అమరుల జీవిత చరిత్రలు చదవడమంటే..
తాత్కాలిక ఓటమికి గురైన విప్లవోద్యమాన్ని పునర్నిర్మించడమే
మావోయిస్టు పంథా అజేయమని ఎలుగెత్తి చాటడమే
-ఆదిత్య కిరణ్
‘త్యాగాల గుర్తుల్లో, సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల జీవిత చరిత్రలు, సంకలనం`3’ అనే పుస్తకం గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ పుస్తకాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రచురించింది. ఇందులో ఉన్న ముందుమాట ప్రకారం ఈ ఏడాది జూలై 28 అమరుల వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈ పుస్తకం రాసింది. మార్చి 31తో మావోయిస్టు రహిత భారత్‌గా మార్చానని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కగార్ యుద్ధంలో అమరులైన కేంద్ర కమిటీ నాయకుల జీవిత చరిత్రలతో మావోయిస్టు పార్టీ ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. విప్లవోద్యమాన్ని తుడిచిపెట్టానని ప్రధాని నరేంద్రమోదీ బస్తర్‌లో సైనిక బలగాలతో కలిసి దివాలీ వేడుకలు చేసుకోడానికి కాస్త ముందు ఈ పుస్తకం ప్రజలకు, విప్లవాభిమానులకు సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి వచ్చింది.
చాలా ఉత్తేజపూరితంగా, లోతైన రాజకీయ దృష్టితో, ఈ తాత్కాలిక ఓటమి మీద విమర్శనాత్మక అంచనాతో రాసిన ఈ ముందుమాట ఈ పుస్తకం వెయిట్ పెంచింది. కేవలం నాలుగున్నర పేజీల ఈ ముందుమాట ప్రకారం అపరేషన్ కగార్ కాలంలో అమరులైన కేంద్ర కమిటీ సభ్యులు 12 మంది జీవిత చరిత్రలు ఇందులో ఉన్నాయి. ఈ పన్నెండు మందికితోడు కా ఆనంద్ జీవితం గురించి ఒక అద్భుత వ్యాసం ఇందులో ఉంది. ఆయన కగార్ కంటే అనారోగ్యంతో విప్లవ స్థావరంలో అమరుడయ్యాడు. కా. చారుమంజుందార్, కా. జవహర్ల లాగే శతృవు దాడిలో ప్రధాన కార్యదర్శి కా. కేశవరావు యుద్ధరంగంలో ఒరిగిపోయాడు. కగార్ కంటే ముందు ఐదేళ్ల నుంచి జైల్లో ఉన్న విప్లవోద్యమ అగ్ర నాయకుడు, నక్సల్బరీ తరానికి చెందిన కా. ప్రశాంత్ బోస్(కిషన్ దా) రాంచీ జైల్లో ఈ కాలంలోనే అమరుడయ్యాడు. కా. కోసా, రామచంద్రారెడ్డి, మోడెం బాలకృష్ణ, చలపతి, గాజర్ల రవి, పాక హనుమంతులతోపాటు ప్రయాగ్ మాంఝీ(వివేక్), పతీరాం మాంఝీ(అనల్), సహదేవ్ సొరేన్, హిడ్మా అనే నలుగురు ఆదివాసీ కామ్రేడ్స్ ఉన్నారు.
‘గత ఏడాది అక్టోబర్‌లో మొదలైన లొంగుబాట్ల విద్రోహపూరిత పర్వం వైపు వీరు కన్నెత్తి అయినా చూడలేదు. చివరి శ్వాస వరకు పోరాడేందుకే సిద్ధమయ్యారు. ఓటమి ముంగిట నిలిచినా వీరు లొంగిపోవడానికి వీరు అంగీకరించలేదు. ఎందుకంటే, తమ లొంగుబాటు దేశ ప్రజానీకాన్ని, విప్లవోద్యమాన్ని నైతికంగా దెబ్బతీస్తుందని వారు భావించారు’ అనే వాక్యాలు ఈ ముందుమాటలో ఉన్నాయి. పూర్తి అననుకూల పరిస్థితుల్లో కూడా విప్లవ పంథాకు కట్టుబడి, దాన్ని ముందుకు తీసుకపోవడానికి కేంద్ర కమిటీ నాయకులుగా వీరు భావించారని రాశారు.
భారత విప్లవోద్యమంలో ఇప్పటికి సుమారు 20 వేల మంది అమరులయ్యారు. వీరందరూ విప్లవంలో తమదైన ప్రత్యేక పాత్ర పోషించినవారే. తమ వ్యక్తిత్వంతో, చైతన్యంతో, ఆచరణతో, విలువలతో విప్లవోద్యమాన్ని కాంతివంతం చేసినవారే. వీరిలో విప్లవ సానుభూతిపరుల దగ్గరి నుంచి కేంద్ర నాయకుల దాకా ఉన్నారు. వీరందరి త్యాగం లేకపోతే విప్లవోద్యమమే లేదు. అలాంటివారిలో కగార్ యుద్ధంలో అమరులైన పన్నెండు మంది కేంద్ర నాయకులు కూడా భాగం. ఈ జీవిత చరిత్రలు ఆ వ్యక్తుల సొంత వివరాలుగా కనిపించవు. అవి కొంత ఉన్నప్పటికీ మొత్తంగా భారత విప్లవోద్యమంలోకి వారు ప్రవేశించిన తొలి రోజుల నుంచి చివరి దాకా విప్లవోద్యమ అభివృద్ధి, విస్తరణ, ఆటుపోట్ల చరిత్ర అంతా వాళ్ల చరిత్రలో కనిపిస్తుంది. విప్లవోద్యమ చరిత్రనూ, అమరుల వీరుల జీవిత చరిత్రనూ వేరు చేసి చూడలేం. ఇది ఈ ఇరవై వేల మంది అమరులకు వర్తిస్తుంది. అయితే ఉద్యమ ఆరంభం నుంచి అనేక మలుపులు దాటుకొని, అనేక సంక్షోభాలను అధిగమించి, నూతన దశల్లోకి విప్లవోద్యమం చేరుకున్న క్రమమంతా ఈ అమరుల జీవిత చరిత్రల్లో ప్రస్పుటంగా కనిపిస్తుంది.
విప్లవోద్యమాన్ని నిర్మించాలంటే అట్లాంటి రాజకీయ కృషి చేయగల మనుషులు ఉండాలి. వాళ్లు ఎక్కడి నుంచో ఊడిపడరు. అతి మామూలు మనుషుల నుంచే అలాంటి వాళ్లను విప్లవోద్యమం తయారు చేసుకుంటుంది. కార్మికవర్గం నుంచి, ఆ వర్గంపట్ల బాధ్యత పడే సమూహాల నుంచి విప్లవపార్టీ తన నాయకులను, కార్యకర్తలను తయారు చేసుకుంటుంది. అలాంటి వ్యక్తుల బృందం ప్రజా పునాదిని నిర్మించే క్రమంలోనే విప్లవ పార్టీ విస్తరిస్తుంది. అయితే ఆ మనుషులు విప్లవోద్యమ కర్తవ్యాలకు తగినట్లు ఉండాలి. విప్లవ విలువలను, ఆదర్శాలను పుణికిపుచ్చుకోవాలి. విప్లవ సంక్షోభాలను అర్థం చేసుకొనే సిద్ధాంత జ్ఞానం ఉండాలి. వాటి నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకపోగల సామర్థ్యం, నైపుణ్యం ఉండాలి. వాటిని ప్రదర్శించి ఉద్యమాన్ని కాపాడటానికి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై ఉండాలి. ఈ పుస్తకంలోని కామ్రేడ్స్ అంతా ఒక పక్క కగార్ యుద్ధం ముంచుకొని వచ్చినా, విద్రోహపూరిత లొంగుబాట్లు జరుగుతున్నా విప్లవం కోసం దృఢంగా నిలబడ్డారు. ప్రాణత్యాగాలతో విప్లవోద్యమాన్ని పరిరక్షించాలని ప్రయత్నించారు. అందువల్ల వాళ్ల జీవిత చరిత్రల ఈ పుస్తకం కేవలం ఉత్తేజపూరితంగానే లేదు. విప్లవ భవిష్యత్తు మీద ఆశను నిలబెడుతుంది. తాత్కాలికంగా ఓడిపోయినా విప్లవ పంథా సరైనదనే సత్యాన్ని ప్రకటించింది. విప్లవోద్యమం పూర్తిగా దెబ్బతినిపోయిందనే అభిప్రాయం చెలామణిలో ఉన్న సమయంలో విప్లవ పార్టీ ఈ పుస్తకాన్ని ప్రజలకు అందించింది. ‘విప్లవోద్యమాన్ని పునర్నిర్మించడానికి ఈ అమరవీరుల జీవిత చరిత్రలను లోతుగా అధ్యయనం చేద్దామ’ని పిలుపు ఇచ్చింది. ‘విప్లవోద్యమాన్ని పునర్నిర్మించడమే అమరులకు ఇచ్చే నివాళి’ అనే సందేశం ఇచ్చింది. ప్రజలు వీరోచిత పోరాటాలు చేసినప్పటికీ ‘కొన్ని ద్రోహాల వల్ల, పార్టీ చేసిన కొన్ని రాజకీయ, సైనిక తప్పిదాల వల్ల ఆ వీరోచిత పోరాటాలు మాత్రమే విప్లవోద్యమాన్ని రక్షించడానికి సరిపోలేదు. ఈ పరిణామాల నుంచి సైద్ధాంతిక, రాజకీయ, సైనిక పాఠాలు నేర్చుకోవలసి ఉంది. ఆ పనిని మనం తప్పక పూర్తి చేద్దాం’ అనే పునర్నిర్మాణ భరోసాను కూడా నాయకత్వం విప్లవాభిమానులకు ఇచ్చింది. ఇది తాత్కాలిక ఓటమేననీ, దీన్నుంచి తిరిగి లేచి నిలబడగలమనే సిద్ధాంత, చారిత్రక, ఆచరణాత్మక విశ్లేషణను అమరుల జీవితంతో ముడిపడిన ఉద్యమ చరిత్ర నుంచి అందించింది.
ఇందులో విప్లవోద్యమ తాత్కాలిక ఓటమికి ‘ఏకైక కారణవాదా’న్ని తిరస్కరించింది. ఏ ఉద్యమ వైఫల్యానికైనా ఏదో ఒక కారణమే ఉండదు. ఉందనుకుంటే అది మార్క్సిజానికి వ్యతిరేకమే. అనేక కారణాల్లో ఒక్కో పరిస్థితిలో ఒకటి ప్రధానం అవుతుంది. ఏదో ఒకటి మిగతా వాటిని తీవ్రం చేస్తుంది. ఒక కాలంలో చాలా అప్రధానమనిపించిన చిన్న పొరబాటు ఆ తర్వాతి కాలంలో అతి పెద్ద నష్టానికి కారణమవుతుంది. ఒక దశలో సకారాత్మక అంశాలు ప్రధానంగా ఉండి, నకారాత్మక అంశాలు అప్రధానంగా ఉన్నప్పటికీ ఆ దశను దాటి మరో దశలోకి ప్రవేశించేసరికి నకారాత్మకమైనవే ప్రధానం అవుతాయి. వాటిని ఎదుర్కోవడంలో పొరబాటు జరిగితే మొత్తం ఉద్యమమే వెనకతట్టుపడుతుంది. గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటి దాకా చేతిలో ఉన్న అవకాశాలన్నీ దూరమైపోతాయి. తాత్కాలికంగా ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. భారత విప్లవోద్యమ చరిత్రలోని ఇటీవలి కాలంలో అలాంటి పొరబాట్లు జరిగాయి.
ఈ పుస్తకంలోని అమరుల జీవిత చరిత్రలు చదివితే, ఉద్యమ చరిత్రలో గతంలో ఇట్లాంటి అననుకూల పరిస్థితులను ఆ కామ్రేడ్స్ నాయకత్వ స్థానంలో ఉండి ఎట్లా ఎదుర్కొన్నదీ తెలుస్తుంది. ఉమ్మడి కృషిలో వ్యక్తులుగా ఈ కామ్రేడ్ల రాజకీయ కృషి కూడా తెలుస్తుంది. విప్లవోద్యమ సిద్ధాంత పునాదిని పెంచడంలో వాళ్ల భాగస్వామ్యం తెలుస్తుంది. చలనశీలమైన సమాజాన్ని అర్థం చేసుకోడానికి నిర్మాణ రంగంలో, పోరాట రూపాల్లో రావలసిన మార్పుల కోసం ఎంత సృజనాత్మకంగా పని చేసిందీ తెలుస్తుంది.
తద్వారా విప్లవోద్యమ నాయకత్వం చాలా ముందు చూపుతో తగిన అంచనాలకు వచ్చింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంది. ఉద్యమ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 2007 నుంచే రాజ్య అణచివేత ఎంత పెరిగే అవకాశం ఉన్నదో గ్రహించి రాజకీయ, సైనిక సన్నాహం చేసుకుంది. కానీ వాటిని అమలు చేయడంలో జరిగిన తప్పిదాల వల్లనే దెబ్బతినిపోయింది. ఈ రాజకీయ, సైనికపరమైన ఎత్తుగడల వైఫల్యానికి సుదీర్ఘకాలంగా నానాటికీ పెరుగుతూ వచ్చిన నిర్బంధం తీవ్ర కారణం. కగార్ మొదలయ్యాకే 12 మంది కీలక కేంద్ర నాయకత్వం అమరులయ్యారు. ఆ పరిస్థితుల్లో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకపోడానికి సిద్ధం కాకుండా మరి కొందరు విద్రోహపూరితంగా లొంగిపోయారు.
అందుకే ఈ పుస్తకం ముందుమాటలో ‘మార్క్సిజాన్ని వక్రీకరిస్తూ, దోపిడీదారులకు వత్తాసు పలికే కుహనా విప్లవకారులను, సంస్కరణవాదులను ఎండగట్టడంలో ఈ అమరవీరులు ముందున్నారు. అవకాశవాదులకు, ద్రోహులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిన కా. సిఎం, కా. కేసీల సమున్నత వారసత్వాన్ని వారు కాపాడారు’ అని పార్టీ రాసింది.
అలాంటి అద్భుత నాయకులు అమరులయ్యారు. ఇప్పుడు భారత విప్లవ పంథా మీద అనేక సందేహాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికవర్గ రాజ్యాధికారం రాజ్యాంగపరిధిలోని చట్టబద్ధ ఆచరణతో, సంస్కరణవాద రాజకీయాలతో రాదని చెప్పడమే నక్సల్బరీ పంథా ప్రత్యేకత. యాభైఏళ్లపాటు భారతదేశంలో ఎన్నో ప్రజాపోరాటాలు ముందుకు వచ్చాయి. నక్సల్బరీ పంథా మాత్రమే ఇంత కాలం నిలబడి గణనీయ విజయాలను సాధించింది. అది ఈ రోజు తాత్కాలికంగా ఓడిపోయినా అది అమరుల త్యాగంలా అజరామరమైనది. ఈ ఓటమి గుణపాఠంతో మార్పులు చేర్పులు చేసుకొని దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని కొనసాగించాల్సిందే. ఈ తాత్కాలిక ఓటమితో భారత రాజ్య స్వభావం మరింతగా తెలిసి వచ్చింది. విప్లవం చట్టపరిధిలోని అంశం కాదు. దెబ్బతిన్న విప్లవోద్యమ పునర్నిర్మాణం కూడా చట్టపరిధిలో జరిగేది కాదు. బహిరంగ, చట్టబద్ధ పోరాటాలు విప్లవానికి తప్పక దోహదం చేస్తాయి. విప్లవోద్యమంలోని చాలా దశల్లో వాటికి కీలక ప్రాధాన్యత ఉంది. కానీ సాయుధ విప్లవ రాజకీయాలే లేకుంటే ఆ పనులకు ఎలాంటి శక్తీ ఉండదు. ఎన్నికల రాజకీయాలతో విప్లవోద్యమాన్ని నిర్మించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఉదారవాదులు, రివిజనిస్టులు, అవకాశవాదులు, విప్లవం మీద నమ్మకం పోయినవాళ్లు, విప్లవోద్యమాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్లు మాత్రమే ఇలాంటి ఆలోచనలు చేస్తారు. మార్క్సిజానికి వ్యతిరేకమైన ఈ పనులు చేస్తూ అవే విప్లవాత్మకమని నమ్మించే పని చేస్తారు.
ఈ పరిస్థితుల్లో వచ్చిన ఈ అమరుల జీవిత చరిత్రల పుస్తకం ఈ సంక్షోభసమయంలో విప్లవోద్యమాన్ని అర్థం చేసుకోడానికి కరదీపికలాంటిది. విప్లవోద్యమం ఎలాంటి సంక్షుభిత, సంక్లిష్ట దశలను దాటుకొని వచ్చిందీ ఈ పుస్తకం నేరుగా అమరుల జీవితాచరణ పునాది నుంచి వివరిస్తుంది. అన్ని దశల్లో బైటి శతృవు నుంచేకాకుండా అంతర్గతంగా స్పాంటీనిటీ ధోరణులతో, పలాయనవాదంతో, అవకాశవాదంతో, అనుభవవాదంతో, అతివాద స్వీయాత్మకతతో, మితవాద స్వీయాత్మకతతో పోరాడుతూ ఉన్నత దశకు చేరుకున్నదీ తెలియజేస్తుంది. విప్లవోద్యమంలోని అన్ని పెడధోరణులతో పోరాడి, వాటి నుంచి బైటపడిన ఉత్తేజపూరిత రాజకీయ, సాంస్కృతిక, నిర్మాణ, పోరాట అనుభవాలను ఈ పుస్తకం పంచుతుంది. ఉద్యమం దెబ్బతినిపోయినా, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా విప్లవోద్యమ రాజకీయాలకు భిన్నమైన పని ఏ ఒక్కటి చేయకుండా పంథాను అంటిపెట్టుకొని ఉండాలనే అతి ముఖ్యమైన రాజకీయ సందేశాన్ని ఈ పుస్తకం అందిస్తోంది.
ఇప్పటి సంక్షోభం గతంలోని సంక్షోభాలకంటే చాలా తీవ్రమైనది. తాత్కాలికంగా ఓడిపోయిన దశ ఇది. అయినప్పటికీ విప్లవోద్యమం ఉందనీ, ఈ ఓటమి నుంచి బైటపడే అవకాశాలు ఉన్నాయనే గొప్ప భరోసాను, స్పూర్తిని ఈ పుస్తకంలోని అక్షరమక్షరం అందిస్తుంది. దాన్ని అందుకోవడమే అమరులకు నిజమైన నివాళి.


Naiti’s Death: Will the Truth Ever Emerge? -Pani
పది మంది ఆదివాసీల ఉరిశిక్ష రద్దు కోసం 16న సభ
ఝీరమ్ లోయ దాడి ఘటనలో పదిమంది ఆదివాసీలకు మరణశిక్ష అన్యాయం, కక్షసాధింపు చర్య
మండుతున్న అడవి – ముసాఫిర్
మీ జ్ఞాపకాలతో జీవిస్తాం…మీ ఆలోచనలతో ముందుకుపోతాం
కన్నబిడ్డల జ్ఞాపకాలు నిలుపుకోవడమూ నేరమా? రాకేశ్ స్థూపాన్ని కూల్చేసిన పోలీసులు 