[2025 నవంబర్ 3 నాడు ఢిల్లీలో కార్పొరేటీకరణ, సైనికీకారణ వ్యతిరేక వేదిక (ఫోరం ఎగైన్స్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్) ఏర్పాటు చేసిన సమావేశంలో హిమాంశు కుమార్ ఉపన్యాసం]
ఈ పోరాటం నిజంగా ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది? ఇది కేవలం నక్సలిజానికి వ్యతిరేకమైనదా? వీరు కేవలం నక్సలైట్లనే తమ శత్రువులుగా చూస్తున్నారా? ఇది వాస్తవమా? లేక ఇది కేవలం ఒక సాకు మాత్రమేనా, వీరి పోరాటం అంతకంటే పెద్దదా? మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.
ప్రస్తుతం ఉన్న దృష్టి అంతా ఆదివాసీ ప్రాంతాలపైనే ఉంది. ఈ దాడులన్నీ, బలగాలన్నీ, డబ్బు అంతా ఆదివాసీ ప్రాంతాలలో నక్సలిజాన్ని అంతం చేయడానికి వెచ్చిస్తున్నారు. ఎందుకు? ఆదివాసీ ప్రాంతాల నుండే నక్సలిజాన్ని ఎందుకు అంతం చేయాలి?
అక్కడి ఖనిజాలను దోచుకోవడమే లక్ష్యమా? అమిత్ షా స్థాయిని మీరు అర్థం చేసుకోండి. ఈ వ్యక్తికి రాజకీయం, దేశం, సమాజం దేని గురించీ అవగాహన లేదు, సభ్యత లేదు. ఇతనికి తెలిసింది ఒక్కటే – డబ్బు. ఛత్తీస్‌గఢ్‌లో ఇతనికి డబ్బు కనిపిస్తోంది.
ఇతని కొడుక్కి లాభం రావాలి కాబట్టి డబ్బు కోసం, ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ కూడా ఆడతాడు,. కాబట్టి ఇతని స్థాయి చాలా తక్కువ. ఇతనికి ఛత్తీస్‌గఢ్‌లో కేవలం డబ్బు మాత్రమే కనిపిస్తోంది. అది ఇతని ప్రధాన లక్ష్యాలలో ఒకటి: అక్కడ మొదట రమణ్ సింగ్ సంపాదించాడు. రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్యలు, విధ్వంసం మీకు తెలుసు. సల్వా జుడుం నడిపారు. 650 గ్రామాలు తగలబెట్టారు, 5000 మంది ఆదివాసులను హత్య చేసారు. అంతే పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది మహిళలపైన అత్యాచారాలు చేశారు.
మీకు గుర్తుండే ఉంటుంది, రెండు సంవత్సరాల క్రితం నేను తీసుకువచ్చిన కేసులో, ఒక రెండు సంవత్సరాల చిన్నారి చేతి వేళ్ళని సిఆర్‌పిఎఫ్ కోసేసింది, ఆ చిన్నారి తల్లి ఒడిలో ఉన్నాడు. తల్లి తలపై సిఆర్‌పిఎఫ్ కత్తితో పొడిచింది. ఆ తల్లి నొప్పితో అల్లాడుతున్నప్పుడు, మరణిస్తున్న ఆ మహిళపైన సైనికులు సామూహిక అత్యాచారం చేశారు.
ఆ కేసు తీసుకుని నేను ఢిల్లీ సుప్రీంకోర్టుకు వస్తే, కోర్టు నాపైనే 5 లక్షల జరిమానా విధించింది. కాబట్టి, రమణ్ సింగ్ హయాంలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వాటన్నిటికీ ప్రతిఫలంగా, మైనింగ్ కంపెనీల నుండి లంచాలు తీసుకుని జమచేసిన డబ్బుతో, రాజ్‌నంద్‌గావ్ నుండి ఎంపీగా ఉన్న ఆయన కొడుకు అభిషేక్ సింగ్‌కు స్విస్ బ్యాంకులో ఖాతా ఉండేది.
ప్రశాంత్ భూషణ్ ఆ నంబర్‌ను పత్రికా సమావేశంలో మీడియా ముందు పెట్టారు— “ఇదిగో”. రమణ్ సింగ్‌కు సంబంధించిన ఆ డబ్బు—మైనింగ్ కంపెనీల నుండి తీసుకున్న లంచం—పనామాలో కంపెనీలు పట్టుబడ్డాయి. ఆ పనామా కంపెనీలలో ఉన్న చిరునామా, రమణ్ మెడికల్ స్టోర్, కవర్ధాది. కాంగ్రెస్ ప్రతినిధి అయిన సుర్జేవాలా, ఆ కంపెనీల చిరునామాల పూర్తి జాబితాను మీడియా ముందు పెట్టారు.
కాబట్టి, ఆ డబ్బును రమణ్ సింగ్ సంపాదించాడు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయినవారు సంపాదిస్తారు. కానీ అమిత్ షా నోట్లో నీళ్లూరుతున్నాయి. ఆదివాసీ ప్రాంతాలు సంపాదనకు ముఖ్యమైనవని అమిత్ షాకు తెలుసు. అక్కడ ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి, గనుల తవ్వకానికి ఉన్న అడ్డంకులను తొలగించి, ఆ ప్రాంతానికి కాంట్రాక్టర్‌గా మారాలని అమిత్ షా చూస్తున్నాడు.
ఎవరు ఆ అడ్డంకి? ఆదివాసులు, వారి పోరాటానికి మద్దతు ఇచ్చే నక్సలైట్లు. “నేను వీరిని అంతం చేస్తాను, ఆ తర్వాత మైనింగ్ దారి సుగమం అవుతుంది, అప్పుడు నేను కంపెనీలతో డీల్ చేసుకుంటాను, నేను డబ్బు సంపాదిస్తాను” అని అమిత్ షా అనుకుంటున్నాడు. కాబట్టి, అమిత్ షా లక్ష్యం అక్కడ డబ్బు సంపాదించడమే.
ఈ పోరాటం కేవలం నక్సలైట్లకు వ్యతిరేకం కాదు. మిగతా కమ్యూనిస్ట్ పార్టీల వారితో కూడా నేను చెప్పదల్చుకున్నాను. వారికి కొన్నిసార్లు అనిపిస్తుంది, “అయ్యో, నక్సలైట్లను చంపుతున్నారు. సరే, మనం మౌనంగా ఉందాం. మనం ఎన్నికల రాజకీయాల్లో ఉన్నాం, మనం సురక్షితంగా ఉన్నాం.” కానీ ఆర్.ఎస్.ఎస్ దృష్టిలో, మీరంతా ఒకటే. “మేము ఆ ‘లాల్ సలాం’ చెప్పే వారందరినీ చంపుతాం. వారిని ఉండనివ్వం” అని వారు అంటారు.
మనం ఎవరం? నేను ఎవరు? నేను గాంధీవాదిని. నేను బస్తర్‌లో పని చేస్తున్నాను. 1992 నుంచీ నాపైన ఎందుకు దాడి చేశారు? వీరి శత్రువు నక్సల్ కాదు.
ఎవరైతే ఆదివాసుల తరఫున మాట్లాడతారో, ఎవరు వీరి కార్పొరేట్ ఎజెండాకు అడ్డు వస్తారో, ఎవరు కార్పొరేట్ దోపిడీకి మధ్యలో వస్తారో, మానవ హక్కుల గురించి మాట్లాడతారో, కోర్టుకు వెళ్తారో—వారంతా నక్సలైట్లే. వారంతా అర్బన్ నక్సల్స్. వారంతా దేశద్రోహులు. వారే వీరి శత్రువులు. సోనీ సోరీ ఎవరు? సోనీ సోరీని ఎందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి నగ్నం చేశారు? ఎస్పీ ఆమె యోనిలో రాళ్లతో నింపాడు. ఆ ఎస్పీకి భారత రాష్ట్రపతి వీరత్వ అవార్డు ఇచ్చారు. ఎందుకు? సోనీ సోరీ నక్సలైటా?
కాబట్టి, వీరి శత్రువులు కేవలం నక్సలైట్లు మాత్రమే కాదు. వీరి దోపిడీ, దురాశ, కార్పొరేట్ పనులకు అడ్డు వచ్చే ప్రతి వ్యక్తీ వీరి శత్రువే; వారు నక్సలైట్లే. అంతేకాకుండా, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, కులవివక్షకు వ్యతిరేకంగా, వీరి బ్రాహ్మణీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎవరు ఉంటారో—వారంతా వీరి శత్రువులే. అందుకే వీరి దృష్టిలో, వారు అంబేద్కరవాదులైనా సరే, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి వ్యతిరేకులైనా సరే—వారంతా వీరి శత్రువులే, వీరి టార్గెట్‌లోనే ఉన్నారు.
హర్యానాలో మోదీ— కాంగ్రెస్ కూడా అర్బన్ నక్సలే అని కూడా అన్నారు. అన్నారా, లేదా? అది మోదీ మాటే. నేను మీకు దాని నేపథ్యాన్ని కూడా చూపిస్తాను. కాబట్టి, వారి దృష్టిలో, వారి ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నవారంతా అర్బన్ నక్సల్సే.
ఇప్పుడు వీరు ఏమి చూపించడానికి ప్రయత్నిస్తున్నారంటే— నక్సలైట్లు తమ తుపాకులను మా పాదాల ముందు పెడుతున్నారు, వారు ఓడిపోయారు. దేశం ముందు అలాంటి అభిప్రాయం ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ గెలిచింది, మా భావజాలం గెలిచింది, మేము గెలిచాం. మా ముందు ప్రతిపక్షమంతా ఓడిపోయింది, మాకు వ్యతిరేకంగా ఉన్నవారు ఓడిపోయారు. చూడండి, అనే ఆ భావాన్ని చూపిస్తున్నారు. మొత్తం ప్రతిపక్షంపైన దాడి చేస్తున్నారు. కాబట్టి, మా వ్యతిరేకత ఓడిపోతోందనే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు.
కానీ, అది ఓడిపోగలదా? ప్రతిఘటన అంతం కాగలదా? ఈ దేశంలో తిరుగుబాటు చచ్చిపోతుందా? ఇది సాధ్యమేనా?
నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మూడేళ్ల పిల్లలు ఇద్దరిని పిలవండి. ఒక బిడ్డకు రెండు బిస్కెట్లు ఇవ్వండి, మరొక బిడ్డకు ఒక బిస్కెట్ ఇవ్వండి. అప్పుడేం జరుగుతుంది? మీరు ఒక బిస్కెట్ ఇచ్చిన బిడ్డ, ఆ బిస్కెట్‌ను విసిరేస్తాడు. నేలపై పడుకుని, చేతులు, కాళ్లు కొట్టుకుంటూ ఏడుస్తాడు. ఆ బిడ్డ ఏమి చేస్తున్నాడు? ఆ బిడ్డ అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నాడు.
తనకు అన్యాయం జరిగిందని ఆ బిడ్డకు తెలుసు. “వాడికి రెండు బిస్కెట్లు ఇచ్చారు, నాకు ఒకటి ఇచ్చారు. నాకు అన్యాయం జరిగింది. నేను అన్యాయాన్ని వ్యతిరేకిస్తాను.” ఆ మూడేళ్ల బిడ్డకు ‘అన్యాయాన్ని వ్యతిరేకించు’ అని ఏ మావోయిస్టు పార్టీ శిక్షణ ఇచ్చింది? అన్యాయాన్ని వ్యతిరేకించడం అనేది మానవుడికి సహజమైన లక్షణం. అది స్వభావం. మీరు స్వభావాన్ని మార్చలేరు. మీరు ప్రతిఘటనను, వ్యతిరేకతను అణచివేయలేరు.
మీరు ఒక పార్టీని అంతం చేయవచ్చు. సీపీఐ (మావోయిస్టు)ను మీరు అంతం చేస్తారు అనుకుందాం. కానీ తిరుగుబాటు బతికే ఉంటుంది. అది కొత్త రూపంలో వస్తుంది. వరవరరావు గారు అన్నారు: “మేము ఫీనిక్స్ పక్షి లాంటి వాళ్లం, మా బూడిద నుండే మళ్లీ జన్మిస్తాం.” తిరుగుబాటు తన బూడిద నుండే జన్మిస్తుంది. కాబట్టి, ఈ దేశంలోనే కాదు, ప్రపంచమంతటా మీరు తిరుగుబాటును చంపలేరు. కాబట్టి, అమిత్ షా చూస్తున్న ఈ ముంగేరిలాల్ కలలు నెరవేరవు.
తిరుగుబాటు బతికే ఉంటుంది. ఈ పార్టీ పేరు మీద ఉండవచ్చు, మరొక పార్టీ పేరు మీద ఉండవచ్చు. అంబేద్కరైట్‌ల రూపంలో ఉండవచ్చు, సోషలిస్టుల రూపంలో ఉండవచ్చు, కాంగ్రెస్ నాయకుల రూపంలో ఉండవచ్చు—ఎవరైనా ఎక్కడైనా వెళ్లి తిరుగుబాటు చేయవచ్చు. ఈ దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనం చూస్తున్నాం, ఈ రోజు 80% దళితులు భూమిలేని వారు.
మనం స్వాతంత్ర్యం కోసం ఎలాంటి కల కన్నాం? సమానత్వం ఉన్న, కులవివక్ష లేని, పితృస్వామ్యం లేని దేశం ఉండాలని. మీరు వీరికి వ్యతిరేకంగా పోరాడటానికి వెళ్లినప్పుడు ఏమవుతుంది?
మీరు ఎంత అహింసావాది అయినా సరే, మీపై దాడి జరుగుతుంది. శివకుమార్ ఇక్కడ కూర్చున్నారు. ఇతన్ని ఎందుకు కొట్టారు? ఇతని జననాంగాలపై కర్రలతో కొట్టారు. ఎందుకు? ఎందుకంటే ఇతను కార్మికుల తరఫున గొంతు వినిపించాడు. ఇతను ఏ ఆయుధం పట్టుకున్నాడు? ఎందుకు కొట్టారు ఇతన్ని?
మీరు అన్యాయాన్ని వ్యతిరేకించడానికి వెళితే, అన్యాయం చేసేవారు ఆయుధం పట్టుకుని మీపై దాడి చేస్తారు. ఈ రోజు మీకు తెలుసు, మీరు కుల వివక్షకు వ్యతిరేకంగా వెళ్తే, మీపై దాడి జరుగుతుంది. మీరు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్తే, మీపై దాడి జరుగుతుంది. అత్యాచారం చేసినవారికి మద్దతుగా బీజేపీ ర్యాలీలు తీస్తోంది. గొంతు లేవనెత్తిన వారిని జైళ్లలో వేస్తోంది.
తెలుగు అనువాదం : పద్మ కొండి పర్తి

ప్రశ్నా పత్రంలో సంఘీలకు కోపం తెప్పించిన ప్రశ్న- దళిత ప్రొఫెసర్ సస్పెండ్,ఎఫ్ఐఆర్కు ఆదేశం
పోరాడండి; లొంగిపోవద్దు: కామ్రేడ్ బసవరాజు అమరత్వ పిలుపు -కె. మురళి @ అజిత్
నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
Condemn The Illegal Detention of FACAM Members by the Delhi Police Special Cell in Bogus Missing Person Case!
కగార్‌లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్
వర్తమాన సంక్షోభం – చారిత్రక ఆశావాదం 