివాసీ, దళిత, శూద్ర సంస్కృతిలోని, ఎన్నో అంశాల్ని సంస్కృతీకరించి, బ్రాహ్మణీకరించి మనను మనకు కాకుండా చేశాయి. ఈ దేశం నడవడానికి ఎవరు కారణమో వాళ్ల భాషలను, సంస్కృతులను, చరిత్రను, వీరులను వాళ్లకు కాకుండా చేశాయి. వాళ్లకు అందనంత ఎత్తులో దేవతలుగా, అతీత మానవులుగా మార్చేశాయి లేదా అమ్మకపు సరుకులుగా మార్చేశాయి. లేదా గుర్తు పట్టలేనంతగా వక్రీకరించాయి.
ఇవాళ ఇక్కడ మనందరమూ కొలవడానికి, మొక్కులు తీర్చుకోవడానికి జమగూడిన సమ్మక్క, సారలమ్మల చరిత్ర విషయంలోనూ ఇదే జరిగింది. ఇవాళ దాదాపు బ్రాహ్మణ, అగ్రవర్ణాల దేవతల లాగ పూజలందుకుంటున్న సమ్మక్క, సారలమ్మలు ఎవరు?
సమ్మక్క, సారలమ్మలు దేవతలు కారు. ఈ నేల మీద మనలాగనే రక్తమాంసాలతో జీవించిన మనుషులు. వాళ్లు ఈ జంపన్న వాగు నీళ్లు తాగారు. ఈ అడవిలో ఆకులు ఆలములు తిన్నారు. ఈ జంపన్నవాగు ఒడ్డున్నే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని సైన్యంతో వీరోచితంగా పోరాడారు.
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర స్థల పురాణాన్ని (స్థల పురాణం అనేది కూడ పాలకవర్గాలు తయారు చేసే అతిశయోక్తుల, అభూత కల్పనల కథ) నిశితంగా పరిశీలిస్తే, ఈ దేశంలో భూస్వామ్య, రాచరికవర్గాలు, మైదాన ప్రాంత రాజవంశాలు ఆదివాసుల మీద సాగించిన దమనకాండలను గుర్తు చేసుకుంటే ఈ కోయబిడ్డల కథను, చరిత్రను పునర్నిర్మించవచ్చు. సమ్మక్కను, సారలమ్మను ఎట్లా చూడాలో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ సమ్మక్కను, సారలమ్మను ఎందుకు, ఎట్లా గుర్తుచేసుకోవలసి ఉన్నదో అవగాహన చేసుకోవచ్చు.
గోదావరి తీరంలోని ములుగు, ఏటూరు నాగారం, నర్సంపేట ప్రాంతాలు కాకతీయుల కాలం నాటికి పూర్తిగా అరణ్య ప్రాంతాలు. ఈ అడవి అంతా కోయల రాజ్యం. ఈ కోయ ప్రాంతానికి పాలకుడు లేదా పెద్ద పగిడిద్ద రాజు. ఈ కోయల ప్రాంతాన్ని తమ పాలనలోకి తెచ్చుకోవాలని, అడవిని నరికి, చెరువులు నిర్మించి, మైదాన ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకొచ్చి వ్యవసాయం సాగించాలని, కోయల పెద్దల నుంచి కప్పాలు వసూలు చేయాలని కాకతీయ పాలకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కోయల అటవీ ప్రాంతం కడుపులోపల ఇవాళ్టికీ మిగిలి ఉన్న ఎన్నో కాకతీయుల చెరువులు ఇందుకు సాక్ష్యం.
కాకతీయ చక్రవర్తుల ఈ దురాక్రమణను పగిడిద్దరాజు ఎదిరించాడు. మరీ ముఖ్యంగా అనావృష్టితో పంటలు పండక తిండి గడవని రోజుల్లో కూడ ప్రతాపరుద్రుడు కప్పం కట్టమని నిర్బంధిస్తే పగిడిద్దరాజు తిరగబడ్డాడు. కప్పం కట్టడానికి నిరాకరించాడు. పగిడిద్దరాజు మీద, కోయల మీద ప్రతారుద్రుడు యుద్ధం ప్రకటించాడు. ప్రతాపరుద్రుడి సేనలు మేడారం మీదికి దాడికి తరలాయి. ఆ యుద్ధంలో పగిడిద్దరాజు మరణించాడు. పగిడిద్దరాజు కొడుకు, సేనాని జంపన్న ఈ వాగులో దూకి చనిపోయాడని, అందుకే అంతకు ముందు వేరే పేరున్న వాగు ఆ తర్వాత జంపన్నవాగు అయిందని అంటారు.
ఈ వార్త విన్న పగిడిద్దరాజు భార్య సమ్మక్క, కూతురు సారలమ్మ స్వయంగా యుద్ధరంగంలో ప్రవేశించారు. సైన్యంతో పోరాడారు. సమ్మక్క పరాక్రమాన్ని నేరుగా ఎదిరించలేని కాకతీయ సైనికులు దొంగచాటుగా బల్లెంతో ఆమెను గాయపరిచారు. సమ్మక్క, సారలమ్మలు ఈ ప్రభుత్వ వ్యతిరేక యుద్ధంలో ఈ జంపన్నవాగు ఒడ్డున ఇవాళ ఈ గద్దెలు ఉన్నచోట ఒరిగిపోయారు. తాము పడి చనిపోయిన చోట గద్దెలు కట్టి, రెండు సంవత్సరాలకోసారి జాతర జరపమని వాళ్లే కోరారని స్థలపురాణం చెపుతుంది కాని అది అతిశయోక్తి కావచ్చు. వాళ్లు మరణించిన తర్వాత కోయలు తమ వీరుల స్మృతి చిహ్నంగా, తమ పోరాట జ్ఞాపకంగా ఈ గద్దెలు నిర్మించుకుని ఉంటారు. ఆ పోరాటానికి తమతమ కుటుంబాల నుంచి, తమ శ్రమ ఫలితాల నుంచి అందించే విరాళానికి గుర్తుగా బలులు, మొక్కులు, బెల్లం ముద్దలు, కొబ్బరి కాయలు తెస్తున్నారు కావచ్చు.
కాని ఇట్లా కనబడే చిహ్నాలలోంచి మరుగునపడిన మన చరిత్రను వెతుక్కోవలసిందే గాని, చారిత్రక చీకటి కోణం అట్టడుగున పడి కన్పించని కథలన్నిటినీ తవ్వి తీసుకోవలసిందే గాని, ఇవాళ జరుగుతున్న సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర మన వీరులను మనం తలచుకునే, కొలుచుకునే వేదికగా మిగలలేదు. మనం కలిసి నవ్వుకునే, ఏడ్చుకునే, కలలూ కలతలూ కలబోసుకునే ఒక సామూహిక ఉత్పవంగా మిగలలేదు.
ఒకప్పుడు కోయల ప్రాధాన్యంతో నడిచే ఈ జాతర ఇవాళ పోలీసుల, అధికారుల, తెల్లబట్టల వాళ్ల హడావుడికి నిలయమయింది. అడవి పలచబడడం మాత్రమే కాదు, కొన్ని చోట్ల అపురూపమయిపోయింది. దూర దూర ప్రాంతాల నుంచి ముళ్లూ, రాళ్లూ నిండిన బాటలలో, కాలినడకనా, ఎడ్లబండ్లలో వచ్చే యాత్రికుల స్థానంలో, తారు రోడ్డుమీద కార్లూ, జీపులూ, బస్సులూ మోసుకొచ్చే మనుషులు నిండిపోయారు. జంపన్నవాగు ఎండిపోయింది. ఇక్కడ ఏడువందల సంవత్సరాల కింద స్వతంత్రంగా జీవించిన జాతి, తమ స్వాతంత్య్రం కోసం రాచరికం మీద యుద్ధం ప్రకటించిన జాతిని స్మరిస్తూ జరుపుకునే ఉత్సవంగా ఎంతమాత్రమూ లేదిది. అడవి బిడ్డలను, ఆదివాసులను ఓడించి మైదాన ప్రాంత ప్రభువులు జరుపుకుంటున్న విజయోత్సవంగా ఉందిది.
తమమీద పోరాడిన జాతులను, తాము అణగదొక్కిన జాతులను మ్యూజియంలో ప్రదర్శన వస్తువులుగా చూపడం ప్రపంచవ్యాప్తంగా అన్ని పాలక వర్గాలూ అనుసరించే నీతే. స్థానిక రెడ్ ఇండియన్లను, వందలాది తెగల ఆదివాసులను ఊచకోత కోసి తమను తాము విస్తరింపజేసుకున్న అమెరికన్ పాలకవర్గాలు ఇవాళ్టికీ రెడ్ ఇండియన్ల భాషలను, పాటలను, సంస్కృతిని, వేషభాషలను ఇట్లాగే ప్రదర్శిస్తున్నాయి. భారత పాలకవర్గాలు కూడా అదేవిధంగా ఈశాన్య ప్రాంత అటవీ జాతులను అట్లాగే ప్రదర్శిస్తున్నాయి. చివరికి తెలుగుజాతి పాలకవర్గాలకు కూడ తెలుగు నేల మీద అణగిపోయిన జాతులు అదే విధంగా ఉపయోగపడుతున్నాయి.
తాము అతి రాక్షసంగా మట్టి కరిపించిన జాతులను ప్రదర్శన వస్తువులుగా, లోకాతీత వస్తువులుగా, విచిత్రమైనవిగా చూపించడంలో పాలకవర్గాలకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆ అల్పసంఖ్యాక జాతులను ప్రదర్శన వస్తువులుగా చూపడం ద్వారా మిగిలిన అన్ని అల్ప సంఖ్యాక జాతులను ఎప్పుడూ భయంలో ముంచి ఉంచవచ్చు. వాళ్ళ భవిష్యత్తుపట్ల అనుమానాలు కలిగించవచ్చు. ఒకవేళ వర్తమాన తరాలు ఆ ఉజ్వల గతం నుంచి ఏమయినా ఉత్తేజం పొందదలచుకుంటే దాన్ని తొలగించేందుకు, రద్దు చేసేందుకు, వక్రీకరించేందుకు అసలు ఆ గతం ఉజ్వలమయినదే కాదని చెప్పవచ్చు. వాళ్ళు చేసిన మంచి పనులేవయినా ఉంటే వాళ్ల అతీతశక్తులవల్ల చేశారని చెప్పవచ్చు. లేదా వాళ్ళు మనుషులైనా విచిత్రమైన మనుషులు గనుక అట్లా ప్రవర్తించారని చెప్పవచ్చు.
చరిత్రలో వెనక్కుపోయిన కొద్దీ ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా కనబడతాయి. కాని సమీపగతంలోని వీరుల గురించి ఇట్లా ప్రవర్తించడం అంతగా సాధ్యంకాదు. అందుకే ఆ వీరులను పొగిడి, మర్యాదస్తులుగా మార్చేస్తారు. ఆ వీరులు బతికి ఉండి పోరాటాలు నడిపిన రోజులలో వారిని అణచివేసిన వాళ్లే, వారిని చంపిన వాళ్లే ఆ వీరులను కీర్తించడం మొదలు పెడతారు. భగత్సింగ్ కు, అల్లూరి సీతారామరాజుకు, చివరికి శ్రీకాకుళం విప్లవోద్యమ నాయకులు సత్యం, కైలాసంలకు కూడ ఇటువంటి ‘పొగడ్తలు’ అందాయి.
ఇప్పుడిప్పుడు పాలకవర్గాలు ప్రజాయోధుల గురించి పన్నుతున్న కొత్త కుట్ర వాళ్లను సరుకులుగా మార్చివేయడం. వాళ్ళ పట్ల ప్రజలలో ఉన్న అభిమానాన్ని సామ్ము చేసుకోవడానికి ప్రయత్నించడం. అదే క్రమంలో వాళ్ల పోరాటసారాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయడం. సామ్రాజ్యవాదం తనను ఎదిరించిన వాళ్లను కూడ సరుకులుగా మార్చి అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినట్టుగానే, సామ్రాజ్యవాద సంస్కృతి విషబీజాలు మొలకెత్తిన చోటల్లా ఇది సాగుతోంది. ఎర్ర సినిమాలుగా ప్రచారమవుతున్న సినిమాలు విప్లవాన్ని, విప్లవోద్యమాన్ని, ప్రజాకాంక్షలను హీరో-హీరోయిన్-విలన్ చట్రంలో బంధించి సామూహిక పోరాట చైతన్యాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. సినిమా వ్యాపార వంటకాలలో ఒకప్పుడు మసాలాదినుసులుగా ఉండిన సెక్స్, హింస, సెంటిమెంట్లు, క్లబ్ డాన్సులతో పాటే ఇప్పుడు విప్లవోద్యమ ఆభాస ఇచ్చే పాత్రలు కూడ ముఖ్యమైన మసాలాదినుసు అయ్యాయి.
తాజాగా విడుదలయి నిర్మాతకు కోట్ల రూపాయలు ఆర్జించి పెడుతున్న సమ్మక్క-సారక్క చిత్రం ఈ పరిణామాలన్నిటికి నిదర్శనం. ఆదివాసి ప్రజాయోధుల పేర్లతో, మేడారం జాతరకు కొద్ది ముందుగా, థియేటర్ల దగ్గర జాతర పనుపు కుంకుమలిస్తూ వచ్చిన ఈ సినిమా ఆదివాసి సంస్కృతిని అవమానించింది. చరిత్రను, పుక్కిటి పురాణాన్ని, సమకాలీన ఉద్యమాన్ని, పాలకవర్గ కుట్రలను కలిపి ముద్ద చేసింది. గోదావరీ తీర ఆదివాసులలో నిర్మాణమవుతున్న విప్లవోద్యమాన్ని తప్పుడు చిత్రణ చేయడానికి ప్రయత్నించింది.
ఒక నిర్మాతో, ఒక దర్శకుడో ఇదంతా కేవలం లాభార్జన కోసం చేశారనుకోవచ్చు. మరి ఇటువంటి దుర్మార్గాలను అడ్డుకోవడానికి ప్రజలకు సహకరించవలసిన న్యాయ వ్వవస్థ పూర్తిగా పాలకవర్గాలకు, డబ్బున్నవారికి కొమ్ముకాసింది. ఆదివాసి పోరాట యోధుల పేర్ల మీద తీసిన ఆ చిత్రం ఆదివాసుల మనోభావాలను గాయపరుస్తుందని మేడారం జాతర పూజారి చేసిన ఫిర్యాదు మీద రాష్ట్ర హైకోర్టు మొదట స్టే ఇచ్చింది. కాని, విడుదల ఏర్పాట్లయిపోయాయనే పేరుతో రాత్రికి రాత్రి న్యాయమూర్తి సినిమా చూసి అది సాంఘిక చిత్రమే గాని ఆదివాసుల మనోభావాలను దెబ్బతీసేది కాదని ప్రకటించాడు. మనుషులు చచ్చిపోతున్నా, మనుషులను పట్టుకుని బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చేస్తున్నా, ఫిర్యాదులను వారాల తరబడి నెలల తరబడి వాయిదాలు వేసే న్యాయస్థానం ఒక డబ్బున్న ఆసామి, మరింత డబ్బు చేసుకోవడం కోసం మన విశ్వాసాల మీద దాడి చేస్తే ఇంత హడావుడిగా తీర్పు ఇచ్చింది.
అయితే ఇన్ని వందల ఏళ్ల అణచివేతలో కూడ మనం మన సంస్కృతినీ, చరిత్రనూ, భాషనూ వదులుకోలేదు. మన పోరాట యోధుల సంస్మరణను వదులుకోలేదు. ఆ సంస్మరణ మీద హిందూమతం, బ్రాహ్మణ్యం, అధికార యంత్రాంగం, వ్యాపార వర్గాలు ఎన్ని మాయపొరలయినా కప్పి ఉండవచ్చు. ఆ మాయపొరల అట్టడుగున ఉన్న పోరాట స్ఫూర్తిని మనం రెండేళ్లకోసారి గుర్తు చేసుకుంటూనే ఉన్నాం.
ఈ సంస్మరణ ఏడు వందల సంవత్సరాల కిందటి సమ్మక్క, సారలమ్మల పోరాట స్ఫూర్తిది మాత్రమే కాదు. మూడు దశాబ్దాలుగా ఈ గోదావరి తీరంలోనే నిర్మాణమవుతున్న విప్లవోద్యమ యోధుల సంస్మరణ కూడ. ఆ యోధులలో మనలోనుంచే పోరాటంలో ప్రవేశించి ప్రాణత్యాగం చేసిన అడవి బిడ్డలున్నారు. ఈ నేలమీద మనిషిని మనిషి దోపిడీ చేయడానికి వీలులేని సమాజాన్ని కలగంటూ ఆ కల కోసం ప్రాణత్యాగం చేసిన మైదాన ప్రాంత కష్టజీవుల బిడ్డలున్నారు. వాళ్లు తమ త్యాగాలతో, నెత్తుటితో మన ఆదివాసులకు, మైదాన ప్రాంతంలోని దళితులకు, వెనుకబడిన వర్గాలకు వారధి నిర్మించి వీడిత ప్రజా ఐక్యతను రుజువు చేశారు. నిజంగా తరతరాలుగా సమ్మక్కను, సారలమ్మను కొలవడంలో పీడిత ప్రజలందరమూ ఐక్యంగా ఉన్నాం. వాళ్లు పీడిత ప్రజా పోరాటయోధులు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వీరులను కూడా సంస్మరించుకుంటూ, ఈ సంస్మరణను వక్రీకరిస్తున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద సంస్కృతులను ఓడిద్దాం.
గెలిచిన ప్రతాపరుద్ర చక్రవర్తి మట్టిగలిసి పోయాడు. ఓడారనుకున్న సమ్మక్క, సారలమ్మలు ఏడు శతాబ్దాలుగా మన స్మృతిలో సదా ఎర్ర జ్యోతులుగా వెలుగుతున్నారు. ఇవాళ్టి బూటకపు ఎన్కౌంటర్లలో మన అన్నదమ్ములనూ, అక్క చెల్లెళ్లనూ చంపి గెలుస్తున్నామనుకుంటున్న వాళ్లు రేపు ఏమవుతారో?
విప్లవాభినందనలతో..
విప్లవ రచయితల సంఘం
వరంగల్

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad