దేశంలో చట్టబద్ద పాలన కాకుండా హిందుత్వ శక్తుల పాలన నడుస్తోందని గోవా ప్రభుత్వం రుజువు చేసింది. రాష్ట్రంలోని బజరంగ్ దళ్ నాయకుల గురించి సమాచారాన్ని సేకరించడం ప్రారంభించిన వెంటనే దక్షిణ గోవా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బదిలీవేటుకు గురయ్యారు.
దక్షిణ గోవా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సునీతా సావంత్, బజరంగ్ దళ్ సభ్యుల గురించి సమాచారాన్ని సేకరించాలని ఆదేశిస్తూ అన్ని పోలీస్ స్టేషన్లకు వైర్‌లెస్ సందేశం పంపారు. ఆ ఆదేశాలతో పోలీసులు నాయకుల సమాచారం సేకరించడం ప్రారంభించారు. దాంతో సోమవారం అర్దరాత్రి అధికారులు ఎస్పీ సునీతా సావంత్ కు తన కార్యాలయాన్ని ఖాళీ చేయమని వైర్‌లెస్ సందేశం పంపారు. ఆ తర్వాత ఆమెను పోలీసు ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సాధారణంగా, ఎస్పీ స్థాయి బదిలీ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది, కానీ ఈ సందర్భంలో, గోవా పోలీసులు వైర్‌లెస్ సందేశం ద్వారా సావంత్‌ను బదిలీ చేశారు. ఆమె స్థానంలో యాంటీ నార్కోటిక్స్ సెల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన ఐపీఎస్ అధికారి టికం సింగ్ వర్మను నియమించారు.
దీనిపై గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) అలోక్ కుమార్‌ను మీడియా సంప్రదించినప్పుడు, ఆయన మాట్లాడుతూ,పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారుల బదిలీలను ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి నేను దీనిపై ఏమీ వ్యాఖ్యానించదలచుకోలేదు” అని అన్నారు.
కాగా ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి “మతపరమైన ఎజెండా” ద్వారా పరిపాలన ఎలా నియంత్రించబడుతుందో ఈ చర్య బయటపెట్టిందని గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (జిపిసిసి) అధ్యక్షుడు అమిత్ పాట్కర్ విడుదల చేసిన మీడియా ప్రకటనలో తెలిపారు.
“గోవాలోని బజరంగ్ దళ్ నాయకుల గురించి ఎస్పీ సునీతా సావంత్ సమాచారం సేకరించడం ప్రారంభించిన క్షణం నుండి, ప్రభుత్వం భయపడి వెంటనే ఆమెను బదిలీ చేసింది. బిజెపికి పాలనపై ఆసక్తి లేదని, దాని సైద్ధాంతిక మిత్రులను రక్షించడంలో, చిత్తశుద్ధితో తమ విధిని నిర్వర్తించే అధికారులను అణచివేయడంలో ఆసక్తి ఉందని దీన్ని బట్టి అర్దమవుతోంది” అని అమిత్ పాట్కర్ అన్నారు.
కొంత కాలంగా గోవాలో బజరంగ్ దళ్ చురుకుగా పని చేస్తోంది. గత నెలలో దక్షిణ గోవాలోని సాన్వోర్డెం గ్రామంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ ప్రసంగించారు.

