Menu

ఝీరమ్ లోయ దాడి ఘటనలో పదిమంది ఆదివాసీలకు మరణశిక్ష అన్యాయం, కక్షసాధింపు చర్య

anadmin 22 hours ago 0 30

అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ – పంజాబ్ (ప్రజాస్వామిక హక్కుల సంఘం) (ఎడిఆర్ – జంహూరీ అధికార్ సభ) ప్రకటన

గుర్దాస్ పూర్, సెప్టెంబరు 18

మహేంద్ర కర్మ తదితరులను హత్య చేసిన ఘటనలో పదిమంది ఆదివాసీలకు మరణశిక్ష విధిస్తూ ఛత్తీస్ గఢ్, సుక్మా జిల్లా సెషన్స్ న్యాయమూర్తి తీర్పు ప్రకటించారు. ఈ మరణశిక్షను ప్రజాస్వామిక హక్కుల సంఘం (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ – పంజాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి ప్రీతి పాల్ సింగ్ తీవ్రంగా ఖండిస్తున్నారు. మహేంద్ర కర్మ సల్వా జుడుం పేరిట ప్రభుత్వ ప్రాయోజిత సాయుధ బలగాలని నడిపించారు. ఈ సల్వా జుడుం కార్యకలాపాలని సుప్రీం కోర్టు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించింది. అటవీ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికై సల్వా జుడుం సాయుధ బలగాలు ఆదివాసీ గ్రామాలను పూర్తిగా నిర్మూలించే దాడులను నిర్వహించాయి.

ఆదివాసీ కుటుంబాలు తమ నిరపరాధులమని వేడుకుంటూనే వస్తున్నాయి. ఈ కేసులో తీర్పు చెప్పేటప్పుడు కోర్టు ఆనాడు ఆదివాసీ ప్రాంతంలో నెలకొని ఉన్న పరిస్థితులని పరిగణనలోకి తీసుకోకుండా విస్మరించిందని ప్రజాస్వామిక హక్కుల సంఘం అభిప్రాయపడుతున్నది. ఆనాటి పరిస్థితులలో ప్రభుత్వ విధానాలు ఆదివాసులను వారి జల్, జంగల్, జమీన్ (అడవి, నీరు, భూమి) నుంచి బలవంతంగా బేదఖలు చేసి, ఆదివాసీ గూడాలని నిర్మూలించి వాటిని కార్పొరేట్లకు అప్పగించే విధంగా ఉన్నాయి. ఆదివాసులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి ఎలాంటి వేదికలూ అందుబాటులో లేవు. దానికి తోడు, బలహీనులు, పేదలు అయిన ఆదివాసులకు తమ వాదనను వినిపించే అవకాశాలు మృగ్యమైన పరిస్థితులు ఆనాడు ఉన్నాయి.

ఈ రోజు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఆదివాసులు సంఘర్షణ పథాన్ని విడనాడాలని పిలుపునిస్తూ ఉంది. పునరావాస పథకాలని అమలుచేస్తూ ఉంది. అలాంటి సమయంలో ఇటువంటి తీర్పు ప్రభుత్వ ఉద్దేశ్యాల పట్ల తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. ఆదివాసులకి మౌలికమైన జల్, జంగల్, జమీన్ సమస్యలలో ఎలాంటి మార్పు లేదు. బలప్రయోగం, వంచనల ద్వారా ఆదివాసుల గొంతు నొక్కి వేయాలనే ప్రభుత్వ ఆలోచనల వ్యక్తీకరణలో మాత్రమే తేడా ఉంది.

జీవించే హక్కునీ వ్యక్తి గౌరవాన్నీ మరణ శిక్ష నిరాకరిస్తుంది. అందుకని అసలు మరణశిక్షలనే పూర్తిగా రద్దు చేయాలని ప్రజాస్వామిక హక్కుల సంఘం భావిస్తున్నది. అనేక దశాబ్దాల పరిశీలనలు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. నేరాలని అరికట్టడంలో జీవిత ఖైదుతో పోల్చితే మరణశిక్ష ఏ విధంగానూ మెరుగైనదిగా లేదు. అసమ సమాజంలో మరణశిక్షల పాలబడే వారిలో అత్యధికులు ఆర్ధికంగా, సామాజికంగా పీడిత వర్గాల ప్రజలే. భారతదేశంలో మరణశిక్షలపై కీలకమైన ప్రాజెక్ట్ 39 ఏ నివేదిక ప్రకారం, మరణశిక్షకు గురైనవారిలో 74.1 శాతం బలహీనవర్గాలకి చెడిన వారే.

నేరాల వెనుక వున్న సామాజిక ఆర్ధిక కారణాలని గుర్తించకుండా భయం మీద, భయపెట్టడం మీద ఆధారపడి విధించే శిక్షలు నాగరిక సమాజపు అభివృద్ధికి దోహదం చేసేవి కావు. నేరానికి ఆధారంగా పరిగణించిన సాక్ష్యాలు నిజం కాదని తర్వాత తేలితే, మరణశిక్షతో హరించిన ప్రాణాలని తిరిగి తీసుకురాలేము. అందుకే, ప్రపంచంలో 113 దేశాలు ఇప్పటికే మరణశిక్షని రద్దు చేశాయి.

ఆదివాసులకి విధించిన మరణశిక్షని రద్దు చేయాలనీ, ఆదివాసులని అణచివేసే విధానాలని నిలిపివేయాలనీ ప్రజాస్వామిక హక్కుల సంఘం కోరుతున్నది. ఆదివాసులు గౌరవంగా జీవించే హక్కులకి సంబంధించిన సమస్యలని చర్చలద్వారా పరిష్కరించాలని ప్రజాస్వామిక హక్కుల సంఘం కోరుతున్నది. మరణశిక్షని రాజ్యాంగం నుండి తొలగించాలి.

-జారీ చేసిన వారు, అమర్ జిత్ శాస్త్రి, ప్రెస్ సెక్రటరీ
అనువాదం: సుధా కిరణ్

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad