Menu

పది మంది ఆదివాసీల ఉరిశిక్ష రద్దు కోసం 16న సభ‌

anadmin 6 hours ago 0 15

భ‌

కరపత్రం

జీరం ఘాటి కేసులో పది మంది ఆదివాసీల ఉరిశిక్ష వెంటనే రద్దు చేయాలి!

  • ఐఏపిఎల్

ఈ సెప్టెంబర్ 16 వ తేదీన ఛత్తీస్ గడ్ రాష్ట్రం జగదల్పూర్ NIA కోర్టు 10 మంది ఆదివాసులకు ఉరిశిక్ష వేసింది. 25 మే 2013 న జీరం లోయ లో మావోయిస్టు వ్యతిరేక సాయుధ సల్వాజుడుం వ్యవస్థాపకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేంద్ర కర్మ లక్ష్యంగా సాగిన మావోయిస్టు దాడి ఘటనలో మొత్తం 29 మంది చనిపోయినారు. అయితే, ఆనాటి ఘటనలో దాడి కి ప్రత్యక్షంగా నాయకత్వం వహించి, వ్యూహం రచించిన ఆనాటి మావోయిస్టు నాయకులైన దేవీజీ, బర్సె దేవా లాంటి ‘పై’ స్థాయి నాయకులైన 27 మంది పై కేసులైతే పెట్టారు కానీ వెంటనే అరెస్ట్ చేసింది మాత్రం స్థానిక ఆదివాసీ గ్రామస్తులైన 10 మందిని. వారిలో ఒకరు 2017 విచారణ ఖైదీగా చనిపోగా గత 13 ఏళ్లుగా విచారణ ఖైదీలుగా జైలులో మగ్గిన వారి పై తగినంత సాక్షాదారులు లేకున్నా వారికి ఉరి శిక్ష వేశారు. ఈ రోజున ఛత్తీస్ గడ్ ఆదివాసీ సమాజం ఈ ఉరి శిక్షకు వ్యతిరేకంగా పోరాడుతోంది. మరీ ముఖ్యంగా నాయకత్వ స్థానంలో దాడికి పాల్పడ్డ వారు ఒకవైపు లొంగి పోయి స్వేచ్ఛగా బయట ఉంటే ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి నజరానాలు ఇచ్చి జీవించే స్వేచ్ఛనిస్తూన్నాయి. కానీ స్థానిక ఆదివాసీలకు మాత్రం వారికి దాడిలో ప్రత్యక్ష, పరోక్ష పాత్ర నిరూపించే సాక్షాధారాలు లేకున్నా ఇన్నేళ్ళుగా జైలులో మగ్గిన తమ వారిని విడిచి పెట్టక పోగా ఉరిశిక్షను వేయటాన్ని మొత్తం ఆదివాసి సమాజం అదెలా సాధ్యమని ఈ దేశంలోని న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తోంది. ఇదెక్కడి న్యాయ సూత్రమని అడుగుతోంది. ఆదివాసీలపై ఇంతకంటే న్యాయ వివక్షకు తార్కాణముందా అని నిలదీస్తోంది.
జీరం ఘాటీ కేసులోనే కాదు ఇప్పటి వరకు ఈ దేశంలో ఉరి శిక్షలు పడ్డ కేసులన్నింటినీ పరిశీలిస్తే, పరిశోధిస్తే ఒక సత్యం వెలుగులోకి వస్తుంది. కేవలం సామాజికంగా, ఆర్థికంగా బలహీనులైన వారే ఉరిశిక్షపడి ఉరి కంభం ఎక్కుతున్నారు. అగ్రకులస్తులకి, ఆర్ధిక స్థితిమంతులకి మరణశిక్షలు అక్కడో ఇక్కడో కోర్టులు విధిస్తున్న, అవి జీరం
ఘాటీ లాంటి ఘోరమైన హత్యలే అయినా కానీ అప్పీళ్ల కోర్టుల్లో అవి మాత్రం కొట్టుడు పోతున్నాయి.

అశ్వథామ హతః కుంజరః లాగ, చట్టం ముందు అందరూ సమానులే, కొందరు మాత్రమే ఎక్కువ సామజిక ఆర్థిక సమానులు. మరెందరో తక్కువ సమానులు. అందుకే దళితులకు, బహుజనులకు, మైనారిటీలకు మాత్రం పై కోర్టు అప్పీళ్లలో లో గాని, క్షమా భిక్షా విడుదలలు గాని అదే న్యాయం దక్కడం లేదనేది – కాదనలేని అక్షర సత్యం. అంకెల్లో అగుపడే వారి మరణశిక్షలే అందుకు సాక్షం. ఇదేదో మాలాంటి హక్కుల సంఘాలు, న్యాయవాద సంఘాల ఆరోపణలో, వాదనలో కాదు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన జాతీయ న్యాయ కళాశాల విద్యార్థి, అధ్యాపకుల పరిశోధన తో కూడిన ప్రాజెక్ట్ 39A నివేదిక తేల్చిన పచ్చి నిజం.

నిజమే, మరణ శిక్షలు పడ్డ వారంతా హీనమైన నేరాల్లో శిక్ష పడ్డ వారే. వారిని అందరిని విడిచి పెట్టమని ఎవరు అనటం లేదు. కానీ మానవ నాగరిక ప్రపంచ పటంలో మరణ శిక్షని అనాగరిక, ఆటవిక శిక్షగా భావిస్తూ సగం దేశాలు శిక్షా స్మృతి కృతి నుండే తొలగిస్తే, మరికొన్ని దేశాలు ఎన్నో ఏళ్లగా మరణ శిక్షలు చట్టాల్లో ఉన్న అమలు లో మాత్రం మినహాయిస్తున్నాయి. కానీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన అమెరికా, భారత్ అలాగే చైనా ఇతర అరబ్ దేశాలు మాత్రం ఇంకా మరణ శిక్షలు అమలు చేస్తున్నాయి.

అలాగే, మరణ శిక్షల కారణంగా నేరాలు తగ్గుతాయి అనేది ఒక అపోహ మాత్రమే. నేరాలకు సాంస్కృతిక, సామాజిక, ఆర్ధిక, రాజకీయ కారణాలుంటాయి. ‘Deterrent theory’ అంటే శిక్షల యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం భవిష్యత్తులో జరిగే నేరాలను అరికట్టడం మరియు శిక్షల పట్ల సమాజంలో భయాన్ని కలిగించడం. మరణశిక్ష విధించడం వల్ల హత్యలు లేదా ఘోరమైన నేరాలు తగ్గాయనడానికి ఎటువంటి ఖచ్చితమైన గణాంక ఆధారాలు లేవు. ఇందులో మరణ శిక్ష ప్రపంచ వ్యాప్తంగా విఫలమైంది. ఈ నేపధ్యం లో నుంచి చూస్తే జీరం ఘాటీ అన్యాయమైన తీర్పు. ఈ కేసులో ఎన్నో సమాధానాలు లేని, రాని, అసలు కనపడని ప్రశ్నలు ఉన్నాయి. ముద్దాయిలుగా ఉన్న ఈ పది మందిలో ఎవరు కూడా సాయుధ మావోయిస్టులు కారు. చురుగ్గా ఆనాటి నేరంలో భాగస్థులు కూడా కాదు. కేవలం వారు స్థానిక ఆదివాసులు. పైగా వందలమంది తో జరిగిన మావోయిస్టు దాడి అది. ప్రత్యక్ష సాక్షులు లేరు. జీరం ఘాటీ చాలా తీవ్రమైన హింసాత్మక సంఘటన. అలాగని, న్యాయ సూత్రాలకి విరుద్ధంగా దొరికిన వారినే అంతటి నేరానికి బాధ్యులని చేస్తారా? ఈ కేసులోని వివరాలు చూస్తే అసలు ఈ తీర్పు అన్యాయమైనది, అసమంజసమైనది. తీర్పు చదివిన న్యాయ విద్యార్థి సైతం ఈ మాత్రం సత్యాన్ని గ్రహిస్తాడు.

కాబట్టే, 13 ఏళ్ళ వారి విచారణ ఖైదీ జీవితాన్ని పరిగణలోకి తీసుకొని ఆ ఆదివాసీలను విడుదల చేయాలని ఒక్క ఛతీస్ గడ్ ఆదివాసీ సమాజమే కాదు, దేశ వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులు, న్యాయ కోవిదులు నేడు కోరుతున్నారు. ఉద్యమిస్తున్నారు. దేశ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలుగు సమాజం హాక్కుల ఉద్యమానికి దేశంలోనే అగ్ర భాగాన ఉన్న ప్రాంతం. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో హక్కుల ఉద్యమం పురుడు పోసుకున్నదే 1970 నాటి ఎమర్జెన్సీ కాలం లో జరిగిన భూమయ్య, కిష్ట గౌడల ఉరి శిక్ష వ్యతిరేక ప్రజా పోరాటంలోనే. దేశ వ్యాప్తంగా ఆనాటి ఆ ఇద్దరి ఉరిశిక్ష పోరాటం అసలు శిక్ష స్మృతి నుండే రద్దు చేయాలని ప్రజాస్వామిక మేధావుల స్పందనలను సంపాదించగలిగినా భూమయ్య, కిష్ట గౌడ్ ల ఉరి శిక్ష నిలవరించలేకపోయాం. అయితే, అదే పోరాట స్ఫూర్తి తో, 1993 నాటి విజయవర్ధన రావు, చలపతి ల ఉరి శిక్ష ని జిల్లా కోర్ట్, హై కోర్టు, సుప్రీమ్ కోర్టు ఖరారు చేసినా, రాష్ట్రపతి నారాయణన్ క్షమా భిక్ష తో వారికి ఉరి తప్పించి జీవిత ఖైదునే ఖరారు చేయించిన ఘనత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా పౌర హక్కుల చైతన్యం సాధించింది.

అప్పటి విజయవర్ధన్, చలపతిల ప్రాణ రక్షణ సాధనలో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పౌర హక్కుల ఉద్యమ సంఘం (AP CLC) నాయకులూ బాల గోపాల్, శేషయ్యలు. 2008 లో బాలగోపాల్, 2021 శేషయ్య అమరులైనారు. జీవించే హాక్కును కాపాడు కోవటంలో ఆ ఇద్దరు హక్కుల నేతల ఉద్యమ జీవిత స్ఫూర్తి తో నేడు జీరం ఘాటీ కేసులో 10 ఛత్తీస్ ఘర్ ఆదివాసీల పై NIA కోర్టు విధించిన ఉరి శిక్ష రద్దు కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందు కోసం జరిగే సభకు రావాలని మీ గొంతు కలపాలని, అమాయక ఆదివాసీల ప్రాణాలు నిలపాలని ఇదే మా పిలుపు.

డిమాండ్స్

  1. మరణ శిక్షలను శిక్ష స్మృతి నుండి రద్దు చేయాలి.
  2. జీరం ఘాటీ కేసులో 10 మంది ఆదివాసీల ఉరిశిక్ష వెంటనే రద్దు చేయాలి.
  3. ఇప్పటి వరకు విచారణ ఖైదీలుగా వారు అనుభవించిన శిక్ష కాలం పరిగణన లోకి తీసుకుని
    జీరం ఘాటి కేసు లోని 10 మంది ఆదివాసులను విడిచి పెట్టాలి.

మరణ శిక్షల వ్యతిరేక నిరసన సభ
16 .10. 2026. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకి

షోయబ్ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగం పల్లి, హైదరాబాద్.

వక్తలు :
N. వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్
Sr Adv. V రఘునాధ్, CLC.
ఆత్రం భుజంగ రావు HRF,
ఆదివాసీ నాయకులు
Adv M వెంకన్న (IAPL)
సజయ, సామజిక ఉద్యమ కారిణి
రవి చంద్, CASR
Adv. MA షకీల్
Adv. కార్తీక్ నవయాన్.
Adv. ఆనంద్ కుమార్ వాసం
(ఆదివాసీ న్యాయవాద సంఘం)

అధ్యక్షత :
Adv.D.సురేష్ కుమార్ (IAPL)

భారత ప్రజా న్యాయ వాదుల సంఘం (IAPL)
INDIAN ASSOCIATION OF PEOPLES LAWYERS -IAPL
Adv ఎం వెంకన్న 9440496422
Adv D సురేష్ కుమార్ 9182620682

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad